మరియమ్మ లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టు: ‘రూ.15 లక్షలు, ఉద్యోగం పోయిన ప్రాణాలను వెనక్కి తీసుకురాలేవుగా’ - ప్రెస్ రివ్యూ

మరియమ్మ
ఫొటో క్యాప్షన్, మరియమ్మ

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురైన మరియమ్మ కేసు విషయంలో హైకోర్టు స్పందించిన తీరు గురించి ఈనాడు వార్తా కథనాన్ని ప్రచురించింది.

రాష్ట్రప్రభుత్వం మొదట అందజేసిన పోస్టుమార్టం నివేదికకు.. తరువాత మేజిస్ట్రేట్ నివేదికతో పాటు సమర్పించిన పోస్ట్ మార్టం నివేదికకు పొంతన లేకపోవడం పై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఒంటిపై గాయాలున్నట్లు మొదటి నివేదికపై ఎక్కడా ప్రశ్నించలేదని పేర్కొంది.

దొంగతనం ఆరోపణపై పోలీసులు తీసుకువెళ్లిన మరియమ్మ (44) అనే దళిత మహిళ కస్టడీలో మృతి చెందడంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు గతంలో సూచించింది.

బుధవారం నాటి విచారణలో "బాధ్యులైన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది".

ఎస్సైని, పోలీసు కానిస్టేబుల్ ను విధుల నుంచి తొలగించి మరియమ్మ కుటుంబ సభ్యులకు రూ. 15లక్షల పరిహారం చెల్లించినట్లు అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.

"ఇవన్నీ పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేవుగా" అని కోర్టు వ్యాఖ్యానించినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

ఆమె మృతదేహంపై ఉన్న గాయాలను ఏజీకి చూపిస్తూ ఇలా ఎవరు కొట్టినా గుండె ఆగిపోతుందని వ్యాఖ్యానించింది.

ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసినట్లు ధర్మాసనం పేర్కొన్నట్లు ఈనాడు కథనం తెలిపింది.

ఇండియన్ రైల్వే

ఫొటో సోర్స్, Getty Images

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.500

పార్కింగ్‌ ఛార్జీల పేరుతో దక్షిణ మధ్య రైల్వే ‍ప్రజల మీద మోయలేని భారాన్ని మోపుతున్నట్లు సాక్షి కథనం ప్రచురించింది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కి ఇరువైపులా పార్కింగ్‌ ప్లేస్‌లు ఉన్నాయి. ఇక్కడ టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలను ప్రయాణికులు నిలిపి ఉంచుతున్నారు.

దక్షిణ మధ్య తాజా నిబంధనల ప్రకారం ఇక్కడ రెండు గంటల పాటు టూ వీలర్‌ నిలిపి ఉంచితే రూ.15 , ఫోర్‌ వీలర్‌ అయితే రూ.50 వంతున పార్కింగ్‌ ఛార్జీగా విధించింది.

ఎవరైనా రెండు గంటలకు మించి పార్కింగ్‌ ప్లేస్‌లో వాహనం నిలిచి ఉంచినట్టయితే గుండె గుబిల్లుమనేలా జరిమానాలు విధిస్తోంది రైల్వేశాఖ" అని సాక్షి కథనం తెలిపింది.

జరిమానా వివరాలు:

రెండు గంటల తర్వాత మొదటి ఎనిమిది నిమిషాలకు ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జ్‌ లేదు. కానీ ఆ తర్వాత గడిచే ఒక్కో నిమిషానికి ఒక్కొ రేటు విధించింది.

- తొలి రెండు గంటల తర్వాత 8 నుంచి 15 నిమిషాల ఆలస్యానికి ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.100

- తొలి రెండు గంటల తర్వాత 16 నుంచి 30 నిమిషాల ఆలస్యానికి ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.200

- తొలి రెండు గంటల తర్వాత 30 నిమిషాలు దాటి ఆలస్యమయితే ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.500

"పండగ వేళ స్టేషన్‌కి వెళ్లి ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జీల కాటుకు గురైన వారు సోషల్‌ మీడియా వేదికగా రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు" అని సాక్షి కథనం పేర్కొంది.

భారత పార్లమెంటు భవనం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత పార్లమెంటు భవనం

తిరిగి ప్రారంభమయిన ఎంపీ ల్యాడ్స్

కరోనా నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో నిలిపివేసిన ఎంపీ లాడ్స్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించినట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో మిగిలిన కాలం నుంచి 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసే వరకు... అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఎంపీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఎంపీ లాడ్స్‌ను కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి రూ.2 కోట్లు చొప్పున ఇస్తారు. 2022-23 నుంచి 2025-26 వరకు ఒక్కో ఎంపీకి ఏడాదికి రూ.5కోట్లు చొప్పున నిధులు కేటాయిస్తారు. వీటిని ఏటా రెండు వాయిదాల్లో రూ.2.5 కోట్లు చొప్పున ఇస్తారు.

అయిదేళ్లకు కలిపి ఈ పథకం కింద మొత్తం రూ.17,417 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. పథకాన్ని పునరుద్ధరించినందున నియోజకవర్గాల్లో తాగునీరు, ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, రోడ్లు తదితర ప్రాజెక్టులకు సంబంధించిన పనులను ఎంపీలు చేపట్టవచ్చని కేంద్రం తెలిపింది.

ఇప్పటికే మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు" అని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

హీరో నాగశౌర్య తండ్రి

ఫొటో సోర్స్, NAGASHAURYA/TWITTER

పేకాట కేసులో ప్రముఖ టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రికి నోటీసులిచ్చిన పోలీసులు

పేకాట కేసులో ప్రముఖ టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు v6 వెలుగు దినపత్రిక కథనం పేర్కొంది.

"ఒక విల్లాలో పేకాట ఆడిన కేసులో 30 మందిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు గుట్ట సుమన్ చౌదరి బర్త్ డే పార్టీ పేరుతో విల్లాను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది" అని కథనం తెలిపింది.

ఈ ఫార్మ్ హౌజ్‌‌ను దాని ఓనర్ రిటైర్డ్ ఐఏఎస్ గార్గ్ నుంచి నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ లీజుకు తీసుకున్నాడని నార్సింగి ఇన్‌స్పెక్టర్ శివకుమార్ అన్నారు.

'ఆదివారం సాయంత్రం ఫామ్ హౌజ్‌పై దాడులు చేశాం. ముప్పై మందిని అరెస్ట్ చేశాం. ఈ కేసులో నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్‌కు నోటీసులు జారీ చేశాం. ఆయన్ను విచారణకు హాజరు కావాలని ఆదేశించాం. ఈ కేసులో అందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. ఎవరూ పరారీలో లేరు' అని ఎస్‌ఐ శివకుమార్ చెప్పారు" అని v6 వెలుగు కథనం పేర్కొంది. .

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)