డిజిటల్ హెల్త్ కార్డ్: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్డుతో ప్రయోజనాలు ఏమిటి? నష్టాలు ఉన్నాయా
- రచయిత, కమలేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. దీనిలో భాగంగా భారత పౌరులకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ ఐడీని ఇస్తారు.
ఈ డిజిటల్ హెల్త్ కార్డు సాయంతో ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో ఒకచోట స్టోర్ చేసుకోవచ్చు.
ఈ ఐడీ సాయంతో సదరు వ్యక్తిని పీడిస్తున్న వ్యాధులు, చికిత్సలతోపాటు వైద్య పరీక్షల సమాచారాన్ని కూడా డిజిటల్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు.
ఆరోగ్య రంగంలో ఈ మిషన్‌ను విప్లవాత్మక మార్పుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.
‘‘ఏడేళ్లుగా దేశంలోని ఆరోగ్య సదుపాయాలు మెరుగుపడుతూ వస్తున్నాయి. తాజా మిషన్ ఆ దిశగా పడిన ఒక విప్లవాత్మక మార్పులాంటిది’’అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
‘‘ఆయుష్మాన్ డిజిటల్ భారత్ మిషన్‌తో ప్రజల ఆరోగ్య పరిరక్షణ తేలిక అవుతుంది. ఆసుపత్రుల్లో పనులు కూడా వేగంగా జరుగుతాయి. ప్రస్తుతం టెక్నాలజీ అనేది కొన్ని ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైంది. తాజా మిషన్‌తో దేశ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకూ టెక్నాలజీ చేరువ అవుతుంది. ఆసుపత్రులు ఒకదానితో మరొకటి అనుసంధానం అవుతాయి. ప్రజలందరికీ ప్రత్యేకమైన డిజిటల్ ఐడీ ఇస్తాం. దీని సాయంతో ఆరోగ్య వివరాలను జాగ్రత్తగా భద్రపరచుకోవచ్చు’’అని ప్రధాన మంత్రి మోదీ వివరించారు.

ఫొటో సోర్స్, PIB
ఏమిటీ కార్డు?
ఈ డిజిటల్ హెల్త్ కార్డు కూడా ఆధార్ లాంటిదే. ఈ కార్డు జారీ ప్రక్రియల్లో భాగంగా అందరికీ 14 డిజిట్ల హెల్త్ ఐడీ ఇస్తారు. ఇది ఆసుపత్రుల్లో ఒక గుర్తింపు కార్డులా పనిచేస్తుంది.
దీని సాయంతో రోగి అనారోగ్యాలు, చికిత్సలు సహా ఇతర ఆరోగ్య సమాచారాన్ని వైద్యులు సులువుగా తెలుసుకోవచ్చు.
ఇది ఆరోగ్య ఖాతా లాంటిది. దీనిలో ఆరోగ్య సమాచారం మొత్తం స్టోర్ చేసుకోవచ్చు. ఇదివరకు ఏ వ్యాధికి చికిత్స తీసుకున్నారు? ఏ ఆసుపత్రిలో ఈ చికిత్స జరిగింది? ఏ పరీక్షలు చేశారు? ఏ మందులు ఇచ్చారు? ఏదైనా ఆరోగ్య పథకం కింద వ్యక్తి లబ్ధి పొందుతున్నారా? తదితర అన్ని వివరాలూ ఈ హెల్త్ ఐడీలో ఉంటాయి.

ఫొటో సోర్స్, Ndhm
ఈ కార్డును పొందడం ఎలా?
- ఆధార్ లేదా ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబరుతో ఈ కార్డును పొందొచ్చు.
- ఈ కార్డు కోసం మొదట ndhm.gov.in. వెబ్‌సైట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ‘‘హెల్త్ ఐడీ’’అనే ఆప్షన్ ఉంటుంది.
- హెల్త్ ఐడీపై క్లిక్‌చేస్తే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. అక్కడే ‘‘క్రియేట్ హెల్త్ ఐడీ’’అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది.
- క్రియేట్ హెల్త్ ఐడీపై క్లిక్ చేస్తే, ఆధార్ లేదా ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబరుతో ఐడీ క్రియేట్ చేసుకునే సదుపాయం వస్తుంది. ఆధార్ లేదా మొబైల్ నంబరును ఎంటర్‌చేసిన వెంటనే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మన గుర్తింపును ధ్రువీకరించుకోవచ్చు.
