యశస్వినీ దేశ్వాల్
దిల్లీకి చెందిన యశస్విని సింగ్ దేశ్వాల్ (23) షూటింగ్ క్రీడాకారిణి. ఆమె 10మీ.ల ఎయిర్ పిస్టల్ కేటగిరీలో పోటీ పడేవారు. 2019లో దేశ్వాల్ ISSF వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఈ గెలుపు ద్వారా ఆమె టోక్యో వరల్డ్ కప్‌కు అర్హత సాధించారు.
2017లో ISSF వరల్డ్‌కప్ ఛాంపియన్‌షిప్‌లో వరల్డ్ జూనియర్ రికార్డును సమం చేస్తూ గోల్డ్ మెడల్ సాధించారు. ISSF వరల్డ్‌కప్‌లో సిల్వర్ మెడల్, 2016 సౌత్ ఏషియన్ గేమ్స్‌లో టీమ్, వ్యక్తిగత విభాగాలలో బంగారు, కంచు పతకాలను దేశ్వాల్ సొంతం చేసుకున్నారు.
వీకే విస్మయ
వెల్లువ కొరొత్ విస్మయ(23). కేరళలోని కన్నూరు జిల్లా నుంచి వచ్చిన స్ప్రింటర్ ఈమె. 400మీ.ల పరుగులో విస్మయ స్పెషలిస్ట్. ప్రస్తుతం ఇండియన్ నేషనల్ రిలే టీమ్‌కు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2019లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆడిన ఇండియన్ మిక్స్‌డ్ రిలే టీమ్‌లో విస్మయ సభ్యురాలు. ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ ఆడటం ద్వారా భారత్ జట్టు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన విస్మయ, 2019 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో వెండి పతకం గెలుచుకున్నారు.
వినేశ్ ఫోగట్
హరియాణాలోని భివానీ జిల్లాలో పుట్టిన వినేశ్ ఫోగట్ (26) కుస్తీ క్రీడాకారిణి. ప్రస్తుతం ఆమె 51కేజీల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణపతకం గెలుచుకోవడం ద్వారా ఈ క్రీడల్లో భారత్‌కు తొలి రెజ్లింగ్ గోల్డ్ సాధించిన క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందారు.
అదే సంవత్సరం కామన్‌వెల్త్ క్రీడల్లో కూడా వినేశ్ ఫోగట్ భారత్‌కు స్వర్ణం సాధించిపెట్టారు. 2019లో వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కంచు పతకం గెలుచుకున్నారు. ఫోగట్ ప్రతిభకు రాజీవ్‌ఖేల్ రత్న, అర్జున అవార్డులు దక్కాయి.
స్వప్నా బర్మన్
పశ్చిమబెంగాల్‌లోని జల్పాయ్‌గురి సమీపంలోని ఓ చిన్నగ్రామంలో పుట్టారు స్వప్నా బర్మన్ (24). 2018 ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలవడం ద్వారా హెప్టాథ్లాన్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం తెచ్చిన ఘనతను స్వప్నా బర్మన్ దక్కించుకున్నారు. 2017 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కూడా స్వప్నా స్వర్ణం గెలిచారు.
రెండు కాళ్లకు ఆరేసి వేళ్లతో పుట్టారు స్వప్న. కానీ ఇందుకోసం ప్రత్యేకంగా షూ తయారు చేయించే స్థోమత ఆమె కుటుంబానికి లేదు. ఎంతో నొప్పిని భరిస్తూనే స్వప్నా ప్రాక్టీస్ చేసేవారు. 2019 సంవత్సరానికి ఆమెకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది.
సుశ్రీ దివ్యదర్శిని
సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్ (23) ఒడిశాలోని ధెంకనాల్ ప్రాంతానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి. ఒడిశా అండర్-23 మహిళా జట్టుకు ఆమె కెప్టెన్
2019 ఏసీసీ విమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు తరఫున ఆడిన దివ్యదర్శిని అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచారు. 2019 అండర్ -23 విమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో ఇండియన్ గ్రీన్ టీమ్‌కు నాయకత్వం వహించారు.
సుమిత్రా నాయక్
ఒడిశాలోని జయ్‌పూర్ జిల్లాకు చెందిన సుమిత్రా నాయక్ (20) రగ్బీ క్రీడాకారిణి. భారత సీనియర్ జట్టు తరఫున ఆడుతున్న ఆమె ఆసియా మహిళల రగ్బీ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించారు. 2019 లో ఆసియా రగ్బీ సెవెన్స్‌లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్నారు
2019లో భారత అండర్ -18 రగ్బీ జట్టుకు, 2019లో అండర్ -19 జట్టుకు సుమిత్రా నాయక్ నాయకత్వం వహించారు. 2016లో ఆసియా బాలికల రగ్బీ సెవెన్స్‌లో భారత జట్టు కాంస్య పతకం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
సోనమ్ మాలిక్
హరియాణాలోని సోనెపట్ జిల్లాకు చెందిన సోనమ్ మాలిక్ (18) మహిళా కుస్తీ యోధురాలు. 56 కేజీల విభాగంలో ఆమె తన కెరీర్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె 65 కిలోల కేటగిరీ పోటీలలో పాల్గొంటున్నారు.
