మాన్య సింగ్: ఆటో డ్రైవర్ కూతురు మిస్ ఇండియా రన్నరప్ వరకు ఎలా ఎదిగారు?

ఫొటో సోర్స్, MANYA SINGH
- రచయిత, మధుపాల్
- హోదా, బీబీసీ కోసం
హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి ఫెమినా మిస్ ఇండియా-2020 టైటిల్‌ను సాధించారు. ముంబయిలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో 23 ఏళ్ల మానస మిస్ ఇండియా కిరిటాన్ని దక్కించుకున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాన్యాసింగ్, హరియాణాకు చెందిన మణికా షియోకాండ్ ఫస్ట్, సెకండ్ రన్నరప్‌లుగా నిలిచారు. ఈ ముగ్గురి పేర్లు మొదటి అక్షరం ‘మ’ తో మొదలైనట్లే, వీరి ముగ్గురి జీవితాలలో కూడా అనేక సారూప్యతలు ఉన్నాయి. ఈ కిరీటాన్ని అందుకోవడానికి ముగ్గురూ చాలా కష్టపడ్డారు.

ఫొటో సోర్స్, Manya Singh
మాన్య సింగ్ తండ్రి ఆటో డ్రైవర్, తల్లి టైలర్
“మీ సొంత తపనతో ప్రయత్నించండి. నిరాశ చెందాల్సిన పని లేదు. మీ ఉనికి ప్రపంచానికి తెలిసే సమయం వస్తుంది’’ అని నమ్మే మాన్యా సింగ్ మిస్ ఇండియా-2020 రన్నరప్‌గా నిలిచారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియా జిల్లాకు చెందిన మాన్యా గురించి నిన్నటి వరకు ఎవరికీ తెలియదు. కానీ ఈ రోజు ఆమె గురించి తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు.
మాన్య తండ్రి ఓంప్రకాశ్ సింగ్ ముంబయిలో ఆటో నడుపుతుంటారు. తల్లి మనోరమా దేవి ముంబయిలోనే ఒక టైలర్ షాప్‌ను నడుపుతున్నారు.
చిన్నతనం నుంచి మాన్య జీవితం కష్టాల మధ్య నడిచింది. తన తల్లిదండ్రులు అనుభవించిన కష్టాలను ఆమె గుర్తు చేసుకున్నారు.
“కొంతమందిలో ఒక ఆలోచన ఉంది. కొన్ని ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు ఎక్కువగా ఎదగలేరని భావించేవారు ఉండే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి” అంటారామె.
“అలాంటి ఆలోచనలు ఉన్నవారికి నేనొకటి చెప్పదలుచుకున్నాను. మీరు అందంగా ఉన్నారా, మంచి దుస్తులు ఉన్నాయా, డబ్బు ఉందా అన్నది ముఖ్యం కాదు. కలలుకనే శక్తి ఉంటే ఆకాశాన్ని తాకవచ్చు. కలలుకనడం మొదలు పెట్టేంత వరకు మీ శక్తి గురించి మీకు తెలియదు’’ అన్నారు మాన్య.

