మమత - మోదీ: ‘దీదీ’ పదేళ్ల పాలనపై వ్యతిరేకతే బీజేపీకి బలమా

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఆమెకు మీరు పదేళ్లు అవకాశం ఇచ్చారు. ఇక ఇప్పుడు అవకాశం మాకివ్వండి" అంటూ భారత ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రజలను అడిగారు.
ఆమె ఎవరో కాదు. గత పదేళ్లుగా బెంగాల్‌ని పరిపాలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ.
బెంగాల్ రాష్ట్రంలో అభిమానులు ఆమెను దీదీ(అక్క) అని పిలుస్తారు.
మోదీ తన ప్రసంగంలో మమతను 'దీదీ.. ఓ మమతా దీదీ' అని సంభోదిస్తూ "మీరు మమ్మల్ని పరాయివారిమని అంటారు. కానీ, బెంగాల్ భూభాగం ఎవరినీ పరాయివారిగా చూడదు. ఇక్కడ ఎవరూ పరాయివారు కాదు" అని అన్నారు.
రాష్ట్రంలో బీజీపీ నుంచి ఎదురవుతున్న పోటీని ఆమె బెంగాలీలకు, పరాయివారికి జరుగుతున్న పోరుగా అభివర్ణించడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, EPA
‘‘మోదీ స్థానిక, సమాఖ్య మనోభావాలతో కూడిన ప్రసంగాన్ని చేశారు. కేంద్రంలో శక్తిమంతమైన బీజేపీ భారత్‌లో ఉన్న సమాఖ్య రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది" అని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ద్వైపాయన్ భట్టాచార్య అన్నారు.
మరోవైపు బెంగాల్‌లో బీజేపీ వివక్ష, విభజిత రాజకీయాలను తీసుకుని రావడానికి ప్రయత్నిస్తోందని మమత బెనర్జీ ఆరోపించారు.
బెంగాల్లో నాలుగు వారాల పాటు 8 దశల్లో జరగనున్న ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని అర్ధమవుతోంది.
ఈ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రాష్ట్రాల ఫలితాలతో కలిపి మే 2న వెలువడతాయి.
9. 2 కోట్ల జనాభా గల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ఎన్నడూ అధికారంలోకి రాలేదు.
ఈ రాష్ట్రాన్ని 34 ఏళ్ల పాటు పరిపాలించిన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఓడించి మమతా బెనర్జీ 2011లో అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు.
ఆమె పార్టీకి ప్రస్తుతం పదవీకాలం ముగియనున్న శాసనసభలో 295 సీట్లలో 211 సీట్లు ఉన్నాయి.
అయితే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణ వ్యవస్థ పటిష్టంగా ఉండకపోవడమే కాకుండా పార్టీలో క్రమశిక్షణ కూడా ఉండదు. ఈ పార్టీకి ఆదర్శవంతమైన సూత్రాలు కూడా ఏమీ లేవు. దేశంలో ఉన్న చాలా ప్రాంతీయ పార్టీల లాగే ఇక్కడ కూడా వ్యక్తిగత ఆకర్షణ శక్తిపైనే పార్టీ నడుస్తుంది. ఆమె మద్దతుదారులు ఆమెను "అగ్ని దేవత" అని పిలుస్తారు.

ఫొటో సోర్స్, EPA
2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 3స్థానాలు లభించాయి. కానీ, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలో ఉన్న 42 పార్లమెంట్ స్థానాలకు గాను 18 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే ఇది 40 శాతం ఓట్లను పొందింది.
బెనర్జీ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో 22 సీట్లు లభించాయి. ఇది 2014 ఎన్నికలతో పోలిస్తే 12 స్థానాలు తక్కువ. ఈ ఎన్నికలలో టీఎంసీ బాగా గాయపడింది.
ఇది మమతకి ఒక మేల్కొలుపులాంటిది 2021 లో జరుగుతున్న ఎన్నికలు ఆమెకు అస్తిత్వపు పోరు" అని రాజకీయ విశ్లేషకుడు రజత్ రే అన్నారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిస్తే ఆ పార్టీకి అదొక భారీ విజయం అవుతుంది. మోదీ దేశంలో అభిమాన నాయకునిగా కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్రాల ఎన్నికలు గెలవడానికి ఆయన పార్టీ ఇబ్బందులు పడుతోంది. మూడు వంతుల మంది ముస్లిం ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ఇది హిందూజాతీయవాద పార్టీ విజయంగా మారుతుంది.
2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాల ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుంది.
ఈ ఎన్నికలు భారత ప్రజాస్వామ్యానికి యుద్ధం లాంటివి. " ఒక వేళ ఇక్కడ బీజేపీ గెలిస్తే హిందూ రాజకీయాలు బెంగాల్ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లే అర్ధం. ఇదే వారు అడుగు పెట్టడానికి ఆఖరు కోట లాంటిది" అని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆయన మమత ఎన్నికల ప్రచారానికి వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.
బెనర్జీ గెలిస్తే ఆమె ఒక జాతీయ నాయకురాలిగా ఎదిగే అవకాశం ఉంది. ఆమె బీజేపీని ఎదుర్కొనేందుకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ప్రతిపక్ష నేతగా ఎదిగే అవకాశం ఉంది.
"మోదీకి వ్యతిరేకంగా మరే ఇతర ప్రతిపక్ష నాయకుడు విజయవంతమైన వ్యూహ రచన చేయలేకపోయారు. గెలిస్తే ఆమె ఒక సమాధానంగా నిలుస్తారు" అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లో సీనియర్ విజిటింగ్ ఫెలో నీలాంజన్ సర్కార్ అన్నారు.
ఇదంత సులభం కాకపోవచ్చు. బెంగాల్‌లో ఎక్కడికి వెళ్లినా స్థానిక టిఎంసి నాయకులపై విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలంటే నాయకులకు లంచాలు ఇవ్వాలని చాలా మంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు.
సంక్షేమ పథకాల నుంచి వచ్చే డబ్బును తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్ళినప్పుడు కొంత మంది పార్టీ కార్యకర్తలు బ్యాంకు బయటే నిలుచుని లంచాలు ఇమ్మని డిమాండు చేస్తూ ఉంటారని ఒక వ్యక్తి చెప్పారు.
ప్రభుత్వం రాజకీయంగా మారడమే ఇక్కడ పెద్ద సమస్య అని అన్నారు.
రాజకీయ ప్రత్యర్థులపై జరిగే హింస, టిఎంసి కార్యకర్తల అహంకారం గురించి కూడా ఇక్కడ ప్రజలు మాట్లాడతారు.
"ప్రత్యర్థులపై దాడి చేసి వేధించే రాజకీయ నేరాలే ఇక్కడ అతి పెద్ద సమస్య" అని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత ధన్‌పథ్ రామ్ అగర్వాల్ చెప్పారు.
ఇన్ని ఉన్నా ప్రజలకు మమతపై మాత్రం పెద్దగా కోపం ఉన్నట్లు కనిపించదు. ఆమెను వ్యక్తిగతంగా నేర చరిత్ర లేని నాయకురాలిగా చూస్తారు.
పదేళ్ల పాలన కారణంగా ఆమె పార్టీపై వ్యతిరేకత పెరగొచ్చు.. కానీ, ఆమె వ్యక్తిగత ప్రతిష్ట మాత్రం చెక్కు చెదరలేదు.
స్థానిక నాయకత్వంపై ప్రజల్లో ఆగ్రహం ఉందని ప్రశాంత్ కిశోర్ అంగీకరించారు. "కానీ, ఆమెకు ఇంకా ప్రజల మనస్సులో అక్క అనే ప్రతిష్ట మాత్రం చెక్కు చెదరలేదు" అంటారాయన.

