త్రిపుర : నిర్బంధంలో ఉన్న ఇద్దరు మహిళా జర్నలిస్టులకు బెయిల్ మంజూరు

ఫొటో సోర్స్, PINAKI DAS
త్రిపురలో మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నారన్న ఆరోపణలతో నిర్బంధానికి గురైన ఇద్దరు మహిళా జర్నలిస్టులు సమృద్ధి.కె.సకునియా, స్వర్ణ ఝాలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మసీదులు, ముస్లింల ఆస్తులపై ఇటీవల జరిగిన దాడుల తర్వాత త్రిపురలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై వీరిద్దరు వార్తలు అందించారు.
సమృద్ధి, స్వర్ణ ఝా ఇద్దరూ రిపోర్టింగ్‌కి వెళ్లిన ప్రాంతంలో హిందూ సమాజానికి వ్యతిరేకంగా ముస్లింలను ప్రేరేపించేలా ప్రసంగించారంటూ స్థానిక హిందూ కార్యకర్త చేసిన ఫిర్యాదుతో వీరిని అరెస్టు చేశారు.
వీరి నిర్బంధాన్ని జర్నలిస్టులు, మీడియా హక్కుల సంఘాలు ఖండించాయి. వీరిని తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వచ్చాయి.
అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని వీరు పని చేస్తున్న వార్తా సంస్థ హెచ్‌డబ్ల్యు న్యూస్ నెట్‌వర్క్ ఆరోపించింది.
వార్తాసంస్థలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తూ వాస్తవాలను నివేదించకుండా త్రిపుర ప్రభుత్వం అడ్డుకుంటుందని హెచ్‌డబ్ల్యు న్యూస్ నెట్‌వర్క్ ఆరోపించింది.
తమపై నమోదైన పోలీసు ఫిర్యాదుని ట్విటర్‌లో సకునియా షేర్ చేశారు. దీనిప్రకారం ప్రకారం, వీరిపైన నేరపూరిత కుట్ర, రెండు మతాల మధ్య శత్రుత్వం పెంచేలా వ్యవహరించారనే అభియోగాలు నమోదు అయ్యాయి.
ఈ ఇద్దరు మహిళలు నిర్బంధంలో ఉన్నప్పుడే ట్వీట్ చేశారు. వీరిని శనివారం రాత్రి హోటల్‌లో అదుపులోకి తీసుకున్నారని, ఆదివారం మధ్యాహ్నం బయటకు అనుమతించారని సకునియా ట్వీట్ చేశారు.
అయితే ఆ తర్వాతి రోజు వారిని మళ్లీ పొరుగున ఉన్న అసోంలో అదుపులోకి తీసుకుని, త్రిపుర పోలీసులకు అప్పగించినట్లు హెచ్‌డబ్ల్యూ న్యూస్ తెలిపింది. వారు ఇంకా కస్టడీలోనే ఉన్నారు.
త్రిపురలోని మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం వీరిద్దరికి బెయిల్ మంజూరు చేసింది.
విధుల్లో భాగంగా రిపోర్టింగ్ చేసే సమయంలో, వారు ధ్వంసమైన మసీదుల చిత్రాలను, వీడియోలను ట్వీట్ చేశారు.
త్రిపురలో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు బెదిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని సకునియా ఆదివారం ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన భారత హోం మంత్రిత్వ శాఖ ఈ జర్నలిస్టులు వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది.
ఇటీవల త్రిపురలోని మసీదులపై దాడులు మతపరమైన ఉద్రిక్తతకు దారి తీశాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువులపై ఇటీవల జరిగిన దాడులు, దేవాలయాల విధ్వంసానికి నిరసన తెలిపేందుకు మితవాద హిందూ సంఘాలు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే పలువురు ముస్లింల ఆస్తులను ధ్వంసం చేశారు.

ఫొటో సోర్స్, PINAKI DAS
నవంబర్ 13న పాణిసాగర్ పట్టణంలోని ఒక మసీదు లోపల విరిగిన కిటికీలు, ఫ్యాన్లు, స్విచ్‌బోర్డ్‌లకు సంబంధించిన ఫొటోలను సకునియా ట్వీట్ చేశారు. స్థానికులు వాటిని బాగు చేయించుకున్నారని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతం సురక్షితంగా, శాంతియుతంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.
విధ్వంసం జరిగినట్లు వస్తున్న సోషల్ మీడియా పోస్ట్‌లను "లైక్ లేదా రీట్వీట్" చేయవద్దని పోలీసులు ప్రజలను కోరారు. దాని వల్ల వదంతులు ప్రబలే అవకాశం ఉందని చెప్పారు.
మరో జిల్లాలో అక్టోబర్ 19న ఒక మసీదును తగులబెట్టినట్లు ఆరోపిస్తూ ఒక వీడియోను సకునియా నవంబర్ 12న ట్వీట్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకూ ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు.
పాణిసాగర్ లేదా ఈ పట్టణం ఉన్న జిల్లాలో ఎవరూ మసీదును తగలబెట్టలేదని పోలీసులు చెప్పారు.
అయితే హింసపై రిపోర్టు చేస్తున్న పలువురు జర్నలిస్టులు, నివేదికలను విడుదల చేసిన న్యాయవాదులపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిపై నమోదైన అభియోగాల్లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్టు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నట్టు పేర్కొన్నారు.
102 ట్విట్టర్ హ్యాండిల్స్‌పై కఠినమైన యాంటీ-టెర్రర్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టడానికే ఈ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఫిర్యాదులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
ఇవి కూడా చదవండి:
- త్రిపుర పీఠం బీజేపీకి ఎలా దక్కింది?
- బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల విషయంలో భారత్ ఎందుకు ఆచితూచి వ్యహరిస్తోంది
- ‘అలెగ్జాండర్ ‘గ్రేట్’ కాదా? యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారు? పర్షియన్ చరిత్ర ఏం చెబుతోంది?
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?
- బ్రిట్నీ స్పియర్స్: ఈ పాప్ గాయని కన్న తండ్రిపైనే కోర్టులో పోరాడాల్సి వచ్చింది ఎందుకు?
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








