చిరంజీవి ‘రాజ్యసభ సీటు ఆఫర్’ వార్తలపై ఏమన్నారంటే... – ప్రెస్‌రివ్యూ

చిరంజీవి, జగన్

ఫొటో సోర్స్, Chiranjeevi/FB

తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని ప్రముఖ సినీనటుడు చిరంజీవి చెప్పినట్లు ఈనాడు ఓ కథనం ప్రచురించింది. తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారనేది పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టంచేసినట్లు పేర్కొంది.

‘‘కృష్ణా జిల్లా డోకిపర్రులో ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృ ష్ణారెడ్డి ఇంట్లో గోదాదేవి కల్యాణోత్సం, సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు చిరంజీవి దంపతులు శుక్రవారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు.

సినీ పరిశ్రమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి గురువారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వైకాపా రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది.

దీనిపై చిరంజీవిని శుక్రవారం మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ‘నాకు రాజ్యసభ సీటు అనే మాట స్పెక్యులేషన్. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా . అలాంటివేవీ నా దగ్గరికి రావు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు ఎవరూ ఆఫర్ ఇవ్వరు. వాటిపై నేనేమీ సమాధానం చెప్పను. అలాంటి వాటికి లోబడేది కానీ, కావాలని కోరుకోవడమనేది నా అభిమతం కాదు. రాజకీయాలకు నేను పూర్తి దూరం’ అని చెప్పారు.

‘తెలుగు సినీ పరిశ్రమ మేలు కోసం , థియేటర్ల మనుగడ కోసం చర్చిం చిన విషయాల్ని పక్క దోవ పట్టించేలా, ఆ సమావేశానికి రాజకీయ రంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్టు కొన్ని మీడియా సం స్థలు వార్తలు ప్రసారం చేస్తున్నా యి. దయచేసి ఊహాగానాల్ని వార్తలుగా ప్రసారం చేయవద్దు. అందుకు సంబంధించిన చర్చల్ని ఇక్క డితో ఆపాలని కోరుతున్నా’ అని చిరంజీవి ట్వీట్ చేశారని కూడా ఈనాడు పేర్కొంది.

రఘురామ

ఫొటో సోర్స్, RAGHU RAMA KRISHNA RAJU/FACEBOOK

ఎంపీ రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సాక్షి ఓ కథనం ప్రచురించింది.

‘‘సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాక కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు నమోదైనట్లు సీఐ ఎంవీఎస్‌ మల్లేశ్వరరావు తెలిపారు.

చింతలపూడికి చెందిన గొంది రాజు, ఎయిమ్‌ సభ్యుడు కాకర్ల సత్యనారాయణ, ఎంఎస్‌ రాజేంద్ర, బుచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

అంబేడ్కర్‌ మిషన్‌ నాయకులు మాట్లాడుతూ.. బ్యాంకులను మోసం చేసి ప్రజల సొమ్మును దోచుకున్న రఘురామ నిజాయితీపరుడైన అధికారిని దూషించడాన్ని ఖండించారు.

మల్లాది చంద్రశేఖరశాస్త్రి

ఫొటో సోర్స్, Malladi chandrasekhara sastry/Facebook

వేద పండితులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి కన్నుమూత

వేద పండితుడు, ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి (96) కన్నుమూశారని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

‘‘వయోభారంతో శుక్రవారం సాయం త్రం హైదరాబాద్ లోని నివాసంలో ఆయన కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనకు భార్య సీతారామ ప్రసన్న, ఆరుగురు మగ పిల్లలు (రామకృష్ణ, వీరరాఘవ శర్మ, రామనాథ్, రామారావు దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఇద్దరు ఆడపిల్లలు (ఆదిలక్ష్మి సరస్వతి) ఉన్నారు.

రామాయణ, మహాభారత, భాగవతాలపై పట్టున్న చంద్రశేఖర శాస్త్రి 15వ ఏట నుంచే ప్రవచనాలు చెప్పేవారు.

ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణాలను కలగలిపి ప్రవచనాలు చెప్పేవారు.

1925 ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో మల్లాది దక్షిణామూర్తి, శారదాంబ దంపతులకు ఏడో సంతానంగా చంద్రశేఖర శాస్త్రి జన్మించారు.

భద్రాచలం సీతారామ కల్యాణ వేడుకలకు ఉషశ్రీతో కలిసి ప్రత్యక్ష వ్యాఖ్యానాల్లో పాల్గొన్న చంద్రశేఖర శాస్త్రి.. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా ప్రభుత్వ ఉగాది వేడుకల్లో పంచాంగ పఠనంతో ఆదరణ పొందారు.

ఆకాశవాణిలో తిరుమల బ్రహ్మోత్సవాలు, భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో సమయోచిత పద్యాలు, శ్లోకాలతో వాఖ్యానాలు చేసేవారు’’అని కథనంలో పేర్కొన్నారు.

కార్లు

ఫొటో సోర్స్, Getty Images

అద్దె కార్లు తనఖా పెట్టి జల్సాలు.. ఇద్దరి అరెస్టు

కార్లను అద్దెకు తీసుకుని తనఖా పెట్టి జల్సాలు చేస్తున్న ఇద్దరిని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

‘‘ఆసి‌ఫ్‌నగర్‌ పోలీసులతో నిర్వహించిన జాయింట్‌ ఆపరేషన్‌లో వారి నుంచి రూ.40 లక్షల విలువ చేసే మూడు కార్లు, ఓ మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

కిషన్‌బాగ్‌ నివాసి మహ్మద్‌ సల్మాన్‌(30) అలియాస్‌ డాన్‌ కారు డ్రైవర్‌. ముగ్గురి వద్ద అద్దెకు కార్లు తీసుకున్నాడు. వాటిని తనఖా పెట్టేవాడు.

2020 లోనూ సైదాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత కిషన్‌బాగ్‌ నివాసి మహ్మద్‌ హుస్సేన్‌(21)తో కలిసి అదే ప్లాన్‌ చేశాడు.

పలు చోట్ల కార్లు అద్దెకు తీసుకుని వాటిని తనఖా పెట్టిన వారిని అరెస్ట్‌ చేశారు’’అని కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)