జార్ఖండ్: లీటరు పెట్రోలుకు రూ.25 తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. సబ్సిడీ నిబంధనలు ఏంటంటే..

ఫొటో సోర్స్, IPRD,JHARKHAND
- రచయిత, రవి ప్రకాష్
- హోదా, రాంచీ నుంచి, బీబీసీ కోసం
జార్ఖండ్‌లో పేదలకు లీటరు పెట్రోల్ రూ.25 తక్కువగా లభించబోతోంది. రేషన్ కార్డు ఉంటే చాలు వారు తమ ద్విచక్ర వాహనాలకు తక్కువ ధరకు పెట్రోల్ కొట్టించుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి నెలకు ఇలా గరిష్టంగా 10 లీటర్ల పెట్రోల్ మాత్రమే పోయించుకోవచ్చు.
అంటే, నెలకు ఒక వ్యక్తి 250 రూపాయలు ఆదా చేయగలుగుతారు. ఆ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.
ఈ ప్రకటన చేసిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దేశంలో పెట్రోల్ ధరల్లో భారీ తగ్గింపు ప్రకటించిన తొలి ముఖ్యమంత్రిగా నిలిచారు. అయితే ఈ లబ్ధి పొందాలంటే కొన్ని షరతులు కూడా ఉన్నాయి.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైన సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ ప్రకటన చేశారు. చాలా తక్కువ సమయంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, కొత్త ఏడాదిలో జనవరి 26 నుంచి ఈ పెట్రోల్ ధర తగ్గింపు ప్రయోజనం పొందవచ్చని అన్నారు.
"దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో పేదలు,మధ్యతరగతిపై దారుణంగా ప్రభావం పడుతోంది. పెద్ద పెద్ద వాహనాల్లో, కార్లలో తిరిగేవారికి దీనివల్ల ఏ సమస్యా లేదు. వాళ్ల జేబు నుంచి రూ.100- రూ.50 పోయినా వాళ్లకు పెద్దగా తేడా ఉండదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు మోటార్ సైకిల్లో కూడా సగం పెట్రోల్, సగం కిరోసిన్ నింపి నడుపుతుంటారు. ఫలితంగా కొన్ని రోజులకు వాళ్ల బండ్లే ఎందుకు పనికిరాకుండా పోతుంటాయి" అన్నారు సోరెన్.

