తనలాంటి మరో వ్యక్తిని చంపేసి.. తానే చనిపోయినట్లు నమ్మించి.. చివరికి పోలీసులకు దొరికిపోయారు

Getty Images

ఫొటో సోర్స్, GETTY IMAGES

హత్య కేసులో జైలుకు వెళ్లిన ఓ వ్యక్తి పెరోల్‌పై బయటకు వచ్చారు. పెరోల్ సమయం ముగియగానే మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో తాను చనిపోయినట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు.

కానీ, ఈ పన్నాగం పోలీసులకు తెలిసిపోవడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

36 ఏళ్ల సుదేశ్ కుమార్ తన భార్యతో కలిసి ఈ పన్నాగం పన్నినట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసు అధికారులు తెలిపారు.

సుదేశ్ మరొకరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకువెళుతున్న దృశ్యాలను పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో గమనించారు. దాంతో వాళ్లు పన్నిన పన్నాగం బయటపడింది.

2018లో తన 13 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన నేరానికి సుదేశ్ జైలుకు వెళ్లారు. కోవిడ్- 19 సమయంలో సుదేశ్ కుమార్‌ను పెరోల్‌పై విడుదల చేశారు.

కిక్కిరిసిన జైళ్లల్లో కరోనావైరస్ కేసులు పెరగకుండా ఉండేందుకు కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేశారు. అలా బయటకు వచ్చినవారిలో సుదేశ్ కుమార్ ఒకరు.

అధికారులు తన పెరోల్ కాలాన్ని త్వరలోనే ముగించనున్నారని సుదేశ్ భయపడ్డారు. మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు ఈ ప్లాన్ చేశారు.

గుంటూరు జిల్లాలో హత్య

ఫొటో సోర్స్, Ani

నవంబర్ 19న డోమెన్ రవిదాస్‌ను హత్య చేసినట్లు సుదేశ్ పోలీసుల ఎదుట అంగీకరించారని అధికారులు తెలిపారు.

తాపీ పని చేసే రవిదాస్ ఎత్తు, బరువు సుదేశ్ కొలతలతో సరితూగుతాయి.

తన ఇంట్లో మరమ్మతులు ఉన్నాయని రవిదాస్‌ను పనిలో పెట్టుకున్నారు సుదేశ్.

ఆ మర్నాడు రవిదాస్ మృతదేహం ఒక ఖళీ స్థలంలో కనిపించింది.

ఆయన మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోయి ఉంది. అయితే ఆయన జేబులో సుదేశ్ కుమార్ ఐడీ కార్డు కనిపించింది.

తరువాత, దిల్లీలో ఉన్న సుదేశ్ భార్య అనుపమ అది తన భర్త మృతదేహమేనని అని చెప్పారు..

అయితే, అది నకిలీ హత్య అని, సుదేశ్ చనిపోలేదని పోలీసులు తాజాగా నిర్థారించారు.

ఇంతలో, తన భార్యను కలవడానికి సుదేశ్ తన ఇంటికి రానున్నారన్న సమాచారం పోలీసులకు అందింది.

వెంటనే పోలీసులు సుదేశ్ ఇంటిపై దాడి చేసి, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

రవిదాస్‌ను హత్య చేసిన నేరాన్ని సుదేశ్ అంగీకరించారు.

ఈ మొత్తం వ్యవహారంలో సుదేశ్‌కు సహాయం చేసినందుకు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ప్రాంతీయ పోలీసు సూపరింటెండెంట్ ఇరాజ్ రాజా ఆదివారం విలేఖరుల సమావేశంలో తమ అధికారుల పనితీరును ప్రశంసించారు.

"సుదేశ్ పెద్ద పన్నాగమే పన్నారు గానీ, పోలీసులు ఈ నకిలీ హత్య పన్నాగాన్ని ఛేదించారు. ఈ బృందానికి అవార్డు దక్కుతుంది" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)