చైనా 'జీరో కోవిడ్' వ్యూహాన్ని డెల్టా వేరియంట్ దెబ్బ తీస్తోందా?

ఫొటో సోర్స్, Getty Images
ఎయిర్ చైనాకు చెందిన విమానం సీఏ910 జులై 10న చైనాలోని నాన్జింగ్ విమానాశ్రయంలో దిగింది. ఆ సమయంలో విమానం ప్రయాణికులతో నిండి వుంది.
మాస్కో నుంచి వస్తున్న వారిలో ఒకరికి అప్పటికే డెల్టా రకం కరోనా వైరస్ సోకింది. వారు విమానం నుండి వెళ్లిపోయిన తర్వాత, నాన్జింగ్ లుకో విమానాశ్రయం సిబ్బంది చెత్త తీయడానికి లోపలికి వచ్చారు.
ఆ పారిశుద్ధ్య కార్మికులు విమానం నుండి బయటకు వచ్చేటప్పుడు వారితో పాటు డెల్టా రకం కరోనా వైరస్‌ను తీసుకొచ్చారని చైనీస్ అధికారులు వెల్లడించారు. ఫలితంగా వూహాన్ తర్వాత ఇప్పుడు ఈ వైరస్ చైనాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది అన్నారు.
వేసవికాలం కావడంతో గత రెండు మూడు వారాల్లో ఎక్కువమంది ప్రయాణాలు చేశారు. దాదాపు 16 ప్రావిన్సులు, మున్సిపాలిటీల్లో డెల్టా రకం కరోనా వైరస్ కేసులను గుర్తించారు. వీటిలో అనేక క్లస్టర్‌లు నాన్‌జింగ్‌తో ముడిపడి ఉన్నాయి.
వందల్లో కేసులు నమోదైనప్పటికీ, దేశంలోని 140 కోట్ల జనాభాను బట్టి చూస్తే ఈ సంఖ్య తక్కువే. బీజింగ్, షాంఘై, వూహాన్‌తో సహా ప్రధాన నగరాల్లో డెల్టా వేరియంట్ వైరస్ కేసులు నమోదు అయ్యాయి.
వీటిని అదుపు చేయడానికి చైనా తన తెలిసిన పద్ధతులనే అనుసరించింది. లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షలు చేయించారు. నగరాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. కొన్ని ప్రాంతాలతో రవాణా సంబంధాలు తెగిపోయాయి.
నిపుణులు దీనిని జీరో టాలరెన్స్ లేదా ఎలిమినేషన్ స్ట్రాటజీ అని పిలుస్తారు. ఇది చైనాలోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ లాంటి ఇతర దేశాల్లో కూడా కనిపిస్తుంది.
కానీ, డెల్టా వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తుండడంతో , ఈ విధానం ద్వారా వైరస్ వ్యాప్తికి చైనా అడ్డుకట్టవేయగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలు ఇప్పటికే కరోనా ముందస్తు జాగ్రత్తలను పట్టించుకోనట్లు తెలుస్తోందని నిపుణులు పేర్కొన్నారు.
నాన్‌జింగ్ కేంద్రంగా వైరస్ వ్యాప్తికి ముందు, గ్వాంగ్‌డాంగ్‌లో కూడా రష్యా, మయన్మార్ సరిహద్దుల నుంచి కొంతమేరకు వైరస్ వ్యాపించింది.
మహమ్మారి ప్రారంభంతో పోల్చితే ప్రస్తుతం మాస్క్ ధరించడం తగ్గిపోయింది. సామూహిక సమావేశాలు సాధారణం అయిపోయాయి. హునాన్ ప్రావిన్స్‌లోని గ్యాంగ్జియాజీ పర్యాటక ప్రదేశంలో జరిగిన ఒక థియేటర్ ప్రదర్శనకు 2 వేల మంది హాజరవడాన్ని సూపర్-స్ప్రెడర్ ఈవెంట్‌గా గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
నాన్‌జింగ్ విమానాశ్రయంలో బయటపడిన లొసుగులను స్థానిక మీడియా ఎండగట్టింది.
విమానం పారిశుద్ద్య కార్మికులు కోవిడ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ పాటించలేదని అధికారులు భావిస్తున్నారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తుల ప్రయాణానికి ఉపయోగించిన ఈ విమానం లాండింగును పలుమార్లు తిరస్కరించినా, మళ్లీ అనుమతి ఇచ్చినట్లు అధికారులు అంగీకరించారు.
