కరోనావైరస్: వందేళ్లు దాటిన వృద్ధులు కోవిడ్ నుంచి ఎలా కోలుకుంటున్నారు

ఫొటో సోర్స్, Twitter/GKishanReddy
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ముఖ్యంగా పిల్లలు, యువకులు, ఆరోగ్య సమస్యలు లేనివారు, నిత్యం వ్యాయామాలు చేసేవారు కూడా దీనికి బలవుతున్నారు.
ఇక 60 ఏళ్లు దాటిన వృద్ధులకు కరోనా వస్తే పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. కరోనాతో పోరాటం చాలామంది వృద్ధులకు కష్టమవుతోంది.
అయితే కరోనా బారిన పడ్డ వందేళ్లు దాటిన వృద్ధులు కొందరు వైరస్‌ను జయించి మిగతావారిలో ధైర్యం నింపుతున్నారు. ఇలాంటి వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు.
బోసి నవ్వుతో కరోనాని జయించి..
90, 100ఏళ్లు దాటిన కరోనా బాధితులు... కరోనాని జయించడానికి వారి ఆహారపు అలవాట్లు, వారి జీవన విధానం, సమస్యలను ఎదుర్కొనే తీరు ఇలాంటివన్ని పనికొస్తాయి.
ఏదీ ఏమైనా కరోనా అయినా, మరే కష్టమైనా అది ఒక సమస్య మాత్రమే. దాన్ని ధైర్యంగా ఎదుర్కొవడం ఒక్కటే మార్గం. భయపడితే అది మనపై దాడి చేస్తుంది. కరోనా విషయంలో కూడా అదే జరుగుతోంది.
యాళ్ల సీతారామమ్మ వయస్సు సరిగ్గా వందేళ్లు. ఆమెది శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని కుమ్మరిగుంట గ్రామం. ఈమె కరోనాను జయించారు. ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు ఈమె స్వయాన పెద్దమ్మ.

"సీతారామమ్మలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఆమెకు ఇంటి వద్దే పరీక్షలు చేశాం. పాజిటివ్ రావడంతో, ఆ విషయాన్ని ఆమెకు చెప్పాం. ఆ పెద్దావిడ ఏం భయపడలేదు. మందులు ఏలా వేసుకోవాలి? అసలు ఏం చేయాలి? అన్నం తినొచ్చా? ఇంకేదైనా తినాలా? ఇలాంటి సాధారణ ప్రశ్నలే అడిగారు. ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాం. 25 రోజులు కరోనా లక్షణాలతో ఆమె బాధపడ్డారు. ఇప్పుడు నెగెటివ్ వచ్చింది. కరోనా కారణంగా శారీరక నిరసమే కానీ.. మానసికంగా భయపడినట్లు ఆమె కనిపించలేదు. దాంతో వందేళ్ల వయసులోనూ సులభంగా కోలుకున్నారు" అని సారవకోట పీహెచ్‌సీ వైద్యాధికారి భార్గవప్రసాద్ తెలిపారు.
"జ్వరం వచ్చిందని భయపడలేదు. మంచి భోజనం మూడు పూటలా తిన్నాను. వద్దన్నా కూడా మా పిల్లలు, మనవళ్లు వదిలేవారు కాదు. తేనె కలిపిన నిమ్మరసం, కోడి కూర భోజనం, పళ్ల రసాలు ఇచ్చేవారు. అయితే మూతికి గుడ్డలు కట్టుకుని దూరం నుంచే మాట్లాడేవారు. నెల రోజులకుపైగా అలాగే చేశారు. ఇప్పుడు అందరూ నా దగ్గరకు వస్తున్నారు. ధైర్యంగా ఉంటే ఎవరికి ఏమీ అవ్వదు" అని సీతారామమ్మ మీడియాకు చెప్పారు.
తెలంగాణలోని మహబూబాబాద్‌కు చెందిన శ్రీరంగం వెంటకమ్మ వయసు 93 ఏళ్లు. ఆమె కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిందని తెలియగానే కంగారు పడకుండా.. ఇంట్లో వారికి దూరంగా ఉన్న ఓ గదిని తన ఐసోలేషన్ వార్డుగా మార్చేసుకున్నారు. 14 రోజుల పాటు ఆ గదిలోనే ఉంటూ మందులు తీసుకున్నారు. మే 8న ఆమెకు నెగెటివ్ వచ్చింది. ధైర్యంగా ఎదుర్కొంటే కరోనా పారిపోతుందని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter/kishanreddy
'పెద్దాయన' విజయం
రామానంద తీర్థ వయసు 110ఏళ్లు. ఎవరూలేని రామానంద తీర్థ హైదరాబాద్ సమీపంలోని కీసరలో ఒక ఆశ్రమంలో ఉంటున్నారు. మూడు వారాల క్రితం కోవిడ్ బారినపడ్డ ఆయన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇక్కడే 14 రోజులు చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నారు. ఈ పెద్దాయన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.