2017లో క్యాడెట్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించిన సోనమ్ మాలిక్ గాయాల కారణంగా ఏడాదిపాటు ఆటకు దూరమయ్యారు.
2019లో మరోసారి క్యాడెట్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ను సోనమ్ మాలిక్ గెలుచుకున్నారు.
సొనాలీ శింగేట్
ముంబయి నగరానికి చెందిన సొనాలీ విష్ణు శింగేట్ (25) ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్. 2019 దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం, 2018 ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన జట్టులో ఆమె సభ్యురాలు.
2014-15లో సొనాలీ నాయకత్వంలో రాష్ట్ర జట్టు జాతీయ జూనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది.
2020లో సొనాలీ శింగేట్‌కు మహారాష్ట్ర ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం 'శివ ఛత్రపతి' లభించింది.
సిమ్రన్‌జిత్ కౌర్
పంజాబ్‌లోని లుథియానా జిల్లాకు చెందిన సిమ్రన్‌జిత్ కౌర్ బాత్ (25) అమెచ్యూర్ బాక్సర్. ఆమె 60, 64 కేజీల కేటగిరీలలో పాల్గొంటారు.
2019లో జరిగిన 23వ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ ప్రెసిడెంట్స్ కప్‌లో సిమ్రన్‌జిత్ కౌర్ గోల్డ్ మెడల్ సాధించారు. 2018లో ఆమె AIBA విమెన్స్ వరల్డ్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకాన్ని గెలిచారు.
2016లో నేషనల్ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు.
శివానీ కటారియా
హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన శివాని కటారియా (23) ఫ్రీస్టైల్ స్విమ్మర్
2019లో జరిగిన నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో శివానీ బంగారు పతకం సాధించారు. 2016 ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడం ద్వారా 2004 తర్వాత ఒలింపిక్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి అయ్యారు.
అదే సంవత్సరం సౌత్ ఏషియన్ గేమ్స్‌లో శివానీ బంగారు పతకం సాధించారు. 2017 సంవత్సరానికి హరియాణా ప్రభుత్వం అందించే భీమా అవార్డును ఆమె సొంతం చేసుకున్నారు.
శైలీ సింగ్
శైలీ సింగ్ (17) ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన అథ్లెట్. లాంగ్‌జంప్ క్రీడాకారిణి అయిన ఆమె నేషనల్ జూనియర్ లాంగ్‌జంప్ ఛాంపియన్
2018లో అండర్ -16 విభాగంలో నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్‌లో శైలీసింగ్ బంగారు పతకాలు సాధించారు. 2019లో అండర్-18 మ్యాచుల్లో ఆమె కొత్త జాతీయ రికార్డు సృష్టించారు.
త్వరలో జరగబోయే అండర్ -20 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి శైలీ సింగ్ అర్హత సాధించారు.
షెఫాలీ వర్మ
హరియాణాలోని రోహ్‌తక్ నుంచి ఉద్భవించిన క్రికెటర్ షెఫాలీ వర్మ (17). ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లలో భారత్ తరఫున షెఫాలీ ప్రాతినిధ్యం వహించారు.
15 సంవత్సరాల వయసులోనే భారత్ తరఫున ఆడిన క్రీడాకారిణిగా గుర్తింపుపొందారు షెఫాలీ వర్మ.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల టీ 20 క్రీడాకారుల ర్యాంకింగ్‌లో షెఫాలి వర్మ మూడవ స్థానంలో ఉన్నారు. తండ్రి జుత్తు కట్ చేయించడంతో ఆమె అబ్బాయిలాగా కనిపిస్తారు. అప్పుడప్పుడు తన సోదరుడి స్థానంలో లోకల్ క్లబ్‌లో షెఫాలీ ఆడుతుంటారు.
సంధ్య రంగనాథన్
సంధ్య రంగనాథన్ (22) తమిళనాడులోని కడలూరుకు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారిణి. ఆమె జాతీయ ఫుట్‌బాల్ జట్టులో మిడ్ ఫీల్డర్‌గా ఆడతారు. SAFF ఉమెన్స్ ఛాంపియన్‌షిప్, 2019 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన భారత జట్టులో సంధ్య సభ్యురాలు. అత్యధిక గోల్స్ చేసిన వారిలో ఆమె ఒకరు.
2019లో ఇండియన్ విమెన్స్ లీగ్ గెలిచిన సేతు FC అనే క్లబ్ తరఫున కూడా సంధ్య ఆడుతున్నారు. విమెన్స్ లీగ్ టోర్నీలో ఈ క్లబ్ తరఫున ఆడిన ఆమె మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు అందుకున్నారు.
ఎస్ కలైవాణి
కలైవాణి శ్రీనివాసన్ (21) తమిళనాడుకు చెందిన ప్రముఖ బాక్సర్. 48 కేజీల విభాగంలో ఆమె పోటీలలో పాల్గొంటారు.
