తెలంగాణ: ఆసిఫాబాద్ జిల్లాలో పులి కలకలం.. అసలైనదా? అధికారులు సృష్టించిందా?

పులి విగ్రహం
ఫొటో క్యాప్షన్, ఆదివాసీలు ఆరాధించే పులి విగ్రహం అగోబా
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం గుండేపల్లి గ్రామ శివార్లలో ఓ చింత చెట్టు కింద పాత పందిరి నీడలో ఓ సిమెంటు విగ్రహం ఉంది. దాని చుట్టూ పుసుపు, కుంకుమా ఉన్నాయి.

అక్కడ పూజలు చేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అయితే అది దేవత విగ్రహం కాదు. ఒక పులిది. దానిపేరు అగోబా. పులిని ఆరాధించే ఆదివాసీ సంస్కృతికి ఆ విగ్రహం ఒక నిదర్శన. ..ఇది ఆదివాసీలు పులికి ఇచ్చే ప్రాధాన్యం.

మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక పులి ఆసిఫాబాద్ ప్రాంతంలోని కదంబ అటవీ ప్రాంతంలో పిల్లలు పెట్టింది. అటవీ శాఖ ఆ పులి, పిల్లల ఫోటోను ఎంతో అపురూపరంగా చూసుకుంటుంది.

అటవీ శాఖకు సంబంధించిన ప్రతి కార్యాలయంలోనూ ఆ ఫోటో ఒక భారీ ఫ్రేములో కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కోనప్ప ఆ ఫోటోను ముఖ్యమంత్రికి బహూకరించారు కూడా. ఇది అటవీ శాఖ పులికి ఇచ్చే ప్రాధాన్యం.

కానీ అదే పులి ఇప్పడు ఈ ఆదివాసీలు, అటవీ శాఖ అధికారులు, నాయకుల మధ్య చిచ్చు పెట్టింది.

ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయం ఎక్కువ. కాగజ్ నగర్ నుంచి ఏ అడవి వైపు ప్రయాణించినా రోడ్డుకు రెండువైపులా పంటలు తెల్ల తెల్లగా కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో అడవిని నరికి చేసే సాగు కూడా మొత్తం పత్తే.

పులి, పత్తి, పోడు.. ఈ మూడు పదాలు ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రాంతంలో అలజడి రేపుతున్నాయి. గిరిజనులు, అటవీ సిబ్బంది, వన్య మృగాలు, రాజకీయ నాయకులు.. అందరూ పాత్రధారులు అయిన ఈ వ్యవహారంలో అసలు గుట్టు ఏంటి?

పులి పోస్టర్
ఫొటో క్యాప్షన్, పులి గురించి హెచ్చరిస్తూ పోస్టర్

పులి గొడవ

అడవిలో పులి ఉంటుంది. కానీ అది బయటకు వచ్చి జనంపై పడితే సమస్య అవుతుంది. ఇప్పుడు ఆసిఫాబాద్ ప్రాంతంలో జరుగుతోన్నది అదే.

కాగజ్ నగర్ దగ్గర్లోని దిగడ, కొండపల్లి గ్రామాల్లో ఇద్దరు పులి వల్ల చనిపోయారు. దీంతో స్థానికులు పులి విషయంలో భయంభయంగా ఉన్నారు. స్థానికుల్లో ధైర్యం నింపేందుకు పులిని పట్టుకునే ప్రయత్నాల్లో పడ్డారు అటవీ శాఖ అధికారులు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఆ పులి మనిషి రక్తం రుచి మరిగిందా? దానిని అధికారులే అడవిలోకి వదిలారా?

అసలు పులి ఎందుకు వచ్చింది?

ఈ ప్రాంతంలో వందల ఏళ్ల నుంచి పులులున్నాయి. మధ్యలో అక్రమ వేట, ఇతర కారణాలతో పులులు తగ్గిపోయాయి. దాదాపు రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఈ ప్రాంతంలో పులి సంచారం పెరిగింది.

ఈ కాగజ్ నగర్ ప్రాంతం సరిగ్గా మధ్య భారతదేశపు పులుల కారిడార్‌గా ఉంటుంది. మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వు నుంచి తెలంగాణలోని కవాల్ టైగర్ రిజర్వుకు వెళ్లే మధ్యలో ఉండడంతో... ఎప్పుడూ ఇక్కడ పులులు తిరుగుతుంటాయి.

