కోవిడ్-19: వ్యాక్సిన్‌ సైడ్ ఎఫెక్ట్స్‌తో భారత్‌లో తొలి మరణం, టీకాతో మరణం ముప్పు చాలా తక్కువేనన్న కేంద్రం

వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత అనాఫిలాక్సిస్ అనే రియాక్షన్ రావడంతో ఓ వృద్ధుడు మరణించారని ప్రభుత్వ కమిటి నిర్ధారించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోవిడ్-19 వ్యాక్సీన్‌

కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడంతో ఒక వ్యక్తి మృతి చెందినట్లు కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ మీద దర్యాప్తు చేపడుతున్న ప్రభుత్వ బృందం ధ్రువీకరించింది.

అయితే, టీకా తీసుకోవడం వల్ల వ్యక్తి మృతి చెందాడనే వార్తలో సగం నిజమే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. కరోనావైరస్‌తో పొంచివున్న ముప్పుతో పోలిస్తే, వ్యాక్సిన్‌ వల్ల కలిగే ముప్పు చాలా తక్కువని తెలిపింది.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనాఫిలాక్సిస్ అనే రియాక్షన్ రావడంతో ఒక వృద్ధుడు చనిపోయాడని ప్రభుత్వ కమిటీ నిర్ధరించినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

టీకా తీసుకున్న తర్వాత దుష్ప్రభావాల(ఏఈఎఫ్‌ఐ)ను పరిశీలించే ఆ కమిటీ ఇలాంటి 31 కేసులను పరిశీలించింది. వీటిపై కేంద్రానికి ఒక నివేదిక సమర్పించింది.

68 ఏళ్ల వృద్ధుడు టీకా అనంతర దుష్ప్రభావాలతో మార్చి 8న మరణించినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది.

అనాఫిలాక్సిస్ అనేది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే సీరియస్ రియాక్షన్లలో ఒకటి. అతి తక్కువ కేసుల్లో మాత్రమే ఇలాంటి దుష్ప్రభావాలు కనిపిస్తుంటాయి.

‘‘కోవిడ్ వ్యాక్సినేషన్‌తో ఇలాంటి దుష్ప్రభావాలు వచ్చి భారత్‌లో వ్యక్తి చనిపోవడం ఇదే తొలిసారి. అందుకే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 30 నిమిషాలు.. టీకా కేంద్రంలోనే ఉండాలని సూచిస్తారు. ఇలాంటి రియాక్షన్లు తొలి అరగంటలోనే వస్తాయి. వెంటనే గుర్తిస్తే, సదరు వ్యక్తి ప్రాణాలు మనం కాపాడవచ్చు’’అని ఏఈఎఫ్ఐ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌.కె. అరోరా పీటీఐతో చెప్పారు.

కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకోవడంతో ఒక వ్యక్తి మృతి చెందినట్లు కోవిడ్ దుష్ప్రభావాల(సైడ్ ఎఫెక్ట్స్)పై దర్యాప్తు చేపడుతున్న ప్రభుత్వ బృందం ధ్రువీకరించింది.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP

31 కేసులను విచారించిన అనంతరం

ఫిబ్రవరి 5న వచ్చిన ఐదు కేసులు, మార్చి 9న వచ్చిన ఎనిమిది కేసులు, మార్చి 31న వచ్చిన 18 కేసులను కమిటీ పరిశీలించింది.

‘‘ప్రతి పది లక్షల మందిలో కేవలం 2.7 మందికే ఇలాంటి మరణం ముప్పు ఉంటుంది. 4.8 మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆసుపత్రి పాలయ్యే అవకాశముంటుంది’’అని నివేదికలో పేర్కొన్నారు.

మరణం ముప్పు, ఆసుపత్రి పాలవడం లాంటివి కేవలం వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే జరిగాయని భావించకూడదని కమిటీ నివేదికలో పేర్కొంది.

తీవ్రమైన దుష్ప్రభావాలు, వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉన్న లింకును నిర్ధరించేందుకు కమిటీ సమగ్ర విచారణ చేపడుతుంది.