2019లో కలైవాణి సౌత్ ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించారు. అదే సంవత్సరం జరిగిన నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్‌గా కలైవాణి గుర్తింపు పొందారు.
2012లో పన్నెండేళ్ల వయసులో కలైవాణి సబ్ జూనియర్ విమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించారు.
రతన్ బాలా దేవి
మణిపూర్‌లోని విష్ణుపూర్‌కు చెందిన నాంగ్‌మెతెమ్ రతన్‌బాలా దేవి (22) ఫుట్‌బాల్ క్రీడలో ఉద్ధండురాలు. ఫార్వర్డ్, మిడ్ ఫీల్డర్‌గా ఆమె ఆడతారు.
2017లో రతన్‌బాలా దేవి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. 2019 దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన మ్యాచ్ లో ఆమె కీలక పాత్ర పోషించారు.
రతన్‌బాలా KRYPHSA FC అనే క్లబ్ తరఫున కూడా ఆడుతుంటారు. 2020 ఇండియన్ విమెన్స్ లీగ్ ఫైనల్లో తన క్లబ్‌కు ఆమె కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే ఫైనల్‌లో ఆమె జట్టు ఓడిపోయింది. రతన్‌బాలా మణిపూర్ రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించారు.
రాణి
హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాకు చెందిన రాణి (26) హాకీ ప్లేయర్. స్ట్రైకర్, మిడ్ ఫీల్డర్ గా ఆమె నేషనల్ హాకీ టీమ్ కు ఆడుతుంటారు.
2018లో భారత హాకీ విమెన్స్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించిన రాంపాల్, ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. ఆమె ఆధ్వర్యంలోని జట్టు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
రాణి రాంపాల్‌కు రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డులు లభించాయి. 2019లో వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా వరించింది. 2020లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
రాహి సర్నోబత్
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన రాహి సర్నోబత్ (30) షూటర్. ఆమె 25మీ.ల పిస్టల్ షూటింగ్ ఈవెంట్స్‌లో పాల్గొంటారు. 2019లో ఆమె ISSF వరల్డ్‌కప్‌లో తన రెండో గోల్డ్ మెడల్‌ను గెలుచుకున్నారు. 2013లో జరిగిన ఈ పోటీలో ఆమె తొలి బంగారు పతకాన్ని సాధించారు.
2019లో గోల్డ్ మెడల్ సాధించడంతో టోక్యో ఒలింపిక్ క్రీడలలో పాల్గొనేందుకు రాహికి అర్హత లభించింది. 2018లో రాహి సర్నోబత్ ఏషియన్ గేమ్స్ షూటింగ్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి అయ్యారు. అదే సంవత్సరం ఆమెకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది.
ఆర్ వైశాలీ
వైశాలీ రమేశ్‌బాబు(19) చెన్నైకి చెందిన చెస్ ప్లేయర్. కోనేరు హంపి, విశ్వనాథన్ ఆనంద్‌లతో కలిసి 2020లో FIDE ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌ను గెలుచుకున్న జట్టులో ఆమె సభ్యురాలు. ఈ ఒలింపియాడ్ రష్యాలో జరిగింది.
2012 అండర్ -12 గర్ల్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్, 2015 అండర్ -14 వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్,2017 ఆసియా ఇండివిడ్యువల్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లలో వైశాలి బంగారు పతకాలు సాధించారు. 2018లో ఆమె మహిళా గ్రాండ్ మాస్టర్ అయ్యారు.
పి.యు. చిత్ర
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన పాలక్కీషిల్ ఉన్నికృష్ణన్ చిత్ర (25) అథ్లెట్.
ఆమె మీడియం డిస్టెన్స్ రన్నర్. 1500 మీ.ల పరుగులో ఆమె పోటీలలో పాల్గొంటుంటారు. 2017,2019లో జరిగిన ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో చిత్ర బంగారు పతకం సాధించారు. 2019 ఆసియా క్రీడల్లో చిత్ర కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
ఆమె 2017 ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ గేమ్స్, 2016 దక్షిణాసియా క్రీడలలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు.
పూనమ్ యాదవ్
పూనమ్ యాదవ్ (29) ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన క్రికెటర్. 2013లో భారత మహిళా క్రికెట్ జట్టు తరఫున ఆమెకు తొలిసారి ఆడే అవకాశం లభించింది. టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో పూనమ్ అత్యధిక వికెట్లు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజా ర్యాంకింగ్‌లో పూనమ్ యాదవ్ ఏడో స్థానంలో ఉన్నారు.
2019లో భారత మహిళా క్రికెట్ నియంత్రణ మండలి పూనమ్‌ను ఉత్తమ మహిళా క్రికెటర్‌గా ప్రకటించింది. అదే సంవత్సరం పూనమ్‌కు అర్జున అవార్డు కూడా లభించింది.
