రైతుల ఆందోళన: మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా... లేక కొత్త రకం 'మాస్టర్ స్ట్రోక్' ప్లాన్ చేస్తోందా?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నరపాటు వాయిదా వేయవచ్చు. ఈలోగా రైతు సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులు కలిసి రైతు సమస్యల గురించి చర్చించి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవచ్చు" అని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి మోదీ ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడల్లో ఇది పూర్తిగా కొత్త రకం.

రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) జోక్యం చేసుకోవడంతో బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందని కొందరు నిపుణులు అంటున్నారు.

సుప్రీం కోర్టు వ్యవసాయ బిల్లుల అమలుపై స్టే విధించడంతో మరో దారి లేక కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన బేరసారాలకు దిగిందని మరి కొందరు అంటున్నారు.

అయితే, ఇది మోదీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న ‘మాస్టర్ స్ట్రోక్’ అని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాబోయే నెలల్లో దేశంలోని చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రైతుల ఉద్యమం తాలూకా ప్రభావం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పడే అవకాశం ఉంది. ఇది రిస్క్‌తో కూడిన వ్యవహారమని, పార్టీకి, ప్రభుత్వానికి కూడా మంచిది కాదని పార్టీ శ్రేణులు భావిస్తూ ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.

కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ గత రెండు నెలలుగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటివరకూ రైతు సంఘాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య పది రౌండ్ల చర్చలు జరిగాయి. అయినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. ఇంతరవరకూ ఏ విధమైన పరిష్కారం దొరకలేదు.

సుప్రీం కోర్టు ఈ చట్టాల అమలుపై స్టే విధించింది. ఇరు వర్గాలతో చర్చించేందుకు వీలుగా నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కో-కన్వీనర్ అశ్విని మహాజన్

ఫొటో సోర్స్, Twitter/Ashwini Mahajan

ఫొటో క్యాప్షన్, స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కో-కన్వీనర్ అశ్విని మహాజన్

ఆర్ఎస్ఎస్ జోక్యం

ఇంత జరిగాక మోదీ ప్రభుత్వం ఎందుకు వెనక్కు తగ్గింది?

"వ్యవసాయ చట్టాల విషయంలో ప్రభుత్వం ఓపెన్‌గా ఉందని వారు తీసుకొచ్చిన ప్రతిపాదన ద్వారా తెలుస్తోంది. ఇది ‘వెనక్కి తగ్గడం’ అని నేను అనుకోవట్లేదు. ఇంతకుముందు కూడా ఇలాంటివి జరిగాయి. గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంది. జన్యుమార్పులు చేసిన (జెనెటికల్లీ మాడిఫైడ్) పంట విషయంలో, భూసేకరణ చట్టం, ఆర్‌సీఈపీలో కొత్త ఒప్పందం గురించి చర్చ...ఇలా కొన్ని విషయాల్లో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వం కొంత సమయం తీసుకుని వాటికి పరిష్కార మార్గాలు కనుక్కొనే ప్రయత్నం చేసింది" అని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్‌కు జాతీయ కో-కన్వీనర్‌గా ఉన్న అశ్విని మహాజన్‌ అన్నారు.

కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాల కోసమేనని స్వదేశీ జాగరణ్ మంచ్ విశ్వసిస్తోంది.

ఇందులో ఆర్ఎస్ఎస్ జోక్యం ఉందా అనే ప్రశ్నకు అశ్విని మహాజన్ బదులిస్తూ..

"అలాంటిదేం లేదు. ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. సాధారణంగా అనేక స్థాయిలలో, అనేక అంశాల గురించి మా సంస్థల్లో చర్చలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు అనధికారిక చర్చలు కూడా జరుగుతాయి" అని తెలిపారు.

భయ్యాజీ జోశీ

ఫొటో సోర్స్, VISHWA SAMWAD KENDRA

ఫొటో క్యాప్షన్, భయ్యాజీ జోశీ

గతంలో కూడా ఇలాంటివి జరిగాయి

తాము తీసుకొచ్చిన చట్టాలపై ప్రభుత్వం తమ వైఖరిని మార్చడమనేది ఇదే మొదటిసారి కాదు. గతంలో వ్యవసాయ భూసేకరణ చట్టంపై కూడా ప్రభుత్వం తన నిర్ణయాలను వెనక్కు తీసుకుంది.

భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని "సూటు-బూటు ప్రభుత్వం" అని విమర్శించారు.

ఇదే కాకుండా, ఎన్ఆర్‌సీ విషయంలోనూ, కొత్త కార్మిక చట్టం విషయంలో కూడా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరిస్తోంది.

అయితే, ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే...అశ్విని మహాజన్ ఉదహరించిన మూడు చట్టాల విషయంలో ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలే ముందు అభ్యంతరం వ్యక్తం చేసాయి.

అందుకే వ్యవసాయ చట్టాల విషయంలో కూడా ఆర్ఎస్ఎస్ జోక్యం ఉండి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి మరో మార్గం లేదు

వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నపాటూ వాయిదా వేయడమనేది కేంద్రం ‘వెనక్కి తగ్గడం’గానే భావించాలని మాజీ బీజేపీ నాయకుడు సుధీంద్ర కులకర్ణి అభిప్రాయపడ్డారు.

"ఈ ప్రతిపాదన ప్రధాని నరేంద్ర మోదీ స్వభావానికి పూర్తి వ్యతిరేకం. సాధారణంగా మోదీ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్నుంచీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గరని చెబుతుంటారు. కానీ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా జరుగుతోంది" అని ఆయన అన్నారు.

