టాలీవుడ్: నిర్మాతలే సినిమా షూటింగులను నిలిపేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనివల్ల ఎవరికి లాభం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆగస్టు ఒకటవ తేదీ నుంచి తెలుగు సినిమాల షూటింగ్ నిలిపివేయాలని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. దానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు తెలిపింది. దీంతో చాలా షూటింగులు ఆగిపోయాయి.
సాధారణంగా చిన్న స్థాయి టెక్నీషియన్లు, ఇతరత్రా సినిమా రంగంపై ఆధారపడ్డ వారూ ఆందోళన చేస్తుంటారు. షూటింగులను బహిష్కరిస్తుంటారు. కానీ, నిర్మాతలే షూటింగులు నిలిపివేయడం చర్చ అయింది.
సినిమాలకు పెట్టిన ఖర్చు వెనక్కు రాకపోవడం, ఖర్చులు పెరగడం, థియేటర్లకు జనం రావడం తగ్గడం, ఇలా అనేక అంశాలపై నిర్మాతలకు సమస్యలు ఉన్నట్టు వారు చెబుతున్నారు.
ప్రస్తుతానికి ఈ బంద్ ఎంత కాలం ఉంటుందో స్పష్టత లేదు. సమస్యలకు ఒక పరిష్కారం వచ్చే వరకూ కొనసాగుతుందని నిర్మాతల మాటలను బట్టి అర్థమవుతుంది. దాన్నే వారు పాజిటివ్‌గా చెబుతున్నారు. ‘‘వీలైనంత త్వరగా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం’’ అని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె బసిరెడ్డి బీబీసీతో చెప్పారు .

తాము గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి 36 మందితో వివిధ కమిటీలను వేశారు నిర్మాతలు. ప్రస్తుతం వారు చర్చలు జరుపుతున్నారు. తారల పారితోషికాలు, టికెట్ ధరలు, వర్చువల్ ప్రింట్ ఖరీదు, ఓటీటీ సినిమాల వంటివి ఈ కమిటీ చర్చిస్తుంది.
‘‘సమస్యలు పరిష్కారం అయ్యాకే మళ్లీ షూటింగులు చేస్తాం. అందరు నిర్మాతలూ నష్టపోతున్నారు. దానికి వ్యూహం కావాలి. పరిష్కారం కావాలి. అప్పటి వరకూ షూటింగులు నిలిపివేస్తున్నాం’’అని నిర్మాతలు మీడియాతో చెప్పారు.
ఈ నిర్ణయం వల్ల 40కి పైగా సినిమాల నిర్మాణం ఆగిపోయినట్టు పరిశ్రమకు సంబంధించిన వారు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా జరిగే ఇతర భాషల సినిమాల నిర్మాణం జరుగుతోంది. కేవలం తెలుగు సినిమాల నిర్మాణమే ఆగిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం చర్చలోని అంశాలు

- ఓటీటీ – ఓటీటీల్లో మరీ త్వరగా సినిమా రావడం వల్ల థియేటర్లకు రావాలనుకునే వారి సంఖ్య తగ్గుతోంది.
- స్టార్ల రెమ్యూనరేషన్ – ఈ విషయాన్ని నిర్మాతలు ఎక్కడా బహిరంగంగా పెద్దగా మాట్లాడడం లేదు. కానీ పదుల కోట్ల రూపాయల్లో పెద్ద స్టార్ల రెమ్యూనరేషన్లు, వారి వ్యక్తిగత సిబ్బంది ఖర్చులూ నిర్మాతలకు భారంగా మారాయి.
- ఇటీవలే తమ రెమ్యూనరేషన్లు పెంచాలని సినిమా కార్మికులు ఆందోళన చేశారు. పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. తుది ఒప్పందాలు జరగాల్సి ఉంది.
- ఎగ్జిబిటర్ షేర్ – నిర్మాత, బయ్యర్, థియేటర్ యజమాని మధ్య వాటాల పంపకం
- టికెట్ ధరలు – రెండు రాష్ట్రాల్లో రెండు భిన్న పరిస్థితులున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి ధరలు తగ్గిస్తోంది. తెలంగాణలో స్వేచ్ఛ ఉంది. దీంతో ధరలు పెంచడంతో చాలా చోట్ల ఆ ప్రభావం కనిపించింది.
- వర్చువల్ ఫిల్మ్ – సినిమాను గతంలోలా రీళ్లలా కాకుండా, డిజిటల్ ఫిల్మ్‌ను నేరుగా థియేటర్లలో ప్లే అయ్యేలా టెక్నాలజీ ఉంది. దాని ఖర్చుల వ్యవహారం.

