మున్నా: ఉరిశిక్ష పడిన మున్నా గ్యాంగ్ చేసిన అరాచకాలేంటి, వాళ్లను పట్టించిన పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం...
ఒంగోలు హైవేపై అబ్దుల్ సమ్మద్ అలియాస్ మున్నా గ్యాంగ్ చేసిన దారుణ హత్యలు 2008లో వెలుగులోకి వచ్చాయి.
ఆ హత్య కేసుల్లో సోమవారం నాడు (మే 24, 2021)న ఒంగోలు 8వ అదనపు సెషన్స్ కోర్టు 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
ప్రధాన ముద్దాయి మున్నాతో పాటు మరో 11 మందికి ఉరిశిక్ష విధించింది. ఇదే కేసులో మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
2008లో ఒంగోలు హైవేపై వరుస హత్యలు, లారీల మాయం కేసును ఒంగోలులో అప్పుడు ట్రైనీ డీఎస్పీగా పని చేసిన దామోదర్, ఆయన బృందం ఛేదించింది. ప్రస్తుతం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఎస్పీగా ఉన్న దామోదర్ బీబీసీతో మాట్లాడారు.
ఈ కేసులోని పలు ఆసక్తికరమైన అంశాలను ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, UGC
ఎవరీ మున్నా?
బీరువాల తయారీ, ఆయుర్వేద వైద్యం, ఆర్టీవో, మాజీ నక్సలైట్...ఇవన్నీ మున్నా అవతారాలు.
''అసలు పేరు ఎండీ అబ్దుల్ సమ్మద్. అతడు వేయని వేషం లేదు, చేయని మోసం లేదు. మున్నాది బీరువాల తయారీ వ్యాపారం. ఐరన్ బీరువాలు తయారు చేయడంలో మున్నాకి మంచి పేరు కూడా ఉంది. అయితే బీరువాల తయారీ ముసుగులో అతడు అనేక వేషాలు వేసేవాడు'' అని ఎస్పీ దామోదర్ వెల్లడించారు.
ప్రభుత్వ అధికారులు కూడా మున్నా చేతిలో మోసపోయేవారని దామోదర్ తెలిపారు. రాత్రయితే ఒంగోలు హైవేపై ఆర్టీవో లేదంటే బ్రేక్ ఇన్‌స్పెక్టర్ అవతారం ఎత్తేవాడని, ఆయుధాలు కొనడానికి వెళ్లినప్పడు మాజీ నక్సలైట్‌నని చెప్పుకునే వాడని ఎస్పీ దామోదర్ వివరించారు.
''దీర్షకాలిక రోగాలతో బాధ పడే వారికి ఆయుర్వేద వైద్యం చేసే వాడు. గుప్త నిధుల అచూకీ, ధనయోగం కలిగించే మహిమలు గల చెంబు, రెండు తలల పాము, రైస్ పుల్లింగ్ మెటీరియల్ లాంటివి ఉన్నాయంటూ రాజకీయ నాయకులను సైతం కోట్లలో మోసం చేశాడు. మున్నా మాకు దొరికే సమాయానికి గుప్త నిధుల ఆచూకీ చెబుతానంటూ బెంగళూరులోని ఒక పొలిటీషియన్ గెస్ట్‌హౌస్‌లో మకాం వేసి ఉన్నాడు'' అని ఎస్పీ దామోదర్ బీబీసీతో చెప్పారు.

సొంతిల్లు ఉన్నా... హోటల్లో బస...
ఒంగోలులో ట్రైనీ డీఎస్పీగా ఉన్న సమయంలో మున్నా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసిందని ఎస్పీ దామోదర్ వెల్లడించారు. ఓసారి మున్నాను అర్ధరాత్రి కారులో వెళ్తుంటే చూశానని, అతడికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని ముందే తెలియడంతో అతడిని వెంబడించానని, చివరకు అతడు ఒక హోటల్లో బంధువుల పేరుతో ఉంటున్నాడని తెలుసుకున్నానని దామోదర్ వెల్లడించారు.
ఊళ్లో ఇల్లు ఉన్నా, హోటల్లో ఎందుకుంటున్నాడనే అనుమానంతో అతని గురించి కూపీ లాగడం మొదలు పెట్టానని దామోదర్ తెలిపారు.
మున్నా చేతిలో 45 ఫోన్లు
మున్నా ఫోన్ నంబర్ కనుక్కోవడం చాలా కష్టమైందని ఎస్పీ దామోదర్ వెల్లడించారు. అతడు 45 ఫోన్లు వాడేవాడని, ఏ ఇద్దరు వ్యక్తులతోనూ ఒకే నంబర్‌తో మాట్లాడేవాడు కాదని తెలిపారు.