పూజ గెహ్లాట్
పూజ గెహ్లాట్ (23) దిల్లీకి చెందిన రెజ్లర్. 51కిలోల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌లో ఆమె పోటీ పడుతుంటారు. 2017లో ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలవడం ద్వారా పూజా తొలిసారి అంతర్జాతీయ మెడల్ సాధించారు.
రెండేళ్ల తరువాత, 2019లో అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పూజా రజత పతకం సాధించారు. కుస్తీని పురుషుల క్రీడగా మాత్రమే భావించే సమాజంలో పుట్టిన పూజా, తనకు నచ్చిన క్రీడలో నైపుణ్యం సంపాదించారు.
మొదట్లో పూజ కుస్తీ క్రీడలో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె కుటుంబం ఆ క్రీడపట్ల ఆమెకున్న శ్రద్ధను చూసి చివరకు తలొగ్గింది. కుస్తీ పోటీల్లో ఆమెకు సహాయకారిగా ఉండేందుకు కుటుంబం దిల్లీ వచ్చింది.
పూజా ఢండా
పూజా ఢండా (27) హరియాణాలోని హిసార్‌కు జిల్లాకు చెందిన రెజ్లర్. 57, 60 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో ఆమె పాల్గొంటుంటారు.
2018లో కామన్వెల్త్ గేమ్స్‌లో పూజా రజత పతకం సాధించారు. అదే సమయంలో ఆమె ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నారు.
అంతకు ముందు 2010లో పూజ సమ్మర్ యూత్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, 2014 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లలో కాంస్య పతకాన్ని సాధించారు. 2019లో ఆమెకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది.
పారుల్ పర్మార్
పారుల్ దాల్సుక్‌భాయ్ పర్మార్ (47) గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. పారా-బ్యాడ్మింటన్ తాజా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఆమె నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు.
పారుల్ 2017 BWF పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించారు.
మూడేళ్ల వయసులో పారుల్‌కు పోలియో బారినపడ్డారు. అయినా ఆటలను తన వృత్తిగా మార్చుకున్నారామె. పారుల్ పర్మార్‌కు 2009లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది.
నిఖత్ జరీన్
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (24) నిజమాబాద్ నుంచి వచ్చిన అమెచ్యూర్ బాక్సర్. ఆమె 51 కిలోల కేటగిరీ పోటీల్లో పాల్గొంటుంటారు. 2019లో థాయ్‌లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో నిఖత్ రజత పతకం సాధించారు.
2011 లో జరిగిన AIBA విమెన్స్ యూత్ అండ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ అంతర్జాతీయ పోటీలో నిఖత్ తొలి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.
2015లో మహిళల సీనియర్ జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ బంగారు పతకం సాధించారు. ఆమె తన స్వస్థలమైన నిజామాబాద్‌కు ప్రభుత్వం తరఫున బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
నగంగోమ్ దేవి
నగంగోమ్ బాలాదేవి(31) మణిపూర్‌లోని విష్ణపూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం నుంచి ఎదిగిన ఫుట్‌బాల్ క్రీడాకారిణి. ఆమె నేషనల్ ఫుట్‌బాల్ టీమ్‌లో ఫార్వర్డ్ ప్లేయర్‌గా ఆడుతుంటారు.
భారతదేశంలో అత్యధిక గోల్స్ చేసిన మహిళా ఫుట్ బాల్ ప్లేయర్ బాలాదేవి. ఐదేళ్లపాటు జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా ఆమె వ్యవహరించారు. 2020 సంవత్సరంలో రేంజర్స్ ఎఫ్‌సితో ఒప్పందం చేసుకోవడం ద్వారా అలా చేసిన తొలి భారతీయ మహిళా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా ఆమె అవతరించారు.
2015, 2016 సంవత్సరాలకుగాను బాలా దేవిని ఉత్తమ మహిళా క్రీడాకారిణిగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ సమాఖ్య ప్రకటించింది.
మెహులీ ఘోష్
పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాకు చెందిన మెహులీ ఘోష్ (20) షూటర్. ఆమె 10 మీ.ల ఎయిర్ రైఫిల్ విమెన్ అండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగాలలో పోటీ పడుతుంటారు.
2019లో మెహులీ ఘోష్ సౌత్ ఏషియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించారు. 2018లో జరిగిన ప్రపంచ కప్‌లో కాంస్య పతకం సాధించారు. 2017సంవత్సరంలో జరిగిన ఏషియన్ ఎయిర్‌గన్ ఛాంపియన్‌షిప్‌లో మెహులీ తొలి అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్నారు.
2016 నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో మెహులీ 9 పతకాలు సాధించారు. ఆమె ఇండియన్ షూటింగ్ టీమ్‌లో అతి పిన్న వయస్కురాలు.
మను భాకర్
మను భాకర్ (19) హరియాణాలోని జజ్జర్ జిల్లాలోని ఒక పల్లెటూరిలో పుట్టారు. ఆమె 10 మీ.ల ఎయిర్ పిస్టల్, 25మీ.ల పిస్టల్ విభాగాలలో పోటీ పడుతుంటారు. 2018లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ వరల్డ్ కప్‌లో బంగారు పతకం సాధించిన అతి పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా ఆమె నిలిచారు.