షూటింగులు ఆపక్కర్లేదు
అయితే ఈ సమస్యలపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవడం కోసం, షూటింగులు ఆపనవసరం లేదని సినీ రంగానికి చెందిన పలువురు అంటున్నారు.
ఈ నిర్ణయాన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే సంస్థ వ్యతిరేకించింది. తమ షూటింగులు కొనసాగిస్తాం అని తెలిపింది. కొందరు స్వార్థం కోసం ఇలా చేస్తున్నారని ఆ సంస్థ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ ఆరోపించారు. అటు చిన్న సినిమాల నిర్మాతలు కూడా ఈ షూటింగుల నిలిపివేత నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు.
‘‘ఏం కావాలో, ఎవర్ని అడగాలో తెలియకుండా షూటింగులు బంద్ చేసి, చర్చలు జరపడం సరికాదు. పెద్ద నిర్మాతలంతా ఒక మాట మీద ఉన్నారు. వారంతా పెద్ద హీరోలు, దర్శకుల దగ్గరకు వెళ్లి అడగవచ్చు కదా? అడిగినప్పటికీ వాళ్లు కాదంటే అప్పుడు సమ్మె చేయాలి. సమస్యకు పరిష్కారం కాకుండా, సమస్యను పెంచుతున్నారు. ఇప్పటికే షూటింగులో ఉన్న వాటిని కొనసాగనివ్వాలి. కొత్తవి వద్దని చెప్పండి. అలాగే 5-10 రోజుల పెండింగ్ వర్క్ చేస్తే పూర్తయ్యే సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అప్పట్లో కార్మికులు సమ్మె చేయబోతే, రెండు రోజుల్లో పరిష్కరించారు. ఇప్పుడు కూడా టాప్-10 ప్రొడ్యూసర్లు ఒక్క మాట మీద కూర్చుంటే పని అయిపోతుంది. అది మానేసి షూటింగులు ఆపేసి చర్చలు జరపడం ఏంటి?’’ అని నిర్మాత రామ సత్యనారాయణ బీబీసీతో అన్నారు. ఆయన పలు చిన్న సినిమాలు నిర్మించారు.
ఇలా షూటింగులు నిలిపేయడం వల్ల ఆర్టిస్టులు, టెక్నీషియన్ల డేట్లు తేడా వచ్చి తీవ్ర ఇబ్బందులు వస్తాయని రామ సత్యనారాయణ అన్నారు. గతంలో కాస్ట్ కంట్రోల్ కమిటి పెడితే, తరువాత కొందరు పెద్ద నిర్మాతలే దాన్ని తప్పించారని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు సినిమా ఖర్చులు పెరగడంలో తప్పు నిర్మాతలదే అన్నారు సీనియర్ నటుడు సుమన్. అంతేకాదు, ఒకప్పుడు బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారనీ, ఇప్పుడు నిర్మాతలే బయ్యర్లు అయ్యే సరికి వారికి నొప్పి తెలుస్తోందని ఆయన అన్నారు. విశాఖపట్నంలో ఒక సమావేశంలో మాట్లాడిన సుమన్, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ డిమాండ్ – సప్లై మీద ఆధారపడి ఉంటుందని గుర్తు చేశారు.
‘‘జనం ఓటీటీకి అలవాటు పడ్డారు. అదేం తప్పు కాదు. అప్పుడు జనాన్ని థియేటర్లకు రప్పించి, థియేటర్లోనే చూడాలనిపించేలా సినిమా తీయండి. ఆర్టిస్టుల రేట్లు డిమాండ్ సప్లై మీద ఉంటుంది. డిమాండ్ లేకపోతే డబ్బు ఇవ్వరు కదా? ఎవరి వల్ల బిజినెస్ అవుతుందో వారికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఒకవేళ అదే సమస్య అయితే (కొందరు ప్రొడ్యూర్లను ఉద్దేశించి) మీరంతా ఫామిలీ లాంటోళ్లు, మేం చాలా క్లోజ్ అంటుంటారు కదా. రేట్లు తగ్గించుకోమని వెళ్లి ఆ పెద్ద హీరోలు, దర్శకులను ఎందుకు అడగరు’’ అని ప్రశ్నించారు సుమన్.
ఒకవేళ వాళ్లు రేట్లు తగ్గించకపోయినా పర్వాలేదన్న సుమన్, వారి పని గంటలు పెంచాలని సూచించారు. గతంలో మాదిరిగా ఎక్కువ సమయం పనిచేసి, తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనీ, ప్రణాళిక ప్రకారం చేయాలని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
అయితే దీనిపై ప్రొడ్యూసర్స్ వాదన మరోలా ఉంది. ఇది కేవలం పెద్ద, చిన్న సినిమాల వేర్వేరు సమస్య కాదనీ, మొత్తం అన్ని రకాల సినిమాల సమస్య అనీ చెబుతున్నారు నిర్మాత బసిరెడ్డి.
