'గని' రివ్యూ: బాక్సింగ్ రింగ్‌లో తడబడ్డ హీరోయిజం

ఫొటో సోర్స్, varuntej/fb
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
థియేటర్లో ప్రేక్షకుల్ని రెండు రకాలుగా సీట్లకు అతుక్కునేలా చేయొచ్చు. ఒకటి.. కొత్త కథ చెప్పడం ద్వారా. రెండోది.. పాత కథనే కొత్తగా చూపించడం ద్వారా. ఏ విజయవంతమైన సినిమా అయినా ఈ రెండింట్లో ఏదో ఒక సెగ్మెంట్లోకి చేరేదే. ఏ దర్శకుడికైనా కొత్త కథ చెప్పడమైనా తెలిసుండాలి. లేదంటే పాత కథనే కొత్తగా చూపించడం తెలిసుండాలి అనేది సుస్పష్టం.
స్పోర్ట్స్ డ్రామా తీసుకున్నప్పుడు కచ్చితంగా అది రెండో కేటరిగిరీదే అయ్యిండాలి. ఎందుకంటే ఏ స్పోర్ట్స్ డ్రామా అయినా.. ఒకేలా ఉంటుంది. ఓ సామాన్యుడు ఛాంపియన్ ఎలా అయ్యాడన్నదే కథ. అయ్యాడన్నది చాలా రొటీన్ వ్యవహారం `ఎలా?` అనే దగ్గరే అసలు మ్యాజిక్ ఉంటుంది.
స్పోర్ట్స్ డ్రామా హిట్టు కొట్టిందంటే.. `ఎలా` అనేది బాగా చూపించడం వల్లే. ఇప్పుడు `గని` సినిమా వచ్చింది. కథ పరంగా రొటీనే కావొచ్చు. మరి కథనంలో, తీయడంలో, సన్నివేశాల్ని చూపించడంలో, భావోద్వేగాల్ని రగిలించడంలో.. `గని` సక్సెస్ అయ్యాడా? పాత కథని కొత్తగా చూపించారా?

ఫొటో సోర్స్, varuntej/fb
అమ్మ మాట.. తండ్రి ఆశయం
ఇదో స్పోర్ట్స్ డ్రామానే అయినా, కథలో ఎమోషనల్ లీడ్ బాగానే వేసుకున్నాడు దర్శకుడు. తల్లికిచ్చిన మాట, తండ్రి ఆశయం మధ్య ఈ కథ దోబూచులాట ఆడుతుంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఆటతో హీరో ఎలా రివెంజ్ తీర్చుకున్నాడన్నది కథ.
గని (వరుణ్‌తేజ్)కి చిన్నప్పటి నుంచీ బాక్సింగ్ అంటే ఇష్టం. తన తండ్రి లానే ఛాంపియన్ కావాలని కలలు కంటాడు. గని తండ్రి విక్రమ్ ఆదిత్య (ఉపేంద్ర)కి కూడా బాక్సింగ్ అంటే ప్రేమ. ఆటలో తాను గెలవడంకంటే.. ఆట గెలవాలని కోరుకుంటాడు.
ప్రతిభ ఉండి, కనీస సౌకర్యాలు లేక, సతమతమవుతున్న బాక్సర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వాళ్లని ఛాంపియన్లుగా చూడాలనుకుంటాడు. అయితే... తనని అడ్డుకుని, స్టెరాయిడ్స్ తీసుకున్నాడన్న అపవాదు మోసి.. ఆట నుంచి వెలేస్తారు. దాంతో తల్లి మాధురి (నదియా) కొడుకు దగ్గర ఓ మాట తీసుకుంటుంది. జీవితంలో బాక్సింగ్ జోలికి వెళ్లకూడదని ఒట్టు వేయించుకుంటుంది. కానీ.. గనికి మనసులో మాత్రం బాక్సర్ అవ్వాలని ఉంటుంది. అందుకే తల్లికి తెలియకుండానే బాక్సింగ్ గ్లౌజులు తొడుక్కుంటాడు.
ఆ ఆటలో పరిణతి సాధిస్తాడు. నేషనల్స్ లో ఆడడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాడు. మరి.. ఈ ఆటలో గెలిచాడా, లేదా? తన తండ్రికి జరిగిన అన్యాయం ఏమిటి? చేసిందెవరు? ఆటలో గెలిచి, ఆటని గెలిపించి... తన తండ్రి ఆశయాన్ని ఎలా నిలబెట్టాడు? ఇదంతా మిగిలిన కథ.