అదే సంవత్సరం మను ISSF జూనియర్ వరల్డ్ కప్‌లో రెండు బంగారు పతకాలు సాధించారు. 2019లో టోక్యో ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లలో భారత్ తరఫున ఆడటానికి మను భాకర్ అర్హత సాధించారు.
2020లో ఆమె ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకున్నారు.
మంజు రాణి
మంజు రాణి (21) హరియాణాలోని రోహ్‌తక్ జిల్లాలోని ఒక పల్లెటూరి నుంచి వచ్చారు. ఆమె అమెచ్యూర్ బాక్సర్ .48 కేజీల విభాగంలో ఆమె పోటీల్లో పాల్గొంటారు. 2019లో మంజు రాణి AIBA విమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించారు. ఇది కాకుండా స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్నారు.
2019లోనే మంజురాణి థాయిలాండ్ ఓపెన్, ఇండియన్ ఓపెన్ టోర్నీలను గెలిచారు.
11 ఏళ్ల వయసులో రాణి తన తండ్రిని కోల్పోయారు. చేతులకు గ్లవ్స్ కొనుక్కోవడానికి కూడా ఆమె కుటుంబం దగ్గర డబ్బులేని పరిస్థితి. ఆమె తల్లి ఏడుగురు పిల్లలను పెంచి పోషించారు.
మానసి జోషి
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన మానసి జోషీ (31)పారా-బాడ్మింటన్ క్రీడాకారిణి. 2019 పారా-బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మానసి బంగారు పతకం సాధించారు.
2017లో జరిగిన ఇదే ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్ మ్యాచ్‌లలో కాంస్య పతకాన్ని, 2015 మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌ల్లో రజత పతకాలను కూడా జోషి గెలుచుకున్నారు.
ఇంజినీరింగ్ చదివిన మానసి జోషి 2011లో ప్రమాదానికి గురయ్యారు. తాను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కావాలని చికిత్స సమయంలోనే నిర్ణయించుకున్నారు. అలా పట్టుదలతో శిక్షణ నుంచి అంతర్జాతీయ పోటీల వరకు ప్రస్థానం సాగించారు.
మాళవిక బన్సోద్
మాళవిక బన్సోద్ (19) మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ అయిన మాళవిక 2018 ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
2019లో మాల్దీవుల్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్, అన్నపూర్ణ పోస్ట్ ఇంటర్నేషనల్ సిరీస్‌లలో బంగారు పతకాలు సాధించి ప్రపంచంలోని టాప్ 200 ఆటగాళ్లలో చోటు దక్కించుకున్నారు.
అదే సంవత్సరం ఆమె ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్, ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలో విజయం సాధించారు.
లవ్లీనా బోర్గొహైన్
లవ్లీనా బోర్గోహైన్ (23) అస్సాంలోని గోల్‌ఘాట్‌కు చెందిన అమెచ్యూర్ బాక్సర్. 69 కిలోల వెల్టర్ వెయిట్ విభాగంలో ఆమె పోటీ పడుతుంటారు. 2018,2019లో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో లవ్లీనా కాంస్య పతకం సాధించారు. 2017 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా కాంస్య పతకాన్నిగెలుచుకున్నారు.
2020లో లవ్లీనాకు భారత ప్రభుత్వం అర్జున అవార్డు ఇచ్చి సత్కరించింది. అస్సాం రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ కు ఎంపికైన తొలి క్రీడాకారిణిగా లవ్లీనా గుర్తింపు పొందారు.
లాల్ రెమ్సియామి
లాల్రెమ్సియామి (20) మిజోరాంలోని కోలాసిబ్ పట్టణానికి చెందిన హాకీ క్రీడాకారిణి. భారత మహిళల హాకీ జట్టులో ఆమె ఫార్వర్డ్ ప్లేయర్‌గా ఆడుతుంటారు. 2018 ఆసియా క్రీడల్లో భారత జట్టు రజత పతకం సాధించారు. మిజోరాం నుంచి ఏషియాడ్‌లో పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా లాల్రెమ్సియామి గుర్తింపు పోందారు.
ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ నుంచి 2019 రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నారు లాల్రెమ్సియామి.
టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత హాకీ జట్టులో లాల్రెమ్సియామి కూడా సభ్యురాలు
కె.వి.ఎల్. పావనీ కుమారి
విశాఖపట్నానికి చెందిన కొల్లి వరలక్ష్మీ పావని కుమారి (17) వెయిట్ లిఫ్టర్. 45 కేజీల విభాగంలో పావని కుమారి పోటీ పడుతుంటారు.
2020లో ఏషియా యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో యూత్ గర్ల్స్ అలాగే జూనియర్ విమెన్ విభాగాలలో పావని రజత పతకాలు సాధించారు.
ఈ మ్యాచ్‌లలో విజయంతో ఆమెకు టోక్యో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం లభించింది. 2019లో పావని కుమారి జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తమ లిఫ్టర్ అవార్డును గెలుచుకున్నారు.