తాము చేస్తోన్నది షూటింగుల బంద్ కాదని, షూటింగుల వాయిదా అని అన్నారు బసిరెడ్డి. దానికి కారణాలు వివరించారాయన.
‘‘నిర్మాతలు పెట్టిన డబ్బు అసలు తిరిగి రావడం లేదు. థియేటర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరికీ డబ్బు రావడం లేదు. అందరం చర్చించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. షూటింగులతో బిజీగా ఉంటే చర్చలకు సమయం ఉండదనే, షూటింగులు ఆపేసి చర్చలు జరుపుతున్నాం’’ అని బీబీసీతో చెప్పారు బసిరెడ్డి.
వేతనాలు, ఓటీటీ, పెద్ద తారలు, పెద్ద దర్శకులు… ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి అని కాదు.. మేం ఒక్కక్క విభాగం వారితో చర్చలు జరుపుతున్నాం అన్నారాయన.
అయితే, ఇప్పటి వరకూ జరుగుతోన్న చర్చల్లో అతి ముఖ్యమైన పెద్ద తారల రెమ్యూనరేషన్ అనే అంశం తప్ప, మిగతా విషయాలపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వివిధ భాగస్వాములతో తాము చర్చిస్తున్నట్టు బసిరెడ్డి వివరించారు.
నిజానికి నిర్మాతలకు ఓటీటీలు కూడా అదనపు ఆదాయం తెస్తాయి. వారు దానికి పూర్తి వ్యతిరేకంగా లేరు. కాకపోతే, దాన్ని వారు తమకు మరింత అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.
‘‘కొత్త వ్యవస్థలు వచ్చినప్పుడు అవి డైజెస్ట్ కావడానికి, ఎడ్జస్ట్ అవడానికీ కాస్త సమయం పడుతుంది. ఒకప్పుడు కంప్యూటర్ల గురించి ఇలానే అనుకున్నారు. ఇప్పుడు ఓటీటీ – థియేటర్ విషయంలో అదే డైజెషన్, అడ్జస్ట్‌మెంటు పీరియడ్‌లో ఉన్నాం. కానీ థియేటర్లపై చాలామంది ఆధార పడి ఉన్నారు. అవి కూడా నడవాలి కదా? ఓటీటీ వాళ్లను పిలిచి మాట్లాడతాం’’ అన్నారు బసిరెడ్డి.
సినిమా రంగానికి సంబంధించి శక్తివంతమైన వ్యక్తి నిర్మాత కదా? మీరే షూటింగులు వాయిదా వేసే పరిస్థితి ఎందుకు? షూటింగులు జరుపుతూ చర్చలు జరుపుకోవచ్చుగా అని నిర్మాత బసిరెడ్డిని బీబీసీ ప్రశ్నించింది. సినిమా పరిశ్రమలో ఎవరో ఒకరే శక్తివంతులు కాదన్న ఆయన, చర్చలకు సమయం కోసమే షూటింగులు వాయిదా వేసినట్టు చెబుతున్నారు.
నిజానికి ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటోన్న వాటిల్లో ఓటీటీ విడుదల ఆలస్యం, ఇతరత్రా చార్జీల తగ్గింపు వంటివి చర్చల ద్వారా పరిష్కారం అవ్వొచ్చు. కానీ అతి కీలకమైన అంశాలు రెండు ఉన్నాయి.
ఒకటి ప్రేక్షకుల కోణంలో, థియేటర్లలో టికెట్ ధరలు అనుకూలంగా ఉండడం. మల్టీప్లెక్సుల్లో చిరుతిండ్ల ధరలు అందుబాటులో ఉండడం. రెండవది నిర్మాతల కోణంలో-ప్రధాన తారలు, దర్శకుల రెమ్యూనరేషన్, వారి సిబ్బందికి పెట్టే ఖర్చులు – వీటి గురించి ఎవరు చర్చిస్తారు, ఎవరు నిర్ణయిస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ఇవి కూడా చదవండి:
- క్యాసినో అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు... చట్టాలు ఏం చెబుతున్నాయి?
- చైనా వార్నింగ్‌ను లెక్క చేయకుండా తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా స్పీకర్ పెలోసీ
- ఈజిప్టులోని కంటి డాక్టర్ జిహాదీ ఎలా అయ్యాడు... లాడెన్‌కు కుడి భుజంగా ఎలా మారాడు?
- అంబానీ, అదానీ: 5జీ సేవలపై ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న భారతీయ కుబేరులు
- విశాఖపట్నం: లైట్ హౌస్‌లు ఎలా పనిచేస్తాయి, వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















