చిలకలూరుపేట బస్సు దహనం (1993) కేసు: 23 మంది మృతికి కారణమైన దోషులకు ఉరిశిక్ష ఎందుకు రద్దు చేశారంటే...

చలపతి, విజయవర్ధనం

ఫొటో సోర్స్, Chalapati vijayavarthanam/Bharadwaja Rangavajhala

ఫొటో క్యాప్షన్, చలపతి, విజయవర్ధనం
    • రచయిత, ఆలమూరు సౌమ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“గత 28 సంవత్సరాలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. 1993 చిలకలూరిపేట బస్సు దహనం సంఘటన సమయానికి నాకు 16, ఆయనకు 20 ఏళ్లు. ఆయన ఎప్పటికైనా విడుదలై తిరిగి వస్తారని నేను, పిల్లలు ఎదురుచూస్తున్నాం" అని చలపతి రావు భార్య రమణమ్మ అన్నారు.

తన భర్తకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తూ ఆమె ఈ ఏడాది సెప్టెంబర్‌లో లేఖలు రాశారు.

28 ఏళ్ల కిందట ఏం జరిగింది?

1993 మార్చి 8 తెల్లవారుజామున చిలకలూరిపేట బస్సు దహనం సంఘటన భారతదేశాన్నంతా ఓ కుదుపు కుదిపింది. ఈ దుర్ఘటనలో 23 మంది సజీవ దహనం అయ్యారు. పలువురు గాయపడ్డారు.

సాతులూరి చలపతి రావు, గంటెల విజయవర్థన రావు అనే ఇద్దరు యువకులు ఈ ఘటనకు కారణమని కోర్టులో నిరూపణ అయింది. వారికి ఉరిశిక్ష విధించారు.

ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం.. మార్చి 7 రాత్రి హైదరాబాదు నుంచి బయలుదేరిన ఏపీ9 జెడ్ 4236 చిలకలూరిపేట సూపర్ ఎక్స్‌ప్రెస్ బస్సు మార్చి 8 తెల్లవారుజామున 4.00కు నర్సారావుపేట రైల్వే క్రాసింగ్ చేరింది.

వీడియో క్యాప్షన్, అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి

అక్కడ చలపతి, విజయవర్థన్‌లు బస్సు ఎక్కారు. డ్రైవర్, కండక్టర్‌తో సహా ఆ బస్సులో 32మంది ఉన్నారు. కాసేపటికి పెట్రోల్ వాసన వేయడంతో డ్రైవర్ బస్సును ఆపారు.

అప్పటికే చలపతి ప్రయాణికులను బెదిరిస్తూ దోపిడీకి సిద్ధమయ్యారు. డబ్బు, ఆభరణాలు ఇవ్వకపోతే బస్సును తగలబెట్టేస్తామని బెదిరించారు. భయంతో ప్రయాణికులు బస్సు నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించారు. డ్రైవర్‌తో సహా పలువురు డ్రైవర్ డోరు నుంచి కిందకు దిగారు.

నిప్పంటించేయమని చెప్పి చలపతి కూడా కిందకు దూకారు. అగ్గిపుల్ల గీసి పడేసి విజయవర్థన్ కూడా కిందకు దూకారు. అలా దూకేప్పుడు ఆయనకు కూడా మంటలు అంటుకుని గాయాలయ్యాయని, వారిద్దరూ ఉద్దేశపూర్వకంగానే ఈ నేరం చేశారని ప్రాసిక్యూషన్ వాదించింది.

1993 మార్చి 18న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 1995 జూన్ 12 నుంచి ఆగస్టు 14 వరకు గుంటూరు సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్ 7న వారిద్దరినీ నేరస్థులుగా నిర్ధరిస్తూ మరణశిక్ష విధించారు.

చలపతి విజయవర్ధనం పేరుతో వెలువడిన సంకలనం

ఫొటో సోర్స్, Chalapati vijayavarthanam/K. Sajaya

ఫొటో క్యాప్షన్, చలపతి విజయవర్ధనం పేరుతో వెలువడిన సంకలనం

‘మేం ఎందుకు చేశామంటే’

అయితే, దోపిడీ చేయడమే తమ ఉద్దేశమని, బస్సును తగులబెట్టే ఉద్దేశం లేదని, అనుకోకుండా ఆ సంఘటన జరిగిందని నేరస్థులు వాదించారు.