- గుర్తింపును ధ్రువీకరించుకున్న తర్వాత ప్రొఫైల్ ఫోటో, పుట్టిన తేదీ, చిరునామా లాంటి వివరాలను ఎంటర్ చేయాలి.
- సమాచారాన్ని నింపిన తర్వాత సబ్‌మిట్ బటన్ నొక్కితే, హెల్త్ కార్డు వస్తుంది. దీనిపై ఫోటోతోపాటు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది.
- సొంతంగా హెల్త్ కార్డులను జెనరేట్ చేసుకోవడం రాకపోతే.. ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్లు లాంటి నేషనల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కేంద్రాలకు వెళ్లి హెల్త్ కార్డును పొందొచ్చు.
డేటా ఎలా స్టోర్ చేస్తారు?
డిజిటల్ హెల్త్ మిషన్‌లో భాగంగా హాస్పిటల్స్, క్లినిక్స్, వైద్యులను ఒక సెంట్రల్ సర్వర్‌తో అనుసంధానిస్తారు. దీని కోసం హాస్పిటళ్లు, వైద్యులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్వర్‌లోనే రోగుల ఆరోగ్య సమాచారాన్ని కూడా పొందుపరుస్తారు.
‘‘ఎన్‌డీహెమ్ హెల్త్ రికార్డ్స్’’ యాప్ సాయంతో ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకునే వీలుంది. డిజిటల్ హెల్త్ ఐడీ లేదా లాగిన్ ఐడీ-పాస్‌వర్డ్ సాయంతో ఈ యాప్‌లో లాగిన్ అవ్వొచ్చు.
ఈ యాప్‌లో మనం చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రిని శోధించి, గుర్తించాల్సి ఉంటుంది. ఈ యాప్ సాయంతో మన ఆరోగ్య సమాచారం ఆసుపత్రిలోని వైద్యులు చూసేందుకు వీలుంటుంది.
సొంతంగా మనం కూడా మందుల చీటీ, పరీక్షల రిపోర్టులు, ఇతర సమాచారాన్ని యాప్‌లో యాడ్ చేయొచ్చు. ఈ యాప్‌కు లాకర్ సదుపాయం ఉంది.
మీరు అనుమతి ఇస్తేనే, ఆరోగ్య సిబ్బంది లేదా వైద్యులు మీ ఆరోగ్య సమాచారాన్ని చూడగలుగుతారు. ఇక్కడ మీ అనుమతి తప్పనిసరి.
ఈ సర్వర్‌లోని సమాచారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసుకునే వీలుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రయోజనాలు ఏమిటి?
- ఈ యాప్‌లో డేటాను స్టోర్ చేసుకుంటే, వైద్యుల దగ్గరకు వెళ్లిన ప్రతిసారీ మందుల చీటీలు, వైద్య రిపోర్టులు మన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వాటిని ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఫర్వాలేదు.
- మన దగ్గర పాత రిపోర్టులు లేకపోతే, ఆ పరీక్ష చేసుకుని రావాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ యాప్‌తో ఆ ఇబ్బంది ఉండదు.
- ఇదివరకు దేశంలో ఎక్కడ చికిత్స తీసుకున్నా, హెల్త్ ఐడీ సాయంతో ఆ వివరాలను తేలిగ్గానే వైద్యులు చూడగలుగుతారు.
- ఈ ఐడీని ఉచితంగానే ఇస్తారు. దీన్ని తీసుకోవడం తప్పనిసరికాదు. అయితే, అందరికీ ఈ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
- ఆరోగ్య సమాచారాన్ని చూడటంలో సదరు వ్యక్తి అనుమతి తప్పనిసరనే నిబంధనను ఈ మిషన్‌లో చేర్చారు.

ఫొటో సోర్స్, GETTY CREATIVE /ISTOCK /IPOPBA
డేటా సెక్యూరిటీ ఉంటుందా?
ఈ హెల్త్ కార్డ్‌లో డేటా మొత్తం డిజిటల్ రూపంలో సేకరిస్తారు. దీన్ని సెంట్రల్ సర్వర్‌లో స్టోర్ చేస్తారు. ఇక్కడ ప్రజల సమాచారానికి పటిష్ఠమైన భద్రత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
అయితే, భద్రత విషయంలో సైబర్ నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సరైన చర్యలు లేకపోతే, కొత్త సమస్యలు తలెత్తే ముప్పుందని వారు చెబుతున్నారు.
