కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సీన్ వేస్టేజీ ఎక్కువగా ఉందా... ప్రధాని మోదీ ఆ మాట ఎందుకు అన్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనా కేసులు పెరుగుతున్న వేళ కొత్త తలనొప్పులు వస్తున్నాయి. కేసుల పెరుగుదలను ఎదుర్కోవడం ఒక సమస్య అయితే, కరోనాను అరికట్టాల్సిన వ్యాక్సీన్ వృథా పోవడం మరో సమస్యగా తయారయింది.
వ్యాక్సీన్ వృథా విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయని భారత ప్రభుత్వం చెబుతోంది. స్వయంగా ప్రధాని మోదీ కూడా ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో ఈ విషయం ప్రస్తావించారు.
వ్యాక్సీన్ వృథా (కేంద్ర లెక్కల ప్రకారం):
తెలంగాణ: 17.6%
ఆంధ్రప్రదేశ్: 11.6%
ఉత్తర్‌ప్రదేశ్ 9.4%
దేశవ్యాప్తం (జాతీయ సగటు): 6.5%
భారత్‌లో ఇప్పటి వరకూ 23 లక్షల డోసులు వృథా అయినట్టు ఓ అంచనా.
వ్యాక్సీన్ వృథా వెనుకున్న కారణాల గురించి ఆంధప్రదేశ్‌లో వ్యాక్సీనేషన్ బాధ్యతల్లో ఉన్న ఓ ఉన్నతాధికారి బీబీసీతో మాట్లాడారు.
‘‘దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రారంభంలో వృథా అయిన మాట వాస్తవమే. కొందరికి అయితే వ్యాక్సీన్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే వేశారు. అలాగే వైద్య సిబ్బందిలో కొందరు శిక్షణ పొందినప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. వ్యాక్సీన్ బాటిల్‌లో ఎన్ని డోసులు ఉన్నాయో, అంత మంది వచ్చేవరకూ ఎదురు చూసి అప్పుడే బాటిల్ తెరవాలి. కానీ ఒకరిద్దరు ఉన్నా వ్యాక్సీన్ వేసేశారు. చాలా సందర్భాల్లో పెద్ద అధికారులు వచ్చినప్పుడు కూడా ఇలా జరిగింది. వాళ్లకు నర్సులు ఎదరు చెప్పలేరు కదా’’ అని బీబీసీతో అన్నారు సదరు అధికారి.

ఫొటో సోర్స్, EPA/ABIR SULTAN
వ్యాక్సీన్‌ను నిర్ణీత వేడి (ఉష్ణోగ్రత) దగ్గర భద్రపరచాలి. లేకుంటే అది పాడవుతుంది. కోవిషీల్డులో 10 డోసులు, కోవ్యాక్సీన్‌లో 20 డోసులు ఉంటాయి. వాటిని తెరిచిన నాలుగు గంటల్లో వాడేయాలి.
వ్యాక్సీన్ వృథాకు కారణాలు:
- ఎక్స్‌పైర్ అవడం
- వేడి ఎక్కువ ఉండడం
- చలి ఎక్కువై గడ్డకట్టుకుపోవడం
- బాటిల్ పగలడం
- బాటిల్ కనిపించకపోవడం
- తిరిగి పంపేప్పుడు మిస్ అవడం లేదా సరిగా ప్యాక్ చేయకపోవడం వల్ల పగలడం
- తిరిగి భద్రపరచడంలో లోపాలు
- డోసులు కావల్సిన సంఖ్యలో తీసుకోకపోవడం (అంటే పది డోసుల బాటిల్ నుంచి 9 డోసులు తీయడం లాగా)
- నీరు, లేదా ఇతర పదార్థలతో బాటిల్ కలవడం
- ఇంజెక్షన్ సరిగా చేయకపోవడం
- రవాణాలో సమస్యలు
- తక్కువ మంది వచ్చినా బాటిల్ ఓపెన్ చేయడం
‘‘మేం ఒకటే చెప్పాం. ఆ బాటిల్ లో ఎన్ని డోసులు ఉంటాయో, అంత మంది వచ్చి కూర్చున్న తరువాత, రిజిస్ట్రేషన్ వంటి ఫార్మాలిటీస్ పూర్తయ్యాక, బీపీ వంటివి చూశాక, అప్పుడే బాటిల్ తెరవమన్నాం. ఒకవేళ సంఖ్య తగ్గితే, బాటిల్ తెరవకుండా మరునాడు రమ్మనమని, నిర్మొహమాటంగా చెప్పమన్నాం. కానీ చాలా చోట్ల ఇలా జరగడం లేదు. పది మంది స్థానంలో ఇద్దరు ముగ్గురు వచ్చినా వ్యాక్సీన్ వేస్తున్నారు’’ అని ఆ అధికారి వివరించారు.