గుంటూరు సెషన్సు కోర్టులో నేరస్థుల నిర్ధరణ సరిగా జరగలేదని, మరణ వాంగ్మూలాలలో చాలామంది నేరస్థులను సరిగా గుర్తించలేదని హైకోర్టులో డిఫెన్స్ న్యాయవాది వాదించారు.

1995 నవంబర్ 2న చలపతి, విజయవర్థన్‌లకు హైకోర్టు ఉరిశిక్షను ధ్రువీకరించింది.

బస్సును తగలబెట్టడం వీరి ఉద్దేశం కాదని, ప్రాణభయంతో బస్సు దిగి పారిపోతున్నవారిని వీరు అడ్డుకోలేదంటూ మరికొన్ని కారణాలతో సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. చలపతి, విజయవర్థన్‌లకు కింది కోర్టు విధించిన మరణ శిక్షనే 1996 ఆగస్టు 28న సుప్రీం కోర్టు ఖరారు చేసింది.

సెప్టెంబర్ 30న ఉరిశిక్ష అమలుచేయాలని గుంటూరు సెషన్స్ కోర్టు ఆదేశించింది.

దీంతో చివరి అవకాశంగా చలపతి, విజయవర్థన్‌లు క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నారు. ఉద్దేశపూర్వకంగా చేసిన నేరం కాదని, జరిగినదానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నామని, శిక్ష తగ్గించమని కోరారు.

వారి క్షమాభిక్ష విజ్ఞప్తిని అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ 1997 మార్చి 14న తిరస్కరించారు.

నిందితులకు ఉరి శిక్షే సమస్యకు పరిష్కారమా?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిందితులకు ఉరి శిక్షే సమస్యకు పరిష్కారమా?

ఉరిశిక్షకు వ్యతిరేకంగా పోరాటం

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషల్ కూడా నేరస్థులకు శిక్ష తగ్గించమని కోరుతూ సంతకాలు సేకరించింది.

యాక్టివిస్ట్, లాయర్ బి. చంద్రశేఖర్ వీరి తరపున న్యాయస్థానంలో వాదించారు.

"23 మంది చనిపోయిన కేసులో ఎలా వాదిస్తామని మొదట సంశయించినా, ఉరిశిక్ష అమానవీయం అన్న దృష్టితో వారిద్దరికీ శిక్ష తగ్గించాలనే ప్రయత్నానికి చంద్రశేఖర్ పూనుకున్నారు" అని ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్త సజయ వివరించారు.

"సమాజాన్ని నేరరహితంగా తీర్చిదిద్దడమే కోర్టుల లక్ష్యం. అనేక దశాబ్దాలుగా ఉరిశిక్షలు అమలుచేస్తున్నా మన సమాజంలో ఘోరాలు ఆగిపోలేదు. నేరాలు తగ్గుముఖం పట్టలేదు. అంటే ఉరిశిక్ష ప్రాణాలు తీయడానికి తప్ప మరెందుకూ పనికిరాదని రుజువవుతూనే ఉంది. చలపతి, విజయవర్థన్‌ల విషయంలో శిక్షను రద్దు చేయమని కోరలేదు. తగ్గించమనే అడిగాం" అన్నారు సజయ.

కె. జి. సత్యమూర్తి, బాలగోపాల్, బి. చంద్రశేఖర్, కె. శ్రీనివాస్, డాక్టర్ కంచె ఐలయ్య, కలేకూరి ప్రసాద్, సౌదా, పైడి తెరేష్ బాబు, ఎన్. జె. విద్యాసాగర్.. ఇలా ఎందరో పౌర హక్కుల కార్యకర్తలు ఉరిశిక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు.

వీరంతా కలిసి ‘చలపతి విజయవర్థనం’ అనే చిన్న పుస్తకాన్ని తీసుకువచ్చారు. దీన్ని ఉరిశిక్షకు వ్యతిరేకంగా దళిత ప్రజాస్వామిక కవుల రచయితల రాజకీయ ప్రకటనగా పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, అమెరికాలో ఓ మహిళకు మరణశిక్ష.. 70 ఏళ్లలో తొలిసారి

మరణదండనకు వ్యతిరేకంగా వాదనలు

చలపతి, విజయవర్థన్‌లకు శిక్ష తగ్గించాలని కోరుతూ ప్రజా సంఘాలు వీధి నాటకాలు నిర్వహించాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.

