అమర రాజా: ఈ సంస్థను తరలించాలని ఏపీ ప్రభుత్వం అంత కఠినంగా ఎందుకుంది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా వెనుకపడింది. కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉన్న పరిశ్రమలే సజావుగా సాగకపోవడంతో రాష్ట్రంలో ఆశించిన అభివృద్ధి జరగడం లేదు.
నిరుద్యోగ సమస్య పెరిగేందుకు ఇది కూడా ఓ కారణం అవుతోంది.
ఇలాంటి సమయంలో రాష్ట్రానికే చెందిన పారిశ్రామిక కుటుంబం నడుపుతున్న అమర రాజా సంస్థ చుట్టూ వివాదం ముసురుకుంటోంది.
కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రభుత్వమే ఆ సంస్థకు చెందిన పరిశ్రమను తరలించాలని ఆదేశించింది.
పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో అష్టకష్టాలు పడుతున్న సమయంలో 1.35 బిలియన్ డాలర్ల రెవెన్యూ దాటిన పెద్ద కంపెనీ విషయంలో ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు ఉందనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, amararaja.com
పీసీబీనోటీసులపైహైకోర్టులోవిచారణ
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమలను గ్రీన్, ఆరెంజ్, రెడ్ అనే మూడు కేటగిరీలు గా విభజిస్తారు.
కాలుష్యం సమస్య లేని వాటిని గ్రీన్ కేటగిరీలో, ఎక్కువ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలను రెడ్ కేటగిరీలో చేరుస్తారు.
రెడ్ కేటగిరీలో ఎక్కువగా సిమెంట్, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. మొత్తం 59 రకాల పరిశ్రమలను ఈ కేటగిరీలో చేర్చారు. బ్యాటరీస్ తయారీలోనూ కాలుష్యం అనివార్యం కాబట్టి అమర రాజా బ్యాటరీస్‌కి చెందిన కంపెనీలు కూడా రెడ్ కేటగిరీలో ఉన్నాయి.
ప్రస్తుతం గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ తండ్రి గల్లా రామచంద్రనాయుడు సారథ్యంలో 1985లో అమర రాజా కంపెనీ ప్రారంభమయింది.
ఈ కంపెనీకి చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో కరకంబాడి, చిత్తూరు సమీపంలో నూనెగుండ్లపల్లిలో రెండు యూనిట్లు ఉన్నాయి.
ఈ సంస్థ దేశంలో బ్యాటరీలు తయారుచేసే రెండో అతి పెద్ద సంస్థ. ఈ సంస్థ తయారుచేసే బ్యాటరీలను 37 దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
మూడున్నర దశాబ్దాల క్రితమే స్థాపించిన ఈ పరిశ్రమ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
జనవరిలో జరిపిన తనిఖీలలో తొలి నోటీసు ఇచ్చి ఆ తర్వాత రెండు నెలలకు క్లోజర్ నోటీసులు కూడా జారీ చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై కంపెనీ యాజమాన్యం ఏపీ హైకోర్టుని ఆశ్రయించింది. నోటీసులు రద్దు చేయాలని కోరింది. ఇప్పటికే ఏపీ హైకోర్టు కూడా క్లోజర్ నోటీసులపై నాలుగు వారాల స్టే విధించింది. ఆగస్టు 16న దీనిపై తదుపరి విచారణ జరగనుంది.

ఫొటో సోర్స్, UGC
లెడ్ సమస్య తీవ్రం, చట్టాలు ఉల్లంఘించారంటున్న ప్రభుత్వం
అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ సంస్థ వల్ల ప్రమాదకర రసాయనం సీసం నీటిలో కలుస్తోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
పీసీబీతో పాటూ స్వతంత్ర దర్యాప్తు సంస్థలు జరిపిన పరిశీలనలో సమీపంలోని చెరువులన్నీ కలుషితం అయినట్టు తమ నివేదికలో పేర్కొన్నాయి.
అంతే కాకుండా, తాము జరిపిన పరీక్షల్లో కరకంబాడి యూనిట్ లో 12 శాతం మంది ఉద్యోగుల శరీరంలో లెడ్ ప్రమాదకర స్థాయిలో ఉందని తెలిపింది.
అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్న విజయ్ కుమార్ ఈ అంశాలను ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు.
"పీసీబీతో పాటూ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్) కూడా పరిశోధనలు చేసింది. బోరు నీటిలో అది 0.01 మైక్రో గ్రామ్స్ ఉండాలి. కానీ 0.08 మైక్రో గ్రామ్స్ ఉంది.
ఎస్టీపీ అవుట్ లెట్‌లో 0.2 మైక్రోగ్రామ్స్ సీసం ఉన్నట్లు ఈపీటీఆర్ పరిశీలనలో వచ్చింది. అంటే అది 100 శాతం అదనంగా ఉంది.
అన్ని ప్రాంతాల్లో లెడ్ పరిమితికి మించి ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. మల్లెమడుగు రిజర్వాయర్లో లీటరుకు ఇది 0.3 మైక్రో గ్రామ్స్ చొప్పున ఉంది. అంటే అది 200 శాతం ఎక్కువ.
గొల్లపల్లి చెరువులో ఇది 500 శాతం ఎక్కువగా ఉంది. నాయుడు చెరువులో 1190 మైక్రోగ్రామ్స్ ఉంది. అంటే 1100 శాతం ఎక్కువ ఉంది. పరిశ్రమలో పనిచేసే వారి విషయంలో కూడా తగిన రక్షణ చర్యలు తీసుకోవడం లేదు.
మనిషి శరీరంలో లెడ్ లెవెల్ డెసీ లీటరుకు 10 మైక్రో గ్రామ్స్ ఉండాలి. కానీ అది 42 మైక్రో గ్రామ్స్ చొప్పున ఉంది. ఇలా 12 శాతం శాంపిళ్లలో ఉంది. ఈ సంస్థకు చెందిన కరకంబాడి పరిశ్రమలో 5400 మంది, చిత్తూరు సమీపంలోని పరిశ్రమలో 4వేల మంది పనిచేస్తున్నారు.
వీరందరి రక్తంలో లెడ్ స్థాయి చాలా తీవ్రంగా ఉంది. కరకంబాడీ ప్లాంట్ నుంచి పరిమితికి మించి 73 స్టాక్స్ , చిత్తూరులో 137 అనధికారికంగా స్టాక్స్ ఏర్పాటు చేసి సీసంను గాలిలోకి వదులుతున్నారు.
"ఇలా నేల, నీరు, వాయు కాలుష్యం జరుగుతోందనే విషయం నిర్ధరణ అయింది. అందుకే పరిశ్రమను తరలించాలని ఆదేశించాము." అంటూ ఆయన మీడియాకు తెలిపారు.

ఫొటో సోర్స్, GALLA JAYADEV
కాలుష్యానికి అమర రాజా ఒక్కటే కారణమా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అనుమతించిన సిమెంట్, ఫార్మా కంపెనీలతో పాటు ఆక్వా ఉత్పత్తుల వల్ల జరుగుతున్న కాలుష్యంపై అనేక ఫిర్యాదులు కూడా ఉన్నాయి. గతంలో కలుషిత పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరిగాయి.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో స్వయంగా తుందుర్రు ఆక్వా పరిశ్రమలకు, దివీస్ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు.
తాము అధికారంలోకి వస్తే ఆ పరిశ్రమలను బంగాళాఖాతంలో కలిపేస్తామని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వా ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటు అయింది.
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ పరిశ్రమ నిర్మాణంలో ఉంది. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను మూసివేస్తామని గతంలో చెప్పిన జగన్ హయాంలోనే ఇప్పుడు ఆ పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ జిల్లా పరిధిలో ఉన్న హెటెరో డ్రగ్స్, దివీస్ పరిశ్రమల కాలుష్యం మీద చాలాకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, కడప జిల్లాల పరిధిలోని సిమెంట్ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం గురించి కూడా తీవ్ర అభ్యంతరాలున్నాయి
అన్నింటినీ మించి సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని యురేనియం కంపెనీ వల్ల సమీపంలోని ఆరేడు గ్రామాలు తీవ్రంగా అల్లాడుతున్నట్టు స్వయంగా అధికార పార్టీ నేతలే పార్లమెంటులో కూడా ప్రస్తావించారు.
