గోదుమల ఎగుమతిపై భారత్ నిషేధంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయా?

గోదుమలు

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, శ్రుతి మేనన్
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్

గోదుమ ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తమ చర్యలను భారత ప్రభుత్వం సమర్థించుకుంటోంది.

రష్యాపై యుక్రెయిన్ దాడి నడుమ అంతర్జాతీయంగా గోదుమ ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు భారత్‌ కూడా ఆంక్షలు విధించడంతో ధరలు మరింత ఎక్కువయ్యాయి.

‘‘అందరూ ఎగుమతులపై ఇలా నిషేధం విధించుకుంటూ పోతే ఈ సంక్షోభం మరింత ముదురుతుంది’’అని జర్మనీ ఆహార, వ్యవసాయ శాఖ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ వ్యాఖ్యానించారు. గత మేలో భారత్ ఆంక్షలు విధించిన అనంతరం ఆయన స్పందించారు.

అయితే, ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో గ్లోబల్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం పడదని భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. భారత్ ప్రధాన గోదుమ ఎగుమతి దేశం కాదని ఆయన అన్నారు.

అయితే, భారత్ నిషేధంతో గోదుమ ధరలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

గోదుమలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ మార్కెట్లలో ధరలు

మే 13న గోదుమ ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. విపరీత ఉష్ణోగ్రతల నడుమ ఇక్కడ గోదుమ పంట దెబ్బతింది. దీంతో స్థానిక మార్కెట్లలో ధరలు పెరిగాయి.

భారత్ ప్రధాన గోదుమ ఎగుమతి దేశం కాని మాట వాస్తవమే. అయితే, భారత్ చర్యల నడుమ చికాగో బెంచ్‌మార్క్ వీట్ ఇండెక్స్‌లో ధరలు దాదాపు 6 శాతం పెరిగాయి.

భారత్ నిషేధాన్ని ప్రకటించిన కొన్ని రోజుల వరకు, మే 18వ తేదీ వరకు కొన్ని ప్రధాన రకాల గోదుమ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన తర్వాత, మార్చి, ఏప్రిల్ నెలల్లో గోదుమల ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి.

యుద్ధం వల్ల లక్షల టన్నుల గోదుమ యుక్రెయిన్‌లోనే ఉండిపోయింది. గోదుమ భారీగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో యుక్రెయిన్ కూడా ఒకటి.

భారత్ నిషేధం విధించడం వల్ల ప్రపంచ మార్కెట్‌లో ధరలు మరింత పెరిగాయని వ్యవసాయ డేటా రీసెర్చ్ సంస్థ గ్రో ఇంటెలిజెన్స్‌కు చెందిన కెల్లీ గౌఘరీ చెప్పారు. ‘‘నల్ల సముద్రం పరిసరాల్లోని దేశాల నుంచి వచ్చే గోదుమల సరఫరా గొలుసుకు అంతరాయం కలగడంతో చాలా దేశాలు భారత్‌పై ఆశలు పెట్టుకున్నాయి’’అని ఆయన అన్నారు.

గోదుమలు

ఫొటో సోర్స్, Getty Images

ఎవరిపై ఎక్కువ ప్రభావం పడుతోంది?

గోదుమ ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంటుంది. అయితే, ఎగుమతుల్లో భారత్ వాటా ఒక శాతం కంటే తక్కువ. ముఖ్యంగా దేశీయ అవసరాలకే ఎక్కువ గోదుమలను భారత్ కేటాయిస్తోంది.

అయితే, ఆంక్షలు విధించడానికి కొన్ని రోజుల ముందు ఎగుమతులను పెంచే దిశగా భారత్ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది మొత్తంగా పది మిలియన్ టన్నులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది మొత్తంగా రెండు మిలియన్ టన్నులను మాత్రమే భారత్ ఎగుమతి చేసింది.

ఆసియా, ఆఫ్రికాల్లోని కొత్త మార్కెట్లకు గోదుమలను సరఫరా చేస్తామని భారత్ చెప్పింది. దీంతో కొన్ని దేశాల రాయబారులు భారత దౌత్య కార్యాలయాలకు వరుసకట్టారు.