కోనేరు హంపి
విజయవాడకు చెందిన కోనేరు హంపి ర్యాపిడ్ వెర్షన్ చెస్‌లో ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్.
2002లో అతి చిన్న వయసులో అంటే 15 ఏళ్ల ఒక నెల 27 రోజులకే ఆమె గ్రాండ్‌మాస్టర్ అయ్యారు.
పురుషులకు ఇచ్చే గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను పొందిన తొలి భారతీయ మహిళగా హంపి రికార్డులకెక్కారు. కోనేరు హంపికి 2003లో అర్జున అవార్డ్, 2007లో పద్మశ్రీ అవార్డ్ లభించాయి.
జమున బోరో
జమునా బోరో (23) అస్సాంలోని ధేకియాజులి పట్టణానికి చెందిన అమెచ్యూర్ బాక్సర్. 52 కేజీల కేటగిరీతో జమునా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈ విభాగంలో 2010 లోనే జమునా తన మొదటి నేషనల్ గోల్డ్ మెడల్‌ను గెలుచుకున్నారు. ఇప్పుడు ఆమె 57 కేజీల కేటగిరీ పోటీలలో పాల్గొంటున్నారు.
2019లో AIBA ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జమునా బోరో కాంస్య పతకం సాధించారు.
2019లో ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్, 23వ ప్రెసిడెంట్ కప్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్‌లలో జమునా బంగారు పతకాలు సాధించారు.
ఈషా సింగ్
ఇషాసింగ్ (16) హైదరాబాదీ షూటర్. 10మీ.ల ఎయిర్ పిస్టల్ షూటింగ్, 25మీ.ల స్టాండర్డ్ పిస్టల్, 25మీ.ల పిస్టల్ ఈవెంట్స్‌లో ఆమె పాల్గొంటారు.
2019లో జూనియర్ ప్రపంచకప్‌లో ఇషా రజత పతకం సాధించారు. అదే సంవత్సరం ఆమె ఆసియా ఎయిర్‌గన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు.
2018లో ఇషా 10 మీ.ల ఎయిర్ పిస్టల్ పోటీలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచారు. అప్పటికి ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలు.
ఎలావెనిల్ వలరివన్
తమిళనాడు షూటర్ ఎలవెనిల్ వలరివన్ (21) కడలూరుకు చెందినవారు. అయితే ఆమె గుజరాత్‌లో పెరిగారు. 10మీ.ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో ఆమె పాల్గొంటున్నారు
2019లో ఎలావెనిల్ ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్, ప్రపంచ కప్‌లలో రెండు బంగారు పతకాలు సాధించారు. ఈ విజయాలతో ఆమె నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నారు.
2018లో జూనియర్ ప్రపంచ కప్‌లో బంగారు పతకం సాధించడం ద్వారా తొలి అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్నారు వలరివన్. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడటానికి ఆమె అర్హత సాధించారు.
ఏక్తా భ్యాన్
ఏక్తా భ్యాన్ (35) హరియాణాలోని హిస్సార్ ప్రాంతం నుంచి వచ్చిన పారా అథ్లెట్ . ఆమె క్లబ్,డిస్కస్ త్రో ఈవెంట్లలో పాల్గొంటారు
2018 ఏషియా పారా గేమ్స్‌లో క్లబ్ త్రోలో ఏక్తా బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. 2016,2017,2018 సంవత్సరాల్లో జరిగిన జాతీయ పారా అథ్లెటిక్స్ పోటీలలో ఆమె బంగారు పతకాలు సాధించారు.
టోక్యోలో జరగబోయే పారా ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ఏక్తా అర్హత సాధించారు. 2018 సంవత్సరంలో వికలాంగుల సాధికారతలో జాతీయ అవార్డును అందుకున్నారు ఏక్తా.
ద్యుతీ చంద్
ఒడిశాలోని జయ్‌పూర్ జిల్లాకు చెందిన ద్యుతీ చంద్ (25) రన్నర్. ఆమె 100మీ.ల పోటీల్లో పాల్గొంటారు. 2019 వరల్డ్ యూనివర్సైడ్ 100 మీటర్ల ఈవెంట్‌లో ద్యుతీ చంద్ స్వర్ణం సాధించారు. 100 మీటర్ల రేసులో అంతర్జాతీయ టోర్నమెంట్లలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా ఆమె నిలిచారు.
నేషనల్ ఛాంపియన్ అయిన ద్యుతి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ చేసిన హైపర్ ఆండ్రోజెనిజమ్ ఆరోపణలను సవాల్ చేసి విజయం సాధించారు. తర్వాత ఆమెకు 2016 రియో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం లభించింది.
తాను స్వలింగ సంపర్కురాలినంటూ ద్యుతీ చంద్ 2019లో సంచలన ప్రకటన చేశారు. ఇలా తన సెక్స్ అలవాటును బహిరంగంగా వెల్లడించిన తొలి క్రీడాకారిణిగా ద్యుతీ రికార్డులకెక్కారు.