ఫొటో సోర్స్, REUTERS/FRANCIS MASCARENHAS/FILE PHOTO
కొన్ని చోట్ల ఒకే డోస్ డబుల్ యుటిలైజేషన్ జరిగినట్టు కూడా రాసినట్టు ఆయన చెప్పారు. చాలా చోట్ల వ్యాక్సీన్ సరఫరాకు ముందు కచ్చితమైన సంఖ్యను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
అయితే, వ్యాక్సీన్ వృథా విషయంలో కేంద్ర వాదనను తెలంగాణ ఖండించింది. కేంద్రం చెప్పిన లెక్కలు తప్పని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.
‘వ్యాక్సీనేషన్ ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్రం వాడుతున్న సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఉన్నాయి. బఫర్ స్టాక్, రాష్ట్రంలో ఉన్న సైనికుల కోసం ఇచ్చిన వ్యాక్సీన్ వివరాలు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే ఈ తప్పుడు అంకెలు ప్రచారంలోకి వచ్చాయి’’ అని తెలంగాణ ప్రజారోగ్య డైరెక్టర్ ఒక ప్రకటనలో చెప్పారు.
ఈ లోపాలు సవరిస్తే రాష్ట్రంలో వ్యాక్సీన్ వేస్టేజీ 1.22% మాత్రమే ఉంటుందని వారు అంటున్నారు.
తెలంగాణ లెక్కల ప్రకారం కేంద్రం, రాష్ట్రానికి 9,52,550 డోసులు ఇచ్చింది. అందులో సైనికులకు 40,540 డోసులు ఉంచారు. వ్యాక్సీన్ కేంద్రాల్లో బఫర్ స్టాక్ గా 25,680 డోసులు పెట్టారు.
మొత్తం తెలంగాణలో వాడిన వ్యాక్సీన్లు 8,86,330 డోసులు. అందులో ప్రజలకు వేసిన వ్యాక్సీన్లు 8,75,478 డోసులు. వృథా అయినవి 10852 (1.22 శాతం). ఇది తెలంగాణ ప్రభుత్వం చెబుతోన్న లెక్క.
ఇందులో ఆర్మీ వారికి రిజర్వు చేసినవి, బఫర్ స్టాక్ లో ఉన్నవి ఉపయోగపడతాయా, వృథా అయ్యాయా, వాడుతారా, వాడలేదా అన్న విషయంలో తెలంగాణ అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న కేసులు
దేశవ్యాప్తంగానూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్చి 1-15 మధ్య కృష్ణా జిల్లాలో 171 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 150 శాతం, విశాఖపట్నంలో 100 శాతం, చిత్తూరులో 90 శాతం, గుంటూరులో 70 శాతం కేసులు పెరిగాయి.
శుక్రవారం ఆంధ్రలో 984 పాజిటివ్ కేసులు వచ్చాయి. తెలంగాణలో కూడా పెరుగుదల ఈ స్థాయిలోనే ఉంది.
పెరుగుతున్న కేసులను ఎదుర్కోవడానికి, కట్టడి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీబీసీతో చెప్పారు ఆంధ్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గీత.
‘‘పరీక్షల సంఖ్య పెంచుతున్నాం. కమ్యూనిటీల వారీగా పరీక్షలు పెంచాం. శాంపిల్లు పెంచాం. ముఖ్యంగా విద్యాసంస్థలపై దృష్టి పెట్టాం. ఏప్రిల్ 1 నుంచి విస్తృతంగా సీరో సర్వేలైన్స్ చేస్తాం. అలాగే మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టేన్సింగ్ గురించి విస్తృత ప్రచారం చేస్తాం. ఆసుపత్రుల్లో అన్ని వసతులు, పడకలు, అంబులెన్సులు సిద్ధం చేస్తున్నాం’’ అని ఆమె అన్నారు.
ఒకవైపు తెలంగాణ ఇప్పటికే విద్యా సంస్థలను మూసేయగా, ఆంధ్రలో మాత్రం ఆ ప్రసక్తే లేదని, విద్యా సంస్థలు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తారన్న ఊహాగానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిపారేశారు. పరిశ్రమల మూసివేత కూడా ఉండదని చెప్పారు.
గతంలో విధించిన లాక్‌డౌన్ వల్ల చాలా దెబ్బతిన్నామని... కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని, కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలను కోరారు. ఊరేగింపులు, ర్యాలీలు, ఫంక్షన్లు తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- దేశంలో మళ్లీ లాక్‌డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








