‘ఆన్‌లైన్ చదువులకు లక్షల్లో ఫీజులు కట్టాం... ఏమీ అర్థం కాలేదని చెబితే ఏమంటారో’

కాలేజీ విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డౌన్లు, విద్యా సంవత్సరం పొడిగింపులతో కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడితే, మరికొంతమంది ఆన్‌లైన్ పాఠాలను అర్థం చేసుకోలేక సతమతమయ్యారు.

ఇంకొందరు కొత్త విద్యా సంవత్సరంలో ట్యూషన్లపై ఆధారపడుతున్నారు. కాలేజీలు పూర్తిగా తెరిస్తే, ఆఫ్‌లైన్ క్లాసులకు ఎప్పుడు హాజరవుదామా అని ఎదురు చూస్తున్నారు.

ఈ పరిస్థితులన్నీ విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

విభిన్న ప్రాంతాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు తామెదుర్కొంటున్న పరిస్థితులను బీబీసీతో పంచుకున్నారు.

షణ్ముఖి

ఫొటో సోర్స్, SHANMUKHI

ఫొటో క్యాప్షన్, షణ్ముఖి

"కాలేజీ జీవితం మిస్ అయినట్లే"

షణ్ముఖి, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్

"కాలేజీ జీవితం అంటే భవిష్యత్తుకు పునాదులు వేసే జ్ఞానం, జీవిత కాలానికి సరిపోయేంత మంది స్నేహితులు, కొన్ని మధురమైన అనుభూతులు.. ఇవన్నీ మేము కోల్పోయామనే చెప్పవచ్చు.

లాక్‌డౌన్లు మా కాలేజీ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేశాయి.

పీపీటీల ద్వారా చెప్పే ఆన్‌లైన్ చదువుతో మేమేం నేర్చుకున్నామో మాకే తెలియటం లేదు. టీచర్లకు కూడా అంతా కొత్తగానే ఉండేది.

ఒక సెమిస్టర్ నిడివిలో పూర్తి చేయాల్సిన ల్యాబ్ ప్రయోగాలు చేసేందుకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే దొరికింది. దీంతో మేమేమీ పెద్దగా నేర్చుకోలేదనే చెప్పాలి.

ఒక సెమిస్టర్ పరీక్షలు అవ్వకుండానే, ఇంకొక సెమిస్టర్ కోసం చదవడం.. ఇదంతా చాలా కష్టంగా ఉండేది.

కాలేజీకి, విద్యార్థులకు మధ్యనుండాల్సిన కమ్యూనికేషన్ గ్యాప్స్ కూడా పెరిగిపోయాయి. సీనియర్స్ ఎవరో తెలియదు. ఎవరితో మాట్లాడాలో తెలియదు. టీచర్లు కూడా పూర్తిగా తెలియదు. దీంతో మా సందేహాలు తీర్చుకునేందుకు మాకు ఎవరూ ఉండేవారు కాదు.

ఇంట్లోనే ఉండటంతో మధ్యాహ్నం పూట తిని పడుకోవడం చేస్తూ చాలా క్లాసులు మిస్ అయిపోతూ ఉండేవాళ్ళం.

ఆన్‌లైన్‌లో చెప్పేది అర్థంకాక చాలా మంది క్లాసులకు కూడా అటెండ్ అయ్యేవారు కాదు"

ఐసీఆర్‌ఐఈఆర్, లెర్న్ ఆసియా కలిసి మార్చి 2021 - ఆగస్టు 2021 మధ్యలో నిర్వహించిన జాతీయ సర్వేలో కేవలం 20శాతం మంది విద్యార్థులకే రిమోట్ విద్య అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. అందులో సగం మంది మాత్రమే ఆన్‌లైన్ తరగతులకు హాజరైనట్లు పేర్కొంది.

"మేమెదుర్కొన్న ఇంకొక పెద్ద సమస్య ఇంటర్న్‌షిప్. మేము ఒక సెమిస్టర్‌లో రెండు ఇంటర్న్‌షిప్‌‌లు చేయాలి. కానీ, ప్రస్తుతానికి మా ఇంటర్న్‌షిప్‌లను కూడా ఆన్‌లైన్‌కే పరిమితం చేశాం. ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ అయితే వస్తుంది కానీ, ఇది మా వర్కింగ్ నాలెడ్జ్ మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది.