‘‘31 అనాఫిలాక్సిస్ కేసుల్లో 18 కేసులకు వ్యాక్సిన్‌తో సంబంధం లేదు. ఏడు కేసుల్లో ఊహించని విధంగా దుష్ప్రభావాలు వచ్చాయి. మూడు కేసుల్లో వ్యాక్సిన్లతో ముందుగా ఊహించిన దుష్ప్రభావాలు వచ్చాయి. మరో కేసులో ఆందోళన వల్ల అనాఫిలాక్సిస్ వచ్చింది. ఇంకో రెండు కేసుల్లో కారణాలు తేలియలేదు’’ అని నివేదికలో పేర్కొన్నారు.

టీకా తీసుకున్న తర్వాత దుష్ప్రభావాల (ఏఈఎఫ్‌ఐ)ను పరిశీలించే కమిటీ ఇలాంటి 31 కేసులను పరిశీలించింది. వీటిపై కేంద్రానికి నివేదిక సమర్పించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఈ వర్గీకరణ ఏంటి?

ఈ కమిటీ అభిప్రాయం ప్రకారం టీకాల వల్ల కలిగే రియాక్షన్లను శాస్త్రీయ ఆధారాలను బట్టి నిర్ధరిస్తారు. అలర్జీ, అనాఫిలాక్సిస్ లాంటివి ఈ రియాక్షన్ల కిందికి వస్తాయి.

అయితే, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కోవిడ్ క్లినికల్ డేటాలో ఇలాంటి రియాక్షన్లు నమోదు కాలేదు. వీటిని నిర్ధరించడానికి మరింత పరిశోధన, అధ్యయనం అవసరం.

అనాఫిలాక్సిస్ రియాక్షన్‌కు సంబంధించి మరో రెండు కేసుల్లోని వ్యక్తులు జనవరి 16, 19 తేదీల్లో టీకా వేసుకున్నారు. రియాక్షన్ కారణంగా వారిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. తర్వాత వారిద్దరూ కోలుకున్నారు.

టీకాలు వేసిన తర్వాత తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించిన కొన్ని కేసుల్లో, వాటికి ఇతర కారణాలు ఉన్నట్లు గుర్తించారు.

ఏది ఏమైనా, టీకా వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల ముందు చాలా చిన్నవని ప్యానెల్ పేర్కొంది. అయినా, ముందు జాగ్రత్తగా అన్ని సైడ్‌ఎఫెక్ట్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది.

అనాఫిలాక్సిస్ అనేది వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత వచ్చే సీరియస్ రియాక్షన్లలో ఒకటి. ఇది చాలా అరుదుగా వస్తుంది.

ఫొటో సోర్స్, ANI

ఆరోగ్య శాఖ ఏం చెబుతోంది?

వ్యాక్సిన్ కారణంగా వ్యక్తి చనిపోయారనే వార్తలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలు అసంపూర్ణమైనవని, పరిమిత అవగాహనతో రాసిన వార్తలుగా పేర్కొంది.

టీకాలు వేసిన తర్వాత, జనవరి 16 నుంచి జూన్ 7వ తేదీల మధ్య సుమారు 488 మరణించారని, వీరంతా కోవిడ్ అనంతర సమస్యలతోనే చనిపోయారని కేంద్రం వెల్లడించింది.

ఆ సమయంలో దేశవ్యాప్తంగా 23.5 కోట్ల మందికి టీకాలు వేసినట్లు కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

వ్యాక్సిన్ తీసుకున్న 23.5 కోట్లమందిలో మరణించిన వారి శాతం 0.0002 అని కేంద్రం పేర్కొంది. దేశ జనాభాలో మరణాల రేటు స్థిరంగా ఉంటుందని, ఎస్ఆర్ఎస్ డేటా ప్రకారం, 2017లో మరణాల రేటు ప్రతి 1000 మందికి 6.3 గా ఉన్నట్లు పేర్కొంది.

కరోనా వల్ల సంభవించే మరణాల రేటు ఒక శాతం కంటే ఎక్కువేనని, వాక్సినేషన్ ఆ మరణాలను ఆపగలదని కేంద్రం చెప్పింది.

‘‘కోవిడ్ -19 కారణంగా మరణాలతో పోలిస్తే, టీకాలు వేయడం వలన మరణించే ప్రమాదం చాలా తక్కువ" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)