‘స్వేరోస్’ ప్రవీణ్ కుమార్: హిందూ దేవుళ్లను పూజించను అంటూ చేసిన ప్రతిజ్ఞ ఎందుకు వివాదాస్పదమైంది

ఫొటో సోర్స్, UGC
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థుల సంఘం స్వేరో యూనియన్ ఏటా భీమ్ దీక్ష పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటుంది. కాన్షీరాం జయంతి నుంచి అంబేడ్కర్ జయంతి వరకూ నెల రోజుల పాటూ ఇది సాగుతుంది.
ఏటా ఈ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు స్వేరో పూర్వ, ప్రస్తుత విద్యార్థులు. ఈసారి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట వద్ద 2 వేల ఏళ్ల నాటి ప్రాచీన బౌద్ధ స్తూపం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఆ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా చేయి పెట్టి నుంచున్న ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో హిందూ దేవుళ్లపై తనకు నమ్మకం లేదు అన్న మాటలు వినిపిస్తాయి.
దీంతో ప్రవీణ్ కుమార్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నరన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పలువురు ఆయనపై విమర్శలు చేశారు. కొందరు కేసులు పెట్టారు. ఆయనతో పాటూ మొత్తంగా స్వేరో సంస్థ హిందూ వ్యతిరేక భావాలను ప్రచారం చేస్తోందన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్ బీజేపీ దళిత నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కార్వాన్ నియోజకవర్గ బీజేపీ దళిత మోర్చా కన్వీనర్ అల్వాల శ్యామ్ రావ్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. ఐపిసి 298 (మతవిశ్వాసాలను గాయపరచడం), 153 (అల్లర్లు జరిగేలా ప్రేరేపించడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు.
దీనిపై ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ తరువాత అదే వేదికపై తాను చేసిన ప్రసంగాన్ని ట్విట్టర్ లో పెట్టారు.
‘‘మనం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. ఎవరి మీదా కోపం లేదు. మీరే హిందూ, క్రైస్తవ, జైన, ముస్లిం.. ఏ దేవుడికైనా మొక్కండి.. కానీ మనం తినే ప్రతీ మెతుకుమీదా రమాబాయి (అంబేడ్కర్ భార్య) ముద్ర ఉంది. ప్రతీ ముద్దలో ఆమె కన్నీళ్లున్నాయి. మనకు తిండి పెట్టిన మహనీయులను మర్చిపోకండి. స్వేరోయిజం అంటే కృతజ్ఞత భావంతో బతకడం. సాయం చేసినవారిని మరవకుండా ఉండడం. కొందరు స్వేరోయిజంపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అంటూ సాగుతుంది ఆ ప్రసంగం.

ఫొటో సోర్స్, ugc
ప్రవీణ్ కుమార్ ప్రకటనలో ఏముంది?
‘‘ఆ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. అన్ని పార్టీల స్థానిక నాయకులూ వచ్చారు. ఆ సమయంలో అక్కడికి ఒక బౌద్ధ కుటుంబం వచ్చి, వేదికపైకి ఎక్కి, బుద్ధ వందనం చదవడం ప్రారంభించారు. దాంతో పాటూ నాగపూర్‌లో 1956లో అంబేడ్కర్ చేసిన ప్రతిజ్ఞ కూడా చదివారు. దాంతో మాకే సంబంధమూ లేదు. నేను కానీ, మా స్వేరో సహచరులు కానీ వేదిక మీద ఆ బౌద్ధ కుటుంబం చెప్పిన దాంతో ఏకీభవించడం లేదు. ఇది ఎవరి మతపరమైన మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే, దానికి మేం తీవ్రంగా చింతిస్తున్నాం. అప్పటికప్పుడే వేదికమీదే మా సంస్థ ప్రతినిధులు ఈ విషయంపై వివరణ ఇచ్చారు.’’ అని ప్రకటనలో పేర్కొన్నారు ప్రవీణ్ కుమార్.
