ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: గెలుపోటములను ప్రభావితం చేసే ప్రధాన అంశాలేంటి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారతదేశంలో జనాభా పరంగా ఉత్తర్‌ప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. రాజకీయంగా కూడా అత్యంత ముఖ్యమైన రాష్ట్రం.
మరికొన్ని నెలల్లో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది.
జన సంఖ్య, రాజకీయ అవగాహన, చారిత్రక, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర్యోద్యమ చరిత్ర.. వీటన్నింటి నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చాలా ముఖ్యమైన స్థానం ఉంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 75 జిల్లాలు ఉన్నాయి. భారతదేశ జనాభాలో సుమారు 16.17% మంది ఈ రాష్ట్రంలో నివసిస్తున్నారు.
విస్తీర్ణంలో.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తరువాత ఐదవ స్థానంలో ఉంది.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి లోక్‌సభలో 80 సీట్లు, రాజ్యసభలో 31 సీట్లు ఉన్నాయి.
రాష్ట్ర శాసనసభలో 404 మంది సభ్యులు, శాసన మండలిలో 100 మంది సభ్యులు ఉన్నారు.
ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్షాలుగా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవహరిస్తున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు?
ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2022 ప్రారంభంలో జరగనున్నాయి. ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు.
ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2022 మార్చి 14న ముగియనుంది. కాబట్టి, అంతకుముందే ఎన్నికలు నిర్వహిస్తారు.
శాసనసభలో 403 మంది ఎన్నికైన సభ్యులు ఉంటారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన ఒక ఆంగ్లో-ఇండియన్ సభ్యుడు ఉంటారు.
అంటే ఇప్పుడు 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 202.
ఎన్నికల్లో 202 స్థానాలు గెల్చుకునే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే సంకీర్ణ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.
యూపీలో ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పొత్తులు స్పష్టంగా లేవు. ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తామని చాలా పార్టీలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రధాన అభ్యర్థులు ఎవరు?
ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాతే పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాయి.
బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు భీమ్ రాజ్‌భర్ (ముక్తార్ అన్సారీని పక్కన పెట్టి రాజ్‌భర్‌ను అభ్యర్థిగా నిలబెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది), బీజేపీ నేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రెండవ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ, రాయ్‌బరేలీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే అదితి సింగ్, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నాయకుడు ఓం ప్రకాష్ రాజ్‌భార్, శివపాల్ సింగ్ యాదవ్‌లు ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ప్రధాన నియోజక వర్గాలు ఏవి? ఎన్నికలకు సంబంధించి ప్రధాన సమస్యలేవి?
ఎన్నికలకు సంబంధించి, ఉత్తర్‌ప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల ప్రాధాన్యాలు, దృక్కోణాలు వేరువేరుగా ఉన్నాయి. సమస్యలూ వేరే.
పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో రైతుల సమస్య ప్రధానమైనది. చెరకు పంట బకాయిల చెల్లింపు, ఎంఎస్‌పీ లాంటి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి.
బుందేల్‌ఖండ్‌లో నిరంతరం నీటి సమస్య ఉంటుంది. ఇది కరువు ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి ఎజెండాలో ఉండదని, నిర్లక్ష్యానికి గురవుతుందని అంటుంటారు.
అవధ్‌లోని సెంట్రల్ లక్నో ప్రాంతంలో కోవిడ్ నిర్వహణ లోపాలు ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించవచ్చు. అలాగే, ఇంతవరకు నెరవేర్చని వాగ్దానాల ప్రస్తావన కూడా తీసుకురావొచ్చు.
మొత్తం రాష్ట్రంలో నిరుద్యోగం సమస్య కూడా చర్చల్లోకి వచ్చే అవకాశం ఉంది.
పూర్వాంచల్ ప్రాంతంలోని గోరఖ్‌పూర్‌లో ప్రతి సంవత్సరం బ్రెయిన్ ఫీవర్ విజృంభిస్తుంటుంది. అక్కడ అది ప్రధాన సమస్య.
అలాగే రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, రహదారులపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ప్రధానమంత్రి పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి, పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి సమస్యలు ముందుకు రావొచ్చు. ఇటీవల వర్షాలకు వారణాసి కూడా నీట మునిగింది.
వారణాసిని జపాన్ నగరమైన టోక్యోలాగ తయారుచేస్తామని ప్రధాని వాగ్దానం చేశారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. దీనిపై ప్రజలు పదే పదే ప్రశ్నిస్తున్నారు.
కాశీ విశ్వనాథ దేవాలయ నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు.
అయితే, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రారంభమైంది. దీన్ని తమ విజయాల ఖాతాలో బీజేపీ లెక్కేసుకోవచ్చు.
కోవిడ్ కారణంగా వారణాసిలో నేత కార్మికులు ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తాయి.
కరోనా నిర్వహణ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై అనేక సవాళ్లు, సందేహాలు వినిపిస్తున్నాయి.
ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ రాజకీయ నాయకుల ప్రకటనల్లో హిందూ-ముస్లింల ప్రస్తావన కూడా పెరుగుతోంది.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN
గత ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి?
ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు సాధించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 403 శాసనసభ స్థానాల్లో 39.67 శాతం ఓట్లను సాధించింది.
