CRPF: అమర జవాను సోదరి పెళ్లి.. తోటి జవాన్లే తోడబుట్టినోళ్లయ్యారు- ప్రెస్‌ రివ్యూ

జవాను చెల్లెలి పెళ్లి

ఫొటో సోర్స్, TWITTER/CRPF

సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాలో కథానాయకుడు మహేశ్ బాబు తన తోటి సైనికుడు మృతి చెందటంతో అతని చెల్లి పెళ్లిని దగ్గరుండి జరిపిస్తాడు. నిజజీవితంలో పుల్వామా దాడిలో అమరుడైన ఓ జవాను చెల్లెలి పెళ్లి పనులని తోటి జవాన్లు దగ్గరుండి చూసుకున్నట్లు 'వెలుగు' కథనం పేర్కొంది.

''వివాహ తంతులో తోడబుట్టినవాడు చేయాల్సిన పనులు చేసి, మా రూపంలో మీ కొడుకు బతికే ఉన్నడని వాళ్ల తల్లిదండ్రులకు భరోసా కల్సించారు.

ఉత్తరప్రదేశ్‌లోని రా‌య్‌బరేలీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫొటోను 'బ్రదర్స్ ఫర్ లైఫ్' అంటూ సీఆర్‌పీఎఫ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రాయ్‌బరేలీకి చెందిన శైలేంద్ర ప్రతాప్ సింగ్ సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్. కిందటేడాది పుల్వామాలో జరిగిన టెర్రర్ దాడిలో అమరుడయ్యారు.

తాజాగా శైలేంద్ర సోదరి జ్యోతి పెళ్లి కుదిరింది. ఆ కార్యక్రమంలో కొడుకులేడని శైలేంద్ర తల్లిదండ్రులు బాధపడకుండా , అన్న లేడనే లోటు చెల్లెలికి తెల్వకుండా జవాన్లు పెళ్లికి వెళ్లారు.

యూనిఫామ్ లోనే పెళ్లికి వెళ్లి, పెళ్లి కూతురును దగ్గరుండి పీటల దగ్గరికి నడిపించారు. తర్వాత తోడబుట్టినవాడు చేయాల్సిన పనులన్నీ వారే దగ్గరుండి చేశారు.

ఆపై కొత్త దంపతులను ఆశీర్వదించి, గిఫ్టులు అందజేశారని'' వెలుగు కథనంలో రాసుకొచ్చింది.

ఆశిష్ మిశ్రా

ఫొటో సోర్స్, PRASHANT PANDEY/BBC

ఫొటో క్యాప్షన్, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను కోర్టులో హాజరుపరిచారు

మీకు సిగ్గులేదా? మెదడు పనిచేయట్లేదా: విలేకర్లపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా చిందులు

'తెలివితక్కువ వాళ్లలా పిచ్చి ప్రశ్నలు వేయకండి. మీకేమైనా మతిస్థిమితం గానీ పోయిందా? మెదడు పనిచేయట్లేదా? మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరందరూ కలిసి ఒక అమాయకుడిని (ఆశిష్‌ మిశ్రా) దోషిగా చిత్రీకరించారు. దీనికి మీకు సిగ్గేయడం లేదా? మీరంతా దొంగలు' అని లఖింపూర్‌ హింసాకాండ, ఆశిష్‌ మిశ్రా పాత్ర, సిట్‌ నివేదిక గురించి బుధవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రా విరుచుకుపడినట్లు 'నమస్తే తెలంగాణ' కథనం వెల్లడించింది.

''లఖింపూర్‌లోని ఓ ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో బుధవారం ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన అజయ్‌మిశ్రా అనంతరం కరోనా కట్టడి చర్యల గురించి మీడియాతో మాట్లాడారు.

ఈక్రమంలో.. రైతులను వాహనాలతో తొక్కించడం ముందస్తు ప్రణాళికలో భాగంగా జరిగిన కుట్రేనని సిట్‌ నివేదిక మంగళవారం పేర్కొనడంపై స్పందించాలని కేంద్రమంత్రిని ఓ విలేకరి కోరారు.

దీంతో సహనం కోల్పోయిన మంత్రి మీడియాపై చిందులు తొక్కారు. మంత్రి దుర్భాషలను రికార్డు చేస్తున్న విలేకరిపై మండిపడ్డారు.

ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడటమే కాకుండా మొబైల్‌ను లాక్కున్నారు. మంత్రి ప్రవర్తనపై విలేకరులు.. డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారని'' నమస్తే తెలంగాణ తెలిపింది.