నేరస్థులు పలుకుబడి ఉన్నవారు, ధనవంతులు అయితే ఈ శిక్ష నుంచి తప్పించుకునేవారని, సామాన్యూలు, పేదలు కావడమే వారికి ప్రతికూలంగా మారిందని ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది కె. బాలగోపాల్ అప్పట్లో వాదించారు.

“చిలకలూరిపేట బస్సు దహనానికి సంబంధించిన ఒక ముఖ్య వాస్తవం ఏమిటంటే, చలపతి, విజయవర్థన్‌లు నేరచరిత్ర కలిగినవారు కారు. ఇద్దరూ కాయకష్టం చేసుకుని బతికిన పట్టణ ప్రాంత దళితులు. అసంఘటిత కార్మికరంగం ఎదుర్కునే దుర్భర పరిస్థితులు వారిని కుంగదీశాయి. వారిని విడుదల చేస్తే మళ్లీ దోపిడీకి పాల్పడతారని భయపడవలసిన అవసరం లేదు. వాళ్లకు గౌరవప్రదమైన శ్రమతో బతుకు గడిచేట్టయితే మళ్లీ నేరాలు చేయడం గురించి ఆలోచించరు.

వాళ్లు బస్సును కావాలని తగులబెట్టలేదు. పెట్రోల్ పోసి బెదిరిద్దామనే అనుకున్నారు. కానీ రద్దీగా ఉండే బస్సులో పెట్రోలు పోసి దొంగతనం చేయాలన్న ఆలోచన బాధ్యతారాహిత్యమైనది. దానికి పురిగొల్పిన పరిస్థితులు ఏమైనప్పటికీ, ఆ బాధ్యతారాహిత్యం పర్యవసానమే బస్సు దహనం. దానికి చలపతి రావు, విజయవర్థన రావు శిక్ష అనుభవించక తప్పదు. కానీ, ఎంత శిక్ష సముచితంగా ఉంటుంది? వారిని ఉరితీయడమే సరైన శిక్షేనా?

ఉద్దేశపూర్వకంగా, నిపుణులైన హంతకులను కిరాయికి తీసుకుని ప్లాను ప్రకారం చంపిన ఎన్నో కేసుల్లో అనేక కారణాలతో హంతకులు ఉరి తప్పించుకున్నారు. అలాంటప్పుడు ఉద్దేశపూర్వకం కానప్పటికీ ఒక బాధ్యతారాహిత్యమైన చర్య వలన మనుషుల చావుకు కారణమైనవారికి ఉరిశిక్షే సబబా?" అంటూ కె. బాలగోపాల్ ‘చలపతి రావును, విజయవర్థన రావును ఉరితీయాల్సిందేనా’? అనే వ్యాసంలో హక్కుల సంఘాల వాదనలను వినిపించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు

ఫొటో సోర్స్, BOBBY

ఫొటో క్యాప్షన్, రాజమండ్రి సెంట్రల్ జైలు

‘ప్రజావిశ్వాసమే ముఖ్యమన్న ధోరణిలో కోర్టులు వ్యవహరిస్తున్నాయి’

ఈ కేసులో ప్రజల ఆవేశాలను చల్లార్చడమే ముఖ్యమన్న ధోరణిలో కోర్టులు వ్యవహరిస్తున్నాయని, అది సరైన పద్ధతి కాదని న్యాయవాది బి. చంద్రశేఖర్ అన్నారు.

"ప్రజల సెంటిమెంట్లను పట్టించుకోవడం కంటే మించి న్యాయస్థానాలకు రాజ్యం అవసరాలను కాపాడడం ముఖ్యమూ, ఆవశ్యకమూ అనే సందర్భాలు తరచూ వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో చట్టమే ముఖ్యం, కొన్ని సందర్భాల్లో ప్రజా విశ్వాసమే ముఖ్యమన్న ధోరణిని వైచిత్రిగా అర్థం చేసుకోవాలేమో. బస్సు దహనంలో కేసులో నేరస్థులకు మరణదండన విధించే విషయంలో ప్రజావిశ్వాసం అన్న అంశాన్ని న్యాయమూర్తులు ప్రముఖంగా ప్రస్తావించారు. 23 మంది బలిగొన్న దుర్ఘటనలో ప్రజలు ఎటువంటి న్యాయం ఆశిస్తున్నారు అన్న అంశం తీర్పులకు ప్రధాన ప్రేరణగా పనిచేసింది. కాబట్టి ఈ కేసులో తీర్పు చెబుతున్నది ప్రజలు కూడా అయ్యారు.