సమాజ్‌వాదీ పార్టీ 47 సీట్లు, బీఎస్పీ 19 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లు గెలుచుకుంది.
గత ఎన్నికలకు, రాబోయే ఎన్నికలకు వ్యత్యాసాలేంటి?
గత ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి పదవికి తగిన అభ్యర్థిగా చూపించేందుకు బీజేపీ దగ్గర నాయకుల పేర్లు సిద్ధంగా లేవు. ఈసారి యోగి ఆదిత్యానాథ్ పేరు ఉంది. ఆయనకు ఐదేళ్ల పాలనా అనుభవం ఉంది.
సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ ఈసారి కూడా విడివిడిగా పోటీ చేయనున్నాయి.
గత ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కానీ ఈసారి అది కష్టం అనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ప్రియాంకా గాంధీకి పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA
ఈవీఎం, వీవీప్యాట్
ఓటు వేయడానికి, ఓట్లను లెక్కించడానికి సహాయపడే ఎలక్ట్రానిక్ సాధనాలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) అంటారు.
ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈవీఎంలో రెండు యూనిట్లు ఉంటాయి. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్. ఈ రెండింటినీ వైర్ల ద్వారా జతపరుస్తారు.
ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా పోలింగ్ అధికారి దగ్గర కంట్రోల్ యూనిట్ పెడతారు. బ్యాలెట్ యూనిట్‌ను ఓటు వేయడానికి ఉపయోగిస్తారు. ఈ ఏర్పాటు ద్వారా పోలింగ్ అధికారి మీ గుర్తింపును ధృవీకరించగలుగుతారు. తరువాత, బ్యాలెట్ బటన్ నొక్కి ఓటర్లు ఓటు వేయవచ్చు.
ఓటర్ వెరిఫయిబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీప్యాట్) అనేది ఈవీఎమ్‌కు అమర్చే మరో యంత్రం. ఇది ఒక ప్రింటర్ లాంటిది.
ఈవీఎం ద్వారా ఓటు వేసిన తరువాత, వీవీప్యాట్ నుంచి ఒక చిన్న కాగితం వెలువడుతుంది. మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్నారో వారికే ఓటు చేరినట్లు ఆ కాగితం చూసి నిర్థారించుకోవచ్చు.
ఆ కాగితంలో మీరు ఓటు వేసిన అభ్యర్థి పేరు, ఎన్నికల గుర్తు ఉంటుంది. దాన్ని ఓటరు ఏడు సెకన్ల పాటు పరిశీలించవచ్చు. ఆ తరువాత, అది సీలు వేసిన ఒక డబ్బాలో పడిపోతుంది. ఈ కాగితం ముక్కను ఓటరుకు ఇవ్వరు.
ఓట్ల లెక్కింపు విషయంలో వివాదాలు తలెత్తినప్పుడు, ఈ కాగితపు ముక్కలను లెక్కించి నిర్థారించుకోవచ్చు.
ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం చెబుతోంది.
అయితే, ఈ యంత్రాల ప్రామాణికత గురించి ఎప్పటికప్పుడు ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి.
వీటిని హ్యాక్ చేసే అవకాశం ఉందని ఓడిపోయిన పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తుతుంటాయి.
ఓటు వేయడానికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
2020 ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 14.52 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
ఓటరుగా రిజిస్టర్ చేసుకోవాలంటే, ఫారం-6 నింపి, మీ నియోజకవర్గంలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ)కు అందజేయాలి. ఆ తరువాత మీ పేరును ఓటర్ల జాబితాలో చేరుస్తారు.
ఫారం-6ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో జమ చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, ఎన్నికల సంఘం వెబ్‌సైట్ www.eci.nic.in లేదా ఉత్తర్‌ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్: యోగీ ఆదిత్యనాథ్ జనాభా పాలసీకి, ముస్లింలకు ఏమైనా సంబంధం ఉందా?
- కాన్పుర్: రిక్షా నడిపే ముస్లిం కూలీపై దాడి, ‘జై శ్రీరాం’అంటూ నినాదాలు చేయాలని ఒత్తిడి
- అఖిలేశ్ యాదవ్: అసదుద్దీన్ పార్టీ వల్ల నష్టం లేదు, మైనారిటీల ఓట్లు మాకే
- గోరఖ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో దళిత బాలిక మృతిపై అనుమానాలు
- ప్రకాశ్ రాజ్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు నాకు ఏం సంబంధం? నేనక్కడ లోకల్ కాదు
- హిందూమతం స్వీకరించిన 19 మంది ముస్లింలు, అసలేం జరిగింది?
- ఎంతమంది పిల్లల్ని కనాలో నిర్ణయించేది ఎవరు? ప్రభుత్వమా, మహిళలా?
- ప్రశాంత్ కిశోర్: రాజకీయ వ్యూహకర్తా? నాయకుడా
- సచిన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారా? పాండోరా పేపర్స్‌లో ఆయన పేరు ఎందుకు ఉంది
- Brahmin Corporation: ఒక కులం గొప్పదని ప్రభుత్వ వెబ్సైట్లో ప్రకటించవచ్చా, బ్రాహ్మణ కార్పొరేషన్ పై విమర్శలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