క్షేత్రస్థాయిలో ఎలా పని చేస్తారో తెలియకుండా ఎంత థియరీ చదివినా ఎలా అర్థమవుతుంది?

మాకు ఒక సంవత్సరం పాటు వచ్చిన గ్యాప్ మా భవిష్యత్తునే అయోమయంలో పడేసింది. భవిష్యత్తులో ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పే స్థితిలో మాత్రం మేం లేము.

ఇన్ని సమస్యల మధ్య మాకు ప్లేస్‌మెంట్స్ దొరుకుతాయో లేదోననే భయం కూడా పట్టుకుంది. చదువూ పోయింది, స్నేహితులూ లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఆశలన్నీ చెల్లాచెదురయ్యాయి"

షణ్ముఖి లాంటి విద్యార్థులు భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతుంటే, విశాఖపట్నానికి చెందిన తన్మయి మాత్రం ఈ లాక్‌డౌన్లు తన అకాడమిక్ ప్రణాళికనే మార్చేశాయని అంటున్నారు.

తన్మయి

ఫొటో సోర్స్, Tanmai

ఫొటో క్యాప్షన్, తన్మయి

"లాక్డౌన్ మా అవకాశాలను లాగేసుకుంది"

- తన్మయి, విశాఖపట్నం - బీ.ఏ సైకాలజీ

"కోవిడ్ లాక్‌డౌన్ వల్ల మొదలైన ఆన్‌లైన్ చదువు నా మొత్తం అకాడమిక్ ప్లాన్‌ను తలకిందులు చేసేసింది.

నేను డిగ్రీ అవ్వగానే, ఫారిన్ యూనివర్సిటీకి అప్లై చేయాలనుకున్నాను.

కానీ, లాక్‌డౌన్లు సెమిస్టర్‌ను వాయిదా వేశాయి. వచ్చే సెమిస్టర్ వరకూ నేను అప్లై చేయలేను. సమయం వృథా అయింది.

దీనికి తోడు, కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం విదేశాలకు పంపాలంటే కూడా వెనుకంజ వేస్తున్నారు.

2020-21 సంవత్సరంలో అమెరికాకు వెళ్లి చదువుకునే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 15 శాతం తగ్గినట్లు ఓపెన్ డోర్స్ నివేదిక-2021 తెలిపింది. ఇది 2019-20 కంటే 1.8 % తగ్గింది.

"ఇక్కడ ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. ఆన్‌లైన్‌లో మేము నేర్చుకున్నదేమి పెద్దగా లేదు. ఇవన్నీ మాపై మానసికంగా చాలా ప్రభావం చూపాయి.

మా చుట్టూ ఒక విధమైన అనిశ్చితి నెలకొంది. ఒక విద్యార్థిగా ఈ పరిస్థితిని చూస్తుంటే చాలా నిరుత్సాహంగా ఉంది.

"వరల్డ్ ఈజ్ యువర్ ఓయెస్టర్" అని అంటారు. (అందరికీ అన్ని అవకాశాలూ అందుబాటులో ఉంటాయి. అదృష్టం ఉంటే ప్రత్యేకమైనది అందిపుచ్చుకుంటారు అని అర్ధం వస్తుంది.) కానీ, ఈ కోవిడ్, లాక్‌డౌన్ మా అవకాశాలన్నిటినీ వెనక్కి లాక్కెళ్లిపోయినట్లుగా అనిపిస్తుంది.

విద్యార్థులంతా తమ భవిత ఆగిపోయినట్లుగా భావిస్తున్నారు.

ఇదంతా తల్లితండ్రులకు చెప్పుకునే స్వేచ్ఛ కూడా అందరి పిల్లలకూ ఉండదు. ఆన్‌లైన్ క్లాసులకు కూడా లక్షల జీతాలు కట్టే తల్లితండ్రులకు నేనేమి నేర్చుకోలేకపోయాను అని చెబితే ఎలా అర్థం చేసుకుంటారో లేదో అనే భయం ఉంది.

నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఆర్గనైజేషనల్ సైకాలజీ చదవాలని అనుకుంటున్నాను.