''గుప్తనిధులు, రైస్ పుల్లింగ్, మహిమలు గల చెంబు, చేప, పాము అంటూ...మోసాలు చేసేవాడు. అందుకే ఎవరికీ తెలియకుండా హోటల్‌లో రూం తీసుకుని, అక్కడి నుంచి అన్నీ నడిపేవాడు. కొంతకాలం బాగానే నడిచిన ఈ దందా లాభసాటిగా లేదనుకున్నాడు. దాంతో రూట్ మార్చాడు'' అని దామోదర్ తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
ఆర్టీవో వేషం...హైవేపై హత్యలు
ఎస్పీ దామోదర్ చెప్పిన దాని ప్రకారం... ఒంగోలు జాతీయ రహదారిపై రాత్రిపూట ఆర్టీవో లేదా బ్రేక్ ఇన్‌స్పెక్టర్ అవతారంలో మున్నా కాపు కాసేవాడు. దాని కోసం 18 మందితో ఒక గ్యాంగ్ కూడా తయారు చేసుకున్నాడు.
హైవేపై ఒక తెల్ల రంగు కారు నిలిపి... లోడ్‌తో ఉన్న లారీలను ఆపి, రికార్డులు సరిగా లేవంటూ పెద్ద మొత్తంలో డబ్బు లంచంగా తీసుకునేవాడు. అదే సమయంలో అదను చూసి ఆ లారీ డ్రైవరు, క్లీనర్ల గొంతులకు నైలాన్ తాడు బిగించి చంపేవాడు. ఈ పనంతా స్వయంగా మున్నానే చేసేవాడు.
ఆ మృత దేహాలను గోనె సంచుల్లో కుక్కేసి...దగ్గర్లోని తోటల్లో, పొలాల్లో పాతి పెట్టేవారు. లారీలోని విలువైన భాగాలను అమ్మేసి...మిగతా వాటిని తుక్కుగా మార్చి...మద్దిపాడులోని ఒక గోడౌన్‌లో ఉంచేవారు. ఇక లారీలోని సరుకును ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు వల వేసి అమ్మేసేవారు.
ఆయుర్వేద వైద్యం...ఉన్నతోద్యోగి సాయం...
ఉన్నతాధికారులను, అవసరంలో ఉన్నవారిని తనకు అనుకూలంగా వాడుకోవడంలో మున్నా చాలా తెలివిగా వ్యవహరించేవాడని ఎస్పీ దామోదర్ తెలిపారు.
"ఒంగోలులోని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి యువకుడు, వికలాంగుడు. నడవలేక పోయేవాడు. ఆయుర్వేద వైద్యంలో పరిచయం ఉన్న మున్నాని కలిస్తే...ఆయన కొద్దిగా నడవగలిగాడు. దాంతో ఆ ఉన్నతాధికారి మున్నాతో కాస్త స్నేహంగా ఉండేవాడు. కానీ, ఆయనకు మున్నా మోసాలు గురించి తెలియదు. ఆ ఉన్నతాధికారిని మున్నా తెలివిగా వాడుకున్నాడు" అని దామోదర్ చెప్పారు.
''మున్నా ప్రధానంగా ఐరన్ లోడ్ లారీలను టార్గెట్ చేసేవాడట. ఆ లారీల్లోని సరుకును గోడౌనులో పెట్టేవాడు. తాను దొంగలించిన ఐరన్ లేదా ఇతర సరుకులు తన స్నేహితులవని, వాటిని ఒంగోలులో వదిలేశారని...తక్కువ రేటుకైనా అమ్మేయమన్నారని ఆ ఉన్నతోద్యోగికి చెప్పేవాడు. ఆయన తన సర్కిల్‌లోని ఉద్యోగులకు, తెలిసినవాళ్లకు తక్కువ రేటుకు సరుకు వస్తుందని చెప్పి, కొనిపించేవాడు. దీంతో మున్నా దొంగిలించిన సరుకు సులభంగా అమ్ముడయ్యేది" అని వివరించారు దామోదర్.

ఫొటో సోర్స్, SRIRAM KARRI
తమిళనాడు లారీ...ఒంగోలులో మిస్...
ఒక కేసుతో మున్నా చేసిన హత్యలు అనుకోని విధంగా వెలుగులోకి వచ్చాయి.