ఫొటో సోర్స్, varuntej/fb
ప్రథమార్థం.. పడుతూ లేస్తూ..!
కథగా చూస్తే... పాతదే అయినా ఫుల్ ప్యాక్డ్‌గా ఉంది. కుటుంబం వైపు నుంచి ఎమోషన్, ఆటల్లో ఉండే భావేద్వేగాలు, రాజకీయాలు.. ఇవన్నీ కథలో కావల్సినట్టుగా మేళవించేశారు. కాకపోతే.. ఒక్కటే సమస్య. ఆ కథని తెరపైకి తీసుకొచ్చే విషయంలో ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు. కథ పోకడలో తమ్ముడు, అమ్మానాన్న తమిళ అమ్మాయి, సుల్తాన్... ఇలాంటి ఛాయలు పుష్కలంగా కనిపిస్తాయి.
హిట్టయిన స్పోర్ట్స్ డ్రామాల రిఫరెన్సులు ఈ సినిమాలో కోకొల్లలుగా ఉంటాయి. హీరో ఎంట్రీ పరమ రొటీన్ స్ట్రీట్ ఫైట్ తో జరిగిపోతుంది. హీరో కుటుంబానికి జరిగిన అన్యాయంతో ఈ కథ చెప్పడం మొదలెట్టాడు దర్శకుడు. ఆ సీన్ చూస్తే `మిగిలిన సినిమా అంతా రొటీన్ గా ఉంటుంది సుమా` అనే హింట్ ఇచ్చినట్టే ఉంటుంది. ఆ తరవాత ఎక్కడ కూడా.. ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేసే ఎలిమెంట్ కనిపించదు.
ఆఖరికి హీరో - హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా. ఈ సినిమాలో ఓ హీరోయిన్ ఉండాలి కాబట్టి ఒకర్ని తీసుకొచ్చి పెట్టినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ ఉన్నప్పుడు కొన్ని సీన్లు ఉండాలి కాబట్టి... కొన్ని లవ్ సీన్లు రాసుకున్నారనిపిస్తుంది. అంతేకానీ, ఈ కథగానీ, క్యారెక్టర్లు అవేమీ డిమాండ్ చేయవు..
అదేంటో.. నదియా - వరుణ్‌తేజ్‌ల తల్లీ కొడుకుల అనుబంధం కూడా... చాలా కృతకంగా కనిపిస్తుంది. ఏదీ మనసులోకి వెళ్లదు. `ఇక్కడ ఎమోషన్ పండించాలి` అని దర్శకుడు అనుకుని, అందుకు తగిన సరంజామాని సిద్ధం చేసుకుని, సీన్ వండేసినా.. అందులో డెప్త్ రాదు. బాక్సింగ్ వైపు వెళ్లను... అని తల్లికి మాట ఇచ్చి, అది తప్పుతున్నానన్న ఆవేదన... గనిలో ఎంత ఉందో.. తండ్రి తనకు చేసిన ద్రోహానికి ఎంత నలిగిపోతున్నాడో.. మాటల్లో చెప్పే ప్రయత్నం చేశారు తప్ప.. అదేం సీన్లలో పండలేదు.
గని తండ్రి ఎవరు అనే విషయాన్ని అదేదో సస్పెన్స్ అన్నట్టు... ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ దాచి పెట్టారు. నిజానికి ఆ ట్విస్ట్ కూడా అంతగా పేలలేదు. పైగా.. ఇలాంటి సినిమాకు ఆ తరహా ట్విస్టు అవసరమా? అనిపించింది. సెకండాఫ్ లో దాదాపు సగ భాగం ఉపేంద్ర సీన్లతో నింపేశారు.
ఉపేంద్ర లాంటి ఆర్టిస్టు ఉన్నాడు కాబట్టి ఆయా సీన్లను చూడబుద్ధేస్తుంది గానీ, ఆ సన్నివేశాల్లో బలం ఉండి కాదు. తండ్రి కూడా రాజకీయాలకు బలైపోయాడన్న సంగతి తెలుసుకుని కొడుకు మారడం, ఆ తరవాత ఛాంపియన్ గా అవతారం ఎత్తడం మిగిలిన కథ.

ఫొటో సోర్స్, JAGAPATI BABU/FACEBOOK
కొన్ని మెరుపులున్నాయి కానీ...
ప్రథమార్థంతో పోలిస్తే.. ద్వితీయార్థంలోనే కొన్ని మెరుపులు ఉంటాయి.
కథంతా సెకండాఫ్‌లో దాచుకోవడం వల్ల.. ఆసక్తి పెరుగుతుంది. కానీ.. ఇక్కడ కూడా కొన్ని తప్పులు చేశాడు దర్శకుడు.
బాక్సింగ్ అనేది క్రికెట్ అంత కిక్ ఇచ్చే ఆట కాదు. మలుపులు ఏం ఉండవు. ఎన్ని మ్యాచ్‌లు అయినా.. ఒకే తరహా పంచ్‌లు ఉంటాయి. దాంతో, ఆట సాగే కొద్దీ ఆసక్తి పెరగాల్సింది పోయి.. తగ్గుతూ వస్తుంది.
తమన్నాని తీసుకొచ్చి.. `కొడితే` పాట పెట్టి కాస్త ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. లేదంటే ఇంకాస్త బోర్ కొట్టేది.
జగపతిబాబులోని చీకటి కోణం తనకు తాను చెబితే గానీ హీరో తెలుసుకోకపోవడం అతి పెద్ద మైనస్. విలన్ తనకు తానుగా వచ్చి బోన్ లో చిక్కుకోవడంలో హీరోయిజం ఏముంటుంది?
బాక్సింగ్ రింగ్ .. ఫైనల్ పోటీలో ముందు చావు దెబ్బలు తిన్న హీరో.. చివర్లో ఓ పంచ్ ఇచ్చి గెలిచేస్తాడు. అప్పటి వరకూ.. ఆ దెబ్బల్ని ఎందుకు భరించినట్టు? చివరి నిమిషాల్లో సినిమాటిక్‌గా ఎందుకు విజృంభించినట్టు..? అనేది అర్థం కాదు.
హీరో చివరికి గెలుస్తాడన్నది అందరికీ తెలుసు. ఆ గెలుపు ఎలా వస్తుందన్నదే ఆసక్తి. దాన్ని నిలబెట్టడంలో.. దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. దాంతో... ఈ స్పోర్ట్స్ డ్రామా పరమ రొటీన్ గా మిగిలిపోతుంది.