"కోవిడ్‌తో రోజూ వందల మంది కొత్త పేషెంట్లు గాంధీ ఆసుపత్రిలో చేరుతుంటారు. అలాగే వందల మంది డిశార్జ్ అవుతుంటారు. 110 ఏళ్ల రామానంద తీర్థ కోవిడ్‌ను జయించడం మాత్రం అద్భుతమనిపిస్తుంది. ఆయన ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగున్నాయి. అయితే మరికొన్ని రోజులు ఆసుపత్రి జనరల్ వార్డులో ఆయన్ను పరిశీలనలో ఉంచుతున్నాం’’అని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు చెప్పారు.
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి.. రామానంద తీర్థ ఉన్న వార్డుకి వెళ్లారు. ఆయనతో కాసేపు మాట్లాడారు. "110 ఏళ్ల రామానంద తీర్థ కోవిడ్ నుంచి కోలుకోవడం ఆనందంగా ఉంది. అంత వయసున్న వ్యక్తి కోవిడ్ నుంచి కోలుకోవడం దేశంలోనే ఇదే ప్రథమం"అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
నువ్వే కాదు.. ప్రపంచమంతా యుద్ధం చేస్తోంది
కరోనా అంటే ఇప్పుడు చాలా మందిలో విపరీతమైన భయం ఉంది. భారత్‌లో మొదటి వేవ్‌లో కేసులు, మరణాల సంఖ్య తక్కువగా ఉండటంతో ఇంత ఆందోళన కనిపించలేదు. కానీ రెండో వేవ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దీంతో కరోనా వచ్చిందని తెలియగానే చాలా మంది భయపడుతున్నారు. కరోనాపై విజయం సాధిస్తున్న వృద్ధులు ముందు భయాన్ని జయిస్తున్నారు. అదే వారి ఆరోగ్య రహస్యమని వైద్యులు, మానసిక శాస్త్ర నిపుణులు అంటున్నారు.
"కరోనాపై అపోహలు పెంచుకుని, ప్రతి చిన్న విషయానికీ భయపడేవారు.. ముందు ఆ భయాన్ని విడాలి. ముఖ్యంగా యువకులు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు సైతం కరోనా బారినపడగానే భయపడిపోతున్నారు. కొందరైతే కరోనా సోకిందని తెలియగానే భయంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మరికొందరు ఏదో అయిపోయిందనే భయంతో గుండె పోటుతో మరణిస్తున్నారు. కరోనా నీకో, నీ కుటుంబంలోని వారికో మత్రమే రావడం లేదు. చాలా మందికి వైరస్ సోకుతోంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తోంది. అందులో నువ్వు కూడా ఉన్నావు. అలా యుద్ధం చేసి బయటపడుతున్నవారిలో వందేళ్లుదాటిన వారు ఉండటం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అనిపిస్తోంది. కరోనా అంటే అతిగా భయపడేవాళ్లు...కరోనాపై విజయం సాధిస్తున్న శతాధిక వృద్ధులను ఆదర్శంగా తీసుకోవాలి"అని ఏయూ సైకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఏవీఆర్ రాజు చెప్పారు.

మంగళగిరి బామ్మ.. నిర్మల్ 'భగీరథ'
వందేళ్లకు చేరువవుతున్న వారు కూడా కరోనాపై విజయం సాధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి చెందిన 99ఏళ్ల గూడపాటి లక్ష్మీ ఈశ్వరమ్మ, తెలంగాణలోని నిర్మల్‌కు చెందిన గంప భగీరథ ఉన్నారు.
"విజయవాడ పటమటలంకకు చెందిన గూడపాటి సుబ్రహ్మణ్యం భార్య గూడపాటి లక్ష్మీ ఈశ్వరమ్మ కరోనా బారినపడి ఏప్రిల్ 22న మా ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది 8 రోజులపాటు వైద్యం అందించారు. ఆమెకు నయం కావడంతో ఆస్పత్రి నుండి మే 1న డిశ్చార్జి చేశాం"అని లక్ష్మీ ఈశ్వరమ్మకు చికిత్స అందించిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ‘‘వైరస్ సోకినా ధైర్యం కోల్పోలేదు. వైద్యుల సూచనల మేరకు మందులు, మంచి ఆహారం తీసుకోవడం వల్లే వైరస్‌ను జయించగలిగాను’’అని ఈశ్వరమ్మ చెప్పారు.