2008లో ఒక ట్రక్కు 20 టన్నుల ఐరన్‌తో పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడుకు వెళ్తూ ఒంగోలు హైవేపై మిస్ అయ్యింది. దీనిపై లారీ యాజమాని కుప్పుస్వామి ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే లారీ డ్రైవర్, క్లీనర్లే సరుకును కొట్టేసినట్లు కుప్పుస్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ మున్నా గ్యాంగ్ ఎప్పటిలాగే ఆ డ్రైవరు, క్లీనర్లను చంపేసి, ఆ ఇనుమును గుంటూరులోని ఒక వ్యాపారికి అమ్మేశారు.
''ఐరన్ లారీ మిస్ కావడం, మున్నా కూడా బీరువాలు, ఐరన్ బిజినెస్ అంటూ బిల్డప్ ఇస్తుండటంతో నాకు అనుమానం వచ్చింది. దాంతో మున్నాను పట్టుకుంటే అన్నీ విషయాలు తెలుస్తాయని భావించాను. అయితే అప్పటికే అతడు బెంగళూరు పారిపోయినట్లు తెలిసింది. దాంతో అతడి ఫోన్ ద్వారా లోకేషన్‌ను ట్రేస్ చేసి మున్నాను పట్టుకుని ఒంగోలుకు తీసుకొచ్చాం. ఈ కేసుని ఛేదించే క్రమంలోనే మున్నా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.'' అన్నారు దామోదర్.

గుంటూరులో బావమరిది...ఒంగోలులో బావ...
గుంటూరులో మున్నా బావ మరిది ఉండేవాడు. అతడు రాత్రిపూట గుంటూరు హైవేపై కాపుకాసి, ఏయే లోడ్ లారీలు వస్తున్నాయో ఎప్పటికప్పుడు లారీ నెంబర్లు, లోడు వివరాలు సహా ఒంగోలు హైవే మీదున్న మున్నాకి ఫోన్‌లో చెప్పేవాడు.
దానిలో ఏదో ఒకదానిని మున్నా టార్గెట్ చేసి చెబితే, మున్నా బావమరిది ఆ లారీని ఫాలో అవుతూ ఒంగోలు వరకూ వచ్చేవాడు. ఒంగోలు హైవేపై మున్నా గ్యాంగ్ దానిని ఆపగానే మున్నా బావమరిది కూడా వారితో కలిసి నేరాలకు పాల్పడేవాడు.
''వాళ్ల దగ్గర ఆధునిక ఆయుధాలు కూడా ఉండేవి. నక్సలైట్లమని చెప్పి కొందరి నుంచి రహస్యంగా వాటిని కొన్నారు. మరికొన్ని బెదిరించి సంపాదించారు. బావ, బావమరిది కలిసి గుంటూరు-ఒంగోలు హైవేపై హత్యలు చేసేవారు. తమిళనాడు, ఏపీ, బిహార్‌కు చెందిన డ్రైవర్లు, క్లీనర్లను కిరాతకంగా చంపారు. నాగాలాండ్‌కు చెందిన ఇద్దరి శవాలు కూడా ఈ కేసులోనే దొరికాయి. అయితే అవి ఎవరివో ఇంకా సాల్వ్ కాలేదు" అని దామోదర్ తెలిపారు.
తమిళనాడు లారీ కేసులో మున్నా, అతడి గ్యాంగ్‌ను అప్పట్లో అరెస్టు చేశామని, బెయిల్ రావడంతో మున్నా బెంగుళూరుకు పారిపోయాడని దామోదర్ వివరించారు.
కొన్ని రోజులు పోలీసులకు చిక్కకుండా మున్నా తప్పించుకున్నాడు. కర్నూలు పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
యాదృచ్ఛికమే...
సోమవారం( మే 24) ఒంగోలు 8వ అదనపు సెషన్స్ కోర్టు మొత్తం 7 కేసుల్లో మూడింటిలో తీర్పు ఇచ్చింది. మున్నాతో సహా మొత్తం 12 మందికి ఉరిశిక్ష, ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది.
''మున్నా కేసు చేధించినప్పుడు ట్రైనీ డీఎస్పీగా ఒంగోలులో ఉన్న నేను, వివిధ ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో పని చేశాను. మున్నా గ్యాంగ్‌కు శిక్ష ఖరారవడానికి కొన్ని రోజుల ముందే, పోలీసు ట్రైనింగ్ కళాశాల ఎస్పీగా నేను మళ్లీ ఒంగోలుకు రావడం యాదృచ్ఛికం" అన్నారు ఎస్పీ దామోదర్.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏమిటి
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