యూసీఐఎల్ ఆధ్వర్యంలో నడిచే ఈ పరిశ్రమ చివరకు టెయిల్ పాండ్ కూడా నిర్మించకుండా గాలి, నీరు కలుషితం చేస్తోందనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
కానీ, వాటి జోలికి వెళ్లకపోవడం సందేహాలకు తావిస్తోందని పర్యావరణ వేత్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
"కాలుష్య కారక కంపెనీలు అనేకం ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా స్వయంగా పర్యావరణానికి హాని చేసే కంపెనీలను నిలిపివేస్తామన్నారు. కానీ ఇప్పుడు వాటిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం పెద్దగా చొరవ చూపించడం లేదు. ఎల్జీ పాలిమర్స్ వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం అందరికీ తెలుసు.అయినా ఆ కంపెనీ మూసేస్తామని చెప్పి ఇప్పుడు కృష్ణపట్నంలో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తామని చెబుతున్నారు. అదే స్థలంలో ఎల్జీ సంస్థకే పరిశ్రమ కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. కాలుష్యం మీద నిజంగా చిత్తుశుద్ధి ఉంటే అన్ని పరిశ్రమలను అడ్డుకోవాలి. కానీ అమర రాజా కంపెనీని మాత్రమే టార్గెట్ చేసి నోటీసుల మీద నోటీసులు ఇస్తూ నిబంధనల పేరుతో అత్యుత్సాహం చూపడం అనుమానాలకు తావిస్తోంది" అని పర్యావరణ వేత్త ఎంవీ రావు అన్నారు.

ఫొటో సోర్స్, Amararaja.com
సమస్యపరిష్కరించాలి.. సంస్థలుపోవాలంటేఎలా?
ఎన్నో కంపెనీలతో పాటూ అమర రాజా కంపెనీ వల్ల కూడా ఎంతో కొంత మేర కాలుష్యం ఉంటుందనేది కాదనలేని నిజం.
కానీ, కాలుష్యం పేరుతో సంస్థలను తరలించడమా లేక కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడమా అనేది ఆలోచించాలని కాలుష్య నియంత్రణ మండలిలో పనిచేసిన మాజీ అధికారి పి.రామచంద్రరావు బీబీసీతో అన్నారు.
"ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగంలో ముందంజలో ఉంది. దాని మూలంగా జరుగుతున్న వాతావరణ కాలుష్యం ఎంతమేరకు అనేది గమనించారా? ఫార్మా పరిశ్రమ పెట్టాలంటే రసాయనాలు లేకుండా సాధ్యమేనా? కేజీ బేసిన్‌లో తవ్వుతున్న ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ వల్ల ఎంత పర్యావరణం దెబ్బతింటోంది? పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మిస్తే విలువైన అడవులు మునిగిపోవడం లేదా..? అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొంత నష్టం ఉంటుంది. దానిని ఎలా పూడ్చాలనేది ఆలోచించాలి. నష్టనివారణ చర్యలు చేపట్టాలి. అనేక దశల్లో కాలుష్యాన్ని నియంత్రించాలి. కాలుష్యం కారణంగా పరిశ్రమలు మూతేస్తామంటే ఏపీలో సగం పరిశ్రమలు నడపలేరు. అమర రాజా కంపెనీలో లెడ్ వెదజల్లుతున్నారని చెబుతున్నారు. కానీ దానికి రెట్టింపు ప్రమాదకర రసాయనాలు వెలువడే పరిశ్రమలు అనేకం ఉన్నాయి. కాబట్టి కంపెనీ తరలించడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. వివిధ మార్గాలు అన్వేషించాలి" అని పిసీబీ మాజీ అధికారి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Sajjala ramakrishna reddy
పాలకపక్ష ప్రతినిధుల భిన్న స్వరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు, సలహాదారులు, అధికారులు కూడా దీనిపై రకరకాలుగా మాట్లాడడం రాజకీయ విమర్శలకు తావిస్తోంది.
ప్రతిపక్ష పార్టీ ఎంపీకి చెందిన ఈ పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాభివృద్ధికి ఇలాంటి చర్యలు తీరని నష్టం చేస్తాయనే వాదన వ్యక్తమవుతోంది.
