కోవిడ్ వ్యాక్సీన్: ఆగస్టులో జీ7 దేశాలను మించి టీకాలు వేసిన భారత్

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ మూడో వేవ్‌ను అరికట్టడానికి భారత్ ఒక్క ఆగస్టు నెలలోనే 18 కోట్లకుపైగా డోసుల టీకాలను వేసింది.
జీ7 సభ్య దేశాలైన కెనడా, యూకే, యూఎస్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలన్నింటిని కలుపుకుని వేసిన టీకాల కంటే భారతదేశంలో వేసిన టీకాల సంఖ్య ఎక్కువని అధికారులు తెలిపారు.
దేశంలో 2021 చివరి నాటికి అర్హులందరికీ కరోనా టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రభుత్వం ఆమోదించిన పలురకాల టీకాలకు చెందిన 68.60 కోట్ల డోసులను ఇప్పటి వరకు వేశారు.
దేశంలో అర్హులైన జనాభాలో సగానికి పైగా దాదాపు 47.30 కోట్ల మంది కనీసం ఒక డోసు కోవిడ్ టీకా వేసుకున్నారని అధికారిక డేటా చెబుతోంది.
అయితే, జనవరిలో డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 17 శాతం మంది వయోజనులు మాత్రమే పూర్తి స్థాయిలో టీకాలు వేసుకున్నారు. టీకాల విషయంలో చిన్న, ధనిక రాష్ట్రాల కంటే పెద్ద, పేద రాష్ట్రాల్లో ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకు దేశంలో 3.30 కోట్లకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేసుల విషయంలో అమెరికా తరువాత రెండోస్థానంలో భారత్ ఉంది.
ఇక 4,40,000 కంటే ఎక్కువ కోవిడ్ మరణాలతో అమెరికా, బ్రెజిల్ తరువాత మూడో స్థానంలో ఉంది భారత్.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియాలో టీకా పంపిణీ ఎలా జరుగుతోంది?
జనవరి 16 నుంచి, భారతదేశంలో దాదాపు 68.70 కోట్ల టీకాలను వేశారు.
దాదాపు 52.60 కోట్ల మంది మొదటి డోస్ టీకాను, మరో 16 కోట్ల మంది రెండు డోసుల టీకాను వేసుకున్నారు.
అధికారిక డేటా ప్రకారం, జూలైలో 43లక్షల రోజువారీ టీకాలతో పోలిస్తే, ఆగస్టులో భారతదేశంలో సగటున ప్రతిరోజూ 60 లక్షల టీకాలను వేశారు.
ఈ సంవత్సరం చివరి నాటికి అర్హులైన వయోజనులందరికీ పూర్తిగా టీకాలు వేయడానికి భారతదేశంలో రోజుకు కోటికిపైగా టీకా డోసులను వేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే నెలల్లో టీకా లభ్యతపైనే ఇది ఆధారపడి ఉంది.
భారతదేశంలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత నెలలో 40,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా కేరళలోనే నమోదవుతున్నాయి.
కొత్త వేరియంట్‌లతో మూడో వేవ్ ముప్పు భారీగా ఉన్నప్పటికీ, దేశంలో అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అని వైద్యులు చెబుతున్నారు.
టీకా డ్రైవ్ వేగం పుంజుకున్నప్పటికీ, లింగ అంతరం గురించి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం పురుషులతో పోల్చితే 6శాతం తక్కువగా మహిళలు టీకాలు వేసుకున్నారు. గ్రామీణ భారతదేశంలో ఇది ఎక్కువగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజూ అధిక మోతాదులో టీకాలు వేస్తున్నా, పట్టణ ప్రాంతాల్లో జనాభాకు వేస్తున్న టీకాల వాటానే ఇంకా ఎక్కువగా ఉంది.
చాలా దేశాలు, ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలు, వ్యాక్సిన్‌ల లభ్యత సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీదారుగా ఉన్న భారత్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటుందని ఊహించలేదు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం టీకా తయారీదారుల నుంచి ముందస్తుగా ఆర్డర్లు ఇవ్వలేదు. ఏప్రిల్‌లో రెండో వేవ్ విజృంభనతో మొత్తం వయోజన జనభాకు టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.
ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 135 కోట్ల డోసుల టీకాలను అందుబాటులోకి తీసుకొస్తామని జూన్‌లో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది.
భారతదేశంలో అర్హులైన వయోజనులందరికీ పూర్తిస్థాయిలో టీకాలు వేయడానికి దాదాపు 180 కోట్ల టీకా డోసులు అవసరం పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశం ఏ టీకాలను ఉపయోగిస్తోంది?