దివ్యా కక్రాన్
దివ్య కక్రాన్ (22) ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన కుస్తీ క్రీడాకారిణి.
2020లో జరిగిన ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 68 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి దివ్య .
అదే సంవత్సరం దివ్యకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది. 2017లో జాతీయ ఛాంపియన్‌షిప్ గెలిచిన తరువాత, కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో దివ్య బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారు.
దీక్షా డాగర్
దీక్షా డాగర్ (20) హరియాణాకు చెందిన ప్రొఫెషనల్ గోల్ఫర్. 2018లో లేడీస్ యూరోపియన్ టూర్‌లో టైటిల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలు ఆమె.
పుట్టుక నుంచే దీక్షకు వినికిడి సమస్య ఉంది. ఆమె వినికిడి శక్తిని పెంచడానికి కోక్లియర్ ఇంప్లాంట్‌తోపాటు స్పీచ్ థెరపీ చికిత్స చేయాల్సి వచ్చింది.
డెప్లింపిక్స్ (చెవిటివారికి నిర్వహించే ఒలింపిక్స్)లో దీక్ష రజత పతకం సాధించారు. ఈ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ దీక్ష. అలాగే ఎడమ చేతితో ఆడే అతి కొద్దిమంది క్రీడాకారిణులలో ఆమె ఒకరు.
సీఏ భవానీ దేవి
చదలవాడ ఆనంద సుందరరామన్ భవానీ దేవి (27)ని అంతా సంక్షిప్తంగా భవానీదేవి అని పిలుస్తుంటారు. తమిళనాడువాసి అయిన భవానీ ఫెన్సింగ్ క్రీడలో నిష్ణాతురాలు.సేబర్ విభాగంలో ఆమె పోటీ పడుతుంటారు.
2018 కామన్వెల్త్ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించడం ద్వారా ఫెన్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా భవానీదేవి రికార్డులకెక్కారు.
2015లో ఆమె కాంస్యం, 201 ఏషియా ఛాంపియన్‌షిప్‌లో అండర్ -23 విభాగంలో రజతంతోపాటు మరికొన్ని అంతర్జాతీయ పోటీలలో కూడా పతకాలు సాధించారు.
భావ్నా జాట్
భావ్నా జాట్ (24) రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఓ పల్లెటూరి నుంచి ఎదిగిన అథ్లెట్. ఆమె 20మీ.ల రేస్ వాకింగ్ ఈవెంట్లలో పాల్గొంటారు. 2020లో నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతోపాటు, కొత్త జాతీయ రికార్డు కూడా సృష్టించారు.
2016 జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె సిల్వర్ మెడల్ సాధించారు. టోక్యోలో జరగబోతున్న ఒలింపిక్స్ క్రీడల్లో ఆమెకు స్థానం దక్కింది.
సౌకర్యాలలేమి కారణంగా ప్రారంభంలో ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొద్దున్నే లేచి తన ఊరి చుట్టూ రౌండ్లు కొడుతూ ప్రాక్టీస్ చేసేవారు
అర్చనా కామత్
అర్చనా గిరీష్ కామత్ (20) బెంగళూరుకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె 2019లో సీనియర్ విమెన్స్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ టేబుల్ టెన్నిస్ టీమ్‌లో చోటు సంపాదించారు.
అంతకు ముందు సంవత్సరం కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో అర్చనా గోల్డ్ మెడల్ సాధించారు
2018లో ఆమె యూత్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. అక్కడ ఆమె సెమీఫైనల్ వరకు వెళ్లి నాలుగో స్థానంలో నిలిచారు.
అపూర్వి చందేలా
అపూర్వి చందేలా(28) షూటర్. ఆమె రాజస్థాన్‌లని జైపూర్‌కు చెందినవారు. 10 మీ.ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె పోటీ పడుతుంటారు.
2019లో అపుర్వి ISSF ప్రపంచకప్‌లో గోల్డ్ మెడల్‌తోపాటు, ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. ఈ విజయంతో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ఆమెకు అర్హత లభించింది.
2014 కామన్‌వెల్త్ క్రీడల్లో అపూర్వి తొలిసారి అంతర్జాతీయ గోల్డ్ మెడల్‌ను గెలుచుకున్నారు. 2015 ప్రపంచ కప్‌లో కాంస్య పతకం సాధించారు. 2016లో అపూర్వికి ప్రతిష్టాత్మక అర్జున అవార్డు లభించింది.
అన్ను రాణి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన అన్నూ రాణి (28) జావెలిన్ త్రో క్రీడాకారిణి. 2019లో జరిగిన ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అన్నూ రాణి రజత పతకం సాధించారు. ఈ విజయంతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా అన్ను రాణి గుర్తింపు పొందారు.
