యుక్రెయిన్: భారత అలీన విధానం ఒత్తిడిని ఎదుర్కొంటోందా? తటస్థ వైఖరి భారత్‌కు ఇబ్బందికరంగా మారిందా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్ మీద వ్లాదిమిర్ పుతిన్ దండయాత్ర విషయంలో క్వాడ్ దేశాల బృందంలో ఒక్క భారతదేశం మాత్రం కొంత జంకుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం నాడు వాషింగ్టన్‌లో వ్యాపారవేత్తలతో నిర్వహించిన ఒక సమావేశంలో వ్యాఖ్యానించారు.
చైనా ప్రభావాన్ని తిప్పికొట్టటానికి ఏర్పాటుచేసుకున్న క్వాడ్ బృందంలోని మిగతా మూడు దేశాలు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు.. ''పుతిన్ దురాక్రమణ విషయంలో అత్యంత బలంగా వ్యవహరిస్తున్నాయ''ని బైడెన్ పేర్కొన్నారు.
భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ అలీన విదేశాంగ విధానాన్ని అవలంబిస్తోంది. ''మేం పెద్ద కూటములకు దూరంగా ఉంటాం.. అన్ని దేశాలతో స్నేహపూర్వకంగా ఉండటానికి ఏ కూటమిలోనూ చేరం'' అని తొలి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం తొలి నాళ్లలో చెప్పారు.
అయితే ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం.. భారత ప్రసిద్ధ అలీన విధానం మీద ఒత్తిడి తెస్తోంది.
'చాలా పెద్ద దౌత్య జూదం'
''భారతదేశం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. సందేహం లేదు'' అని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే థింక్ ట్యాంక్ ఏసియా ప్రోగ్రామ్ ఎట్ ది విల్సన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కుగల్మన్ పేర్కొన్నారు.
''ఎటూ కాకుండా మధ్యలో ఉండటం గతంలో కంటే ఇప్పుడు చాలా పెద్ద దౌత్య జూదం. ఎందుకంటే యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర కొన్ని దశాబ్దాల్లో అతిపెద్ద దురాక్రమణ. పైగా పశ్చిమ దేశాలతో భారతదేశ సంబంధాలు ఎప్పుడూ బలంగా లేవు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
రష్యాను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో వారం రోజుల్లో మూడు తీర్మానాలు చేయగా.. వాటిపై ఓటు వేయకుండా భారత్ గైర్హాజరైంది. యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు పెరిగిపోగా.. భారతదేశానికి రష్యా నుంచి రాయితీ ధర చమురు దిగుమతులు పెరిగాయని వార్తలు వస్తున్నాయి. భారత్ తెలివిగా రష్యాను విమర్శించలేదు కూడా. రష్యా గతంలో దీర్ఘకాలికంగా, కాలపరీక్షకు నిలిచిన మిత్రదేశమని చెప్పింది.
ఇండియా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచీ దశాబ్దాల సంబంధం ఉంది. భారతదేశానికి అత్యధికంగా ఆయుధాలు సరఫరా చేసేది రష్యానే.

ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితులు మారాయని భారత్‌ను ఒప్పించటానికి అమెరికా ఇప్పుడు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా.. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ప్రస్తుతం ఇండియా, రష్యాల మధ్య 800 కోట్ల డాలర్లుగా ఉంటే.. ఇండియా, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15,000 కోట్ల డాలర్లుగా ఉంది.
అమెరికా విదేశాంగ శాఖ రాజకీయ వ్యవహారాల ఉపమంత్రి విక్టోరియా న్యూలాండ్ ఈ వారంలో భారత్‌లో పర్యటించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఇతర ఉన్నతాధికారులతో ''విస్తృతమైన, లోతైన సంప్రదింపులు'' జరిపినట్లు ఆమె చెప్పారు. భారత్, రష్యాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాన్ని తాము గుర్తిస్తున్నామన్నారు. అయితే ''ఇప్పుడు కాలం మారింది. ఇండియా ఆలోచన మారుతోంది'' అని కూడా ఆమె పేర్కొన్నారు.
భారతదేశానికి బలమైన ''రక్షణ, భద్రత భాగస్వాములు''గా ఉండటానికి అమెరికా, యూరప్‌లు సుముఖంగా ఉన్నాయని ఆమె విలేకరులతో చెప్పారు. భారతదేశం రష్యా ఆయుధ సరఫరాల మీద ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించటానికి అమెరికా సాయం చేయగలదన్నారు. ''నిరంకుశత్వానికి - ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంలో ఈ యుద్ధం ఓ కీలక మలుపు. ఇందులో భారతదేశ మద్దతు అవసరం'' అని విక్టోరియా చెప్పారు.
