ఉత్తర్‌ప్రదేశ్: నకిలీ మార్క్‌షీట్ల కేసులో దోషిగా తేలడంతో బీజేపీ ఎమ్మెల్యే శాసనసభ్యత్వం రద్దు - Newsreel

KHABBU TIWARI - INDRA PRATAP TIWARI

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, ఖబ్బు తివారీ

యూపీలోని గోసాయిగంజ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఖబ్బు తివారీ శాసన సభ్యత్వం రద్దయింది. ఆయన ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచారు.

నకిలీ మార్క్‌షీట్ల కేసులో అయోధ్యలోని ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా తేల్చడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంద్రప్రతాప్ అలియాస్ ఖబ్బు తివారీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ విధానసభ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

తాజా నిర్ణయం ప్రకారం ఆయన సభ్యత్వం కోర్టు తీర్పు వెలువడిన అక్టోబర్ 18, 2021 నుంచి అమల్లోకి వచ్చిందని, ప్రస్తుతం గోసాయిగంజ్ నియోజకవర్గం శాసనసభ స్థానం ఖాళీగా ఉందని ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరగబోదు.

ఏమిటీ కేసు?

29 ఏళ్ల క్రితం అయోధ్యలోని సాకేత్ మహావిద్యాలయలో జరిగిన నకిలీ మార్క్‌షీట్‌ల కేసులో అయోధ్యలోని ప్రత్యేక కోర్టు ఈ ఏడాది అక్టోబర్ 18న తీర్పు ఇచ్చింది. ఇందులో ఖబ్బూ తివారీని దోషిగా తేల్చింది. ఐపీసీ సెక్షన్‌ 419, 420, 467, 468 కింద కోర్టు ఆయనకు అయిదేళ్ల శిక్ష విధించింది.

సాకేత్ మహావిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ యదువంశ్ రామ్ త్రిపాఠి దాఖలు చేసిన కేసు ప్రకారం, ఇంద్ర ప్రతాప్ తివారీ అలియాస్ ఖబ్బు తివారీ నకిలీ సర్టిఫికెట్లతో బీఎస్సీలో అడ్మిషన్ తీసుకున్నారు.

2017 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఇంద్ర ప్రతాప్ తివారీ అలియాస్ ఖబ్బు తివారీ, 2007లో అయోధ్య స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున, 2012లో గోసాయిగంజ్ స్థానం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

యూపీలో శాసనసభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలు

ఉత్తర్‌ప్రదేశ్‌ లో 17వ శాసనసభకు ఎన్నికైన వారిలో ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయింది. 2019 డిసెంబర్లో రాంపూర్‌లోని సవార్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజం తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. నిజమని తేలడంతో ఆయన సభ్యత్వం రద్దయింది.

ఉన్నావ్ అత్యాచారం కేసులో బంగార్‌మావు నుండి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవిత ఖైదు శిక్ష పడింది. ఆయన సభ్యత్వం కూడా 2019 డిసెంబర్‌లో రద్దయింది.

హమీర్‌పూర్‌కు చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే సదర్ అశోక్ చందేల్ 1997లో జరిగిన ఓ హత్య కేసులో దోషిగా శిక్షను ఎదుర్కోవడంతో ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. దిల్లీలో...నకిలీ డిగ్రీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర సింగ్ తోమర్ కూడా అరెస్టయ్యారు. ఆయన్ను 2015 జూన్‌లో దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ మంత్రి వర్గంలో ఆయన న్యాయ మంత్రిగా పని చేశారు. అయితే ఆయన న్యాయశాస్త్ర పట్టా నకిలీదని తేలడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

నరేంద్ర సింగ్ తోమర్

ఫొటో సోర్స్, Getty Images

ఒక్క రైతు కూడా మరణించలేదు: పార్లమెంటులో చెప్పిన కేంద్ర ప్రభుత్వం

రైతులు ఏడాది పాటు సాగించిన నిరసనలపై పోలీసు చర్యల కారణంగా ఒక్క రైతు కూడా మరణించలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పింది.

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ రాజ్యసభలో ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారని పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది.

మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనుకుంటున్నాయని.. కానీ, రైతుల ఉద్యమంలో ఎవరూ మరణించలేదని మంత్రి చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మరోవైపు 700 మందికిపైగా రైతులు చనిపోయారని రైతు సంఘాలు చెబుతున్నాయి.

వారి మరణాలకు ప్రభుత్వమే కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

పంజాబ్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా కేంద్ర ప్రభుత్వం కూడా మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)