"ప్రభుత్వానికి మరో మార్గం లేదు. చాలా ఒత్తిడిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులు రెండు నెలలుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రపంచం నలుమూలలనుంచీ వారికి మద్దతు లభిస్తోంది. సుప్రీం కోర్టు వేసిన కమిటీ వల్ల కూడా ఏం లాభం లేకపోయింది. ఏది ఏమైనా రైతులు వెనక్కు తగ్గరని ప్రభుత్వానికి అర్థమైపోయింది" అని సుధీంద్ర తెలిపారు.

ప్రభుత్వం ఈ ప్రతిపాదన తీసుకు రావడానికి ఒక రోజు ముందు ఆర్ఎస్ఎస్‌లో రెండో స్థానంలో ఉన్న భయ్యాజీ జోషీ ప్రకటనను పరిగణనలోకి తీసుకోవాలి.

"ఇరు పక్షాలూ ఈ సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించాలి. దీర్ఘకాలం నిరసనలకు కూర్చోవడం ఎవరికీ లాభదాయకం కాదు. మధ్యేమార్గం ఆలోచించాలి" అని భయ్యాజీ జోషీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

భయ్యాజీ జోషీ అలా అనడం యాదృచ్ఛికమే కావొచ్చు. కానీ బీజేపీ తీసుకొచ్చిన ప్రతిపాదనను, ఆయన ఇంటర్వ్యూలో అన్నట్టు మధ్యేమార్గంగా పలువురు భావిస్తున్నారు.

రైతుల ఆందోళన

ఫొటో సోర్స్, PANKAJ NANGIA/ANADOLU AGENCY VIA GETTY IMAGES

జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ

"ఆర్ఎస్ఎస్‌నుంచీ ఒత్తిడి మాత్రమే కాకుండా, జనవరి26న రైతులు నిర్వహించనున్న ర్యాలీలో గందరగోళం జరగవచ్చని కూడా ఇంటెలిజెన్స్ విభాగంనుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. అంతకుముందే రైతుల ఉద్యమాన్ని ఓ కొలిక్కి తీసుకు రావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 22, శుక్రవారం జరగబోయే సమవేశం కీలకమైనది. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు అంగీకరిస్తే, జనవరి26న ర్యాలీని రద్దు చేసుకోమని భుత్వం వారిని కోరే అవకాశం ఉంది" అని అవుట్‌లుక్ మ్యాగజీన్ రాజకీయ విభాగం సంపాదకులు విజ్ అరోరా తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం 'మాస్టర్ స్ట్రోక్'

ఇది కేంద్రం ప్లాన్ చేస్తున్న ‘మాస్టర్ స్ట్రోక్’ అని సీనియర్ జర్నలిస్ట్ అదితి ఫడ్నిస్ అభిప్రాయపడ్డారు. ఇందులో ఆర్ఎస్ఎస్ జోక్యం ఉన్నట్లుగా తాను భావించట్లేదని ఆమె తెలిపారు.

"కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. రైతుల డిమాండ్లను వేటినీ అంగీకరించలేదు. చట్టాల అమలుకు 18 నెలల గడువు మాత్రమే ప్రతిపాదించింది. ఈ 18 నెలల్లో ముఖ్యమైన అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. రైతులు ముఖ్యంగా డిమాండ్ చేసినవి రెండు...ఈ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, కనీస మద్దతు ధరకు చట్టం హామీ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటినీ అంగీకరించలేదు.

ఇది ప్రభుత్వం చేస్తున్న మాస్టర్ ప్లాన్. రైతులు వెనక్కు తగ్గట్లేదు సరి కదా ఈ ఆందోళనల ప్రభావం ఒక ‘పొలిటికల్ ఇంఫెక్షన్‌’లా దేశమంతటా వ్యాపిస్తోంది. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

ఈ పని ప్రభుత్వం ముందే చేసుండొచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం చాలా కోల్పోయింది" అని అదితి అభిప్రాయపడ్డారు.

రైతుల ఆందోళన

ఫొటో సోర్స్, Reuters

ఇది ప్రజాస్వామ్యంలో భాగమే

ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కాదని, ఇది ప్రజాస్వామ్యంలో భాగమేనని బీజేపీ రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా అంటున్నారు.

"రైతుల ఆందోళనలను ఆపడానికి రెండే మార్గాలు ఉన్నాయి. శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కారం కనుక్కోవాలి లేదా ఇందిరా గాంధీ చేసినట్లు బలప్రయోగం ద్వారా ఆపాలి. మా ప్రభుత్వం శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కారం కనుక్కోవడానికే మొగ్గు చూపుతోంది. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు కాబట్టి మధ్యేమార్గంగా 18 నెలల గడువును ప్రతిపాదించింది. మేము ఇప్పటికీ చట్టాలను వెనక్కు తీసుకుంటామని చెప్పట్లేదు.

ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే రైతుల ఆందోళనలను కొలిక్కి తీసుకు రావాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఇది రైతుల ఉద్యమం కాదు. ఇది గతంలో రష్యాల్లో వచ్చిన ‘కులక్’ ఉద్యమంలాంటిది. ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం. కులక్ ఉద్యమంలో అమాయక రైతులకు మాయమాటలు చెప్పి ఉద్యమానికి పూనుకునేలా చేసారు. ప్రస్తుతం ఆందోళనలలో కూడా ఇదే జరుగుతోంది. ఏడాదిన్నర కాలంలో మేము వారికి ఏది సరైనదో, కాదో పూర్తిగా వివరించి చెప్తాం.

దేశంలోని 11 కోట్లమంది రైతులు మాతోనే ఉన్నారు. కొంతమంది మాత్రమే దేశంలోని శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారు. వ్యవసాయ చట్టాల ఆధారంగా ఎక్కడెక్కడ ఎన్నికలు జరిగినా, ఫలితాలు మాకు అనుకూలంగానే వస్తాయి. ఇందులో రెండు పద్ధతులేం లేవు" అని రాకేశ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)