కానీ, ఇటువంటి శిక్షలు నేరాలను తగ్గిస్తాయన్నదానికి ఆధారమేమీ లేదు. అమాయకులైన ప్రయాణికులను అంతం చేసినందుకు ఇది ప్రతిఫలం అని వాదించవచ్చు. ఈ వాదం అతి పురాతనమైనది. కంటికి కన్ను, పంటికి పన్ను న్యాయమని జనం అనుకోవచ్చు. దానికి వ్యవస్థలన్నీ కలిసి ఆమోదముద్ర వేయాలా అన్నదే ప్రశ్న. అలా చేస్తే ఇంక న్యాయశాస్త్రాలు, చట్టాలు, కోర్టులు ఎందుకు? రచ్చబండ తీర్పులు చాలవా? జనం సెంటిమెంట్లను తక్కువ చేయడం కాదిది. ఇటువంటి సందర్భాల్లో చైతన్యవంతులైన వారి జోక్యం అవసరం అవుతుంది" అని చంద్రశేఖర్ చెప్పారు.

'బాధితుల కోణాన్ని కూడా పట్టించుకోవాలి '

చలపతి, విజయవర్థన్‌లకు శిక్ష తగ్గించాలన్న డిమాండ్‌ను ఆ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలు ఆమోదించలేదు. మానవ హక్కుల సంఘాల నిరసనలను వారంతా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనకు కారణమైనవారిని ఉరి తీయాల్సిందేనని డిమాండ్ చేశారు.

"ఈ దుర్ఘటనలో ఒకామెకు ఎదిగొచ్చిన ఇద్దరు పిల్లలు చనిపోయారు. మా కుటుంబం కుదుటపడుతుందని అనుకున్న సమయంలో ఇలా జరిగిందని ఆమె దుఃఖపడ్డారు. ఒక ముస్లిం కుటుంబం ఎంతో నష్టపోయింది. ఈ కేసులో బాధితుల కోణం కూడా చాలా ముఖ్యం. వాళ్లకి చాలా కోపం ఉంది. నిజానికి, ప్రభుత్వం వాళ్లను పట్టించుకోవాలి. వారికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వారికి నామమాత్రంగా కొంత సొమ్ము ఇస్తే సరిపోదు. ప్రభుత్వం నేరస్థులకు మరణశిక్ష విధించడం పైనే దృష్టి పెట్టింది. కానీ బాధితుల కుటుంబాలను పట్టించుకోవలసినంతగా పట్టించుకోలేదు. ప్రజా సంఘాలు కూడా వారి కోణం నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంది" అని సజయ అన్నారు.

సజయ, మోయిద్ హసన్ ఈ మొత్తం కేసుపై "హ్యాంగ్ ది నూస్" అనే డాక్యుమెంటరీని చిత్రీకరించారు. దానిలో భాగంగా చలపతి, విజయవర్థన్‌లను కలిశారు. బాధితుల కుటుంబాల ఇంటర్వ్యూలు తీసుకున్నారు.

వాళ్లిద్దరికీ ఉరిశిక్ష విధించినప్పుడే హైకోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిశామని సజయ చెప్పారు.

ఈ డాక్యుమెంటరీని అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో పలు చోట్ల, కొన్ని యూనివర్సిటీల్లోనూ ప్రదర్శించారు.

"ఈ ఉద్యమం పూర్తిగా ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ జరిగింది. వారు చేసింది తప్పు కాదని నిరూపించడం హక్కుల సంఘాల ఉద్దేశం కాదు. ఉరిశిక్ష అమానుషం, దాన్ని రద్దు చేయాలన్నదే ఉద్యమ నినాదం" అని సజయ వివరించారు.

నిందితులు మూడు జీవితాలకు సరిపడా జైలు శిక్షను అనుభవించారని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిందితులు మూడు జీవితాలకు సరిపడా జైలు శిక్షను అనుభవించారని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అభిలాష సినిమా తరహాలో నడిచిన హై డ్రామా

చలపతి, విజయవర్థన్‌లు తొలిసారి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ 1997 మార్చి 14న తిరస్కరించారు. ఇక వారిద్దరూ మరణశిక్షను తప్పించుకోలేమనే నిర్ణయానికి వచ్చేశారు.