‘‘స్వేరో లో అన్ని మతాల వారూ ఉన్నారు. మేం అన్ని మతాల నుంచి మంచిని తీసుకుంటాం. మేం మా ఇళ్ళల్లోనూ లేదా, పనిచేసే చోటా, ఏ మతంపైనా ఏ వ్యతిరేక భావాలనూ ప్రచారం చేయం. అన్ని పండుగలనూ జరుపుకొంటాం. మేం కేవలం ఈ దేశంలో సమ సమాజం కోసం, విద్య, ఆరోగ్య అవగాహన, శాస్త్రీయ దృక్పథం, ఆర్థిక సాధికారత ద్వారా ప్రయత్నిస్తున్నాం. ద్వేషం ద్వారా కాదు.’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే ప్రవీణ్ కుమార్‌ను సమర్థించే కొందరు, ఆ వీడియో మార్పింగ్ చేశారని వాదించారు. కానీ అది అసలు వీడియోయేనని నిర్వాహకులు ధ్రువీకరించారు.

‘అనుకోకుండా జరిగింది’
అయితే ఈ ప్రతిజ్ఞలో ప్రవీణ్ కుమార్ ఉద్దేశపూర్వకంగా పాల్గొనలేదని వివరిస్తున్నారు కార్యక్రమం నిర్వహించిన స్వేరో సంస్థ ప్రతినిధుల్లో ఒకరైన పులి కవిత. స్వేరో ఉపాధ్యాయ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు.
‘‘మేం ఏటా భీం దీక్ష చేపడతాం. ఈసారి ఈ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని ఎంచుకున్నాం. స్వేరోలో సభ్యులుగా అన్ని మతాల వారూ ఉన్నారు. స్వేరో ఎప్పుడూ బౌద్ధం సహా ఏ మతాన్నీ సమర్థించదు. వ్యతిరేకించదు. వ్యక్తిగత నిబద్ధత, అభివృద్ధి, సమాజం పట్ల అంకితభావం, మన ఎదుగుదలకు కారణమైన మహనీయుల పట్ల కృతజ్ఞత - వీటినే బోధిస్తుంది. బౌద్ధాన్ని విశ్వసించే అంబేడ్కరిస్టులు స్వేరో సంస్థలోనూ, సంస్థకు మద్దతుగానూ ఉన్నప్పటికీ, ఆ బౌద్ధ ప్రచారాన్నీ, స్వేరోయిజాన్నీ ఎప్పుడూ వేర్వేరుగానే చూస్తాం. ఆ విషయంలో ప్రవీణ్ కుమార్ కూడా చాలా కచ్చితంగా ఉంటారు. ఏ మతాన్నీ దేవుళ్లనీ కించపరచవద్దు, వ్యతిరేకించవద్దు, సమర్థించవద్దు అని ఆయన స్పష్టంగా చెబుతారు’’ అంటూ వివరించారు కవిత.
అయితే ఆ రోజు మాత్రం ఆ విషయం అనుకోకుండా జరిగిందేనని అంటున్నారామె.
‘‘వేదిక మీద చాలా మంది మాట్లాడారు. ఎవరికి వారు తమ సిద్ధాంతాలు, పద్ధతులు అవీ చెప్పుకున్నారు. అంతా హడావుడిగా ఉంది. అదే సందర్భంలో అక్కడకు, దళితుల్లో బౌద్ధమతాన్ని ప్రచారం చేసే ఒక కుటుంబం వచ్చింది. వారెంతో కాలంగా దళితులను బౌద్ధం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. వారు వేదిక మీద మాట్లాడుతూ సడెన్‌గా ప్రతిజ్ఞ అని ప్రకటించారు. అందరూ నుంచున్నప్పుడు ప్రవీణ్ కుమార్ కూడా నుంచున్నారు. తీరా ఈ ప్రతిజ్ఞ మొదలయ్యాక ప్రవీణ్ గారు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మొహమాటానికి తప్పదన్నట్టు, ఆయన నుంచున్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు కవిత.
స్వేరో వేదికపై జై శ్రీరాం
ఈ ప్రతిజ్ఞపై అక్కడికక్కడే కొందరు స్థానిక నాయకులు అభ్యంతరం చెప్పారు. తమకు స్వేరోయిజంపై, ప్రవీణ్ కుమార్‌పై గౌరవం ఉందనీ అదే సందర్భంలో బౌద్ధ ప్రతిజ్ఞ స్వేరో వేదికపై చేయడం సరికాదనీ ధర్మపురికి చెందిన బీజేపీ నాయకులు కన్నం అంజన్న అన్నారు.
ఆయన, ఆయన అనుచరులు అదే వేదికపై జై శ్రీరాం నినాదాలు ఇచ్చారు.