ఫొటో సోర్స్, IPRD,JHARKHAND
"అలాంటి వారికి ఈ సమస్య నుంచి ఉపశమనం అందించాలనే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. మన వనరులు పెరిగేకొద్దీ, వారికి ఇచ్చినట్లే రాష్ట్ర ప్రజలకు కూడా ఈ తగ్గింపు అందించడానికి కృషి చేస్తాం" అన్నారు.
కేంద్రం గత నవంబర్‌లో ఎక్సజ్ డ్యూటీ తగ్గించి పెట్రోల్‌పై రూ.5, డీజిలుపై రూ.10 తగ్గించిన తర్వాత 20కి పైగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించాయి. పెట్రో ధరల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం అందించాయి. కానీ, ఇవన్నీ జార్ఖండ్ తగ్గించిన మొత్తంలో సగం కంటే తక్కువే తగ్గించాయి.
జార్ఖండ్ ఇప్పుడు ఒక పెద్ద జనాభా లీటరు పెట్రోల్‌ను రూ.25 తక్కువకే కొనుగోలు చేసే తొలి రాష్ట్రం కాబోతోంది.
రేషన్ కార్డు ఉండి ద్విచక్ర వాహనాలు నడిపేవారికి, వ్యవసాయంతోపాటూ ఇతర పనులకు తిరగడానికే ఈ తగ్గింపు అందిస్తున్నట్లు హేమంత్ సోరెన్ చెప్పారు.
అయితే, ఆయన ప్రకటన తర్వాత దారిద్ర్యరేఖ(బీపీఎల్)కు దిగువన ఉండేవారికే ముఖ్యమంత్రి ఈ ఉపశమనం అందించారనే గందరగోళం వ్యాపించింది.
మీడియాలో కూడా ఇలాంటి వార్తలే రావడంతో, ఒక వ్యక్తి దారిద్ర్య రేఖకు కిందుంటే, అతడి దగ్గర బైక్ ఎలా వస్తుందని, వారు బీపీఎల్ ఎలా అవుతారని.. సోషల్ మీడియాలో ప్రశ్నలు గుప్పించడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Empics
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేత బాబూలాల్ మరాండీ కూడా దీనిపై జోకులు వేశారు.
పెట్రో ధరల తగ్గింపుపై రెండు ట్వీట్లు కూడా చేసిన ఆయన ముఖ్యమంత్రి ప్రకటనపై ప్రశ్నలు సంధించారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"ధరల పెరుగుదల నుంచి ఉపశమనం అందించే పేరుతో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై పెట్రోల్ సబ్సిడీ పథకం వల్ల ఎంతమందికి ప్రయోజనం లభిస్తుంది. హేమంత్ సోరెన్ గారూ... రేషన్ కార్డులున్న ఎంతమంది బీపీఎల్ కార్డుల వారికి సొంత ద్విచక్ర వాహనాలున్నాయి. వ్యాట్ తగ్గించి రాష్ట్ర ప్రజలందరికీ ఆ ప్రయోజనం అందించలేరా. ఈ సబ్సిడీ పేరుతో నకిలీ లబ్ధిదారుల కుంభకోణానికి పునాదులు వేసినట్లు కాదా?" అన్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్ హ్యాండిల్ ద్వారా చేసిన ఒక ట్వీట్‌లో ఈ తగ్గింపు రేషన్ కార్డులున్న అందరికీ(అన్ని రకాల కార్డులు) వర్తిస్తుందని చెప్పింది.

ఫొటో సోర్స్, IPRD,JHARKHAND
జార్ఖండ్‌లో రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి
నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద జార్ఖండ్‌లో 59 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి.
ఇవి కాకుండా 4 లక్షల 84 వేల 849 కుటుంబాల దగ్గర గ్రీన్ రేషన్ కార్డ్ ఉంది. అంటే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య దాదాపు 64 లక్షలు.
ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం ఎన్ఎఫ్ఎస్ఏ కింద రేషన్ కార్డులు ఉన్నవారందరూ ప్రభుత్వం అందించే తగ్గింపు పెట్రోల్ ధరలకు అర్హులు అవుతారు.
సబ్సిడీ డబ్బు ఎలా లభిస్తుంది
పెట్రోల్ ధర తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు అందించడానికి జనవరి 26 లోపు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి సెక్రటరీ వినయ్ చౌబే మీడియాకు చెప్పారు. దానికోసం ఒక యాప్ కూడా రూపొందిస్తున్నామని అన్నారు.
"కానీ, ప్రజలు మొత్తం డబ్బు చెల్లించి పెట్రోల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాత వారు పెట్రోల్ పంపులో ఇచ్చే రసీదును దానికోసం డెడికేట్ చేసిన యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇందులో ఎలాంటి మోసాలూ జరగకుండా వారు ఆ రశీదుతోపాటూ తమ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ద్విచక్ర వాహనం రిజిస్టర్డ్ నంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీబీటీ ద్వారా ప్రతి నెలా గరిష్టంగా 250 రూపాయలు వారి ఖాతాల్లో వేస్తాం. అంటే, ప్రతి నెలా వారు తగ్గింపు ధరకు 10 లీటర్ల పెట్రోల్ కొట్టించుకోవచ్చు" అన్నారు.