ఫొటో సోర్స్, Missindiaorg
జీవితంలో మలుపు
మాన్య సింగ్ చిన్నప్పటి నుంచీ అనేక ఆర్థిక సంక్షోభాలు చూశారు. చాలా రాత్రులు ఆకలితో నిద్రించారు. డబ్బులు ఆదా చేయడానికి కిలోమీటర్ల దూరం నడిచేవారు.
ఆమె వేసుకునే దుస్తులన్నీ ఆమె ఇంట్లో కుట్టినవే. కాలేజీ ఫీజు కట్టడానికి తల్లిదండ్రులు వారి ఆభరణాలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. చదువుకుంటూనే సంపాదన కోసం ఆమె కాల్ సెంటర్లలో పని చేసేవారు.
“ఆశలన్నీ నిరాశలైన వేళ కొందరి జీవితాలు అనుకోని మలుపు తిరుగుతాయి. నాకు కూడా అలాంటి రోజు వస్తుందని అనుకునేదాన్ని” అని మాన్య అన్నారు. “మహిళలకు ఒక ప్రత్యేక శక్తి ఉందని నేను నమ్ముతాను” అన్నారు మాన్య.
“మా అమ్మా నాన్నలకు కొడుకు లేడనే బాధను పోగొట్టాలని అనుకున్నాను. అందుకే పెద్ద కూతురుగా బాధ్యతలు తీసుకున్నాను. నేను 20శాతం కృషి చేస్తే, వారు 80శాతం సహకారం అందించారు. వారి త్యాగమే నాకు ప్రేరణ” అన్నారామె.
“అందాల పోటీలంటే కేవలం ధనికులకే అని చాలామంది అనుకుంటారు. డబ్బులేని వారు ఈ పోటీలలో పాల్గొనడం చాలా కష్టం. కానీ మీరు దీన్ని ఎలా సాధించగలిగారు” అన్న ప్రశ్నకు మాన్య సమాధానం ఇచ్చారు.
“మనకు వేరే ఆప్షన్ ఉంటే ఇది కాకపోతే ఇంకొక లక్ష్యానికి మారతాం. కానీ మరో ఆప్షన్ లేదనుకుంటే ఎంత కష్టమైనా, ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ నిలబడేందుకు ప్రయత్నిస్తాం” అన్నారు మాన్య.
“వైఫల్యాలు ఎప్పుడూ నా వెంటే ఉంటాయి. నువ్వెప్పటికీ మిస్ ఇండియా స్థాయికి చేరుకోలేవని చాలామంది అనేవారు. కానీ ఎవరు ఏమంటున్నారు అన్నది మనకు అనవసరం. మనం ఏం చేయాలనుకుంటున్నామో అదే ముఖ్యం. మన మీద మనకు నమ్మకం ఉంటే చాలు” అని మాన్య వ్యాఖ్యానించారు. మాన్య సింగ్ మిస్ ఇండియా కాకపోయినా, చాలామంది మనసులను గెలుచుకున్నారు.

ఫొటో సోర్స్, Manasi Varanasi
నాలో నేను..నాతో నేను: మానస వారణాసి
23 ఏళ్ల మానస వారణాసి మిస్ ఇండియా స్థాయికి చేరుకోవడంలో ఎంతో కృషి, పట్టుదల దాగి ఉంది. "2020 సంవత్సరంలో ఎవరికీ మంచి జరగలేదు” అని మానస వారణాసి అన్నారు.
కరోనా మహమ్మారికి ముందు చాలా సంవత్సరాలుగా ఫెమినా మిస్ ఇండియా పోటీలలో పాల్గొనడానికి మానస ప్రయత్నాలు చేశారు.
"మిస్ఇండియా కోసం ప్రయత్నించడానికి ముందు నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాను. తరువాత ఒక ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్ సంస్థలో పిక్స్ ఎనలిస్ట్‌గా పని చేశాను. లాంగ్ లీవ్ పెట్టి పోటీకి ప్రిపేర్ అయ్యాను.” అన్నారు మానస.
"కోవిడ్ మహమ్మారి సమయంలో నేను చాలా కష్టపడ్డాను. కానీ పోటీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. వర్చువల్‌గా జరుగుతుందని తర్వాత తెలిసింది" అని మానస వివరించారు.
"ఇదంతా మొదటిసారి అనుభవం. అంతా వర్చువల్. పైగా అన్నీ స్వయంగా చూసుకోవాలి. పోటీలో పాల్గొంటున్న వారంతా మల్టీ టాస్కర్లు కావలసి వచ్చింది. నేను టాప్ 15కు చేరుకున్న తర్వాత కూడా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అర్ధమైంది” అన్నారు మానస.

ఫొటో సోర్స్, missindiaorg
ప్రియాంక చోప్రా నాకు ప్రేరణ
తన విజయం క్రెడిట్‌ను తన కుటుంబంలో ముగ్గురికి ఇవ్వాలనుకుంటున్నట్లు మానస వారణాసి చెప్పారు.
“మా ఇంట్లో అమ్మా, చెల్లీ, నాన్నమ్మా ఉంటారు. నేను పోటీలకు వెళ్లడానికి అమ్మా, చెల్లికి అభ్యంతరం లేదు. కానీ నాన్నమ్మను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. ఆమె అంగీకరించిన తర్వాత ముగ్గురం దీని కోసం కష్టపడి పని చేశాం. వర్చువల్ పోటీలలో అమ్మా, చెల్లీ ఎంతగానో సహకరించారు" అని మానస చెప్పారు.
“వారి వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమవుతున్నాను. ప్రియాంకా చోప్రా నాకు ప్రేరణ. ఆమెలాగే నేనూ నాదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తాను” అన్నారు మానస వారణాసి.

ఇవి కూడా చదవండి:
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
- నేపాల్ వెళ్తే జేబు ఖాళీయే
- వివాదాల్లో చిక్కుకున్న అందగత్తెలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