భారతదేశం మూడు టీకాలను ఉపయోగిస్తోంది.
- ఆక్స్‌ఫర్డ్ -ఆస్ట్రజెనెకా టీకా, దీనినే స్థానికంగా కోవిషీల్డ్ అని పిలుస్తారు.
- భారతీయ సంస్థ, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్.
- రష్యాకు చెందిన స్పుత్నిక్ వి.
18 ఏళ్లలోపు వారికి కూడా టీకాను ఇచ్చేందుకు భారత్ ఆమోదం తెలపడంతో, టీకా కార్యక్రమానికి మరింత వేగం పెంచినట్టయింది.
మూడు డోసుల జైకోవ్ డి వ్యాక్సిన్ టీకాలు తీసుకున్న వారిలో 66 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్టు టీకా తయారీదారు కాడిలా హెల్త్‌కేర్ పేర్కొంది.
కోవిడ్ -19 పైపోరులో ప్రపంచంలోనే జైకోవ్ డి టీకా మొట్టమొదటి డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్.
కోవిడ్ -19కి వ్యతిరేకంగా దాదాపు 95% సామర్థ్యాన్ని కలిగిఉన్న మోడెర్నా వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవడానికి భారత ఫార్మా కంపెనీ సిప్లాకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే భారతదేశంలో ఎన్ని డోసులు అందుబాటులోకి వస్తాయో ఇంకా స్పష్టత రాలేదు.
మరికొన్ని టీకాలు ఆమోదం పొందడానికి సిద్ధంగా ఉన్నాయి.
టీకా స్వచ్ఛంద కార్యక్రమం. ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో 57,000 కంటే ఎక్కువ కేంద్రాలు టీకాలను అందిస్తున్నాయి. అయితే ప్రజలు ప్రైవేట్ గా కూడా టీకాలను డబ్బు చెల్లించి వేసుకోవచ్చు.
రాష్ట్రంలోని క్లినిక్‌లు, ప్రజారోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో ఉచిత టీకాలను అందించడానికి ప్రభుత్వం సుమారు 37 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

ఫొటో సోర్స్, EPA
టీకా వేసుకుంటే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా?
టీకాతో సైడ్ ఎఫెక్ట్ లకు గురి అయ్యే అవకాశం ఉంది.
భారతదేశంలో ఇమ్యునైజేషన్ తరువాత "ప్రతికూల సంఘటనల" పర్యవేక్షణకు ప్రత్యేకించి 34 ఏళ్ల నాటి ఓ నిఘా కార్యక్రమం ఉంది. ఇటువంటి సంఘటనలను పారదర్శకంగా నివేదించలేకపోతే, టీకాలపై భయాలు పెంచగలవని నిపుణులు అంటున్నారు.
మే 17 నాటికి టీకాలు వేసిన తర్వాత భారతదేశంలో 23,000 కంటే ఎక్కువ "ప్రతికూల సంఘటనలు" నమోదయ్యాయి. వాటిలో ఎక్కువగా మైనర్ సమస్యలైన ఆందోళన చెందడం, కళ్లు తిరగటం, అలసట, జ్వరం, నొప్పివంటివి ఉన్నాయి.
"తీవ్రమైన ప్రతికూల సంఘటనల"కింద 700 కేసులు కూడా నమోదయ్యాయి. జూన్ మధ్య వరకు 488 మరణాలు కూడా సంభవించాయి.
అయితే దీని అర్థం వారు టీకాల వల్ల మాత్రమే చనిపోలేదని, "కోవిడ్ -19 వ్యాధి కారణంగా మరణించే ప్రమాదంతో పోలిస్తే టీకా తరువాత మరణించే ప్రమాదం చాలా తక్కువ" అని ప్రభుత్వం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- కాకినాడ, చెన్నై మధ్య రోజూ వందల పడవలు తిరిగిన జలమార్గానికి ఇప్పుడేమైంది
- ‘పంజ్‌షీర్ పూర్తిగా గెలిచాం, అఫ్గానిస్తాన్‌లో యుద్ధం ముగిసినట్టే’: తాలిబాన్
- ‘రోజుకు 15 మందితో సెక్స్ చేయమని బలవంతం చేశారు’
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- టోక్యో పారాలింపిక్స్: 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలతో అదరగొట్టిన భారత్
- INDvsENG: 'రహానేను ఎందుకు తప్పించరు? హనుమ విహారికి ఛాన్స్ ఎందుకు ఇవ్వరు'
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