ఫొటో సోర్స్, swaeros
ప్రతిజ్ఞ చట్ట వ్యతిరేకమా?
‘‘ఏ అఖిల భారత సర్వీసు అధికారికీ ప్రత్యేకంగా మతపరమైన నిబంధనలు ఏమీ ఉండవు. పౌరులకు ఉండే అన్ని మతపరమైన హక్కులూ, పరిమితులే వారికీ ఉంటారు. కేవలం రాజకీయాల్లో పాల్గొన కూడదన్న నిబంధన మాత్రమే ఉంటుంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో చెప్పినట్టు ఏ మతాన్నీ ప్రత్యేకంగా ప్రోత్సహించకూడదన్నది మాత్రమే వర్తిస్తుంది’’ అని బీబీసీతో చెప్పారు ఆకునూరి మురళి.
తెలంగాణలో ఐఎఎస్‌గా రిటైరైన ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు.
‘‘ఉదాహరణకు తిరుమల దేవస్థానాల ఈవోగా ఐఎఎస్ అధికారిని నియమిస్తారు. అక్కడ ఈవో ఉద్యోగ నియమావళిలో పరిపాలనా బాధ్యతలు మాత్రమే ఉంటాయి. కానీ ఈవోలు పూజల్లో పాల్గొంటారు. దాన్ని ఎవరూ అభ్యంతర పెట్టరు కదా. అది వ్యక్తిగత విశ్వాసం కిందకు వస్తుంది. స్వచ్ఛంద సంస్థల కార్యాక్రమాల్లో పాల్గొనడం, వేదిక పంచుకోవడం కూడా తప్పు కాదు. కాకపోతే ఆ స్వచ్ఛంద సంస్థకు చెందిన పదవులు అంటే డైరెక్టర్ వంటి పదవుల్లో ఉండకూడదు’’ అని మురళి వివరించారు.
‘‘ఈ మధ్య మతపరమైన విషయాల్లో ఏం మాట్లాడినా దేశద్రోహి అంటున్నారు. అది చాలా దారుణం. ప్రవీణ్ కావాలని చేయని దానికి, ఆయన్ను పట్టుకుని రచ్చ చేయడం సరికాదు. పైగా అది అంబేడ్కర్ చేసిన ప్రతిజ్ఞ. ఈ లెక్కన ఈరోజుల్లో అంబేడ్కర్ బతికి ఉండుంటే ఏం చేసేవారో? నేను స్వేరోలను దగ్గర్నుంచి చూశాను. వారు సామాజిక సాధికారత కోసం పనిచేస్తున్నారు. అందులో క్రైస్తువులు, ముస్లింలే కాదు, హార్డ్ కోర్ హిందువులూ ఉన్నారు. గుండు చేయించుకుని, బొట్టుపెట్టుకునేవారు కూడా స్వేరోస్ లో ఉన్నారు’’ అని అన్నారు.
‘‘అది కించపరిచేది కాదు. హిందు దేవతలపై నాకు నమ్మకం లేదు అనడం తప్పేం కాదు. తిట్టినట్టు కాదు. పైగా ఆయన, తనకు తెలియకుండా జరిగింది అని చెప్పుకునే అవకాశం కూడా ఉంది. ఒకవేళ తెలిసి చేసినా, బౌద్ధ ప్రతిజ్ఞ చేయడం తప్పు కాదు. అంబేడ్కర్ ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆయనపై కేసు పెట్టనప్పుడు ఇప్పుడెలా కేసు పెడతారు? అలాగే అఖిల భారత సర్వీసు అధికారులు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడంపై నిషేధం లేదు. చాలా మంది రోజూ పాల్గొంటూనే ఉన్నారు.’’ అన్నారు అరవింద రావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన అరవింద రావు, సంస్కృత, వైదిక, బౌద్ధ సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు.
అయితే చట్ట ప్రకారం ప్రవీణ్ కుమార్ చేసిన ప్రతిజ్ఞ, ఆ కార్యక్రమం తప్పుకాకపోయినా, స్వేరోలు గ్రామాల్లో ద్వేషాన్ని పెంచుతున్నారని ఆరోపించారు అరవింద రావు.
