హుజూరాబాద్: ఈటల రాజేందర్ బీసీ కార్డ్, కేసీఆర్ దళిత బంధు, హరీశ్ రావు ఎన్నికల వ్యూహాలు... ఉప ఎన్నికలలో ఓట్లు తెచ్చేది ఏది

ఈటల రాజేందర్

ఫొటో సోర్స్, facebook/eatalarajender

    • రచయిత, జింకా నాగరాజు
    • హోదా, బీబీసీ కోసం

హుజూరాబాద్‌లో ఏం జరగబోతుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న గ్రామం అచ్చంపేట. 1000 జనాభా ఉన్న ఈ గ్రామం మెదక్ జిల్లాలో ఉంటుంది.

ఆ మధ్య ఈ గ్రామం తరచుగా హెడ్‌లైన్లలోకి వచ్చింది. అప్పుడు ఈ ఊరితో పాటు చాలా మంది గ్రామస్థులు  టీవీల్లో కనిపించారు. గ్రామస్థుల అభిప్రాయం కోసం మీడియా ఎగబడింది. 

కారణం, బర్తరఫ్ అయిన టీఆర్‌ఎస్ మంత్రి ఈటల రాజేందర్ సొంత ఊరు అచ్చంపేట.  ఉన్నట్లుండి ఒక రోజు సాయంత్రం టీవీల్లో ఈటల రాజేందర్ భూకబ్జా వార్త వచ్చినప్పటి నుంచి, ఆయనను  ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్ నుంచి తొలగించడం వరకు పరిణామాలు వేగంగా జరిగాయి.

అధికారుల విచారణలు, టీఆర్‌ఎస్‌కు ఆయన రాజీనామా చేయడం, అనంతరం బీజేపీలో చేరడం, ఆయన ఖాళీ చేసిన హూజూరాబాద్  నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం, అక్కడ జరుగుతున్న క్యాంపెయిన్.. అన్నీ అచ్చంపేట గ్రామస్తులు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలను ఒక కొత్త మలుపు తిప్పుతుందని నమ్మేవాళ్లూ ఈ ఊరిలో ఉన్నారు.

అంతేకాదు, ఆ ఊరికి చెందిన ఒక నాయకుడు ముఖ్యమంత్రి  కావాలని ఆశించారని, అదే ఆయన నేరమైందని ఒకరిద్దరు వాదించారు.

వీడియో క్యాప్షన్, ఈటల రాజేందర్‌తో బీబీసీ తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ

సొంతూరిలో రాజేందర్ మీద సానుభూతి అయితే కనిపిస్తోంది. భూముల వ్యవహారంలో స్వచ్ఛమైన నేతలు ఎంతమంది అని కొందరు ప్రశ్నిస్తుండగా... రాజేందర్ తప్పేమీ లేదని. ఈ ఉప ఎన్నిక ఆ విషయాన్ని నిరూపిస్తుందని అచ్చంపేటకు చెందిన మరికొందరు చెబుతారు.

అచ్చంపేటకు చెందిన కుంట్ల విఠల్ ఇదే చెబుతారు. ఆయన వయసు 60 ఏళ్లు. రాజేందర్‌ను గతంలో ఎప్పుడో ఓసారి కలుసుకున్నారాయన. తనని రాజేందర్ గుర్తుపడతారని కూడా నమ్మకం లేదు. 

"జరిగిందంతా రాజకీయం. రాజేందర్ భూముల మీద మా ఊర్లో కొందరు పొద్దున ఒక మాట, సాయంకాలానికి మరొక మాట చెప్పి వివాదం సృష్టించారు. దీని వెనక ఏముందో అందరికీ తెలుసు" అని విఠల్ అంటారు.

భూ ఆక్రమణల ఆరోపణలు అనేకమంది నేతల మీద వస్తూ ఉంటాయని.. రాజేందర్ మాత్రం రాజకీయ కారణాల వల్లనే బలయ్యారని మరికొందరు అంటారు.

