ఆంధ్రప్రదేశ్: భారత చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణకు సాదరంగా ఆహ్వానం పలికిన సీఎం జగన్ - Newsreel

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణతో ఏపీ సీఎం వైఎస్ జగన్
ఫొటో క్యాప్షన్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణతో ఏపీ సీఎం వైఎస్ జగన్

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌ రెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు. విజయవాడ సందర్శించిన జస్టిస్ రమణకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో తేనీటి విందు ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాబినెట్ సహచరులను చీఫ్ జస్టిస్‌కు పరిచయం చేశారు. అంతకుముందు, వైఎస్ జగన్ సతీ సమేతంగా భారత ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం పలికారు.

చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, వైఎస్ జగన్
చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, వైఎస్ జగన్

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ తేనీటి విందుకు హాజరయ్యారు.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం" అని ఈ సందర్భంగా జగన్ అన్నారు.

జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ, "సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రానికి తొలిసారిగా వచ్చిన సందర్భంలో సాదరంగా ఆహ్వానించి, తేనీటి విందును ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. ఆంధ్ర రాష్ట్రం మరెంతో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. క్రిస్టమస్ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆరోపణలు చేస్తూ వైఎస్ జగన్ 2020 అక్టోబర్‌లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జస్టిస్ రమణను జగన్ కలుసుకోవడం ఇదే మొదటిసారి.

వైఎస్ జగన్ రాసిన లేఖను సుప్రీం కోర్టు ఈ ఏడాది మార్చి నెలలో ఇన్-హౌజ్ ప్రక్రియలో డిస్మిస్ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)