'మా‌' ఎన్నికలు: ప్రకాశ్‌రాజ్‌ వర్సెస్‌ మంచు విష్ణు - ప్రెస్‌రివ్యూ

ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు

ఫొటో సోర్స్, facebook

తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోరు ఈసారి రసవత్తరంగా ఉండబోతోందని 'ఆంధ్రజ్యోతి' తన కథనంలో పేర్కొంది.

''ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌.. ఈ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగగా.. తాజాగా మంచు విష్ణు కూడా ఈసారి 'మా' అధ్యక్ష పోటీలో దిగుతున్నట్లుగా ప్రకటించారు.

ప్రకాశ్‌రాజ్‌కి పోటీగా మంచు విష్ణు బరిలోకి దిగనుండటం.. 'మా' ఎన్నికలపై ఆసక్తిని రేపుతోంది.

విష్ణు కూడా ఈసారి పోటీ చేయబోతున్నారని తెలుపుతూ.., కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు'' అని ఆ వార్తాకథనంలో పేర్కొన్నారు.

పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

ఆగస్టు 4 నుంచి ఎంసెట్‌

తెలంగాణలోని పలు వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పరీక్షల తేదీలను ప్రభుత్వం సోమవారం ఖరారుచేసిందని 'నమస్తే తెలంగాణ' పత్రిక తెలిపింది.

''ఇంజినీరింగ్‌, మెడికల్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్‌ను ఆగస్టు 4 నుంచి 10వ తేదీవరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు.

ఎంసెట్‌ సహా 7 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను సైతం మంత్రి విడుదలచేశారు. ఇది వరకు ప్రకటించిన షెడ్యూల్‌కు భిన్నంగా ఈ ఏడాది సైతం ఎంసెట్‌ పరీక్షలు ఇంజినీరింగ్‌తోనే మొదలుకానున్నాయి.

ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్‌వారికి, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడికల్‌వారికి పరీక్షలను నిర్వహించనున్నారు.

ఇంజినీరింగ్‌, పీజీ, డిగ్రీ, డిప్లొమా చివరి సెమిస్టర్‌ పరీక్షలను జూలై మొదటివారంలో ప్రారంభించి, నెలాఖరువరకు పూర్తిచేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులను మంత్రి ఆదేశించార''ని ఆ కథనంలో రాశారు.

వంశధార

వంశధార జలాల వివాదానికి ముగింపు

వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇచ్చిన తుది తీర్పునే వీడబ్ల్యూడీటీ (వంశధార జల వివాదాల ట్రిబ్యునల్‌) ఖరారు చేసిందని 'సాక్షి' పత్రిక తన కథనంలో రాసింది.

''సెప్టెంబర్‌ 13, 2017న ఇచ్చిన తుది తీర్పుపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956 సెక్షన్‌-5(3) కింద ఒడిశా సర్కార్‌ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది.

ఈ మేరకు సోమవారం వీడబ్ల్యూడీటీ చైర్మన్‌ జస్టిస్‌ డాక్టర్‌ ముకుందకం శర్మ ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రానికి నివేదించారు.

వంశధార ట్రిబ్యునల్‌ తుది తీర్పును నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తే.. ఆ తీర్పు అమల్లోకి వస్తుంది. తుది తీర్పును సవాల్‌ చేస్తూ ఒడిశా సర్కార్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కేంద్రం ఆ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.

ఏడున్నరేళ్లపాటు విచారణ..

వంశధార జలాల వివాదాన్ని ఏడున్నరేళ్లపాటు విచారించిన ట్రిబ్యునల్‌ సెప్టెంబర్‌ 13, 2017న ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. ఇందులో ప్రధానాంశాలు..

- సెప్టెంబరు 30, 1962న ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. వంశధారలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 115 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా. ట్రిబ్యునల్‌ వాటిని చెరి సగం అంటే 57.5 టీఎంసీల చొప్పున పంపిణీ చేసింది.

- శ్రీకాకుళం జిల్లాలో నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఈ బ్యారేజీ నుంచి నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకోవాలని సూచించింది. బ్యారేజీ కుడి వైపు స్లూయిజ్‌ల ద్వారా రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కుల చొప్పున తరలించడానికి ఏపీకి అనుమతి ఇచ్చింది. తీర్పు అమలు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ఆర్నెళ్లలోగా బ్యారేజీ ఎడమ వైపు నుంచి నీటిని వాడుకోవడానికి వీలుగా ఏపీకి ప్రతిపాదనలు పంపాలని ఒడిశాకు సూచించింది.

- నేరడి బ్యారేజీ నిర్మాణానికయ్యే వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఏపీ, ఒడిశాలు భరించాలని పేర్కొంది.

- నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని ఒడిశాను ఆదేశించింది. ఇందుకు పరిహారాన్ని ఒడిశాకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.

- కాట్రగడ్డ సైడ్‌వియర్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ను జూన్‌ 1 నుంచి ఎనిమిది టీఎంసీలు తరలించే వరకు లేదా నవంబర్‌ 30 వరకు తెరిచి ఉంచాలని పేర్కొంది.

- నేరడి బ్యారేజీ పూర్తయ్యాక కాట్రగడ్డ సైడ్‌వియర్‌ను పూర్తిగా తొలగించాలని షరతు విధించింది.

- ఈ తీర్పు అమలును పర్యవేక్షించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ అధ్యక్షతన, ఇరు రాష్ట్రాల అధికారులు సభ్యులుగా అంతర్రాష్ట్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింద''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)