ఒక్క మాటలో చెప్పాలంటే, మేమంతా దారి కనిపించక ఒక అయోమయంలో ఉన్నాం. మా భవిత ప్రశ్నార్థకంగా మారిందని తన్మయి చెప్పారు.

శిరీష

ఫొటో సోర్స్, Sirisha

ఫొటో క్యాప్షన్, శిరీష

"ఆన్లైన్ పాఠాలు అర్థమయ్యేవి కావు"

శిరీష, విజయనగరం - బీఎస్‌సీ

శిరీష విజయనగరం జిల్లా కొత్తబగ్గం గ్రామానికి చెందిన విద్యార్థి. ఆమె విశాఖపట్నం సమతా కాలేజీలో బీఎస్‌సీ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ పరీక్షలు రాశారు. పీజీలో చేరేందుకు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు.

‘‘కోవిడ్ లాక్‌డౌన్‌లో మా గ్రామానికి వెళ్ళిపోయాను, కానీ, ఇంటర్‌నెట్ సమస్య వల్ల క్లాసులకు సరిగ్గా హాజరవ్వలేక పోయేదాన్ని. సిలబస్ అంతా ఆన్‍లైన్‌లోనే పూర్తి చేశాం" అని చెప్పారు.

స్కూలు పిల్లలున్న ఇళ్లల్లో 64% మందికి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండగా, మిగిలిన 36శాతానికి ఉండేది కాదని ఐసీఆర్‌ఐఈఆర్, లెర్న్ ఆసియా సర్వే పేర్కొంది.

"కానీ, ఒక్కొక్కసారి టీచర్లు చెప్పే పాఠాలు అర్ధం కాక వినేవాళ్ళం కాదు. ఒక్కొక్కసారి పీడీఎఫ్ పంపించి నోట్స్ రాసుకోమనేవారు. దీంతో, పాఠం వినడంపై ఆసక్తి తక్కువగానే ఉండేది.

కెమెరా లేకపోవడంతో, ఆన్‌లైన్ క్లాసులు సరిగ్గా వినేవాళ్ళం కాదు. ఏకాగ్రత ఉండేది కాదు. మా సందేహాలకు సమాధానం దొరికేది కాదు.

సెమిస్టర్ పరీక్షల గురించి సమాచారం కూడా చాలా తక్కువ వ్యవధిలో చెప్పేవారు. నోట్స్, పరీక్షలు, రికార్డ్ సబ్‌మిషన్ అన్నిటికీ సమస్యలు ఎదుర్కొన్నాను.

మేము అటెండన్స్ కోసమే హాజరవుతూ ఉండేవాళ్ళం. మొబైల్ డేటాతోనే క్లాసులకు హాజరయ్యేదానిని" అని అన్నారు.

కోవిడ్-19 వ్యాప్తి నడుమ 05-18 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న పిల్లల్లో 80 శాతం మందికి విద్య అందలేదని ఐసీ‌ఆర్‌ఐఈ‌ఆర్, లెర్న్‌ఆసియా సర్వే తెలిపింది. సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగు వర్గాల్లో ఉన్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

ఆన్‌లైన్ విద్య అందిన 20 శాతం మందిలో కేవలం 55శాతం మందికే ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే అవకాశం దొరికినట్లు సర్వేలో వెల్లడయింది. 70శాతం మంది విద్యార్థులకు టీచర్లు అందుబాటులో ఉండేవారని ఈ సర్వే పేర్కొంది.

హితైష్ణి

ఫొటో సోర్స్, Hetaishni

ఫొటో క్యాప్షన్, హితైష్ణి

"కాలేజీలు ఇలా కొనసాగితే మేలు"

హితైష్ణి, హైదరాబాద్ - బీబీఏ

హైదరాబాద్‌లో బీబీఏ రెండవ సంవత్సరం చదువుతున్న హితైష్ణి మొదటి సంవత్సరంలో చేరిన ఆరు నెలల్లోనే లాక్‌డౌన్ మొదలయింది. ఆమె కూడా ఆన్‌లైన్ క్లాసుల్లో ఆసక్తి లేక, క్లాసుకు హాజరై వేరే పని చేసుకునేవాళ్లం అని చెప్పారు.

కానీ, మిస్ అయిన సిలబస్‌ను తిరిగి అర్థం చేసుకుని ముందుకు కదలడం కొంతమందికి కష్టంగానే ఉందని అన్నారు.