2017లో అదే పోటీలో అన్నూ రాణి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. భారతదేశంలో జావెలిన్ త్రోలో ఆమె పేరిట జాతీయ రికార్డు ఉంది. చిన్నతనంలో ఆమె కనీస సౌకర్యాలు లేకపోయినా ఎంతో శ్రమకోర్చి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేశారు. ప్రొఫెషనల్‌గా వాడే జావెలిన్ (ఈటె)ను కొనే స్థోమత లేని ఆమె కుటుంబం ఆమెకు వెదురు కర్రతో చేసిన ఈటెను కొని ఇచ్చింది. దానితోనే ఆమె ప్రాక్టీస్ చేసేవారు
అంకితా రైనా
అంకితా రవీందర్ కృష్ణ రైనా (28) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. ఇండియన్ విమెన్స్ సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ఆమె ప్రస్తుత నెంబర్ వన్ క్రీడాకారిణి
2018 ఏషియన్ గేమ్స్‌లో అంకిత కాంస్య పతకం సాధించారు. ఈ విజయంతో సానియా మీర్జా తర్వాత ఏషియన్ గేమ్స్ సింగిల్స్ మ్యాచ్‌లలో పతకం సాధించిన రెండో భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచారు.
2018లో ప్రపంచంలోని టాప్ -200 విమెన్ టెన్నిస్ ప్లేయర్స్ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ క్రీడాకారిణి అంకితా.
అనితా దేవి
హరియాణాలోని పాల్వాల్‌కు చెందిన అనితా దేవి(36) షూటర్. 10 మీ.లు, 25మీ.ల ఎయిర్ పిస్టల్ పోటీలలో పాల్గొంటుంటారు.
2016లో అనిత ఇంటర్నేషనల్ షూటింగ్ కాంపిటిషన్‌లో 10మీ.ల ఎయిర్ పిస్టల్‌లో రజతం, 25 మీ.ల విభాగంలో కాంస్యం గెలుచుకున్నారు.
2015 నేషనల్ గేమ్స్‌లో అనిత రజత పతకం సాధించారు. 2013లో జరిగిన నేషనల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నారామె. అనితా దేవి కొడుకు కూడా ఈ క్రీడలో శిక్షణ తీసుకుంటున్నాడు.
ఐశ్వర్యా పిస్సే
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఐశ్వర్య పిసే (25) మోటార్ సైకిల్ రేసర్. 2019లో FIM వరల్డ్ కప్ గెలిచి మోటార్ స్పోర్ట్స్‌లో వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా నిలిచారు.
ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా 2016, 2017, 2019 సంవత్సరాల్లో ఐశ్వర్యకు అవుట్ స్టాండింగ్ ఉమన్ మోటార్ స్పోర్ట్స్ అవార్డ్‌తో సత్కరించింది.
నేషనల్ రోడ్ రేసింగ్, ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లలో ఐశ్వర్య మొత్తం ఆరు టైటిళ్లు గెలుచుకున్నారు.
అదితి అశోక్
అదితి అశోక్ (25) బెంగళూరుకు చెందిన ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్. 2016లో లేడీస్ యూరోపియన్ టూర్ గెలిచిన మొదటి భారత గోల్ఫ్ క్రీడాకారిణి ఆమె. అదే సంవత్సరం అదితిని రూకీ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించారు.
2016లో అదితి రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. 18 సంవత్సరాల వయసులో గ్లోబల్ గోల్ఫ్ పోటీలో పాల్గొన్న తొలి భారతీయ మహిళ మాత్రమే కాదు, అతి పిన్న వయస్కురాలు కూడా.
2017లో లేడీస్ ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ నుంచి టూర్ కార్డును అందుకున్న మొదటి భారతీయ క్రీడాకారిణిగా అదితి నిలిచారు.
వీరిలో చాలామంది క్రీడాకారిణులు ప్రముఖుల గురించి సమాచారం అందించే వెబ్ పోర్టల్ వికీపీడియాలోని స్థానిక భాషల విభాగంలో స్థానం సంపాదించలేకపోయారని బీబీసీ గుర్తించింది.
దేశవ్యాప్తంగా 12 సంస్థలు, 300 మందికి పైగా జర్నలిజం విద్యార్ధులు వికీపీడియాలోకి వెళ్లి అందులో చోటుదక్కని ఈ 50 మంది భారతీయ మహిళా క్రీడాకారిణుల సమాచారాన్ని తెలుగు, హిందీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, ఇంగ్లీషు భాషలలో వచ్చేలా చేశారు.
ఈ 50 మంది క్రీడాకారిణులను ఎలా గుర్తించాం?
40 మందికి పైగా ప్రముఖులు ఉన్న జ్యూరీ సహాయంతో ఈ 50 మంది భారతీయ మహిళా క్రీడాకారులను బీబీసీ ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు, రచయితలు ఈ జ్యూరీలో సభ్యులు. 2019, 2020 సంవత్సరాలలో మహిళా క్రీడాకారిణుల ఆట తీరును పరిశీలించడం ద్వారా జ్యూరీ ఈ 50 మంది క్రీడాకారిణుల పేర్లను సూచించింది. క్రీడాకారిణుల పేర్లను ఆంగ్ల అక్షర క్రమంలో పొందుపర్చాం.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