మామూలు పరిస్థితుల నుంచి కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలకు వేగంగా మారడం చైనా పాలనలో సర్వ సాధారణంగా మారినట్లు తెలుస్తోందని హాంకాంగ్ విశ్వవిద్యాలయంలోని వైరాలజిస్ట్ జిన్ డోంగ్యాన్ తెలిపారు.
"మీకు దొరికితే చంపేయండి. వదిలారంటే గందరగోళమే అని మాకు ఒక నానుడి ఉంది. ప్రమాదకర శత్రువు పట్ల చైనీస్ పరిభాషలో అలాంటి తీవ్రత ధ్వనిస్తుంది" అని ఆయన బీబీసీకి చెప్పారు.
మరోవైపు, నాన్‌జింగ్ చాలా వరకు పూర్తిగా టీకా వేసుకున్న వ్యక్తులకు వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. దాంతో చైనా టీకాల ప్రభావంపై కొందరు ఆందోళన చెందుతున్నారు.
బూస్టర్ షాట్‌లు ఇవ్వడాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని ఆరోగ్య అధికారులు ప్రజలకు భరోసానిచ్చారు.
"కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించే వ్యాక్సీన్ లేనప్పటికీ, ప్రస్తుత టీకా అన్ని వేరియంట్‌ల వ్యాప్తినీ నియంత్రించగలదు" అని చైనీస్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన షావో యిమింగ్ చెప్పారు.
చైనా ఇప్పటికే 170 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసింది. కానీ, ఎంత మందికి పూర్తి స్థాయిలో టీకాలు అందాయో ఆ దేశం అధికారికంగా వెల్లడించలేదు.
సామూహిక టీకాల వివరాలను ఇతర దేశాలు బహిర్గతం చేసినట్లు చైనా బయటపెట్టడం లేదని నిపుణులు అంటున్నారు. మహమ్మారి తొలి దశలో కేసుల విషయంలో గోప్యత పాటించినట్లే అది ఇప్పుడు కూడా స్పందిస్తోందని చెబుతున్నారు.
''అది వారి టీకాలపై, వారికే నమ్మకం లేదేమో అనిపించేలా చేస్తోంది'' అని విదేశీ సంబంధాల మండలి గ్లోబల్ హెల్త్ సీనియర్ ఫెలో ప్రొఫెసర్ యాన్జాంగ్ హువాంగ్ బీబీసీకి చెప్పారు.
యూకే తరహాలో తిరిగి తెరవాలనే ఆలోచనను ఇటీవల గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్ తిరస్కరించింది. ఇది '' రాజకీయంగా దాదాపుఊహించలేనిది'' ఎందుకంటే ఇది 'ఊహించలేని సామాజిక బాధ'కి దారి తీస్తుంది. 'డైనమిక్ జీరో కోవిడ్' పద్దతిలో వైరస్‌ను నియంత్రించవచ్చని అది చెప్పింది.
వైరస్ ఎప్పటికీ ఉంటుందనే విషయాన్ని ఇది మరోసారి గుర్తు చేసిందని ప్రస్తుత వ్యాప్తిని ఉద్దేశించి వైద్య శాస్త్ర నిపుణుడు ఝాంగ్ వెన్హాంగ్ కైక్సిన్ పేర్కొన్నారు.
"మనకు నచ్చినా నచ్చకపోయినా, భవిష్యత్తులో ప్రమాదాలు పొంచి వుంటాయి. ప్రజల్లో వైరస్ భయాన్ని పోగొట్టి, వారు సాధారణ జీవితం గడిపేలా చైనా చూడాలి" అన్నారు.
నిపుణులు సూచించినట్లు కేసుల సంఖ్యతో సంబంధం లేకుండా మరణాలను తగ్గించేలా తగిన చర్యలు చేపట్టడం అంత సులువేమీ కాదు.
ప్రమాదానికి దూరంగా ఉన్న చైనీయులకు ఎలా అవగాహన కల్పించాలనేది ప్రస్తుతం అధికార యంత్రాంగానికి అతి పెద్ద సవాలుగా నిలిచిందని ఝాంగ్ పేర్కొన్నారు.
