తమిళిసై vs కేసీఆర్‌: తెర వెనుక ఏం జరిగింది? గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు కరెక్టేనా?

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్

ఫొటో సోర్స్, facebook/KalvakuntlaChandrashekarRao

    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. కానీ గవర్నర్ ప్రారంభ ఉపన్యాసం లేకుండానే సభలు మొదలు కావడం వివాదంగా మారింది.

గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం ద్వారా ముఖ్య మంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చి నిరసనకు దిగారు. దీంతో రాజా సింగ్, ఈటల రాంజేదర్, రఘునందన్‌లను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.

అసలు వివాదం ఏంటి?

సాధారణంగా ప్రతి ఏడాదిలో మొదటి అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ హాజరవుతారు. రెండు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంటే గవర్నర్ స్పీచ్‌తోనే సమావేశాలు మొదలవుతాయి. అయితే ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశ పెట్టేసింది తెలంగాణ ప్రభుత్వం.

ప్రస్తుత సమావేశాలు గత ఏడాది అక్టోబర్ సమావేశాలకు కొనసాగింపు కాబట్టి గవర్నర్ ప్రసంగం అవసరం లేదనేది ప్రభుత్వం వాదన. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నర్సింహా ఆచార్యులు కూడా స్పష్టం చేశారు. అయితే దీనిపై గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అభ్యంతరం తెలిపారు.

సాంకేతిక కారణాలను చూపుతూ తన ప్రసంగాన్ని రద్దు చేశారని, కానీ గత ఏడాదికి సంబంధించి ప్రభుత్వ పని తీరును చర్చించే అవకాశాన్ని కోల్పోయారని గవర్నర్ అన్నారు.

2020లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతున్న తమిళిసై సౌందర రాజన్

ఫొటో సోర్స్, facebook/TelanganaCMO

ఫొటో క్యాప్షన్, 2020లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తమిళిసై సౌందర రాజన్

గవర్నర్ స్పీచ్ ఎంత ముఖ్యం?

కానీ ఈ సారి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ స్పీచ్ లేకుండానే మొదలు కావడం పలు ప్రశ్నలకు తావిచ్చింది. గవర్నర్ లేకుండా అసలు అసెంబ్లీ సమావేశాలు మొదలు కావొచ్చా అనే సందేహాలు కూడా వచ్చాయి.

వీడియో క్యాప్షన్, కేసీఆర్ ఉన్నట్లుంది మోదీపై స్వరం ఎందుకు పెంచారు? కేసీఆర్ దిల్లీ కల ఫలిస్తుందా?

అయితే కొత్త సంవత్సరంలో తొలి సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే మొదలు కావాలని, అది గవర్నర్ బాధ్యతని మహీంద్ర యూనివర్సిటీ ఫర్ లా డీన్ మాడభూషి శ్రీధర్ అన్నారు. 'గవర్నర్ పదవిలో నియమితులైన వారు ఎవరైనా ఆర్టికల్-163 ప్రకారం మంత్రి మండలి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి .

ప్రభుత్వం రాసిన ప్రసంగాన్నే గవర్నర్ అసెంబ్లీలో చదవాలి. ఆర్టికల్-174 ప్రకారం సమావేశాల ముగింపు గురించి కూడా గవర్నర్ మంత్రి మండల సూచనల మేరకు తెలియ చేయాలి. అంతే కానీ అసెంబ్లీ సమావేశాల గురించి గవర్నర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు.

అయితే ఆర్టికల్-176 ప్రకారం క్యాలెండరు సంవత్సరంలోని మొదటి సెషన్ ప్రతి సారి గవర్నర్ స్పీచ్‌తోనే మొదలవ్వాలి. అది గవర్నర్ బాధ్యత.' అని శ్రీధర్ వివరించారు.

కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook/KalvakuntlaChandrashekarRa

ఫొటో క్యాప్షన్, హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్‌ నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు

గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ సౌందర రాజన్ కొంత అసహనంతో ఉన్నారు .

ఫిబ్రవరి 5న విడుదల చేసిన పత్రిక ప్రకటనలో 'ప్రభుత్వం ఇందుకు సాంకేతికత కారణాలను చూపిస్తోంది. కానీ 5 నెలల తరువాత మొదలవుతున్న అసెంబ్లీ సమావేశాలను కొత్త సమావేశాలు కాదని ఎలా అంటాం? గవర్నర్ ప్రసంగమంటే కేవలం స్పీచ్ మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వ రిపోర్ట్ కార్డు కూడా' అని గవర్నర్ అన్నారు.