ఫొటో సోర్స్, Ani
ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది
పేరు వెల్లడించవద్దనే షరతుతో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి దీనికి సంబంధించిన వివరాలు చెప్పారు.
"ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో రేషన్ కార్డులున్న వారి మొత్తం సంఖ్యలో 20-25 లక్షల కుటుంబాలకు కూడా సొంత బైక్ లేదు. దానిని బట్టి చూస్తే ప్రతి నెలా గరిష్టంగా 2.5 కోట్ల లీటర్ల పెట్రోల్ మీదే సబ్సిడీ అందించాల్సి ఉంటుంది".
"దీనివల్ల సర్కారు ఖజానాపై అదనపు భారం పడుతుంది. కానీ, అది మేనేజ్ చేయలేనంత పెద్ద మొత్తమేం కాదు. దానికోసం మేం అన్నిరకాల చర్యలూ తీసుకుంటాం. మేం ఇంకా దానిపై పనిచేస్తున్నాం. ఒకటి- రెండు వారాల్లో ఈ మొత్తం విషయంపై ఒక స్పష్టత వస్తుంది" అన్నారు.
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా తన ప్రసంగంలో అదే విషయం చెప్పారు.

ఫొటో సోర్స్, Ani
"ఖజానా ఖాళీ ఉంటే, ఇది ఎక్కడనుంచి పంచుతారు అని జనం అంటారు. గత ప్రభుత్వంలా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాలనే ఉద్దేశం మాకు లేదు అని నేను మీకు చెబుతున్నా. ఇప్పుడు కొత్త ఆర్థిక వనరులు కూడా సిద్ధం చేశాం. ట్రాన్సిట్ టాక్స్, టోల్ టాక్స్ లాంటివి అమలు చేయడం, ఇతర చర్యలు తీసుకున్నాం. వీటివల్ల మనకు రెగ్యులర్‌గా ఇతర ఆదాయం ఉంటుంది. మన ఆదాయ వనరులు పెరిగాయి. మేం వనరులు కూడా సమీకరించి, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా పెంచుతాం" అన్నారు.
వ్యాట్ ద్వారా ఆదాయం
జార్ఖండ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద వేసిన వ్యాట్ ద్వారా రాష్ట్రానికి ప్రతి నెలా రూ.450 కోట్ల ఆదాయం వస్తుంది.
రాంచీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.99 ఉంది. రేషన్ కార్డు ఉన్నవారికి తగ్గింపు తర్వాత దీని ధర లీటరుకు రూ.74 అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- పిల్లలకు కోవిడ్19 వ్యాక్సీన్: టీకా ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - 7 ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు
- డిసెంబర్ 31 రాత్రి ‘డ్రంకెన్ డ్రైవ్’ తనిఖీలు చేస్తే కరోనా వ్యాపిస్తుందా
- పాశ్చాత్య దేశాలతో యుద్ధానికి రష్యా, చైనా రిహార్సల్స్ .. భవిష్యత్ యుద్ధాలు, ఆయుధాలు ఎలా ఉంటాయి?
- జనవరి 1 నుంచి ఏమేం మారతాయి... మీరేం చేయగలరు, ఏం చేయలేరు?
- మన తాత ముత్తాతలు తిన్న జొన్నలు, సజ్జలు, రాగులు ఇప్పుడు స్మార్ట్ ఫుడ్ ఎలా అయ్యాయి?
- జొమాటో, స్విగ్గీ ఆర్డర్లపై పన్ను భారం: 5 శాతం జీఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయం - ప్రెస్‌రివ్యూ
- జుగాడ్ జీప్: 'లీటర్ పెట్రోల్‌కు 50KM మైలేజ్. ఆనంద్ మహీంద్రాకు దీన్ని ఇవ్వలేను.. కొత్తది తయారు చేసి ఇస్తా'
- నడి రోడ్డుపైనే ఉమ్మేసే జనం తీరు మారేదెప్పుడు..
- ‘జుగాడ్’ విధానంలో ఉద్ధభ్ భరలి వినూత్న ఆవిష్కరణలు
- చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? దానికి పరిష్కారమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