సైబర్ నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

మనవడి ఆట.. తాతకు టోకరా

మనవడి ఆన్‌లైన్ మొబైల్ గేమ్‌ల కారణంగా రాజేంద్రనగర్‌కు చెందిన మాజీ పోలీసు అధికారి సయ్యద్ అస్గర్ అలీ రూ. 11.50 లక్షలను కోల్పోవాల్సి వచ్చిందని, అయితే సైబరాబాద్ పోలీసుల సమర్థతతో ఆ మొత్తం తిరిగి ఆయనకు చేరినట్లు 'ఆంధ్రజ్యోతి' తెలిపింది

''సయ్యద్‌ అస్గర్‌ అలీ ఐదు నెలల క్రితం రూ. 11.50 లక్షలను ఓ గేమిం గ్‌ సంస్థకు కోల్పోయారు.

విశ్రాంత ఏఎస్సై అయిన అస్గర్‌, తనకు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బును బ్యాంకు ఖాతాలో భద్రపరుచుకున్నారు.

ఆలీ మనవడు(8) తరచూ ఫోన్లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవాడు. ఈ క్రమంలో సింగపూర్‌కు చెందిన ఓ ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థకు చెందిన ఆటను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఆటలో మరింతగా ముందుకు వెళ్లేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

ఫోన్‌లో సయ్యద్‌ బ్యాంకు ఖాతా యాప్‌ ఉండటంతో.. దాన్ని లింక్‌ చేసిన బాలుడు, ఆటలో వచ్చిన ప్రతి ఆప్షన్‌నూ ఓకే చేసి డబ్బులు చెల్లించేశాడు.

దీంతో విడతలవారీగా మొత్తం రూ. 11.50లక్షలు గేమింగ్‌ సంస్థకు చేరాయి. ఈ విషయాన్ని ఆ లస్యంగా గుర్తించిన సయ్యద్‌, సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాంకేతిక ఆధారాలను బట్టి రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. నిబంధనల ప్రకారమే, చట్టబద్ధంగానే తమ సంస్థ డబ్బులు తీసుకుందని గేమింగ్‌ సంస్థ ప్రతినిధులు వాదించారు.

చిన్నారులను మోసం చేసి డబ్బులు ఇలా కొల్లగొట్టడమేంటంటూ పోలీసులు సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు.

ఎట్టకేలకు ఆ సంస్థ ఉన్నతాధికారులు దిగి వచ్చి.. బాధితుడి డబ్బులను వెనక్కి ఇచ్చినట్లు'' ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

వరికోత.. ఊరినే కోసింది

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో సాంఘిక దురాచారం తారా స్థాయికి చేరిందని 'సాక్షి' వెల్లడించింది.

''గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి బుధవారం పరస్పరం సాంఘిక బహిష్కరణకు దిగారు.

ఇరవై రోజుల కిందట వరికోత యంత్రాలను అద్దెకిచ్చే విషయంలో ఇరువర్గాల మధ్య ఏర్పడిన వివాదం చివరకు పరస్పరం బహిష్కరణకు దారితీసింది.

వరికోత యంత్రాలు తమ సామాజిక వర్గానికి చెందినవారి పొలాల్లోనే పనిచేయాలని ఒక వర్గం కట్టుబాటు విధించడంతో మరో వర్గం అభ్యంతరం తెలిపింది.

అంతకుముందే గ్రామస్థులు మధ్య అంశాలపై భేదాభిప్రాయాలున్నాయి. చివరకు ఒక కులానికి చెందదిన సుమారు 100 కుటుంబాలు ఒక సమూహంగా, మిగతా కులాలకు చెందిన 320 కుటుంబాలు మరో సమూహంగా చీలిపోయాయి.

ఈ నేపథ్యంలో భూముల కౌలును కూడా రద్దు చేసుకున్నారు. కిరాణ దుకాణాలు, హోటళ్లు, ఆటోలు ఇతర వ్యాపార సంస్థలను ఎవరికి వారు విభజించుకున్నారు.

అన్ని కులాల సమూహానికి చెందిన ఆటోల్లో ప్రయాణిస్తే రూ 50 వేల జరిమానా చెల్లించాలని ఒక వర్గం... ఒక కులం సమూహానికి ఎవరైనా సహకరిస్తే రూ. లక్ష జరిమానా అని మరో వర్గం నిబంధన విధించినట్లు'' సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)