ఇలా ఈ ఊర్లో పుట్టిన ఒక వార్తే హూజూరాబాద్ ఉప ఎన్నికకు కారణమయింది. రేపు రాజకీయాలను ఇది ఎలాంటి మలుపు తిప్పుతుందో అనే చర్చ అచ్చంపేటలో వినిపిస్తుంది. ఉప ఎన్నిక

క్యాంపెయిన్ కూడా అచ్చంపేట ఉత్కంఠనే ప్రతిబింబిస్తుంది. హూజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 30న జరుగుతుంది.

రాజేందర్ కమలం పార్టీలో చేరడంతో చాలాకాలంగా వెదుకుతున్న తీగ బీజేపీ కాళ్లకు తగిలినట్లయింది.  రెండు తెలుగు రాష్ట్రాలలో రాజేందర్ లాంటి సక్సెస్ ఫుల్ లీడర్ బీజేపీకి దొరకలేదు. రాజేందర్ భవిష్యత్తులో మళ్లీ బయటకు వెళ్లకుండా ఉండేలా పార్టీ జాగ్రత్త తీసుకుంటూ ఉంది.

ఇందుకోసం మొదట చేసిన పని హూజూరాబాద్  ఎన్నికల ప్రచారాన్నిపూర్తిగా స్థానికం చేయడం. ఎక్కడా హిందూత్వ గురించి మాట్లాడకుండా చర్యలు తీసుకుంది బీజేపీ. ఆయనను జాతీయ కార్యవర్గంలో ప్రత్యేకాహ్వానితుడిని చేశారు.  అంతే కాదు, బీజేపీ తెలుగునాట తొలిసారి బీసీ కార్డుని చాలా జాగ్రత్తగా ప్రయోగిస్తోంది. దీనికోసం బీజేపీ 'ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్' (కేవీఐసీ) సౌత్ జోన్ చెయిర్మన్ పేరాల శేఖర్ రావును రంగంలోకి దించింది.

ఖాదీకమిషన్‌తో అనుబంధం ఉన్న కులాలన్నీ వెనుకబడిన కులాలే కావడంతో ఆయన ఈ నియోజకవర్గంలో విపరీతంగా కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీ తెలంగాణ 'బీసీ అజెండా'ను ప్రజల్లోకి చొప్పిస్తున్నారు. శేఖర్ రావు దాదాపు అన్ని కులాల సమావేశంలో 'తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి రావడానికి హూజూరాబాద్ ఎన్నిక బాట వేస్తుంది' అని ప్రత్యేకంగా చెబుతున్నారు.

Eatala Rajendar

ఫొటో సోర్స్, facebook/eatalarajendar

ఎలా?

"ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు తెలంగాణలో కానీ బీసీలే ఎక్కువ. అయినా సరే, ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదు. బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తామని ఏ పార్టీ చెప్పలేదు. ఎస్‌సీ నేతను ముఖ్యమంత్రి చేస్తామన్నారు కానీ, బీసీ నేతని ముఖ్యమంత్రి చేస్తామన లేదు. బీజేపీ చెబుతోంది. హూజూరాబాద్ ఎన్నిక ప్రభావం చాలాదూరం పోతుంది. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ ఎన్నిక  బాట వేస్తుంది. బీసీ ముఖ్యమంత్రి కావాలా, వద్దా?," అని జమ్మి కుంటలో జరిగిన పద్మశాలి, కుమ్మరి, యాదవ, గౌడ్‌ల కుల సమావేశాలలో ఆయన చాలా స్పష్టంగా అడిగారు.

ఆయన వెకబడిన కులాల నేతలతో  మాట్లాడుతున్నారు, వాళ్ల కాలనీలలో తిరుగుతున్నారు. అన్ని చోట్ల ఒకటే చెబుతున్నారు.. 'బీసీ ముఖ్యమంత్రి అయ్యేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నిక తప్పకుండా బాట వేస్తుంది. బీజేపీని గెలిపించండి. బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారు,' అని చెబుతున్నారు. 