"మా అమ్మ వయసు 97ఏళ్లు. మాది నిర్మల్ జిల్లా. కొద్దిపాటి లక్షణాలు కనిపించగానే ఆమెకు కరోనా పరీక్ష చేయించాను. అయితే పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె హోం క్వారంటైన్‌లో 14 రోజులు ఉన్నారు. కరోనా సోకిందని తెలిసినా అమ్మ ధైర్యం కోల్పోలేదు. క్రమం తప్పకుండా మందులు వాడారు. తన పనులు తానే స్వయంగా చేసుకునేవారు. తర్వాత నెగెటివ్ రావడం ఆనందం కలిగించింది. ప్రస్తుతం అమ్మ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు"అని ఆమె కుమారుడు గంప శ్రీనివాస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అధ్యయనం చేయాలి
‘‘ఆరోగ్యవంతులు, ప్రతి రోజు వ్యాయమం చేసేవారు, యువకులు, నిత్యం కరాటే సాధన చేసేవారు, బాడీ బిల్డర్లు కూడా సెకండ్ వేవ్‌కు బలయ్యారు. అదే సమయంలో వందేళ్లు దాటిన వృద్ధులు కరోనాని సులభంగా జయించి చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది’’అని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ పీవీ సుధాకర్ బీబీసీతో చెప్పారు.
"126 కేజీలున్న డయాబెటిక్ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. మా కళాశాల సిబ్బందికి చెందిన కుటుంబంలోని వ్యక్తే ఆయన. అయితే ఆయన చాలా ఈజీగా కరోనా నుంచి బయటపడగలిగారు. సాధరణంగా షుగర్ ఉండి అధిక బరువున్నవాళ్లు కరోనా నుంచి కోలుకోవడం కష్టం. కానీ ఆయన కోలుకున్నతీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే నిత్యం వ్యాయమం చేస్తూ, సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేసే ఒక బాడీ బిల్డర్ కరోనాతో చనిపోవడం చూశాను. ఈ రెండూ విరుద్ధమైన అంశాలు. దీన్ని బట్టి ఒక్కో వ్యక్తిలో ఒక్కోరకంగా కరోనా ప్రభావం చూపుతుందని అర్థమవుతోంది. దీనిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది".
"వయసు, ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నా.. ఒక్కో శరీరం ఒక్కో రకమైన ఇమ్యూనిటీ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అది కూడా ప్రభావం చూపుతుంది. వైరస్ కూడా అందరిపై ఒకే విధంగా దాడి చేయదు. వైరస్ మన శరీరంలో ప్రవేశించిన లోడ్‌ను బట్టి దాడి తీవ్రత ఉంటుంది. అయితే వందేళ్లు దాటిన వాళ్ల ఆహారపు అలవాట్లు, ఆలోచనలు కూడా చాలా బలంగా ఉంటాయి. అవే వారికి చాలా వరకు రక్షణ కల్పిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నా కూడా అవయవాల పనితీరు క్రమంగా తగ్గుతుంది. ఇదంతా కూడా శరీరంలోని జన్యువుల తీరుపై ఆధారపడి ఉంటుంది. అందుకే కరోనాని జయించిన 60 ఏళ్ల నుంచి 100ఏళ్ల వృద్ధులపై అధ్యయనం చేయాలి. దీన్ని సీసీఎంబీ చేపట్టాలి. అప్పుడు మరికొన్ని ఆసక్తికర అంశాలు తెలిసే అవకాశం"అని డాక్టర్ సుధాకర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- ప్రిన్సెస్ డయానా - మార్టిన్ బషీర్ ఇంటర్వ్యూ విషయంలో బీబీసీ తన తప్పులను కప్పిపుచ్చుకుందన్న లార్డ్ డైసన్ నివేదిక
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: గూగుల్ మ్యాప్‌లో గాజా మసగ్గా ఎందుకు కనిపిస్తోంది? - BBC RealityCheck
- కోవిడ్: డిసెంబరు నాటికి భారత జనాభాకు సరిపడేలా వ్యాక్సీన్ తయారవుతుందా?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








