నకిలీ ఐపీఎల్: ఊరు బయట పొలాల్లో ఐపీఎల్ ఆడతారు, రష్యన్లతో బెట్టింగ్‌ చేసి లక్షల రూపాయలు కొట్టేస్తారు

క్రికెట్ మ్యాచ్
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్, భార్గవ్ పారిఖ్
    • హోదా, బీబీసీ న్యూస్

బంజరు భూమిలా కనిపిస్తున్న గ్రౌండ్‌పై ఆ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది.

మ్యాచ్‌ను చూస్తున్నప్పుడు ఎలాంటి సౌండ్ వినిపించడంలేదు. స్క్రీన్ కింద భాగంలో సాధారణ క్రికెట్ మ్యాచ్‌లలానే నీలం రంగులో స్కోర్ కార్డు కనిపిస్తోంది.

గాంధీనగర్ ఛాలెంజర్స్ తమ ముందుంచిన 151 రన్లను చెన్నై ఫైటర్లు ఛేదిస్తున్నట్లు కనిపిస్తోంది.

గ్రౌండ్ గోధుమ రంగులో చెత్తచెత్తగా ఉంది. మధ్యలో తెల్లని కార్పెట్ వేసినట్లు తెలుస్తోంది.

ఓవర్‌కు సగటున ఏడు రన్లతో చెన్నై జట్టు బ్యాటింగ్ చేస్తోంది. మంచి షాట్లు కొట్టినట్టు చూపిస్తున్నారు. కానీ, బాల్ మాత్రం బౌండరీని దాటట్లేదు. బ్యాటర్లు ఆయాసంతో ఒకటి రెండు రన్లు తీస్తున్నారు.

అరెస్టైన నిందితులు
ఫొటో క్యాప్షన్, కిందన కూర్చున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు

ప్లేయర్ల కంటే అంపైర్ మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వైడ్‌లు, నోబాల్స్‌కు చేతులు ఆయన విపరీతంగా ఊపుతున్నారు.

కాసేపటికి ఐస్ డబ్బా లాంటిది పట్టుకుని ఒక యువకుడు గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ప్లేయర్లు బ్రేక్ తీసుకున్నారు. ఇక్కడ ప్లేయర్లను దగ్గర నుంచి చూపించడం లేదు. ప్రేక్షకులు కూడా కనిపించడం లేదు.

ఇదంతా భారత్‌లో ఏదో మారుమూల ప్రాంతంలో జరుగుతున్న 20-20 క్రికెట్ మ్యాచ్ వీడియో రికార్డులా కనిపిస్తోంది.

అయితే, ఇది ‘‘ఫేక్’’ క్రికెట్ టోర్నమెంట్ అని పోలీసులు చెప్పారు. గుజరాత్‌లోని నిరుద్యోగ యువత, రష్యాకు చెందిన గ్యాంబ్లర్లు దీన్ని నడిపిస్తున్నారని వెల్లడించారు.

ఇలాంటి ఫేక్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నడిపిస్తున్నారని గతవారం మెహసనా జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు సోషల్ మీడియా యాప్ ‘‘టెలిగ్రామ్’’ ద్వారా రష్యాలోని మూడు నగరాలకు చెందిన గ్యాంబ్లర్ల నుంచి బెట్లు స్వీకరిస్తున్నారు.

క్రికెట్ మ్యాచ్

ఈ కేసుపై విచారణ చేపడుతున్న అధికారి భవేశ్ రాఠోడ్ బీబీసీతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం అరెస్టైన నలుగురిలో ఒక నిందితుడు శోయబ్ దావ్డా.. రష్యాలోని ఒక పబ్‌లో పనిచేశాడు. అక్కడి వ్యక్తులతో ఇతడికి సంబంధాలున్నాయి. వారికి క్రికెట్ బెట్టింగ్‌లో ఆసక్తి ఉందనే విషయాన్ని అతడు గ్రహించాడు. దీంతో ఇలాంటి ఫేక్ క్రికెట్ లీగ్‌ ప్రారంభించాడు’’అని తెలిపారు.

భారత్‌లో ఏటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహిస్తుంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్. ఇదే తరహాలో తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా సొంతంగా లీగ్‌లు మొదలుపెట్టాయి.

భారత్‌లో గుర్రాల పందేలు మినహా స్పోర్ట్స్ బెట్టింగ్‌కు చట్టాలు అనుమతించవు. అయితే, చాలా చోట్ల అక్రమంగా బెట్టింగ్ సాగుతుందని పోలీసులు చెబుతుంటారు.

‘‘ఇప్పుడు మెహసనాలో బయటపడ్డ మ్యాచ్‌ల లాంటి ఫేక్ లీగ్‌లు పూర్తిగా గ్యాంబ్లింగ్ కోసమే నిర్వహిస్తుంటారు. ఈ మ్యాచ్‌లను ఆర్గనైజర్లు లైవ్ ఇస్తుంటారు. వీటిలో అంపైర్లు బహిరంగంగానే ప్లేయర్లకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఇదంతా పూర్తిగా ఓ కట్టుకథ లాంటిది’’అని ఒక ఐపీఎల్ జట్టు మాజీ డైరెక్టర్, స్పోర్ట్స్ ప్రొడ్యూసర్ జోయ్ భట్టాచార్య చెప్పారు.

దాదాపు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన తర్వాత మెహసనా టోర్నమెంటును పోలీసులు పట్టుకోగలిగారు. మోలిపుర్‌గా పిలిచే ఒక మారుమూల గ్రామంలో ఈ మ్యాచ్‌లు ఆడుతున్నట్లు వారు చెప్పారు. క్రికెట్ కిట్లు, కెమెరాలు, స్పీకర్లను నిందితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ స్పీకర్ల సాయంతో రన్నింగ్ కామెంటరీలు పెట్టేవారని పోలీసులు చెప్పారు.

