మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో కోళ్లను ఎందుకు ఎగరేస్తున్నారంటే..

మేడారం జాతరలో సమ్మక్క-సారక్క రాత్రి గద్దెపైకి చేరడంతో వారిని దర్శించడానికి జనం తరలివస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకోడానికి తరలివస్తున్న భక్తులతో మేడారం జనసంద్రంలా మారింది.

ఫొటో సోర్స్, FB/Medaramjathara
మేడారం జాతరకు తరలివచ్చిన భక్తుల స్నానాలతో జంపన్నవాగు నిండిపోయింది. శివసత్తులు, పిల్లలు మహిళలు, మొక్కులు ఉన్నవారు జంపన్నవాగులో స్నానాలు చేసిన తర్వాత వనదేవతల గద్దెలు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.

జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా తరలివస్తున్న జనాలను అదుపు చేస్తున్నారు. 500 మంది పోలీసులు,
ఆదివాసీ సంఘాల సభ్యుల భద్రత మధ్య సమ్మక్కను గద్దెకు తీసుకొస్తుండగా దారి పొడవునా రంగవల్లులతో మహిళలు స్వాగతం పలికారు.

రాత్రి సమ్మక్కను కుంకుమ భరిణె రూపంలో పూజారులు గుట్ట కిందికి తీసుకువస్తున్న సమయంలో ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఏకే 47తో గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారి రాక గురించి భక్తులకు సంకేతాలిచ్చారు.

ఫొటో సోర్స్, facebook/manamedaramjathara

ఫొటో సోర్స్, facebook/manamedaramjathara
సమ్మక్క, సారలమ్మలు గద్దెపైకి వచ్చే సందర్భంగా అక్కడ ఉన్న భక్తులు ఇలా కోళ్లను ఎగరేయడం ఆనాయితీగా వస్తోంది.

ఫొటో సోర్స్, FB/medaramjathara
వనదేవతలిద్దరూ గద్దెపైకి చేరుకోగానే భక్తులు జయజయధ్వానాలు చేస్తూ అమ్మవార్లకు స్వాగతం పలికారు. బుధవారం సారలమ్మ, తండ్రి పగిడిద్ద రాజు, భర్త గోవిందరాజు గద్దెపై కొలువుదీరగా.. గురువారం సమ్మక్క కూడా అక్కడికి చేరుకోవడంతో జాతర కోలాహలం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, FB/medaramjatara
భక్తులు తమ ఎత్తు బంగారాన్ని సమర్పించి వనదేవతలకు మొక్కు తీర్చుకుంటున్నారు.

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా కుటుంబంతో సహా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి మంత్రి మొక్కులు తీర్చుకున్నారు. గద్దెలపైకి చేరుకోకముందే అమ్మవార్లు 75 లక్షల మంది దర్శించుకున్నారని మంత్రి చెప్పారు.
డిసెంబర్ నుంచి జాతర ప్రారంభం ముందు వరకూ 50 లక్షల మంది సమ్మక్క-సారక్కను దర్శించుకున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. కుంభమేళా తర్వాత జరిగే అతిపెద్ద జాతరగా మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

ఫొటో సోర్స్, FB/Dayakar Rao Errabelli
రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మేడారంలో తాత్కాలిక బస్ స్టేషన్ ను ప్రారంభించారు. మంత్రులు మేడారంలో క్యూ లైన్లను పరిశీలించారు. మంత్రులకు ఆర్టీసీ కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు.

ఫొటో సోర్స్, FB/Medaramjathara
అమ్మవార్ల దర్శనం కోసం సీఎం కేసీఆర్ శుక్రవారం మేడారం రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడికి చేరుకోనున్న ముఖ్యమంత్రి మొక్కులు చెల్లించి అమ్మవార్లను దర్శించుకుంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా శుక్రవారం మేడారం వెళ్లనున్నారు.

ఫొటో సోర్స్, FB/Medaramjatara
జాతర కోసం ప్రత్యేకంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ 'మేడారం విత్ టీఎస్ఆర్టీసీ' అనే ప్రత్యేక యాప్ ఆవిష్కరించారు. ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతర కోసం 3800కు పైగా బస్సులు నడుపుతోంది.

ఫొటో సోర్స్, fb/medaramjathara
మేడారం వచ్చే భక్తులకు మరింత సులభంగా ఉండేలా ఏయే రూట్ల నుంచి బస్సులు నడుపుతున్నారో, వాటి ఛార్జీల వివరాలను టీఎస్ఆర్టీసీ విడుదల చేసింది. భక్తులకు సులభంగా అర్థమయ్యేలా ఒక ఫొటో రూపంలో దీనిని అందించింది.

ఫొటో సోర్స్, FB/Medaramjathara
మేడారం జాతరకు వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్న భక్తులు తర్వాత అక్కడ ఉన్న ఆదివాసీ, గిరిజన మ్యూజియంను సందర్శిస్తున్నారు. ఇందులో ఆనాటి గిరిజన, ఆదివాసీల జీవితాలను ప్రదర్శిస్తున్నారు.

ఫొటో సోర్స్, FB/Medaramjathara
మేడారం జాతర కోసం తెలంగాణలోని వివిధ ప్రాంతాలతోపాటూ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసీలు భారీగా తరలివస్తున్నారు. సంప్రదాయ వాయిద్యాలతో ఆడుతూ పాడుతూ సందడి చేస్తున్నారు.

మేడారంలో ఉన్న ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ కళాకారులు తమ సంప్రదాయ దుస్తులు, అలంకరణలో తమ ప్రాంత నృత్యాలను ప్రదర్శిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన గుస్సాడి, రేలా, ఖమ్మం ప్రాంతంలోని కొమ్ము, ధింసా నృత్యాలు ప్రదర్శించారు.

ఫొటో సోర్స్, fb/Information & Public Relations Dept, Telangana
మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ సేవలు కూడా ప్రారంభించింది.
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి మేడారంతోపాటూ, కరీంనగర్, మహబూబ్ నగర్ నుంచి కూడా మేడారం వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
మేడారం ప్రాంతంలో తెలంగాణ టూరిజం శాఖ హాట్ ఎయిర్ బెలూన్ కూడా అందుబాటులో ఉంచింది.

ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ సైట్లలోని నా ఫొటోలను తెలిసినవారు ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉంది’
- రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా లబ్ధి పొందాలని చూస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














