రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే కేంద్రం నుంచి రూ.5 వేలు ప్రోత్సాహకం-ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడే వారిని ప్రోత్సహించేందుకు కేంద్రం సరికొత్త పథకం ప్రకటించిందని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
క్షతగాత్రులను మొదటి గంటలోగా (గోల్డెన్ అవర్) ఆస్పత్రికి తరలించిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహక బహుమతి అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ పథకం 2021 అక్టోబర్ 15 నుంచి అందుబాటులోకి వచ్చి, 2026 మార్చి 31 వరకు కొనసాగుతుందని వెల్లడించింది.
ఈ మేరకు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖల కార్యదర్శులకు కేంద్రం సమాచారం పంపింది. రూ. 5 వేల ప్రోత్సాహకంతో పాటు అభినందన సర్టిఫికెట్‌ను అందించనున్నట్లు పేర్కొంది.
ఇలా సాయం అందించిన వారి నుంచి కొంత మందిని ఎంపిక చేసి ఏడాదికోసారి జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించనున్నట్లు తెలిపింది. వారికి రూ. లక్ష చొప్పున బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ఒకరి కంటే ఎక్కువ మంది బాధితులను, ఒకరి కంటే ఎక్కువ మంది కాపాడితే ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిందని సాక్షి వివరించింది.

జిల్లాల నుంచి తిరుమలకు ఉచిత బస్సులు
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి టీటీడీ ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తోందని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.
రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుకబడిన వర్గాల భక్తులకు ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేయించనున్నారు.
హిందూ ధర్మప్రచారం చేసేందుకు, మత మార్పిడులను అరికట్టేందుకు దేవాదాయ శాఖతో కలిసి తితిదే తొలి విడతగా 13 జిల్లాల్లో రూ.25 కోట్లతో 502 ఆలయాలను నిర్మించిన విషయం తెలిసిందే.
ఈ ఆలయాల పరిధిలోని భక్తులకు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శనం చేయించనున్నారు. ఒక్కో జిల్లాకు 10 బస్సులు ఏర్పాటు చేశారు.
తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు అందుబాటులో ఉంచారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్థానిక దాతల సహకారంతో భోజనాలు అందించేందుకు తితిదే ఏర్పాట్లు చేపట్టిందని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు
హైదరాబాద్‌లో గృహ విక్రయాలు కరోనా సంక్షోభ పూర్వ స్థాయికి పుంజుకున్నాయని ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్‌ఫ్రాంక్ వెల్లడించినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి నగరంలో ఇళ్ల విక్రయాలు 5,987 యూనిట్లకు పెరిగాయని చెప్పింది.
గత ఏడాది మూడో త్రైమాసికంలో నమోదైన 1,609 యూనిట్లతో పోల్చితే, అమ్మకాలు మూడింతలకు పైగా పెరిగాయి.
2019 మూడో త్రైమాసికంతో పోల్చితే గడిచిన మూడు నెలల విక్రయాలు 147 శాతానికి సమానం. అంటే, హైదరాబాద్‌లో అమ్మకాలు ప్రీ-కోవిడ్ స్థాయిని దాటేశాయన్నమాట.
అంతేకాదు, నగరంలో 9,256 యూనిట్లు కలిగిన కొత్త హౌసింగ్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, వార్షిక ప్రాతిపదికన 650 శాతం పెరిగాయని ఆ నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా మార్కెట్లలో ఇళ్ల ధరలు వార్షిక ప్రాతిపదికన స్వల్పంగా పెరిగాయి. మిగతా మార్కెట్లలో మాత్రం దాదాపు స్థిరంగానే నమోదయ్యాయని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, FB/KCR
పద్మాలు ఇవ్వరు, అనుమతులు పట్టించుకోరు: కేసీఆర్
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేసినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.
రాష్ట్రానికి పద్మ పురస్కారాలు ఇవ్వడంలోనూ కేంద్రం ఉపేక్ష వహిస్తోందని, ఎయిర్ స్ట్రిప్‌లకు అనుమతులు కోరితే పట్టించుకోవడం లేదని కేసీఆర్ ఆక్షేపించారు.
సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రాభివృద్ధిపై సభ్యులు అడిగిన ఓ ప్రశ్నపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని మాట్లాడారు.
తెలంగాణపై చూపుతున్న నిర్లక్ష్యం పట్ల ఇటీవల ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలోనూ గొడవ పెట్టుకొన్నానని ఆయన పేర్కొన్నారని పత్రిక చెప్పింది.
పద్మ అవార్డుల కోసం పేర్లు పంపించమంటారా? వద్దంటారా అని అడిగానని, ప్రతిపాదనలు పంపించి విసిగిపోయిన నేపథ్యంలోనే తాను ప్రధానిని అడిగానన్నారు.
'మా దగ్గర కళాకారులు లేరా? కళలు లేవా? వివిధ రంగాల్లో సేవలు చేసిన విశిష్ట వ్యక్తులు లేరా? పద్మ అవార్డుకు మా దగ్గర అర్హులైన వారు లేరా? తెలంగాణకు ఎందుకు అవార్డు ఇవ్వడం లేదని ప్రధానిని నిలదీసినట్టు ఆయన చెప్పారు.
'మీరు చిన్నబుచ్చుకోవద్దు.. తప్పకుండా సానుకూలంగా పరిశీలిస్తాం' అని ప్రధాని మోదీ చెప్పారని వెల్లడించారు.
'వాళ్లకు మన మీద దృష్టి వస్త లేదు. ఎయిర్‌స్ట్రిప్‌లు ఇవ్వాలని అడిగినా కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాం. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఈ మధ్యనే ఆ శాఖ మంత్రిని ఇంటిని భోజనానికి పిలిచి అడిగాం.
వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఉన్నది. మామునూరులో ఎయిర్‌స్ట్రిప్ ఇవ్వాలని అడిగాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు నేరుగా మామునూరులో దిగి టెక్స్‌టైల్ పార్కుకు వెళతారు.
వరంగల్ సమీప ప్రాంతాలకు విమానాల రాకపోకలు మొదలైతే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని విడమరిచి చెప్పాం. అయినా కూడా ఇవ్వడంలేదు. వాటి ఖర్చు మేము పెట్టుకుంటామన్నా కూడా ఇవ్వడంలేదు' అని సీఎం కేసీఆర్ వివరించారని నమస్తే తెలంగాణ రాసింది.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: 24 కోట్ల వ్యాక్సీన్లు వృథా అయిపోతున్నాయా
- Standing instructions: ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్పులతో మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- కోట్ల సంపదను వదులుకుని సామాన్యుడిని పెళ్లి చేసుకుంటున్న జపాన్ రాకుమారి, అక్టోబరు 26న వివాహం
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
- భారత్ ప్రతిచర్య: బ్రిటిష్ ప్రయాణికులకు 10 రోజుల క్వారంటీన్
- మహాత్మా గాంధీకి పొందూరు ఖాదీ వస్త్రాలకు ఉన్న అనుబంధం ఎలాంటిది?
- గర్భస్రావం చేయించుకునే హక్కు విషయంలో అమెరికా కంటే భారత్ మెరుగ్గా ఉందా?
- ఈ ముస్లిం యువతి బాలకృష్ణుడి పెయింటింగ్స్ వేసి హిందూ ఆలయాలకు కానుకగా ఇస్తున్నారు
- శ్రీలంక: రాగి శాసనాలలో కనిపించిన తెలుగు భాష-అక్కడ ఒకప్పుడు మాతృభాషగా విలసిల్లిందా?
- ఎయిర్ ఫోర్స్ మహిళా అధికారికి 'టూ ఫింగర్ టెస్ట్’
- హిమాలయాలలో పర్వతారోహణకు వెళ్లిన అయిదుగురు నేవీ సిబ్బంది గల్లంతు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