మార్చి 29 ఉరిశిక్ష తేదీగా ఖాయమైంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తెల్లవారుజామున ఉరిశిక్ష అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది.అయితే, వీరికి శిక్ష తగ్గించేందుకు పౌర సంఘాల వాళ్లు ఇంకా గట్టిగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఓ పక్క ఈ ఉద్యమాలు కొనసాగుతుండగా, మరో పక్క రెండవసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు దోషులు. మార్చి 28న ప్రముఖ రచయిత్రి మహా శ్వేతాదేవితో సహా మరికొందరు రాష్ట్రపతిని స్వయంగా కలసి విజ్ఞప్తి చేసేందుకు దిల్లీ వెళ్లారు.

అక్కడి నుంచి హై డ్రామా నడిచింది. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేలోపు శిక్షను అమలుచేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ వార్త హుటాహుటిన జైలు అధికారులకు అందజేశారు. ఉరికి మరికొన్ని గంటల వ్యవధి ఉందనగా శిక్ష వాయిదా పడిందన్న వార్త చలపతి, విజయవర్థన్‌లకు చేరింది.

మరణశిక్ష మొదట వారం రోజులు వాయిదా పడింది.

అదే సమయంలో దేవెగౌడ ప్రధానమంత్రిగా వైదొలగడంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. దాంతో, ఈ కేసుపై నిర్ణయానికి మూడు నెలల వ్యవధి దొరికింది.

ఈలోగా, కేఆర్ నారాయణన్ రాష్ట్రపతి కావడం, దళిత, ప్రజాస్వామ్య హక్కుల సంఘాలు ఆయనను కలవడం, ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తున్నట్లు రాష్ట్రపతి ప్రకటించడం వరుసగా జరిగిపోయాయి.

ఈ విషయాలన్నీంటినీ విపులంగా వివరిస్తూ చలపతి ఒక పుస్తకం రాశారు.

నేర రహిత సమాజం కోసం "ఒక నేరస్థుడి ఆలోచనలు" అనే 1200 పేజీల పుస్తకాన్ని తన భర్త రాశారని చలపతి భార్య రమణమ్మ చెప్పారు.

అయితే, ఈ పుస్తకం ముద్రణకు నోచుకోలేదు. రాజకీయ ఖైదీలకు రచనలు చేసే అవకాశం ఉంది. కానీ క్రిమినల్ కేసుల్లో జైలు పాలైనవారికి రచనలు చేసే అవకాశం లేదని, దీన్ని ముద్రించలేమని చట్టం తిరస్కరించింది.

‘వాళ్లు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు’

భూమిక హెల్ప్‌లైన్ వ్యవస్థాపకులు, రచయిత కొండవీటి సత్యవతి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చలపతి, విజయవర్థన్‌లను కలిశారు. వారు అపరాధభావంతో, పశ్చాత్తాపంతో బాధపడుతున్నారని ఆమె తెలిపారు.

“నేను మొదటిసారి 1999లో రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించాను. అప్పటికి పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి మండలంలో మండల రెవెన్యూ ఆఫీసర్‌గా పని చేస్తున్నాను. చిలకలూరిపేట బస్సు దహనం ఒక భయానక సంఘటన. వాళ్ళు చేసింది ఘోరమే. కాని మరణశిక్ష పరిష్కారం కాదు. నా మిత్రురాలు మరణశిక్షలకు వ్యతిరేకంగా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీస్తుండడం వల్ల నేను కూడా వాళ్ళతో కలిసి మరణశిక్షలు పడ్డ చలపతి, విజయవర్ధన్‌ల దగ్గర ఇంటర్యూలను తీసుకోవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లాను.

గుంటూరులో ఓ మురికివాడలో నివసించే వీళ్ళిద్దరూ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్లు. ప్రయాణికులు ప్రతిఘటించడంతో ఘర్షణ జరిగిందని, మంటలు ఎలా చెలరేగాయో తమకు తెలియదని వాళ్ళు చెప్పారు. దోపిడీ చేయడమే తమ ఉద్దేశ్యమని, బస్సు తగలబెట్టాలని తాము అనుకోలేదని తమవల్ల జరిగిన ప్రాణ నష్టానికి తామెంతో కుమిలిపోతున్నామని చెప్పుకున్నారు. తాము తెలిసో తెలియకో చాలా కుటుంబాలకు తీరని వేదన కలిగించామని తమని క్షమించమని వేడుకుంటున్నామని చెప్పారు. మేము వాళ్ళతో ఓ పూటంతా గడిపాం. అప్పటికే చాలా కాలంగా వాళ్ళు జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తున్నారు.