''వూహాన్‌లో ఆరోగ్య వ్యవస్థలు పూర్తిగా దిగజారిపోవడాన్ని చూసిన వారికి చాలా బాధాకరమైన అనుభవాలు ఉన్నాయి. అవి మళ్లీ తెరుచుకుంటే, చైనా ఆరోగ్య వ్యవస్థ మరో విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ను నియంత్రించలేమోనని వాళ్లు భయపడుతున్నారు'' అని ప్రొఫెసర్ హువాంగ్ చెప్పారు.
చైనా జాతీయ మీడియా ఈ వైరస్‌ను చిత్రీకరించిన విధానం కూడా ప్రజల్లో భయాందోళనలు సృష్టించింది. కొన్ని సంస్థలు ''భారత్‌లో కోవిడ్ వ్యాప్తిని చూస్తుంటే ఇక రోజులు ముగిసినట్లేనని చెబుతున్నాయి. బ్రిటన్, అమెరికాలలో పరిస్థితి భయంకరంగా ఉంటున్నట్లు చూపుతున్నారు'' అని ప్రొఫెసర్ జిన్ వెల్లడించారు.
''జీరో కోవిడ్ పద్ధతిలో సాధించిన విజయాలతో చైనా ప్రభుత్వం దానిని పాశ్చాత్య విధానం కంటే గొప్పదని పేర్కొంది. కానీ ఆ విధానం వైరస్‌ను అదుపు చేయలేకపోయింది. ఇది చైనా రాజకీయ వ్యవస్థ ఆధిపత్యాన్ని కూడా చెబుతుంది'' అని ప్రొఫెసర్ హువాంగ్ చెప్పారు.
''వారు ఆ విధానం వదిలేసి ఉపశమన చర్యలు చేపడితే, కాదనుకున్న పాశ్చాత్య విధానాన్ని అనుసరించినట్లు అవుతుంది'' అని పేర్కొన్నారు.
వూహాన్లో మహమ్మారి విలయం తర్వాత చైనాలో మరణాలు తగ్గాయి. ఆర్థికవ్యవస్థ కూడా పుంజుకోవడంతో కొందరు చైనా అవలంబించే విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, దీర్ఘకాలం పాటు జీరో కోవిడ్ వ్యూహాన్ని పాటించడంలో కూడా సమస్యలు ఉన్నాయి.
లాక్‌డౌన్‌లు పేదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ప్రజల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ బయోఎథిక్స్ ప్రొఫెసర్ నాన్సీ జెక్కర్ పేర్కొన్నారు.
''చైనా త్వరగా మారకపోతే, సమాజంలోని అన్నిదశలవారూ తీవ్ర పరిణామాలను ఎదుర్కుంటారు. ప్రాంతాల వారీగా లాక్‌డౌన్లు, స్కూళ్లను తెరవడం, జిమ్స్, రెస్టారెంట్లను మూసివేయడం లాంటి చర్యల వల్ల ప్రయోజనం ఉంటుంది" అన్నారు.
ఇతర దేశాలు లాక్‌డౌన్‌లు ఎత్తి వేస్తుండటంతో, చైనా ఇమేజ్ దెబ్బతినే అవకాశం కూడా ఉందని ప్రొఫెసర్ హువాంగ్ హెచ్చరించారు.
ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి జీరో కోవిడ్ దేశాలు 80 శాతం వ్యాక్సీన్ రేటును సాధించడానికి ప్రణాళికలను సిద్ధం చేశాయి.
మున్ముందు ప్రపంచం రెండు రకాల దేశాలుగా విడిపోతుందని ప్రొఫెసర్ జెక్కర్ పేర్కొన్నారు. జీరో కోవిడ్ వ్యూహాన్ని పాటించేవిగా, ఉపశమన మార్గాలను అనుసరించేవిగా ఉంటాయని చెప్పారు.
''కానీ, చివరకు దాన్ని అంగీకరించడం మినహా మరో మార్గం లేదు. మహమ్మారి విజృంభణ తగ్గిన తర్వాత మరణాలు తగ్గుముఖం పడతాయి. కానీ వైరస్ మాత్రం ఏటా జలుబు రూపంలో వస్తుంది'' అని ఆమె వివరించారు.
''అదే నిజమైతే, చైనా దానితో కలిసి సహజీవనం చేయాల్సిందే''అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్‌కు టాటా చెప్పబోతోందా?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
- బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో సిఐఏకు సాయపడ్డ డాక్టర్ షకీల్ అఫ్రిది... అమెరికాలో హీరో, పాకిస్తాన్లో ద్రోహి
- భారత తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లో అందుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