‘‘నాకు తెలిసిన వారు చాలా మంది చెప్పారు. గ్రామాల్లో స్వేరోలు హిందూ దేవుళ్ల పటాలు తగలబెడుతున్నారు. ఒక వర్గంలో ద్వేషం పెంచుతున్నారు. గ్రామాలకు వెళ్లి ఇన్నాళ్లూ మనల్ని అణగదొక్కారని చెబుతూ ఒకరకమైన విక్టిమ్ మోడ్ కల్పిస్తున్నారు. అది తప్పు. కానీ దాని వెనుక ఎవరు ఉన్నారో తెలియదు. విదేశీ శక్తులు ఉన్నాయా? అమెరికా ఉందా.. యూకే ఉందా.. యూకే ఇప్పటికీ భారత్‌కు శత్రువే. దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటోంది. ఇది కచ్చితంగా ప్రవీణ్‌కి వచ్చిన ఆలోచన కాదు. వేరేవాళ్లెవరో వీరిని పెట్టి ఆడిస్తున్నారు. వీరు ఆడుతున్నారు అంతే. బయటి శక్తులు ఏవో, భారత సమాజాన్ని విభజించే శక్తులు, ఇదంతా చేస్తున్నాయి. ఇప్పుడు పోరాటం శాంతియుత భారత్ కోరుకునే వారు, భారత్ ముక్కలవ్వాలని కోరుకునేవారి మధ్యే’’ అన్నారు అరవిందరావు.

అసలేమిటీ ప్రతిజ్ఞ?
1956లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో అక్టోబరు 14న అంబేడ్కర్ ఈ ప్రతిజ్ఞ చేయించారు.
అంబేడ్కర్ బౌద్ధ మతంలోకి మారుతున్న సందర్భంగా ఆయన ఇది తయారు చేశారు. ఇందులో మొత్తం 22 వాక్యాలు ఉంటాయి. అంబేడ్కర్ తనతో పాటూ మతం మారిన వేలాది మంది దళితులతో అక్కడ ఇవి చదివించారు. నాగపూర్ లో అంబేడ్కర్ మతం మారిన ప్రదేశాన్ని దీక్షా స్థలిగా పిలుస్తారు. అక్కడ కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో ఒక స్తూపంపై ఆ ప్రతిజ్ఞలోని 22 పాయింట్లను అక్కడే వివిధ భాషల్లో చెక్కించారు. 2017 ఏప్రిల్ లో అంబేడ్కర్ పుట్టిన రోజున ప్రధాని మోదీ ఆ దీక్షా స్థలిని సందర్శించారు.
దళితవాదంతో, అంబేడ్కర్ బోధనలతో ప్రభావితమై బౌద్ధంలోకి మారే దళితులు ఈ ప్రతిజ్ఞ చేస్తుంటారు.
‘‘ నాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మీద నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను. నాకు రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను.. నేను బుద్ధుడు ప్రవచించిన సూత్రాలకు, ప్రబోధాలకు ఏమాత్రం వ్యతిరేకమైన విధంగా ప్రవర్తించను’’ అంటూ సాగుతుందీ ప్రతిజ్ఞ.
దీక్షా స్థలిలో శిలా ఫలకంపై వివిధ భాషల్లో చెక్కించిన పాయింట్లు:
1. నాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మీద నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను.
2. నాకు రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను.
3. నాకు గౌరీ మీద, గణపతి మీద, ఇతర హిందూ దేవతల ఎవరిమీదా నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను.
4. నేను దేవుడి అవతారాల సిద్ధాంతాలను నమ్మనుగాక నమ్మను.
5. నేను బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమని అసలే నమ్మను. ఇది కుట్రతో కూడిన తప్పుడు ప్రచారంమని నమ్ముతున్నాను.
6. నేను శ్రాద్ధ కర్మలను పాటించను. పిండదానాలు చేయను.
7. నేను బుద్ధుడు ప్రవచించిన సూత్రాలకు, ప్రబోధాలకు ఏమాత్రం వ్యతిరేకమైన విధంగా ప్రవర్తించను.
8. నేను బ్రాహ్మణుల ద్వారా ఎలాంటి క్రతువులను, ఆచారాలను నిర్వహించను.
9. నేను మనుషులంతా ఒకటేనని నమ్ముతాను.
10. నేను సమానత్వాన్ని సాధించేందుకు కృషి చేస్తాను.
