Omicron: ‘సంక్రాంతి తర్వాత కరోనా కేసులు పెరుగుతాయి’ - ప్రెస్ రివ్యూ

తెలంగాణ రాష్ట్రంలో జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరుగుతాయని.. ఫిబ్రవరి నాటికి పతాక స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపినట్లు 'ఆంధ్రజ్యోతి' వెల్లడించింది.
''ఆదివారం హైదరాబాద్ కోఠిలోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా పాజిటివ్‌లు పెరుగుతున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముప్పు జాబితాలోని 12 దేశాల నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌కు 900 మందిపైగా వచ్చారని తెలిపారు.
విమానాశ్రయంలో నిర్వహించిన టెస్టుల్లో 13 మందికి కరోనా నిర్ధారణ అయిందన్నారు. వీరందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపామని చెప్పారు. ఫలితాలు ఒకటి, రెండు రోజుల్లో వస్తాయన్నారు.
''ఏ క్షణమైనా ఒమిక్రాన్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శంషాబాద్ విమానాశ్రయంలో స్ర్కీనింగ్, ఆర్టీపీసీఆర్ టెస్టులు పకడ్బందీగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదు''' అని ఆయన స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ కేసులను దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తప్పుడు ప్రచారంతో వైద్య ఆరోగ్య శాఖ మనోస్థైర్యం దెబ్బతింటుందన్నారు.
ప్రభుత్వం కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నదని.. ప్రతి రోగికి చికిత్స అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వైరస్ వ్యాప్తి పెరిగినా రాబోయే రోజుల్లో లాక్‌డౌన్ విధించేంతటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు.
ఒమిక్రాన్ సోకినవారిలో ఒళ్లు నొప్పులు, తల నొప్పి, నీరసం ఉంటాయని.. ఈ లక్షణాలున్నవారు దగ్గర్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
వేరియంట్ తీవ్రతపై అధ్యయనాలు జరుగుతున్నాయని, పూర్తి స్పష్టత వచ్చేందుకు మరో వారం పడుతుందని తెలిపారు.
కాగా, ఒమిక్రాన్ ప్రభావంతో దక్షిణాఫ్రికాలో కేసులు పెరుగుతున్నాయన్నాయని, ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశమని శ్రీనివాసరావు చెప్పారు.
ఒకటి, రెండు నెలల్లో భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందని డాక్టర్ గడల పేర్కొన్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
అర్హులంతా టీకా తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. కరోనా మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పా రు.
టీకా పంపిణీని వేగవంతం చేశామని.. శనివారం 3.70 లక్షల డోసులు పంపిణీ చేశామని వివరించారు. నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తిచేస్తామని తెలిపినట్లు'' ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొంది.

పంచాయతీల ఆన్‌లైన్ ఆడిట్‌లో తెలంగాణ నం.1.. రెండో స్థానంలో ఏపీ
గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పంచాయతీల ఆన్‌లైన్ ఆడిటింగ్ విధానంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు 'సాక్షి' తెలిపింది.
''2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లోనూ ప్రభుత్వం ఆన్‌లైన్ ఆడిటింగ్‌ను 100 శాతం పూర్తి చేసింది. అలాగే ఆయా నివేదికలను ఆన్‌లైన్‌లో కేంద్రానికి సమర్పించింది. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది.
దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీల్లో ఈ ప్రక్రియ ఇప్పటివరకు 13 శాతమే పూర్తవగా మరో 16 రాష్ట్రాల్లో ఇది ఇంకా మొదలుకాలేదు. దేశంలోని 2,56,561 గ్రామ పంచాయతీలకుగాను ఇప్పటివరకు 32,820 పంచాయతీల్లోనే ఆన్‌లైన్ ఆడిటింగ్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,549 గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్ ఆడిట్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలవగా 5,560 పంచాయతీల్లో ఆడిటింగ్‌తో తమిళనాడు మూడో స్థానం నిలిచింది.
మరోవైపు మండలాలవారీ ఆడిటింగ్‌లోనూ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది. తెలంగాణలోని 540 మండలాలకుగాను ఇప్పటివరకు 156 చోట్ల ఆడిట్ పూర్తిచేసింది.
కేంద్రం గ్రామ పంచాయతీల ఆన్‌లైన్ ఆడిటింగ్‌కు ఆదేశించిన వెంటనే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు సూచనలతో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలంగాణ ఆడిట్ శాఖ డైరెక్టర్ మార్తినేని వేంకటేశ్వరరావు తెలిపారు.