ఈ విషయంపై బీబీసీ ఆయనను సంప్రదించింది. ఈ ప్రచారం నిజమేనని ఆయన అంగీకరించారు. "తెలంగాణలో బీజేపీ బీసీల పార్టీ. మా నేతలంతా బీసీలే. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బీసీ.  నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ బీసీ. బీసీ జాతీయ మోర్చ నాయకుడు డాక్టర్ లక్మణ్ బిసి. ఇపుడు ఈటల రాజేందర్ బీసీయే. అందువల్ల తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అయ్యేందుకు హుజూరాబాద్  బాటవేస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది చెప్పలేను. బీజేపీలో టాలెంటే అర్హత. ఒక్కటి మాత్రం నిజం- తెలంగాణ లో బీసీలు ఒక  శక్తి అని బీజేపీ గుర్తించింది" అని శేఖర్ రావు చెప్పారు.

శేఖర్ రావు గతంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. ఆర్‌స్‌ఎస్ నేత. ఆయన ద్వారా బీజేపీ కొత్త అజెండాకి తెర లేపిందనిపిస్తుంది. హుజూరాబాద్‌లో బీజేపీది 'కౌంటర్ క్యాంపెయిన్ స్ట్రాటజీ'. ఇక్కడ టీఆర్ ఎస్ ఎన్నికల ప్రచారం కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతూ ఉంది. దాన్ని తిప్పి కొట్టడం బిజెపి వ్యూహం.

ఒక ఉప ఎన్నికని అధికార పార్టీ ఇంత సీరియస్ గా తీసుకుని  అసాధారణ రీతిలో  ప్రచారం చేయడం  ఎపుడూ జరగ లేదు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు రెండు నెలలుగా నియోజకవర్గంలోనే తిష్ఠ వేసి, ప్రభుత్వ పథకాల లబ్దిదారులందరినీ కలుస్తున్నారు. కుల సంఘాలతో సమావేశమవుతున్నారు.

పాదయాత్రలు చేస్తున్నారు. బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇపుడు ప్రతి ఇంటి తలుపుతడుతున్నారు. 'టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ని గెలిపిస్తే, ఇక్కడే ఇలాగే కూర్చుని  మీ అందరికి ఎపుడూ అందుబాటులో ఉంటూ సేవచేస్తాన'ని ఆయన సోమవారం హుజూరాబాద్‌లో చెప్పారు.

ఆయనకు తోడు కరీంనగర్ జిల్లాకు చెందిన  మరొక మంత్రి గంగుల కమలాకర్ మరోవైపు నుంచి నరుక్కువస్తున్నారు. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర మంత్రులు, కార్పొరేషన్లు

చైర్మన్లు లెక్కలేనంత మంది హరీష్ రావు కెప్టెన్సీలో పనిచేస్తున్నారు.

రేవంత్

ఫొటో సోర్స్, REVANTH REDDY ANUMULA/FACEBOOK

కొడంగల్ పునరావృతమవుతుందా?

ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో కాకలు తీరిన యోధుడు హరీశ్ రావు.  2018 ఎన్నికల్లో ఆయన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్  రెడ్డిని ఓడించారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో బద్ధవైరం. మాటల తూటాలతో కేసీఆర్ మీద దాడి చేయగలిగే ప్రతిపక్ష నాయకుల్లో  రేవంత్ ఒకరు.

అలాంటి రేవంత్ అసెంబ్లీలో కనిపించడానికి వీల్లేదు, ఓడించేయ్ అని కేసీఆర్  హరీష్ రావును పంపించినట్లు చెబుతారు.  టిఆర్‌ఎస్  అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలింపిచాల్సిన బాధ్యత హరీశ్ మీద పెట్టారు. హరీష్ రావు విజయం సాధించారు. రేవంత్ ఓడిపోయి, పట్నం గెలిచారు.

ఇపుడు హుజూరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. చాకు లాంటి నాలుక ఉన్న నాయకుడు ఈటల రాజేందర్. ఆయనను భూకబ్జా ఆరోపణలతో క్యాబినెట్ నుంచి బర్త్‌రఫ్ చేశారు.