అమర రాజా కంపెనీ తరలిపోవడం లేదు...మేమే తరలించాలని ఆదేశించాం అంటూ పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రకటించారు. ఇదే అభిప్రాయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వ్యక్తం చేశారు.
టీడీపీ ఎంపీది కాబట్టి అలా చేశామనడం సరికాదంటూనే, "వాళ్లు పోవడం కాదు.. ప్రభుత్వమే వాళ్లకు దణ్ణం పెట్టి పొమ్మంటోంది" అంటూ ప్రకటించారు. కానీ అంతలోనే ఆయన మాట మార్చేయడం విశేషం.
"కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలకు అనుగుణంగా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తే తమకు ఏ అభ్యంతరం లేదని' అమరావతిలో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఆయన తిరుపతిలో మీడియాకు చెప్పారు.
ఇదే అంశంలో "అమర రాజా కంపెనీ ఎక్కువ లాభాల కోసమే వెళ్లిపోతోంది" అంటూ మునిసిపల్ మంత్రి బొత్సా సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు.
ఇలా అధికారులు, నేతలు మాట్లాడుతున్న తీరు అపోహలు పెంచుతోంది.

ఫొటో సోర్స్, Amararaja.com
పర్యావరణ పరిరక్షణకే ప్రాధాన్యత
అమర రాజా కంపెనీ తన వాదనను ఇప్పటికే ఏపీ హైకోర్టుకి తెలిపింది. పీసీబీ జారీ చేసిన క్లోజర్ ఆర్డర్స్ ని రద్దు చేయాలని కోరింది.
కోర్టు తాత్కాలికంగా వాటిని అమలు చేయకుండా ఉత్తర్వులిచ్చింది. అదే సమయంలో బీఎస్ఈకి అమర రాజా కంపెనీ సెక్రటరీ వికాస్ సబర్వాల్ ఈ పరిణామాలను తెలియజేశారు.
ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఈ సమస్యను పరిష్కరించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు జూలై 28 నాటి లేఖలో ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ, సిబ్బంది ఆరోగ్యం, రక్షణకు తమ సంస్థ అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. సమీప గ్రామాల ప్రజలకు తాము భరోసాగా ఉంటామన్నారు.
అమర రాజా కంపెనీ విస్తరణలో భాగంగా తమిళనాడులో కొత్త ప్లాంట్ ఏర్పాటుచేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. కరకంబాడి, నూనెగుండ్లపల్లి ప్లాంట్స్ విషయంలో ఎదురైన సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు అధికారికంగా వెల్లడించింది.
15,470 మంది ఉద్యోగులు పనిచేసే ఏడు కంపెనీలు ఉన్న అమర రాజా కంపెనీ ఏపీ నుంచి తరలిపోతోందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
అది సిబ్బందిని కలవరపరుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే ఈ పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులను రెన్యువల్ చేయడంతో పాటూ పర్యావరణపరంగా అంతా సానుకూలమని చెప్పిన ప్రభుత్వం స్వల్పకాలంలోనే దానికి భిన్నంగా వ్యవహరించడం ఏమిటని కార్మిక సంఘం నేత కందారపు మురళి అభిప్రాయపడ్డారు.
"అన్ని విభాగాలు తనిఖీలు చేశాకే అనుమతులు రెన్యువల్ చేశారు కదా. ఈలోగా జనవరి నుంచి అనూహ్యంగా ఎందుకు మనసు మార్చుకున్నారో అంతుబట్టడం లేదు. రాజకీయ లక్ష్యాల కోసం పరిశ్రమలు, వాటిపై ఆధారపడిన వారితో ఆడుకోవడం శ్రేయస్కరం కాదు. గత ఏడాది ఈ కంపెనీ రూ.2,600 కోట్లను పన్నులుగా చెల్లించింది. కంపెనీ రిజిస్టర్ ఆఫీసు ఏపీలోనే ఉండడంతో రాష్ట్రానికి పన్నుల్లో వాటా వస్తోంది. దాంతోపాటు చిత్తూరు జిల్లాలో పరోక్షంగా లక్ష మందికి ఆసరాగా ఉంది. అలాంటి సమయంలో ప్రభుత్వం ఇలా చేయడం సరికాదు" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