మన దగ్గర డాక్యుమెంట్లు ఉంటే మనం జాగ్రత్తగా చూసుకోగలం. అదే డాక్యుమెంట్లు కేంద్రం సర్వర్‌లో సేవ్ చేస్తే, భద్రత విషయంలో మనం పూర్తిగా కేంద్రంపైనే ఆధారపడాల్సి ఉంటుంది’’అని సైబర్ నిపుణుడు పవన్ దుగ్గల్ అన్నారు.
‘‘ఈ మిషన్‌తో చాలా విషయాలు తేలిక అవుతాయి. ఇది నిజమే అయితే, భద్రతా ముప్పులు.. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ విషయంలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.’’
‘‘ఆధార్‌లానే ఈ డేటా కూడా సురక్షితంగా ఉంటుందని కేంద్రం చెబుతోంది. అయితే, ఆధార్ డేటాలోకి హ్యాకర్లు చొరబడగలరని చాలా వార్తలే వచ్చాయి. దీంతో డిజిటల్ హెల్త్ డేటాకు కూడా అలాంటి ముప్పులు సంభవించే అవకాశముంది.’’
‘‘డేటా బ్రీచ్ అతిపెద్ద సవాల్. ముఖ్యంగా ఈ డేటా సైబర్ క్రిమినెల్స్ చేతిల్లోకి వెళ్తే చాలా ప్రమాదం. వారు దీన్ని తమకు కావాల్సిన విధంగా ఉపయోగించుకుంటారు. ఒక్కోసారి రోగికి అందాల్సిన చికిత్స కాకుండా వేరే చికిత్స అందించే ముప్పు కూడా డేటా బ్రీచ్‌లతో ఉంటుంది.’’

ఫొటో సోర్స్, Thinkstock
డేటా ప్రొటెక్షన్ లా లేదు..
‘‘డేటా ప్రొటెక్షన్ విషయంలో ప్రభుత్వం చాలా ప్రకటనలు చేస్తోంది. అయితే, సైబర్ సెక్యూరిటీకి ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టంగా వెల్లడించడం లేదు’’అని పవన్ అన్నారు.
‘‘భారత్‌లో ఇప్పటివరకు డేటా ప్రొటెక్షన్ లా లేదు. 2019లో డేటా ప్రొటెక్షన్ బిల్లును తీకొచ్చారు. అయితే, అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గర ఉంది. అసలు చట్టమే లేనప్పుడు, ప్రజల డేటాను ఎలా పరిరక్షిస్తారు? ఒకవేళ చట్టం ఉంటే, దాని కంద శిక్షలు ఉంటాయి. ఫలితంగా చాలా మంది భయపడతారు. చట్టమే లేకపోతే ఎవరికి నచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు.’’
అయితే, తమ అనుమతి ఉంటేనే వైద్యులు తమ డేటాను చూడగలరని నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ తమ వెబ్‌సైట్లో రాసుకొచ్చింది. ఎంతకాలం ఆ డేటాను చూడొచ్చు? అనే విషయంలోనూ మనం ఆంక్షలు విధించొచ్చని పేర్కొంది.
అయినప్పటికీ, డేటా ప్రొటెక్షన్ విషయంలో ప్రశ్నలు, ఆందోళనలు వస్తూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- పెట్రోల్ కోసం కిలోమీటర్ల దూరం వరకు క్యూ లైన్లు
- ఏపీ అసెంబ్లీలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలకు నోరెత్తే అవకాశం లేనట్లేనా?
- పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా
- తాలిబాన్ల ప్రభుత్వాన్ని పాకిస్తాన్, చైనా, రష్యా ఎందుకు గుర్తించట్లేదు? 7 కీలక ప్రశ్నలు, సమాధానాలు..
- భారతదేశపు రాజులు నిజంగానే ‘ఆడంగి లక్షణాలు’ ఉన్న, మగతనం లేని అసమర్ధులా?
- అఫ్గానిస్తాన్ యుద్ధంతో వేల కోట్లు లాభం పొందిన 5 కంపెనీలు ఇవే..
- ‘కష్టపడి పనిచేస్తే పైకి ఎదుగుతావు’.. ఇది నిజమా, అబద్ధమా?
- అఫ్గానిస్తాన్: ఆకలి తీర్చుకోవడానికి అన్నీ అమ్మేస్తున్నారు
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- కోవిషీల్డ్ టీకాను గుర్తించిన బ్రిటన్, భారతీయులు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