ఈటెల రాజేందర్ ఒక సారి కూడా ఎన్నికల్లో ఓడిపోని నేత. అంతేకాదు, జనంలో పలుకుబడి ఉన్న నేత. ఇది ఆయనకు అసాధారణమైన గుండె ధైర్యం ఇచ్చింది.

అందుకే టీఆర్‌ఎస్ జెండాలో తనకు కూడా బాగస్వామ్యం ఉందని, టీఆర్‌ఎస్ నుంచి తమను ఎవరూ వేరుచేయలేరని సంచలన ప్రకటన చేసి కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు.

దానికి తోడు కేసీఆర్ క్యాబినెట్‌లో  ముఖ్యమంత్రి యోగ్యతలున్నవాళ్లుగా  తెలుగు మీడియా బాగా ప్రచారం చేసిన రెండు పేర్లలో రాజేందర్ పేరొకటి. మొదటి పేరు హరీష్ రావు.

అలాంటి రాజేందర్ తనపై వచ్చిన ఆరోపణల అనంతరం కాళ్ల బేరానికి రాలేదు. కయ్యాన్నే ఎంచుకున్నారు.  దానికి తోడు బీజేపీ అండ తీసుకున్నారు.

అందువల్లే రేవంత్‌ను ఓడించినట్లు హుజూరాబాద్‌లో రాజేందర్‌ను ఓడించాలని హరీష్ రావుని దండయాత్రకు పంపించారు. ఇక్కడ రాజేందర్‌కు వ్యతిరేకంగా హరీష్ టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తుంటే, టిఆర్ ఎస్ అభ్యర్థి  గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున ఏకంగా ప్రభుత్వమే క్యాంపెయిన్ చేస్తోంది.

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు అనే పథకం ప్రకటించి పైలట్ ప్రాజక్టుకి హూజూరాబాద్‌ను ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతి దళిత కుటుంబానికి రూ. 10  లక్షలు అందిస్తారు.

అప్పటి నుంచి హుజూరాబాద్‌లో నిధుల, పథకాల కుంభవృష్టి కురుస్తూ ఉంది. ఇంటి జాగా ఉన్న వాళ్లందరికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5.04 లక్షలు ఇస్తామని హరీష్ రావు ప్రకటించారు.

సుమారు రూ. 4,000 కోట్లను వివిధ ప్రభుత్వ పథకాల కింద హుజూరాబాద్ ఎన్నికల  సందర్భంగా ఖర్చు చేశారని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన మాజీ అధ్యాపకుడు  ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి ట్వీట్ చేశారు.

కులాలకు సంబంధించి చూస్తే హుజూరాబాద్ బీసీ నియోజకవర్గం. ఇక్కడ పద్మశాలి (26 వేలు), గౌడ (24 వేలు), ముదిరాజ్‌ (23 వేలు), యాదవ (22 వేలు) ఓట్లకు  గెలుపు, ఓటములను ప్రభావితం చేసే శక్తి ఉంది.

అందుకే ఈ కులాలకు భవన్‌లు హామీ ఇచ్చి భూములు, నిధులు మంజూరు చేశారు. తెలంగాణ వచ్చిన ఏడేళ్ల తర్వాత,  తొలిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకుని  అధికారుల వరకు పద్మశాలి కులానికి చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించారు.

నియోజకవర్గంలో వీధిలైట్ల దగ్గర నుంచి పెన్షన్లు మంజూరు చేయడం, కొత్త రోడ్లు వేయడం, పెండింగులో ఉన్నపనులన్నింటిని ఆగమేఘాల మీద చేసేయడం, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం అందించడం వంటి పనులు హుజూరాబాద్‌లో జరిగాయి.

అయితే, ఇదంతా ఎన్నికల కోసమే ననేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. అందుకే బీజేపీ కౌంటర్ క్యాంపెయిన్ ప్రారంభించింది. నిధులు 'ఇచ్చింది కేసీఆర్ అయితే, తెచ్చింది రాజేందర్' అంటూ కేసీఆర్ నినాదాన్ని ఆయన మీదకే ప్రయోగించింది బీజేపీ.