అయితే, ఇప్పటికీ కొన్ని దేశాలకు ఎగుమతులు కొనసాగుతాయని భారత్ చెబుతోంది. అవసరంలోనున్న పొరుగు దేశాలను ఆదుకుంటామని వివరిస్తోంది.

వీడియో క్యాప్షన్, నెమళ్ల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువకుడు

భారత్ నుంచి గోదుమల ఎగుమతులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఉన్నాయి.

2019-20ల్లో భారత్ గోదుమ ఎగుమతుల్లో 50 శాతం శ్రీలంక, యూఏఈకే వెళ్లాయి. మరోవైపు నేపాల్‌ తమకు అవసరమైన గోదుమల్లో 90 శాతం వరకు భారత్‌పైనే ఆధారపడుతోందని అబ్జర్వేటరీ ఆఫ్ ఎకనమిక్ కాంప్లెక్సిటీ (ఓఈసీ) తెలిపింది.

ఈ దేశాలకు ఇప్పుడు కూడా ఎగుమతులు కొనసాగుతాయా? లేదా గోదుమల కోసం కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలా అనే విషయంపై స్పష్టతలేదు.

అయితే, భారత్‌ నుంచి తమకు వచ్చే గోదుమలకు ఎలాంటి అవాంతరాలు ఉండబోవని ఈజిప్టు చెబుతోంది. గోదుమలను భారీగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఈజిప్టు కూడా ఒకటి.

ఎగుమతులపై నిషేధం అంశాన్ని మరోసారి పునరాలోచించాలని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) భారత్‌కు సూచించింది. యుక్రెయిన్‌పై రష్యా దాడితో ఆహార సంక్షోభంలో చిక్కుకున్న దేశాలకు సాయం చేయాలని అభ్యర్థిస్తోంది.

వీడియో క్యాప్షన్, హైటెక్ టొమాటోలు.. ఎలా పండిస్తున్నారో చూడండి

ప్రతికూల వాతావరణం నడుమ..

యుక్రెయిన్‌లో యుద్ధంతోపాటు ప్రతికూల వాతావరణం కూడా గోదుమలను పండించే దేశాలపై ప్రభావం చూపుతోంది.

‘‘గోదుమలను భారీగా ఉత్పత్తి చేసే అమెరికా, కెనడా, ఫ్రాన్స్ లాంటి దేశాలను కరవు, వరదలు, హీట్‌వేవ్‌లు ప్రభావితం చేస్తున్నాయి’’అని కెల్లీ చెప్పారు.

2022-23లో గోదుమ దిగుబడి గత నాలుగేళ్లలోనే అతి తక్కువని, మరోవైపు గత ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి గోదుమ నిల్వలు పడిపోనున్నాయని అమెరికా ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది.

గత ఏడాదిలో ఎరువుల ధరలు కూడా మూడు రెట్లు పెరిగాయని గ్రో ఇంటెలిజెన్స్ తెలిపింది. గోదుమ దిగుబడిపైనా ఇది ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది.

వీడియో క్యాప్షన్, LED లైట్లతో డ్రాగన్ ఫ్రూట్ సాగు, ఎకరాకు రూ.15 లక్షల వరకు లాభం

ఈ పరిణామాల నడుమ ప్రపంచ గోదుమ నిల్వలు 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోనున్నాయని సంస్థ కూడా అంచనా వేస్తోంది.

గోదుమల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. అయితే, చైనా కూడా దేశీయ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. తాజాగా గత చలికాలంలో కురిసిన వర్షాల వల్ల గోదుల పంట విపరీతంగా దెబ్బతిందని చైనా అధికారులు కూడా వెల్లడించారు.

ప్రస్తుతం దిగుబడి ఏ స్థాయిలో ఉంది? వర్షాలు ఎంత మేరకు ప్రభావం చూపాయి? లాంటి అంశాలపై స్పష్టత లేదు.

ఒకవేళ దేశీయ అవసరాల కోసం చైనా కూడా ప్రపంచ మార్కెట్‌ను ఆశ్రయిస్తే, గోదుమ ధరలు మరింత పెరిగే అవకాశముంది.

రియాలిటీ చెక్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)