‘‘కాలేజీలు తెరుచుకోవడంతో, కాలేజీకి వెళ్లడం, టీచర్లతో మాట్లాడటం, స్నేహితులతో మాట్లాడటంతో పరిస్థితి మెరుగవుతుందని ఆశిస్తున్నాను.

అకాడమిక్ సంవత్సరం ఆలస్యం అవ్వడంతో, ఫైనల్ పరీక్షలు ఎప్పుడవుతాయి, భవిష్యత్తు ఏంటనే విషయాలపై చాలా సందేహాలున్నాయి.

కాలేజీలు మళ్ళీ అవాంతరాలు లేకుండా కొనసాగితే బాగుంటుందని నేననుకుంటున్నాను" అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్కూలు విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించారు. అందులో కొంత మంది విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు కూడా జరగలేదు.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ శుక్రవారం దేశవ్యాప్తంగా 1.23 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో సుమారు 38 లక్షల మంది విద్యార్థులకు నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేను 3, 5, 8, 10వ తరగతికి చెందిన విద్యార్థులకు నిర్వహించింది. ఈ సర్వే ద్వారా పిల్లల లెర్నింగ్ సామర్ధ్యాన్ని అంచనా వేస్తుంది.

సగం మంది పిల్లలకు టీవీ, రేడియోలో ప్రసారమయ్యే విద్యా కార్యక్రమాలను వినమని చెప్పేవారు. సిగ్నల్ సమస్యలు, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం, లేదా ఫోన్లు, ట్యాబ్‌లు లేకపోవడం, డేటా ఖర్చు కూడా విద్యార్థులకు విద్య అందకపోవడానికి కొన్ని కారణాలుగా ఐసీఆర్‌ఐఈఆర్, లెర్న్ ఆసియా సర్వే పేర్కొంది.

పై తరగతుల్లో పాఠాలు అర్థం చేసుకుని పరీక్షలు రాసేందుకు ట్యూషన్లపై ఆధారపడాల్సి వస్తోందని యలమంచిలి చెందిన గణేష్ లాంటి విద్యార్థులు చెబుతున్నారు.

కే గణేష్

ఫొటో సోర్స్, GANESH

ఫొటో క్యాప్షన్, కే గణేష్

"పరీక్షలు లేవు, చదువూ లేదు"

కే గణేష్, 9వ తరగతి, యలమంచిలి

"లాక్‌డౌన్‌లో మాకు ఆన్‌లైన్ క్లాసులు కూడా జరగలేదు. ప్రభుత్వం మమ్మల్ని పరీక్షలు లేకుండానే పాస్ చేయడంతో ప్రస్తుతం తొమ్మిదవ తరగతిలోకి వచ్చేశాం.

మేం 8వ తరగతి చదవకపోవడం వల్ల సబ్జెక్టు ఏమీ నేర్చుకోలేదు. పరీక్షలు లేకుండా పాస్ అవ్వడం చాలా సంతోషం అనిపించింది.

కానీ, ప్రస్తుతం కొన్ని పాఠాలు వింటుంటే అర్ధం కావడం లేదు. దీంతో, ట్యూషన్‌కి వెళ్లి నేర్చుకోక తప్పడం లేదు. నిజం చెప్పాలంటే, నేనసలు 8వ తరగతిలో పుస్తకాలే తీయలేదు. దాని, పర్యావసానాలు ఇప్పుడు తెలుస్తున్నాయి.

ఇప్పుడు స్కూల్‌కు వెళ్లడం, టీచర్లు చెబుతున్న పాఠాలు నేరుగా వినడం బాగుంది" అన్నారు.

ట్యూషన్లపై ఆధారపడ్డ పిల్లల సంఖ్య 2020లో 32.5 శాతం ఉండగా, 2021లో 39.2 శాతానికి పెరిగినట్లు ఎస్‌ఈ‌ఆర్ సర్వే తెలుపుతోంది. ఎక్కువ రోజులు విద్యా సంస్థలు మూత పడటంతో, తల్లితండ్రులు పిల్లల చదువు కోసం బయట నుంచి మద్దతు తీసుకుంటున్నట్లు సర్వే పేర్కొంది.

