ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీర్థ్ సింగ్ రావత్ ఎంపిక... త్రివేంద్ర సింగ్ రావత్ ఆకస్మిక రాజీనామాకు కారణాలు ఏమిటి?

ఫొటో సోర్స్, Ani
- రచయిత, ధృవ మిశ్రా
- హోదా, డెహ్రాడూన్ నుంచి బీబీసీ కోసం
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా తీర్థ్ సింగ్ రావత్ పేరును బీజేపీ సూచించింది. బుధవారం డెహ్రాడూన్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తీర్థ సింగ్ రావత్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 56 ఏళ్ల రావత్ ఉత్తరాఖండ్ బీజేపీ పార్టీలో ప్రముఖులు. పౌరీ గర్హ్వాల్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.
ఈ విషయాన్ని వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించిన తరువాత రావత్ మాట్లాడుతూ.. "నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రధాని మోదీకి, హోం మంత్రి, ఇతర పార్టీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు రావత్ ఆ రాష్ట్ర మొట్టమొదటి విద్యా శాఖ మంత్రిగా వ్యవహరించారు. తరువాత 2007లో ఆయన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2012లో ఎమ్మెల్యేగా ఎన్నికయిన తరువాత 2013లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ నాయకత్వ పగ్గాలు అందుకున్నారు.
అంతకుముందు మంగళవారం నాడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ బేబీ రాణి మౌర్యకు తన రాజీనామా అందజేశారు.

ఫొటో సోర్స్, TWITTER @ TSRAWATBJP
ఈ నిర్ణయం పార్టీ ఉమ్మడిగా తీసుకుందని ఆ తర్వాత ఆయన మీడియాతో చెప్పారు. బుధవారం బీజేపీ ఎంఎల్ఏలు అందరూ సమావేశమవుతారని తెలిపారు.
రాజీనామాకు కారణం ఏమిటని అడిగినపుడు.. ఆ ప్రశ్నకు సమాధానం దిల్లీలో లభిస్తుందని త్రివేంద్రసింగ్ బదులిచ్చారు. ఆయన సీఎం పదవి నుంచి తప్పుకుంటారని కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచీ.. ఇప్పటివరకూ ఎనిమిది మంది ముఖ్యమంత్రులయ్యారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నిరంతరమా అన్నట్లు కొనసాగుతోంది. కేవలం ఎన్.డి.తివారి మాత్రమే ఐదేళ్లు పూర్తి కాలం సీఎంగా కొనసాగారు.
మొత్తం 70 మంది సభ్యులు గల రాష్ట్ర శాసనసభలో బీజేపీకి ప్రస్తుతం 56 మంది ఎంఎల్ఏలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు ఉండగా.. ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది.

ఫొటో సోర్స్, TWITTER @ TSRAWATBJP
ఆకస్మికంగా దిల్లీ నుంచి పరిశీలకులు...
డెహ్రాడూన్ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర వేసవి రాజధాని గారాసాయిన్‌లో ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వంలో కీలకమైన ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంఎల్ఏలు అందరూ ఇక్కడే ఉన్నారు.
అకస్మాత్తుగా బీజేపీ కేంద్ర నాయకత్వం దిల్లీ నుంచి ఇద్దరు పరిశీలకులను మార్చి ఆరో తేదీ శనివారం రోజు డెహ్రాడూన్‌కు పంపించింది. వారిలో ఒకరు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమన్ సింగ్ కాగా, మరొకరు ఉత్తరాఖండ్ బీజేపీ ఇన్‌చార్జ్ దుష్యంత్ గౌతమ్.
బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. వెంటనే సీఎం త్రివేంద్రసింగ్ రావత్ డెహ్రాడూన్ చేరుకున్నారు. బీజేపీ ఎంఎల్ఏలు మొత్తం డెహ్రాడూన్ రావటం మొదలైంది. ముఖ్యమంత్రిని మారుస్తుండవచ్చునని, అందుకే దిల్లీ నుంచి పరిశీలకులను పంపించారని ఊహాగానాలు మొదలయ్యాయి.
బీజేపీ కోర్ గ్రూప్ శనివారం సాయంత్రం గంటసేపు సమావేశమైంది. ఆ సమావేశంలో ఏం జరిగిందని సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌ను మీడియా ప్రశ్నించినపుడు ఆయన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, TWITTER @ TSRAWATBJP
అకస్మాత్తుగా నాయకత్వ మార్పు ఎందుకు?
బీజేపీ ఉత్తరాఖండ్ సీఎంను మార్చే పనిలో ఉందని, అసమర్థతకు బీజేపీ దగ్గర ఉన్న సమాధానం ముఖాన్ని మార్చటమేనని.. ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ విమర్శించారు.
ఆదివారం అంతా మామూలుగా ఉన్నట్లు కనిపించింది. కానీ మార్చి ఎనిమిదో తేదీన గారాసాయిన్‌లో మహిళా దినోత్సవంలో పాల్గొనాల్సిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ హుటాహుటిన దేశ రాజధాని దిల్లీకి వచ్చారు. ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు అనిల్ బులానిని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాను ఆయన కలిశారు. దీంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారుస్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
''ముఖ్యమంత్రి త్రివేదంద్ర సింగ్ రావత్ మీద పార్టీలో ఇప్పటికే అసంతృప్తి ఉంది. దేవస్థానం బోర్డు ఏర్పాటు వంటి కొన్ని నిర్ణయాలతో బీజేపీ కీలక ఓటు బ్యాంకైన ఆలయ అర్చకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి స్వయంగా ఈ అంశంపై కోర్టుకు వెళ్లారు'' అని సీనియర్ జర్నలిస్ట్ జైసింగ్ రావత్ పేర్కొన్నారు.
''గార్సాయిన్‌లో వేసవి రాజధానిని నిర్మించిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. రోడ్డును వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన మహిళల మీద అసెంబ్లీ ప్రారంభం రోజునే లాఠీచార్జి చేయించారు. ఇది పర్వత ప్రాంతాల ప్రజలకు తప్పుడు సందేశం పంపింది. జనంలో కూడా చాలా ఆగ్రహం వ్యక్తమవుతోంది'' అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- హిమాలయాల్లో కార్చిచ్చులను ఆపి కరెంటు సృష్టిస్తున్నారు.. ఇలా..
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








