గంగానదిలో పెరిగిన నీరు.. తేలుతున్న శవాలు

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో గంగా నదిలో నీటి మట్టం పెరగడంతో ఒడ్డున ఇసుకలో పాతిపెట్టిన మృతదేహాలు నదిలో తేలడం ప్రారంభించాయి. అక్కడి మున్సిపల్ అధికారులు హిందూ సంప్రదాయంలో ఈ శవాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు 150కి పైగా మృతదేహాలకు దహన సంస్కారాలు జరిపించారు.
కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ప్రయాగరాజ్ జిల్లాలోని ఫాఫామవూ ప్రాంతంలో గంగానది ఒడ్డున ఇసుకలో మృతదేహాలను ఖననం చేశారు.
గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. గంగానదిలో నీటి మట్టం పెరగడంతో ఒడ్డున పాతిపెట్టిన శవాలు నీటిలో తేలుతూ కనిపిస్తున్నాయి.
నీటి తాకిడికి పైనున్న ఇసుక తొలగిపోవడంతో కొన్నిచోట్ల శవాలు బయటకు కనిపిస్తున్నాయని మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ ఆఫీసర్ నీరజ్ సింగ్ తెలిపారు.
"20 రోజుల వ్యవధిలో 155 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు జరిపించాం. వీటిలో కరోనా మృతదేహాలే ఎక్కువగా ఉన్నాయి’’ అని నీరజ్ సింగ్ వివరించారు.
‘‘సెకండ్ వేవ్ సమయంలో అంబులెన్స్ డ్రైవర్లు శవాలను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అప్పుడు కూడా మేము పదికిపైగా మృతదేహాలకు దహన సంస్కారాలు జరిపించాం. ఇసుకలో ఖననం చేసిన మృతదేహాలు నీటి కోతకు ఇప్పుడు బయటకి వచ్చేశాయి. వీటికి దహన సంస్కారాలు జరిపించడానికి చాలా సమయం పడుతోంది. జాగ్రత్తలు తీసుకుంటూనే అన్నీ చేస్తున్నాం" అని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC
రోజూ డజన్ల కొద్దీ శవాలు
ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో చిన్న చిన్న గ్రామాల్లో కూడా కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది.
అయితే చాలా చోట్ల తగినన్ని పరీక్షలు నిర్వహించకపోవడంతో అనేకమంది మరణాలకు కారణాలను స్పష్టంగా నిర్ధరించలేకపోయారు.
ప్రయాగరాజ్ చుట్టు పక్కల గ్రామాల్లో శ్మశాన వాటికలు నిండిపోవడంతో మృతదేహాలను గంగానది ఒడ్డున ఇసుకలో ఖననం చేశారు.
శ్రింగ్వేర్‌పూర్, ఫాఫామవూ ప్రాంతాల్లో నదిలో నీటి మట్టం పెరగడంతో ఒండ్రు మట్టి కొట్టుకుపోయి శవాలు బయటకు కనిపిస్తున్నాయి.
నదిలో అనేక శవాలు తేలుతుండడం చూశామని ఫాఫామవూలో నివసించే పడవలు నడిపే వారు చెప్పారు.
"నీటి ప్రవాహం బలంగా ఉండడంతో ఒడ్డున ఉన్న ఇసుక కొట్టుకుపోతోంది. పైకి కనిపిస్తున్న మృతదేహాల పరిస్థితి ఘోరంగా ఉంది. పడవ నడుపుతున్నప్పుడు మాకు రోజూ ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి" అని మేకూ లాల్ అనే పడవ నడిపే వ్యక్తి తెలిపారు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC
స్థానికులకు ఇబ్బందులు
అంతకు ముందు రోజుకు నాలుగైదు మృతదేహాలు మాత్రమే కనిపించేవని, తరువాత రోజుల్లో 30 శవాల దాకా కనిపిస్తున్నాయని మున్సిపల్ అధికారులు తెలిపారు. అయితే, గత రెండు రోజులుగా పైకి తేలుతున్న మృతదేహాల సంఖ్య మళ్లీ తగ్గిందని నీరజ్ సింగ్ చెప్పారు.