కొత్తగా కాలేజీల్లో చేరిన కొంత మంది విద్యార్థులు ఇంకా కాలేజీల్లో కూడా అడుగుపెట్టలేదు. ఆన్‌లైన్‌లోనే చదువును కొనసాగించడం పట్ల తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ప్రోత్సాహమూ లేకుండా జేఈఈ లాంటి పరీక్షలకు సిద్ధం కావడం కూడా అంత సులభమైన పనేమీ కాదని అంటున్నారు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న దీప్తి.

దీప్తి శ్రీ

ఫొటో సోర్స్, Deepti Sri

ఫొటో క్యాప్షన్, దీప్తి శ్రీ

"మా బాడీ సైకిల్ మారిపోయింది"

దీప్తి శ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్

"మార్చి 2020లో లాక్‌డౌన్ అనగానే క్లాసులకు వెళ్లనక్కర లేదు అనుకున్నాను, ఆ నిర్ణయం గురించి తర్వాత చింతించాల్సి వస్తుందని ఊహించలేదు.

ఎవరినీ కలవకుండా, ఇంటి దగ్గరే ఉండటం చాలా కలవర పెట్టింది. ఒకేసారి ఆన్‌లైన్ చదువులకు అలవాటు పడటానికి చాలా కష్టమైంది. ఏకాగ్రత కుదిరేది కాదు. టీచర్లకు కూడా ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడం కొత్తే కావడంతో, వాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేకపోయేవారు.

ఇది మా ఆరోగ్యాల పై కూడా ప్రభావం చూపించింది. పొద్దున్న లేచి కాలేజీకి వెళ్లే పని లేకపోవడంతో, రాత్రి పూట నిద్రపోకపోవడం, ఆలస్యంగా లేవడం...ఇదంతా మొత్తం మా బాడీ సైకిల్‌పై ప్రభావం చూపించింది.

ఈ ఒత్తిడి వల్ల ఇష్టం వచ్చినట్లు తినడం, తిండి మీద శ్రద్ధ లేకపోవడం జరిగేది.

దీనికి తోడు, కోవిడ్-19 బారిన పడి తెలిసిన వ్యక్తులు మరణిస్తున్న వార్తలు మరింత ఒత్తిడికి గురి చేసేవి. నాకు కూడా రెండవ వేవ్‌లో కోవిడ్ వచ్చింది.

అప్పుడే పరీక్షలు కూడా ఉండటంతో ఒకవైపు ఆరోగ్యం చూసుకుంటూ, పరీక్షలకు చదవాల్సి వచ్చేది.

అయితే, వీటన్నిటి మధ్యా నన్ను కాపాడింది మాత్రం యోగ అని చెబుతాను. నేను కవితలు రాస్తాను. చదువుకుంటాను. ఇవన్నీ నాకు బాగా సహాయం చేశాయి. మనసు విప్పి స్నేహితులతో మాట్లాడటం కూడా ఒక్కొక్కసారి థెరపీలా పని చేస్తుంది.

సంవత్సరానికి పైగా నేను ఆఫ్‌లైన్ క్లాసులను మిస్ అవుతున్నాను.

పరీక్షలు రాయకుండానే నేను 12వ తరగతి పాస్ అయిపోయాను. ప్రస్తుతం నేను వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరాను. అయితే, నేనింకా క్లాసులకు ఇంటి నుంచే హాజరవుతున్నాను. ఒకటైతే చెప్పగలను. ఈ ఒక్క ఏడాదిలో టెక్నాలజీ వాడకం, యాప్‌ల వాడకాన్ని బాగా అలవాటు చేసుకున్నాను. ఇది చాలా వరకు ఉపయోగపడుతోంది కూడా. వీటి వల్ల కనీసం స్నేహితులతో మాట్లాడటం కుదురుతుంది. జీవితం మరీ బోర్ కొట్టడం లేదు.

అయితే, కాలేజీకి వెళ్లడాన్ని, హాస్టల్ లైఫ్‌ను మిస్ అవుతున్నాను. టీచర్లను, తోటి విద్యార్థులను కలవలేకపోవడం విచారంగా ఉంది.

కానీ, ఆన్‌లైన్‌లో పరీక్షలు రాయడం మాత్రం బాగుంది.

నేను మాత్రం కాలేజీ జీవితం గడిపేందుకు, కొత్త అనుభవాలను పోగు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)