ఇది అమెరికా ఇచ్చిన విస్పష్ట సందేశమని కుగల్మన్ పేర్కొన్నారు. అయితే పరిణామాలు ఎలా ఉంటాయనేది తెలీదన్నారు.
కానీ.. భారతదేశం దౌత్యపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని నమ్మటానికి భారతదేశ నిపుణులు సిద్ధంగాలేరు.
యుక్రెయిన్ విషయంలో రష్యాను ఇండియా ఎందుకు విమర్శించటం లేదు?
క్వాడ్ బృందంలోని ఇతర సభ్యులు భారత్ పట్ల సానుభూతితో ఉన్నారని, యుక్రెయిన్‌కు భారత్ అందిస్తున్న మానవతా సాయాన్ని అమెరికా సైతం గుర్తించిందని వారు ఉటంకిస్తున్నారు. ''క్వాడ్‌లో ఏదైనా ఒక దేశం ఒంటరి అయిందంటే.. అది ఇండియా కాదు, అది అమెరికానే'' అంటారు భారత మాజీ దౌత్యవేత్త జితేంద్ర నాధ్ మిశ్రా.
రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొన్నందుకు తన వ్యూహాత్మక భాగస్వామిని ఆంక్షల ద్వారా బలహీనపరచటం అమెరికాకు ప్రయోజనం కలిగించదు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు సరితుల్య పాత్ర భారత్ పోషించాలని అమెరికా కోరుకుంటోంది.

ఫొటో సోర్స్, AFP
'వ్యూహాత్మకంగా తటస్థం'
అదేసమయంలో.. రష్యాతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటమనేది, యుక్రెయిన్ సంక్షోభం విషయంలో భారత్ దూరంగా ఉన్నట్లు కాదని నిపుణులు అంటున్నారు.
గత వారం జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిద భారత పర్యటనకు వచ్చినపుడు ఆయనతో కలిసి మోదీ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనను వారు ఉటంకించారు. ఇరువురు నేతలూ ''యుక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ, మానవ సంక్షోభం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు''. అలాగే.. ''సమకాలీన అంతర్జాతీయ క్రమం యూఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టం, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతల మీద గౌరవం అనేవి పునాదిగా నిర్మితమైంది'' అని కూడా పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీతోనూ మోదీ ఫోన్‌లో మాట్లాడారు. హింసకు ముగింపు పలకాలని కోరారు. యుక్రెయిన్ నుంచి 22,000 మంది భారతీయులను మోదీ ప్రభుత్వం 90 విమాన సర్వీల ద్వారా ఆయన బయటకు తీసుకురాగలిగారు.
భారత ప్రతిస్పందన 'జంకుతున్నట్లు'గా ఉందంటూ బైడెన్ చేసిన వ్యాఖ్యలు 'ఒకరకమైన జోక్ కావచ్చు' అని మాస్కోలో పనిచేసిన మాజీ భారత దౌత్యవేత్త అనిల్ త్రిగుణియత్ వ్యాఖ్యానించారు.
''భారత వైఖరి మొదటి నుంచీ ఒకే విధంగా, సూత్రబద్ధంగా ఉంది. దౌత్యం, చర్చలు, యుక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించటం అనేది భారత్ వైఖరి. వ్యూహాత్మకంగా మనం తటస్థంగా ఉండాలి. మరో దారి లేదు'' అని ఆయన పేర్కొన్నారు.
భారతదేశం మీద ఒత్తిడి నిజంగా పెరగలేదని, వైరుధ్యాలను ఇండియా చాలా బాగా సమన్వయం చేస్తోందని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విదేశాంగ విధానం ప్రొఫెసర్ హాప్పీమన్ జాకబ్ విశ్లేషించారు.
''ప్రశ్న ఏమిటంటే ఇండియా మరింత ఎక్కువ చేయగలిగి ఉండేదా అనేది'' అంటారాయన.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియా ఇంకా ఎక్కువ చేయగలదా?
అది చెప్పలేం.