ఫొటో సోర్స్, EPA
"అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను ఆమె ప్రతిష్ట మాత్రమే కాపాడగలదు. ఆమెను ఎవరూ ద్వేషించరు. బీజేపీ ప్రయత్నాలకు ఆమె పార్టీ చెదిరిపోలేదు" అని ఆయన అన్నారు.
గత 18 నెలల్లో ఆమె పార్టీ కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించింది.
ప్రజల ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి సుమారు 70 లక్షల మంది ప్రజలు కాల్ చేశారు.
12 సంక్షేమ పథకాలు ప్రజలకు సులభంగా అందడానికి ఏర్పాటు చేసిన ‘ముంగిట్లోకి ప్రభుత్వం’ అనే సేవను సుమారు 3 కోట్ల మంది ప్రజలు ఉపయోగించుకున్నారు.
సామాజిక పథకాలకు సంబంధించిన 10,000 ఫిర్యాదులను పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతోంది.
గ్రామీణ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.
విద్యార్థులకు సైకిళ్లు, స్కాలర్ షిప్‌లు, అమ్మాయిలు చదువు కొనసాగించడానికి నగదు బదిలీ, ఆరోగ్య బీమా లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఇలాంటి పథకాలతో మమత ప్రతిష్టకు మచ్చ లేకుండా చూసుకున్నారు.
మహిళా ఓటర్లలో ఆమెకు పాపులారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో ఆమె పార్టీ తరుపున 17 శాతం మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
మమతపై విజయం సాధించడానికి బీజేపీ ఆమె వ్యతిరేకులను తమ పార్టీలోకి తీసుకుంది.
బీజేపీ నిలబెట్టిన మొత్తం 282 అభ్యర్థులలో 45 మందికి పైగా వారి వారి పార్టీలను ఫిరాయించి బయటకు వచ్చినవారే.
అందులో 34 మంది మమత పార్టీకి చెందిన వారే. అందులో చాలామంది మమత పార్టీలో టికెట్లు దొరకని స్థానిక నాయకులు ఉన్నారు.
టీఎంసీని విమర్శించడం, బంగారు బెంగాల్ సాధిస్తామని అనడం తప్ప బీజేపీకి ఒక కచ్చితమైన దృక్పథం ఏమి లేదని చాలా మంది అంటారు.

ఫొటో సోర్స్, AFP
మరో వైపు బలహీన స్థితిలో ఉన్న కమ్యూనిస్టులు ముఖ్య పార్టీల ఓట్లు చీల్చడానికి ముస్లిం మతాధికారులతోనూ, కాంగ్రెస్ తోనూ జత కట్టాలని చూస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో జరిగే పోరు ఎప్పుడూ రెండు పార్టీల మధ్యే జరుగుతుంది.
ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కనీసం 45 శాతం ప్రజల ఓట్లను గెలవాల్సి ఉంటుంది.
‘‘కోల్‌కతా ఆకాశ హర్మ్యాలన్నీ బెనర్జీని బెంగాల్ పుత్రికగా అభివర్ణిస్తూ ఆమె ముఖ చిత్రంతో కూడిన బిల్ బోర్డులతో నిండిపోయాయి.
ఇది పరాయి వారి చేతిలో బందీగా ఉన్నానంటూ ఒక మహిళ చేస్తున్న విజ్ఞప్తిలా ఉంది.
ఈ కీలకమైన పోరులో ఆమెకు ఓటర్ల మద్దతు అవసరం ఉందని ఇలా చెబుతున్నారు" అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








