శిల్పా శెట్టి: తన భర్త రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫీ కేసుపై స్పందించిన నటి - Newsreel

శిల్పా శెట్టి
ఫొటో క్యాప్షన్, శిల్పా శెట్టి

పోర్నోగ్రఫీ కేసులో తన భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్‌పై తొలిసారిగా స్పందించారు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి.

ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లలో ఒక ప్రకటన ఇచ్చారు.

తనకు ముంబై పోలీసులపై, న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, విచారణ కోర్టులో జరగాలిగానీ మీడియాలో కాదని ఆమె అన్నారు.

"గత కొద్ది రోజులుగా మేం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాం. మాపై రకరకాల వదంతులు, ఆరోపణలు వెల్లువెత్తాయి.

మీడియాతో సహా మిత్రులు అనుకున్నవాళ్లు కూడా మాకు ఎన్నో రకాల కళంకాలను అంటగట్టారు. నేను, నా కుటుంబం ఎంతో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాం.

ఈ అంశంలో నేనేమి మాట్లాడదలుచుకోలేదు.

"ఎప్పుడూ ఫిర్యాదు చేయొద్దు, ఎప్పుడూ వివరణ ఇవ్వొద్దు" అనేదే ఒక సెలబ్రిటీగా నేను పాటించే సూత్రం.

ఇదే సూత్రాన్ని నేను ఇప్పుడు కూడా పాటించాలనుకుంటున్నాను. కోర్టులో విచారణ జరుగుతోంది. అంతవరకు నా తరపున తప్పుడు వ్యాఖ్యానాలు ప్రచారం చేయడం మానుకోండి.

మా కుటుంబ ప్రైవసీని గౌరవించమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. సత్యమేవ జయతే" అంటూ పోస్ట్ చేశారు.

శిల్పా శెట్టి

ఫొటో సోర్స్, MILIND SHELTE/THE INDIA TODAY GROUP VIA GETTY IMAG

మీడియాపై కేసు వేసిన శిల్పా శెట్టి

మీడియా కథనాలపై శిల్పా శెట్టి కోర్టు మెట్లు కూడా ఎక్కారు.

మీడియాలో వస్తున్న కథనాలు తనకు, తన కుటుంబ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ఆమె తన పిటీషన్‌లో పేర్కొన్నారు.

మీడియా సంస్థలు, గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి సోషల్ మీడియాలలో వస్తున్న వ్యాఖ్యల కారణంగా తన ప్రతిష్ట దెబ్బ తింటోందని ఆరోపిస్తూ, రూ.25 కోట్ల నష్ట పరిహారాన్ని ఆమె కోరారు.

అయితే "అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా భార్య, నటి శిల్పా శెట్టిపై ఎలాంటి వార్తలూ రాయకుండా మీడియాను నిరోధించడం పత్రికా స్వేచ్ఛకు భంగమని" తెలుపుతూ కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది.

ఆ కథనాలు పరువుకు భంగం కలిగించేలా లేవని కోర్టు తేల్చి చెప్పింది.

"గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎడిటోరియల్ కంటెంట్‌ను నియంత్రించాలని అభ్యర్థించడం ప్రమాదకరం" అంటూ కోర్టు ఆమె పిటీషన్‌ను తిరస్కరించింది.

పోర్న్ చిత్రాలు తీసి, ఓ యాప్ ద్వారా అందించారన్న ఆరోపణలతో రాజ్ కుంద్రాను జులై 22న పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 27 మంగళవారం నాడు కుంద్రాను ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

2021 ఫిబ్రవరిలో క్రైమ్ బ్రాంచ్‌లో ఈ కేసు నమోదైందని, రాజ్ కుంద్రాను దోషిగా నిరూపించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ముంబై పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)