ఈ సంక్షోభాన్ని భారతదేశం అద్భుతంగా మేనేజ్ చేసినప్పటికీ.. ''నిర్మొహమాటంగా మాట్లాడి ఉండాల్సింది. అక్కడ సైనికదాడి చేస్తున్నారు. యుద్ధం జరుగుతోంది. అలా మాట్లాడకపోతే మన విశ్వసనీయత మీద అది ప్రభావం చూపుతుంది'' అని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శివ్ శంకర్ మీనన్ ద వైర్‌తో పేర్కొన్నారు.
అయితే.. రష్యాతో భారత్ సంబంధం చిరకాలంగా కొనసాగుతున్న, లోతైన విశ్వాసంతో కూడుకున్నదని.. కాబట్టి భారత్ తన మిత్రపక్షానికి ఎదురుతిరగటం అంత సులభం కాదని కుగల్మన్ చెప్పారు.
''అదే సమయంలో పశ్చిమ దేశాలతో తన సంబంధాలను దూరం చేసుకోవటం కూడా భారత్‌కు ఇష్టం లేదు'' అన్నారాయన.
అలా దూరంకాకుండా ఉండటానికి ఒక మార్గం.. మూడో పక్షానికి చెందిన మధ్యవర్తిగా భారత ముందుకు రావటమని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో యుక్రెయిన్ రాయబారి ఐగర్ పోలిఖా.. యుద్ధం ఆరంభానికి ముందు భారత్ ఈ పాత్ర పోషించాలని కోరారు.
''రష్యాతో సన్నిహిత సంబంధాలను, యుక్రెయిన్‌తో సుహృద్భావ సంబంధాలను ఉపయోగించుకుని.. ఇరు పక్షాలనూ ఘర్షణను విరమించుకునే దిశగా తీసుకెళ్లటానికి భారత్ ప్రయత్నించవచ్చు'' అంటారు కుగల్మన్.
దీనితో జాకబ్ ఏకీభవిస్తున్నారు. మధ్యవర్తిత్వం వహించాలని యుక్రెయిన్ కోరినపుడు భారతదేశం ఆ పని చేపట్టి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ''భారత్‌కు ఇంకా ఆ అవకాశం ఉంది. తను స్వయంగా ముందుకెళ్లి తటస్థ మధ్యవర్తిగా మాట్లాడతానని చెప్పవచ్చు'' అని పేర్కొన్నారు.
ఏదేమైనా.. చైనాతో చెడిన తన సంబంధాలను మేనేజ్ చేయటానికి భారతదేశానికి అమెరికా, రష్యాలు రెండూ తన పక్షాన ఉండటం అవసరం. ఇండియా, చైనాలు గత ఏడాది హిమాలయ ప్రాంతంలో వివాదాస్పద సరిహద్దు వద్ద సాయుధ బలగాలతో ఎదురుబొదురుగా నిల్చున్నాయి.
దీర్ఘ కాలంలో భారతదేశం వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విధానాన్ని అనుసరించాలని త్రిగుణియత్ అభిప్రాయపడుతున్నారు. యుక్రెయిన్ యుద్ధం అనంతరం రెండో ప్రచ్ఛన్న యుద్ధం మరింత తీవ్రంగా ఉంటుందని.. అప్పుడు వివిధ దేశాల అభివృద్ధి ప్రయోజనాలను నెరవేర్చుకోవటానికి, అలీనోద్యమానికి పెద్ద దూరం జరగకుండా.. ''వ్యూహాత్మక ఐక్యత కోసం దేశాల బృందా''న్ని ఏర్పాటు చేయటానికి భారత్ చొరవ తీసుకోవాలని విశ్లేషించారు.
అయితే.. ''రష్యా నుంచి తనకు ఎక్కువ ముప్పు ఉందని భావించి, చైనాతో వ్యూహాత్మక సర్దుబాటు చేసుకోవాలని అమెరికా నిర్ధారణకు వచ్చినట్లయితే.. అది భారతదేశానికి పీడకల పరిస్థితే అవుతుంది. దీని అర్థం.. యూరప్ కూటమిని రక్షించుకుంటూ.. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని అమెరికా అంగీకరించటమే అవుతుంది'' అని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ శరణ్ పేర్కొన్నారు.
ఆ 'పీడకల'ను భారత్ తట్టుకోలేదు.
ఇవి కూడా చదవండి:
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- చైనా: 132 మందితో వెళ్తున్న ఆ విమానం ఎలా కుప్పకూలింది... సాంకేతిక లోపమా, విద్రోహ చర్యా?
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