వీడియో క్యాప్షన్, Farmers Cricket Team: పంచె కట్టి... బ్యాట్ పట్టి.. పరుగులు కొల్లగొట్టి

సించరీ హిట్టర్స్ పేరుతో

సెంచరీ హిట్టర్స్ టీ20గా పిలిస్తున్న ఈ లీగ్‌లో జట్లకు భిన్న రాష్ట్రాల పేర్లు పెట్టారు. వీటిలో ఆడేందుకు దాదాపు 25 మంది స్థానిక యువకులను నియమించుకున్నారు. ఇక్కడ ఇద్దరు అంపైర్లు, మరో ఇద్దరు ఆర్గనైజర్లు కూడా పనిచేస్తున్నారు. ఒక ఆర్గనైజర్ కమెంటేటర్‌గానూ పనిచేస్తున్నాడు.

రెండు హైడెఫినిషన్ కెమెరాలతో రికార్డు చేసి ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లు పెడుతున్నారు. అయితే, ఈ ఛానెల్‌కు 255 మంది సబ్‌స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు.

బెట్టింగ్ కాసేవారిలో చాలా మంది మాస్కో, వొరొనెజ్, ట్వెర్ నగరాలలో ఉంటారని పోలీసులు చెప్పారు. ఈ మ్యాచ్‌లు నిజమైన మ్యాచ్‌లలా కనిపించేందుకు ప్రేక్షకుల స్పందనలను ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసి స్పీకర్లలో పెట్టేవారని వివరించారు.

ఆర్గనైజర్లతో మాట్లాడేందుకు అంపైర్లు వాకీటాకీలు ఉపయోగిస్తారని, రష్యాలో ఉండే గ్యాంబ్లర్లతో వీరంతా టెలిగ్రామ్‌లో మాట్లాడుతుంటారని పోలీసులు చెప్పారు. గేమ్‌తోపాటు ప్లేయర్లను కూడా అంపైర్లు ప్రభావితం చేస్తుంటారని వివరించారు.

వీడియో క్యాప్షన్, క్రికెట్ అంపైర్లు, స్కోరర్లుగా వికలాంగులకు శిక్షణ

ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.400 ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీరంతా కేసులో విచారణకు సహకరిస్తామని అంగీకరించినట్లు రాఠోడ్ చెప్పారు.

‘‘ఇలాంటి స్కామ్‌ను నేను ఇదివరకు చూడలేదు. ఒక గ్రామంలో బంజరు భూమిని చదునుచేసి మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌ను యూట్యూబ్‌లో లైవ్ ఇస్తున్నారు. దీని ద్వారా గ్యాంబ్లింగ్ జరుగుతోంది. స్థానికులకు దీనిపై ఎలాంటి సమాచారమూ లేదు. ఈ మ్యాచ్‌లపై లక్షల రూపాయల్లో బెట్టింగ్ కాస్తున్న రష్యన్ల గురించి మనకు చాలా తక్కువ వివరాలు అందుబాటులో ఉన్నాయి’’అని రాఠోడ్ చెప్పారు.

మరి ప్రేక్షకుల సంగతేమిటి?

‘‘అసలు ప్రేక్షకులే లేరు’’అని రాఠోడ్ వివరించారు.

వీడియో క్యాప్షన్, ప‌రుగులో రికార్డులు బ్రేక్ చేస్తున్న 105 ఏళ్ల బామ్మ‌.. ఈమె ప‌రుగు చూశారా..

ఎలా తెలిసింది?

యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ బెట్టింగ్ కోసం మెహసనాలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు తమకు మొదట సమాచారం అందిందని రాఠోడ్ చెప్పారు.

‘‘యూట్యూబ్‌లో ఆ మ్యాచ్ చూస్తున్నప్పుడు అంపైర్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని కనిపించాడు. మరోవైపు రెండు జట్ల బ్యాటర్లు కూడా ఒకేలాంటి ప్యాడ్లు వేసుకున్నారు. దీంతో మాకు అనుమానం వచ్చిది. వెంటనే దర్యాప్తు ప్రారంభించాం’’అని రాఠోడ్ వివరించారు.

‘‘మా దర్యాప్తులో అసలు అది క్రికెట్ గ్రౌండ్ కాదని తేలింది. ఒక బంజరు భూమిని చదునుచేసి, మ్యాట్‌లు వేసి ఆడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తంగా చెప్పాలంటే అది ఒక ఫేక్ క్రికెట్ గ్రౌండ్’’అని ఆయన తెలిపారు.

‘‘ఆ మ్యాచ్‌లు వాస్తవానికి దగ్గరగా ఉండేందుకు పిచ్‌పై హేలోజన్ లైట్స్ ఏర్పాటుచేశారు. ప్లేయర్ల కోసం కొత్త బట్టలు కొన్నారు. కమెంటరీ కోసం మిమిక్రీలో నిపుణుడైన షకీబ్ అనే వ్యక్తిని నియమించుకున్నారు. మ్యాచ్‌ను రికార్డు చేసేందుకు హైక్వాలిటీ కెమెరాలు ఏర్పాటుచేశారు’’అని రాఠోడ్ చెప్పారు.

మేం అరెస్టు చేసేందుకు ముందు రోజు హవాలా మార్గంలో నిర్వాహకులకు రూ.3 లక్షలు వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని రాఠోడ్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)