మ్యాట్రిమొనీ వెబ్‌సైట్లలో ఒంటరి మహిళలకు వల - ప్రెస్ రివ్యూ

marriage

ఫొటో సోర్స్, Getty Images

మ్యాట్రిమొనీల్లో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు 'ఈనాడు' పేర్కొంది.

''వరంగల్ జిల్లా ములుగు మండలం ఇంచర్ల గ్రామానికి చెందిన కోరండ్ల కిరణ్‌కుమార్‌రెడ్డి (29) బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. మూడేళ్ల కిందట అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. 2019లో వీరిద్దరూ విడిపోయారని సీఐ కె. నర్సింహారెడ్డి తెలిపారు.

అనంతరం రెండో వివాహం కోసం కిరణ్ వేర్వేరు మ్యాట్రిమొనీల్లో నమోదు చేసుకున్నాడు. సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఒంటరి మహిళల వివరాలు సేకరించి పెళ్లి పేరుతో వారికి వల విసురుతాడు. చనువు పెంచుకొని రూ. లక్షల్లో దండుకొని పరారవుతాడు.

వరంగల్, కరీంనగర్‌తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అనేక మందిని మోసగించినట్లు విచారణలో వెల్లడైంది. ఇతనిపై జనగామ, కరీంనగర్, అల్వాల్, నార్సింగ్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి.

నిజాంపేటకు చెందిన ఓ మహిళ ఇతని వలలో పడి ఆర్థికంగా మోసపోయి గత నెల 19న ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని గురువారం తిరుపతిలో అదుపులోకి తీసుకున్నట్లు'' ఈనాడు కథనం పేర్కొంది.

AP CM JAGAN MOHAN REDDY

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM

బద్వేలు ఉప ఎన్నికకు ఏర్పాట్లు కట్టుదిట్టం

పటిష్టమైన నిఘాతో వైఎస్సార్‌ జిల్లా బద్వేలు ఉప ఎన్నికను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ తెలిపినట్లు 'సాక్షి' వెల్లడించింది.

''ప్రచారంలో రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజయానంద్ విజ్ఞప్తి చేశారు.

బద్వేలు ఉప ఎన్నిక నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను శుక్రవారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు.

ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.

కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో ఎటు వంటి ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించకూడదు. నామినేషన్లకు అభ్యర్థితోపాటు మరొకరికి మాత్రమే అనుమతి ఉంటుంది.

ఎన్నికల ప్రచార సమయంలో ఇండోర్‌ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమావేశాలకు స్టార్‌ క్యాంపైనర్లకు 1,000 మంది, ఇతరులకు 500 మంది, వీధుల్లో సమావేశాలకు 50 మంది, ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి ఉంటుందని విజయానంద్ చెప్పినట్లు'' సాక్షి పేర్కొంది.

గంజాయి

ఫొటో సోర్స్, Getty Images

పెట్రోల్ ట్యాంకర్‌లో గంజాయి స్మగ్లింగ్

రిలయన్స్‌ పెట్రోల్‌ ట్యాంకర్‌ లారీలో గంజాయి స్మగ్లింగ్ జరిగినట్లు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రాహల్‌దేవ్‌శర్మ మీడియాకు వెల్లడించినట్లు 'ఆంధ్రజ్యోతి' కథనంలో రాసింది.

''ఛత్తీస్‌గఢ్‌లోని కుంట నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం వయా రాజమండ్రి మీదుగా రిలయన్స్ పెట్రోల్ ట్యాంకర్ హైదరాబాద్‌ వెళ్తోంది.

ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లోని పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి చెక్‌ పోస్టు వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు.

అనుమానంతో లోపల పరిశీలించగా.. పెట్రోల్‌ ఉండాల్సిన ట్యాంకర్‌లో గంజాయి ఉంది. ఐదేసి కేజీల ప్యాకెట్లు చొప్పున మొత్తం 1,530 కిలోలు రెండు అరల్లో సర్దుకుని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు.

వెంటనే ఆ గంజాయిని, ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని లారీలో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్‌శంకర్‌యాదవ్‌, జ్ఞానేంద్ర త్రిపాఠిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన గంజాయి విలువ రూ.76 లక్షలు, ఆయిల్‌ ట్యాంకర్‌ విలువ రూ.25 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ వాహనం హైదరాబాద్‌ వెళ్తున్నట్టు అనుమానించి.. అక్కడ ఈ సరుకును ఎవరికి చేరుస్తారనే విషయమై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారని'' ఆంధ్రజ్యోతి తెలిపింది.

Gandhi hospital

ఫొటో సోర్స్, TSMSIDC

హైరిస్క్ రోగులకు తెలంగాణ సర్కారు సాంత్వన

హైరిస్క్‌ రోగులతోపాటు హైరిస్క్‌ పరిధిలోని మైగ్రేట్స్, ట్రక్కర్స్‌, డ్రగ్స్‌ వినియోగదారులు సహా ఆరు కేటగిరీలకు చెందిన వారికి తెలంగాణ సర్కారు హెపటైలిస్‌-బి, హెపటైటిస్‌-సి పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు 'నమస్తే తెలంగాణ' పేర్కొంది.

''బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ కలిగిన వారికి సాధారణంగా హెపటైటిస్‌-బి లేదా హెపటైటిస్‌-సి వచ్చే అవకాశాలు ఎక్కువ.

ప్రధానంగా హెచ్‌ఐవీ బాధితుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాధులు సోకే అవకాశాలు అధికం.

వీరితోపాటు తలసీమియా వ్యాధిగ్రస్తులు కూడా తరచూ రక్తమార్పిడి చేయించుకుంటుండడం వల్ల వీరిలో కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశముంటుంది.

సెక్సువల్‌ ఎఫైర్స్‌ అధికంగా కలిగి ఉండే అవకాశాలున్న మైగ్రేట్స్‌, డ్రగ్స్‌ వినియోగదారులు, ట్రక్కర్స్‌కు సైతం హెపటైటిస్‌-బి, సి వచ్చే ప్రమాదం లేకపోలేదు.

వీరందరినీ హెపటైటిస్‌-బి, సిల నుంచి రక్షించడమే కాకుండా వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, వ్యాధి నిర్ధారణ జరిగిన వారికి మెరుగైన చికిత్స అందించే ఉద్దేశంతో ప్రభుత్వం హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి పరీక్షల నిర్వహణకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తుందని'' నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)