"అందరికీ హిందూ ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు జరిపిస్తున్నాం. అంతిమ సంస్కారాలకు ఒక్కొక్కరికీ సుమారు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతోంది" అన్నారాయన.
గంగా నదిలో మృతదేహాలు తేలుతూ కనిపించడంతో గత కొన్ని నెలలుగా నదిలో స్నానానికి వెళ్లేవారు తగ్గిపోయారని స్థానికులు చెప్పారు.
"నది దగ్గరకు వెళితే దుర్వాసన వస్తోంది. రెండు నిమిషాలు కూడా నిల్చోలేక పోతున్నాం. ఇప్పుడు మరిన్ని శవాలు బయటకు కనిపిస్తున్నాయి. వాటిని కేవలం దుస్తుల్లో చుట్టి ఖననం చేసేశారు. వాటి పరిస్థితి ఘోరంగా ఉంది" అని రసూలాబాద్ నివాసి దీపక్ మౌర్య చెప్పారు.
వీటి వలన అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA/BBC
పర్యావరణంపై ప్రభావం
"ఒక మృతదేహం పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి ఒక ఏడాది పడుతుంది. ఇక్కడ శవాలను వస్త్రాల్లో చుట్టి ఖననం చేస్తున్నారు. ఇవన్నీ నదిలో కలుస్తాయి. వీటి ప్రభావం పర్యావరణంపై పడుతుంది" అని అలహాబాద్ విశ్వవిద్యాలయంలో పర్యావరణవేత్త ప్రొఫెసర్ ఎన్.బి. సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
"గంగానది ఒడ్డున ఎక్కడ చూసినా మృతదేహాలే. శవాలు మట్టిలో కలిసిపోతాయి కానీ, ఇసుకలో కలిసి పోవు. బయటకు వచ్చిన వాటన్నిటికీ మేం దహన సంస్కారాలు జరుపుతున్నాం" అని ప్రయాగరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభిలాషా గుప్తా నంది చెప్పారు.
ఏప్రిల్-మే నెలల్లో ఇలా నది ఒడ్డున ఇసుకలో మృతదేహాలను ఖననం చేయడంపై కలకలం రేగింది.
మొదట్లోప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇది అక్కడి సంప్రదాయం అంటూ దాటవేసే ప్రయత్నం వేసింది. పాతిపెట్టిన శవాలపై ఉన్న వస్త్రాలు తొలగించి అక్కడ అంతా బాగానే ఉన్నట్టు చూపించే ప్రయత్నాలు చేసింది.
అయితే, సమస్య తీవ్రం కావడంతో ప్రయాగరాజ్ జిల్లా మేజిస్ట్రేట్ భానుచంద్ర గోస్వామి దీనిపై దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత మేజిస్ట్రేట్ భానుచంద్ర గోస్వామికి బదిలీ అయిపోయిందిగానీ విచారణ కమిటీ తమ నివేదికను ఇంత వరకూ సమర్పించలేదు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 మిక్స్ అండ్ మ్యాచ్: వేర్వేరు వ్యాక్సీన్లు తీసుకుంటే మరింత మెరుగైన రక్షణ
- కరోనావైరస్ పుట్టుక రహస్యం తేలాల్సిందే... ఎందుకంటే?
- చల్లటి నీటిలో స్నానం చేస్తే మైండ్, బాడీ ఫ్రెష్ అవుతుందా....దీని వెనకున్న శాస్త్రీయత ఏంటి?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- ‘ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసా... అది నా ప్రాణాలు తీసే బులెట్’
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- గాంధీ హాస్పిటల్‌కు చేతులెత్తి దండం పెట్టిన ఓ మహిళ... ఆ వైరల్ ఫోటో వెనుక అసలు కథ
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










