గుంటూరు జిల్లాలో గ్యాంగ్‌రేప్: పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా భర్తపై దాడి చేసి భార్యపై సామూహిక అత్యాచారం

బాధితురాలు - సింబాలిక్ ఇమేజ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

గుంటూరు జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులు ఓవైపు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్నాయి.

అదే సమయంలో అమరావతి ప్రాంతాన్ని ఆనుకుని గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సత్తెనపల్లిలో బంధువుల పెళ్లికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్న దంపతులను మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు సమీపంలో కొందరు దుండగులు అడ్డుకున్నారు.

వారి వద్ద ఉన్న నగదు, నగలు దోచుకున్న తర్వాత భర్తపై దాడికి దిగారు. అనంతరం తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

8వ తేదీ రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు మేడికొండూరు పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విచారణలో భాగంగా పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. స్థానికులను విచారించారు. దారిదోపిడి, అత్యాచార సంఘటన జరిగిన స్థలంలో డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు.

బాధితురాలిని వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె కొలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.

కేసు విచారణ వేగవంతంగా సాగుతోందని, నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని బీబీసీకి తెలిపారు. కేసులో కీలక సమాచారం లభించిందని అన్నారు.

అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారంతా బీహార్‌కి చెందిన యువకులుగా స్థానికులు అనుమానిస్తున్నారు.

ఘటనా స్థలానికి సమీపంలో ఒక శీతల గిడ్డంగి నిర్మాణంలో బీహార్‌కి చెందిన కూలీలు పనిచేస్తున్నారు. వారిలో కొందరిని ఇప్పటికే పోలీసులు విచారించారు.

మొత్తం 50 నుంచి 60 మంది రోజువారీ కూలీలుగా అక్కడ ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. దాంతో అసలు నిందితులు ఎవరన్నది కనుక్కునే పనిలో పోలీసులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)