మరో వైపు దీనిపై ప్రభుత్వం తన వైఖరిని చెప్పకనే చెప్పింది . ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి ఒక మెసేజ్ లీకు చేశారు. అందులో అది ఎవరు చెప్పారో చెప్పకుండా 'గవర్నర్‌తో మొదటి రెండు ఏళ్లు సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ ఆ తరువాత ఎన్నో సార్లు ప్రభుత్వంతో గవర్నర్ విభేదించారు. కౌశిక్ రెడ్డిని గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా చేస్తూ రాష్ట్ర మంత్రివ‌ర్గం సిఫార్సు చేసింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకోకుండా చాలా రోజులు తన వద్దే ఉంచుకున్నారు గవర్నర్. ఉభ‌యస‌భ‌ల‌ను ఉద్దేశించి గవర్నర్ ప్ర‌సంగించినా 26 జ‌న‌వ‌రి నాడు జెండా ఎగుర‌వేసి మాట్లాడినా ప్ర‌భుత్వం (మంత్రి మండ‌లి) ఆమోదించిన ప్ర‌సంగాన్ని మాత్ర‌మే చ‌దవాలి. సొంతంగా ప్ర‌సంగం చేయ‌డానికి వీల్లేదు. రాజ్యాంగం ఒప్పుకోదు. ఈసారి జ‌న‌వ‌రి 26న గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం పంపించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగాన్నే చ‌దివారు. వాస్త‌వానికి జ‌న‌వ‌రి 26వ తేదీ ప్ర‌సంగానికి సంబంధించి ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఎలాగూ బ‌హిరంగ స‌భ లేదు కాబ‌ట్టి ప్ర‌సంగాలు వ‌ద్ద‌నుకున్నారు. కానీ, గ‌వ‌ర్న‌ర్ అనూహ్యంగా 26 జ‌న‌వ‌రి నాడు ప్ర‌సంగించారు. 2021-2022 గ‌వ‌ర్న‌ర్ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో రాష్ట్ర మంత్రిమండ‌లి ఆమోదించ‌ని కొన్ని పేరాల‌ను సొంతంగా చ‌దివారు. అప్పుడు ప్ర‌భుత్వం కూడా దాన్ని పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదు. ఇక శాస‌న‌మండ‌లికి ప్రొటెం చైర్మన్‌గా ఎంఐఎం స‌భ్యుడు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అమీనుల్ జాఫ్రీని రిక‌మండ్ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఫైల్‌ను గ‌వ‌ర్న‌ర్‌కు పంపించింది. అయితే గ‌వ‌ర్న‌ర్ దానిపై నిర్ణ‌యం తీసుకోకుండా నాన్చివేత ధోరణితో వ్య‌వ‌హ‌రించారు. ప్రొటెం చైర్మన్ దేనికి డైరెక్ట్‌గా చైర్మన్ ఎన్నిక పెట్టండి అని గ‌వ‌ర్న‌ర్ ఉచిత స‌ల‌హాను ప్ర‌భుత్వానికి ఇచ్చారు' అనేది ఈ లీకు సారాంశం.

తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

ఫొటో సోర్స్, facebook/TelanganaCMO

'పెరుగుతున్న గవర్నర్ల జోక్యం'

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కొంత కాలంగా బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మూడవ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల బీజేపీకి చెందిన సౌందర రాజన్‌తో తన ప్రభుత్వానికి ఇబ్బంది కలగొచ్చని భావించి కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకూడదనేది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తోంది.

అయితే గవర్నర్, ప్రభుత్వం ఇద్దరి వైపూ ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకుడు కటారి శ్రీనివాస్ అంటున్నారు. 'గత కొన్నేళ్లుగా కొన్ని రాష్ట్రాలలో గవర్నర్, ప్రభుత్వాల మధ్య విభేదాలు ఎక్కువుగా కనపడుతున్నాయి. 2014లో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీజేపీ పాలన లేని రాష్ట్రాల్లో ఇలాంటి ఘర్షణలు తరచూ కనపడుతున్నాయి. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వ రోజు వారీ పనులలో గవర్నర్ జోక్యం చేసుకునే వారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు అనుకూలంగా ఉండేవారు.' అని శ్రీనివాస్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ కూడా విమర్శిస్తోంది. 'అట్టహాసంగా మహిళా దినోత్సవం జరుపుతామంటున్న రాష్ట్ర ప్రభుత్వం... ఒక గౌరవమైన హోదాలో ఉన్నా మహిళను కించపరచడం శ్రేయస్కరమేనా?' అంటూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న విభేదాలు ఈ ఘటనతో మరింత బహిర్గతమయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)