మరణ శిక్షను కఠిన జీవిత ఖైదుగా మార్చాలని జరిగిన ఉద్యమంవల్ల వీరి మరణ శిక్ష ఎన్నోసార్లు వాయిదాపడింది. మరణం అంచులదాకా వెళ్ళారు చాలా సార్లు. చాలా కాలం వాళ్ళ దగ్గర నుంచి మాకు ఉత్తరాలు వస్తుండేవి. పశ్చాత్తాపంతో దహించుకుపోతూ ఉత్తరాలు రాసేవాళ్ళు. వాళ్ళు చేసింది చిన్న నేరమేమీ కాదు" అని ఆమె వివరించారు.

ఉరిశిక్షలు వేసినంత మాత్రాన నేరాలు ఆగవని హక్కుల ఉద్యమకారులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉరిశిక్షలు వేసినంత మాత్రాన నేరాలు ఆగవని హక్కుల ఉద్యమకారులు అంటున్నారు

'ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?’

ప్రస్తుతం చలపతి రావు నెల్లూరు జైల్లో ఉండగా, విజయవర్థన్ రాజమండ్రి జైల్లోనే ఉన్నారు. వారిద్దరి జైలు జీవితానికి 28 ఏళ్లు పూర్తయ్యాయి.

మిగిలిన జీవితాన్ని కుటుంబాలతో గడిపేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం, సమాజం వారిని క్షమించి విడుదల చేయాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు ఇటీవలే పిటిషన్ పెట్టుకున్నారు.

చలపతికి భార్య ఒక కూతురు, కొడుకు ఉన్నారు. విజయవర్థన రావుకు వివాహం కాలేదు.

"1993 మార్చిలో ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పటికి నాకు 16 ఏళ్లు, ఆయనకు 20. అప్పటి నుంచి ఆయన విడుదల కోసం వేచి చూస్తూనే ఉన్నాం. ఇన్నేళ్లలో చాలా రకాల ఇబ్బందులు పడ్డాం. శ్రమకోర్చి, అన్ని కష్టాలూ తట్టుకుని నిలబడి నేను పదవ తరగతి పూర్తి చేశాను. ఆ దేవుడి దయవల్ల ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నేను అమ్మ వాళ్ల దగ్గర ఉండేదాన్ని, ఆయన జైల్లో ఉంటూనే పీజీ చేశారు. ఇన్ని తట్టుకుని నిలబడ్డాం. ఇప్పటికైనా ఆయనను క్షమించి విడుదల చేస్తారని ఆశిస్తున్నాం."

"జీవితకాలం అంటే ఏడేళ్లో, పద్నాలుగేళ్లే ఉంటుంది.. ఈపాటికి వారిద్దరూ విడుదల అయ్యుంటారని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. వాళ్లింకా జైల్లోనే ఉన్నారు. 2021 నవంబర్‌కు ఇద్దరూ 28 ఏళ్ల 9 నెలల శిక్షను పూర్తి చేసుకున్నారు. సాధారణ జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని ఏడేళ్ల వాస్తవ కాలం, రెమిషన్ సమయంతో కలిపి పదేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది. అలా లెక్కిస్తే వాళ్లిద్దరూ మూడు జీవిత కాల శిక్షలు అనుభవించినట్టు అవుతుంది. వాళ్లు అనేకమార్లు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఈ వృద్ధాప్యంలోనైనా కుటుంబాలతో గడపడానికి అనుమతిస్తూ, విడుదల చేస్తే బాగుంటుంది" అని యాక్టివిస్ట్, జర్నలిస్ట్ భరద్వాజ రంగావఝల అభిప్రాయపడ్డారు.

ఈ దుర్ఘటనలో చనిపోయిన 23 మంది ప్రయాణీకుల కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారి వివరాలు ఎక్కడా అందుబాటులో లేవు. చిలకలూరి పేట రూరల్ పోలీసులను కూడా బీబీసీ సంప్రదించింది. అయితే, ఇది చాలా పాత కేసు కాబట్టి ప్రస్తుతం బాధితుల కుటుంబ సభ్యుల గురించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)