11. నేను బుద్ధుడు ప్రవచించిన 8 అంచెల మార్గాన్ని అనుసరిస్తాను.
12. నేను బుద్ధుడు ప్రవచించిన 10 పారమితలను పాటిస్తాను.
13. నేను ప్రాణులన్నింటి పట్ల దయగా ఉంటాను. వాటిని సంరక్షిస్తాను.
14. నేను దొంగతనం చేయను.
15. నేను అబద్ధం చెప్పను.
16. నేను నీతిమాలిన దుష్ప్రవర్తనలకు దూరంగా ఉంటాను.
17. నేను మద్యం సేవించను.
18. నేను బౌద్ధమతం ప్రభోధించే ప్రజ్ఞ, శీలం, కరుణ అనే మూడు సూత్రాల ప్రకారం నా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటునాను.
19. నేను మానవాళి అభివృద్ధిని విచ్ఛిన్నం చేసే మతాన్ని, మనుషుల పట్ల వివక్షను ప్రదర్శించే మతాన్ని, మనుషుల్ని చిన్న చూపు చూసే హిందూ మతాన్ని విసర్జించి బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాను.
20. నేను బౌద్ధ దమ్మాన్ని సద్ధమ్మమని గట్టిగా నమ్ముతున్నాను.
21. నేను కొత్త జీవితంలో ప్రవేశిస్తున్నానని విశ్వసిస్తున్నాను.
22. నేను ఇక నుంచి బుద్ధుని ప్రబోధల ప్రకారమే నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను.

హిందూయిజం – బౌద్ధం:
ప్రస్తుతం చాలా మంది బౌద్ధం గురించి మాట్లాడే వారు, బౌద్ధాన్ని సరిగ్గా చదవలేదనీ, అంబేడ్కర్‌ని సరిగా అర్థం చేసుకోలేదనీ అంటున్నారు అరవింద రావు.
‘‘ఇది హిందూ – బౌద్ధ మధ్య యుద్ధం కాదు. బౌద్ధంలో చాలా శాఖలు, రకాలు ఉన్నాయి. అప్పట్లో బౌద్ధ, హిందూ పండితుల మధ్య చర్చలూ, వాదనలు జరిగాయి. వాస్తవికత, నేను అనే భావన, బుద్ధి.. ఇలా ప్రపంచంలో ఎక్కడా జరగని విషయాలపై చర్చలు జరిగేవి. వారు పరస్పరం విబేధించుకున్నా, ఎదుటి వారి నైతికతను తప్పు పట్టలేదు. కానీ ఇప్పటి వారు బౌద్ధం గురించి చెప్పేటప్పుడు, హిందూత్వానికి వ్యతిరేకిగా చూపుతారు’’ అని అరవింద రావు అన్నారు.
‘‘వారు చరిత్రను సరిగా చదవలేదు. రైస్ డేవిడ్స్ (భారత్ లో పనిచేసిన బ్రిటిష్ అధికారి) వంటి వారు పూర్తి అధ్యయనం చేయకుండా రాసిన వాక్యాలు పట్టుకుని కథలు అల్లుతారు. ఆఖరికి బౌద్ధం పతనానికి బ్రాహ్మణులు కారణం కాదు, విదేశీ దండయాత్రలే కారణమని అంబేడ్కర్ చెప్పినా వారికి ఎక్కదు. ‘డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ బుద్ధిజం’లో అంబేడ్కర్ ఆ విషయం చెప్పాడు.
విదేశీ దండయాత్రలు భారతదేశంలో బౌద్ధానికి మరణ శాసనం రాశాయన్నారు అంబేడ్కర్. వీళ్లు చాలా మంది బుద్ధిజాన్ని చదవకుండా, అంబేడ్కర్ ను సరిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. అంబేడ్కర్ హిందు నుంచి బౌద్ధానికి వెళ్లినా ప్రజల్లో శత్రుత్వం పెంచమనలేదు. నేను వారికి చెప్పేది ఒకటే. మీరు రికార్డుల్లో బౌద్ధులుగా నమోదు చేసుకోండి. బౌద్ధాన్ని చదవండి. దానిలో ఏముందో తెలుసుకోండి’’ అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు... అమరావతి భూముల సేకరణపై విచారణకు రావాలని ఆదేశం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