ఫొటో సోర్స్, VARUNTEJ/TWITTER
వరుణ్ కష్టం కనిపించింది
వరుణ్ తేజ్ తొలిసారి చేసిన స్పోర్ట్స్ డ్రామా ఇది. తనకు బాక్సింగ్ అంటే ఇష్టం. అందుకే ఆ పాత్రని ప్రేమించగలిగాడు. వరుణ్‌ని చూస్తే నిజంగానే బాక్సర్ లా కనిపించాడు. టైటిల్ సాంగ్ లో తను ఈ పాత్ర కోసం పడిన కష్టం అంతా కనిపించింది. నటుడిగా ఎమోషన్స్ బాగా పండించగలడు వరుణ్.
ఇందులోనూ ఆ స్కోప్ ఉన్నా.. బలమైన సంభాషణలు రాసుకోకపోవడం, ఆయా సీన్లలో ఎమోషన్ కృత్రిమంగా ఉండడంతో వరుణ్ కష్టం నిలబడలేకపోయింది. సాయీ మంజ్రేకర్.. సినిమా నిడివిని పెంచడానికి తప్ప దేనికీ ఉపయోగపడలేదు. నదియా ఓకే అనిపిస్తుంది.
జగపతిబాబు స్టైలిష్ విలన్ గా మరోసారి రాణించాడు. ఆయన కాస్ట్యూమ్స్ బాగున్నాయి, ఉపేంద్ర ఉన్న కాసేపూ.. సినిమా ఆసక్తిగానే సాగింది. సునీల్ శెట్టికి తగిన పాత్ర కాదిది. నరేష్ ని కోచ్ గా చూపించడం ఏమాత్రం అమరలేదు. శ్రీనివాసరెడ్డి, సత్య లాంటి కమెడియన్లు ఉన్నా సరిగా వాడుకోలేదు.

ఫొటో సోర్స్, Thaman S/TWITTER
తమన్ సంగీతం ప్లస్ పాయింట్
తమన్ నేపథ్య సంగీతం ఈమధ్య కొన్ని సినిమాలకు ప్లస్ పాయింట్ గా మారింది. కానీ, ఈ సినిమాలో ఆ మ్యాజిక్ కనిపించలేదు. మళ్లీ మళ్లీ వినాలన్న పాట ఒక్కటీ లేదు. బీజియమ్స్ లోనూ. హోరే ఉంది. కెమరా వర్క్ బాగుంది. ముఖ్యంగా బాక్సింగ్ ఎపిసోడ్లు బాగా తెరకెక్కించారు. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ పనితనం కూడా బాగుంది. అంతర్జాతీయ స్థాయిలో... బాక్సింగ్ రింగ్‌లను రూపొందించారు.
ఖర్చుకి నిర్మాతలు ఎక్కడా వెనుకాడలేదు. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. చిన్న పాత్రనైనా.. పేరున్న వాళ్లతో చేయించారు. అయితే దర్శకుడు ఎంచుకున్న కథలో పదును లేదు. తీసిన విధానంలో కొత్త దనం కనిపించలేదు. ఇంత మంది స్టార్ తారగణం, వరుణ్ కష్టం.. ఇవన్నీ ఓ సాదా సీదా కథలో నలిగిపోయాయి.
స్పోర్ట్స్ డ్రామా అంటే యువత వెంటనే కనెక్ట్ అయిపోతుంది. బాక్సింగ్ లాంటి ఆటలైతే... ఇంకాస్త త్వరగా చేరువ అవుతాయి. ఇలాంటి నేపథ్యంలో కథని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆసక్తిగా చెబితే చాలు. అదే, గనిలో కరువైంది.
ఇవి కూడా చదవండి:
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- షాంఘై లాక్డౌన్: ఆహారం దొరకడం లేదంటున్న కొందరు స్థానికులు
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
- యుక్రెయిన్: ‘రష్యా సైనికులు మా నాన్న గుండె మీద కాల్చారు.. నా కళ్లెదుటే చంపేశారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