2014 ఎన్నికలపుడు, 'తెలంగాణ ఇచ్చింది సోనియా అయితే, తెచ్చింది కేసీఆర్,' అనేది టీఆర్‌ఎస్ నినాదం.

టీఆర్‌ఎస్ డబ్బులిస్తే తీసుకోండి, ఓటు మాత్రం ఈ డబ్బులొచ్చేందుకు కారణమయిన రాజేందర్ కు వేయండి అని బీజేపీ ఇప్పుడు ప్రచారం చేస్తోంది. టీఆర్‌ఎస్ ఓటమి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమే అనే ధోరణిలో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. రాజేందర్ క్యాంపెయిన్ మొత్తం కేసీఆర్ చుట్టూ తిరుగుతూ ఉంది.

హరీశ్ రావు

ఫొటో సోర్స్, Harishrao/facebook

కేంద్రాన్ని చూపి రాజేందర్ మీద దాడి

దీనికి విరుగుడు అన్నట్లుగా హరీష్ రావు  ప్రధాని నరేంద్ర మోదీ 'బూచి'ని చూపించి భయపెట్టే ప్రయత్నమూ చేస్తున్నారు. మోదీ పాలన గురించి చెప్పి ఓట్లు అడగాలని ఆయన రాజేందర్‌కు సవాల్ విసురుతున్నారు.  

'2014లో గ్యాస్ ధర రు. 464. ఇపుడు రూ. 912. దీన్ని చూపి ఓటు అడుగు. గత పదిరోజులలో ఏడు సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి, అది చూపి ఓటడుగు. ప్రభుత్వ రంగ సంస్థలను, రైళ్లను, విమానాశ్రయాలను అమ్మేస్తున్నారు. అది చూపి ఓటడుగు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు, రైతు చట్టాలకు, రైతులకు ఉరితాళ్లు అవి చూపి ఓటడుగు' అని రాజేందర్‌కు హరీష్ రావు సవాల్ విసిరారు.

గెల్లు శ్రీనివాసయాదవ్

ఫొటో సోర్స్, TELANGANA CM OFFICE

ఫొటో క్యాప్షన్, గెల్లు శ్రీనివాసయాదవ్

పోటీ కేసీఆర్, రాజేందర్ మధ్యే..

ఈటల రాజేందర్  చాలా సీనియర్ నాయకుడు, సీరియస్ నాయకుడు కావడంతో టీఆర్‌ఎస్ క్యాంపెయిన్ చాలా తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ముఖ్యమంత్రి  కెసిఆర్ పేరు ప్రస్తావన లేకుండా టిఆర్ ఎస్ క్యాంపెయిన్ సాగడం లేదు. ఫలితంగా క్యాంపెయిన్ ధోరణి చూస్తే  హుజూరాబాద్ లో పోటీ ముఖ్యమత్రి కెసిఆర్ , ఈటెల రాజేందర్ మధ్యనే అనే భావం కలుగుతుంది.

ఈ ఎన్నిక రెండు పార్టీలకు చాలా ప్రతిష్టాకరంగా మారింది. ఎలాగైనా సరే రాజేందర్ అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవాలనే ధోరణి టీఆర్‌ఎస్ క్యాంపెయిన్‌లో కనిపిస్తుంది. ఏది ఏమయినా సరే రాజేందర్‌ని అసెంబ్లీకి పంపాలనే తీరు బీజేపీలో కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ కాస్త మరుగున పడిందనక తప్పదు.

రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్‌లో భవిష్యత్తు మీద ఆశలుచిగురించాయి. కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ అనే నినాదం కాంగ్రెస్ వర్గాల్లో వినిపించినా హుజూరాబాద్‌లో ఆ పార్టీ పాత్ర పరిమితమే అనిపిస్తుంది. 

కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్ నర్సింగ్ రావును బరిలో దించింది. ఫలితమెలా ఉన్నా హుజూరాబాద్  ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. గెలుపు ఎవరిదైనా తెలంగాణ రాజకీయాలలో  ఇది మరో ముఖ్యమైన మలుపు కానుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)