తెలంగాణ ఆడిట్ శాఖ ఇప్పటికే ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో 2,10,781 అభ్యంతరాలను నమోదు చేసిందన్నారు. గ్రామ పంచాయతీల సిబ్బంది కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతూనే 100 శాతం ఆన్‌లైన్ ఆడిటింగ్‌ను పూర్తి చేశారన్నారు. ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో తమకు సహకరించాలని ఇతర రాష్ట్రాలు కోరాయని ఆయన చెప్పినట్లు'' సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, UGC
ఈ నెలలోనే ఉద్యోగుల విభజన
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగుల విభజన ప్రకియ ఒకట్రెండు రోజుల్లో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని 'నమస్తే తెలంగాణ' తెలిపింది.
''మొత్తంగా ఈ నెలలోనే ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. మార్గదర్శకాలు సిద్ధం కాగా, అతి త్వరలోనే వెలువడనున్నాయి.
ఉద్యోగుల కేటాయింపులో భాగంగా మొదట అన్నిశాఖల్లోని వారికి ఆప్షన్లు ఇస్తారు. ఉద్యోగులు ఎంచుకొన్న ఆప్షన్ల ప్రకారమే బదిలీలు చేయనుండగా, సీనియార్టీని పరిగణనలోకి తీసుకొంటారు.
ఆరోగ్యం, భార్యాభర్తలు వంటి ప్రత్యేక పరిస్థితులను స్పెషల్ క్యాటగిరీగా తీసుకొని బదిలీ చేయనున్నట్టు తెలుస్తున్నది.
ఉద్యోగుల వర్గీకరణ, బదిలీల విధివిధానాలపై ఆదివారం సచివాలయంలో సీఎస్ సోమేశ్‌కుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్ అండ్ ఐజీ శేషాద్రి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్‌తో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు సహదేవ్, ముజీబ్ హుస్సేనీ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కొత్త జోన్లు, జిల్లాల ప్రకారం ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై వారు సీఎస్‌తో చర్చించారు.
కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, కోడ్ అమల్లో లేని జిల్లాల్లో ముందుగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నారు.
అయితే క్యాడర్‌ల వారీగా ఉద్యోగులకు ఆప్షన్స్ ఇస్తామని సీఎస్ సోమేశ్‌కుమార్ ఉద్యోగ సంఘాలకు హామీనిచ్చారు. ప్రక్రియ సజావు సాగేందుకు టీజీవో, టీఎన్జీవో, ప్రభుత్వ గుర్తింపు పొందిన జిల్లా స్థాయి ఉద్యోగ సంఘాలను కేటాయింపు సమయంలో ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నట్లు'' నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
చల్మెడ మెడికల్ కాలేజీలో 39 మందికి కరోనా
కరీంనగర్‌లోని చల్మెడ మెడికల్ కాలేజీలో 39 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయినట్లు 'వెలుగు' తెలిపింది.
''దీంతో మేనేజ్‌మెంట్ వారం రోజులు సెలవులు ప్రకటించింది. బాధితులకు ట్రీట్‌మెంట్ అందిస్తోంది. వారి కాంటాక్టులపై ఆరా తీస్తోంది.
కాలేజీలో 5 రోజుల క్రితం ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ ఫంక్షన్ వల్లే వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఇందులో స్టూడెంట్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారని'' వెలుగు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- జవాద్ తుపాను హెచ్చరిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
- వానాకాలం ధాన్యం సేకరణ తెలంగాణలో 16 లక్షల మెట్రిక్ టన్నులు, ఏపీలో 62 వేల మెట్రిక్ టన్నులు - కేంద్రం
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని ఏ పరీక్షతో తెలుస్తుంది?
- కొత్త సినిమాల టికెట్ ధరలు పెంచుకోవచ్చు - హైకోర్టు ఉత్తర్వులు
- 'సిరివెన్నెల సీతారామ రెడ్డి’కి ‘గురవయ్య శాస్త్రి’ నివాళి
- అన్నమయ్య ప్రాజెక్టు: డ్యాం కొట్టుకుపోయినా ప్రజలకు సమాచారమివ్వలేదా? సైరన్ మోగలేదా
- మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా?
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