తాడోబాలో ఏటా పెద్ద సంఖ్యలో పులులు పిల్లల్ని పెడతాయి. పెరుగుతున్న పులుల జనాభాకు సరిపడా స్థలం లేకపోవడంతో, అవి ఈ ప్రాంతంలో ప్రవహించే పెద్దవాగు, ప్రాణహితలు దాటి తెలంగాణలోకి వస్తున్నాయి. (పెద్దవాగు - తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుగా అడవి మధ్యలో ఉంటుంది.)

తాడోబా నుంచి కవాల్ వెళ్లే దారిలో పులులు కనపడడం సహజమని అటవీ అధికారులు చెబుతున్నారు.

కొన్నాళ్లుగా అడవి ఆక్రమణ తగ్గడం, ఇక్కడ అడవిలో తిండి, నీరు దొరకడంతో కొన్ని పులులు ఇక్కడే స్థిరపడుతున్నాయి.

ఈమధ్య కాలంలో అటవీ శాఖ అధికారుల గస్తీ పెరగడంతో అడవిలోకి వెళ్లే జనం సంఖ్య కాస్త తగ్గింది. ఇక మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక పులి ఇక్కడ పిల్లల్ని పెట్టింది కూడా. అలా పులి సంతతి పెరిగింది.

అటవీశాఖ అధికారులు
ఫొటో క్యాప్షన్, అటవీశాఖ అధికారులు

పులిని అటవీ అధికారులే వదిలారా?

పులిని అటవీ అధికారులే తీసుకుని వచ్చి వదలినట్టు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు.

దీనిని అటవీ శాఖ ఖండించింది. ''పులి ఒక అడవి జంతువు. దాన్ని పట్టుకోవడం అంత తేలిక కాదు. మేమే దీన్ని తీసుకువచ్చి వదిలాం అన్నది నిజం కాదు. అదసలు సాధ్యం కాదు.'' అని ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారాం బీబీసీకి చెప్పారు.

కానీ, స్థానికుల్లో చాలా మంది ఆ విషయాన్ని నిజమని నమ్ముతున్నారు. దీనికి కారణం ఉంది.

అటవీ భూములు కాపాడే విషయంలో తరచూ స్థానికులకూ, వారి తరపున మాట్లాడే నాయకులకూ, అటవీ శాఖ అధికారులకూ మధ్య రచ్చ జరుగుతోంది.

దీంతో స్థానికులను అడవిలోకి రాకుండా, అడవిని ఆనుకుని చెట్లు కొట్టకుండా అటవీ శాఖ అధికారులే మనుషులను తినే పులులను తీసుకువచ్చి ఇక్కడి అడవుల్లో వదిలేశారని చాలా మంది నమ్ముతున్నారు.

అటవీ అధికారులు ఆ ఆరోపణలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

పోడు సాగులో పత్తి పంట
ఫొటో క్యాప్షన్, పోడు భూముల్లో పత్తి సాగు

పోడు వ్యవసాయంతో సమస్య ఏమిటి

ఆదివాసీలు తమ ఆహారం కోసం అడవిలో చెట్లను నరికి పోడు సాగు చేసేవారు. జనాభా తక్కువ ఉన్నప్పుడు, అవసరానికి సరిపడా ఆహార పంటలు మాత్రమే సాగు చేసినప్పుడు.. పోడు భూములు పెద్ద సమస్య కాలేదు.

పోడు సాగు ఎప్పుడూ ఒకే నేలలో చేయరు. ఒక చోట అడవిని నరికి సాగు చేసిన తరువాత, ఆ భూమిని వదలి మరో చోటికి వెళ్తారు.

ఇప్పుడా పద్ధతి తగ్గినా, కొత్తగా అడవి నరికే వారు మాత్రం కొనసాగుతున్నారు. ఇందులో ఆదివాసీలూ, స్థానికులే కాకుండా, ఆదివాసీయేతరులూ, స్థానికేతరులూ ఉన్నారు.

కొన్ని దశాబ్దాల క్రితం ప్రకృతి సహజమైన పద్ధతులలో, చాలా తక్కువ భూమిని, కేవలం ఆహార అవసరాల కోసం సాగు చేసేవారు.

కానీ క్రమంగా జనాభా పెరిగింది. ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంట పత్తి వచ్చింది. విస్తీర్ణం పెరిగింది.

కాగజ్ నగర్ నుంచి ఏ అడవి వైపు ప్రయాణించినా రోడ్డుకు రెండువైపులా పత్తి పంట తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంది. దీంతో ఇప్పడు పోడు భూములు పెద్ద సమస్యగా మారాయి.

ఒకప్పుడు అడవిలో జంతువుల వేట, కలప స్మగ్లింగ్ వంటి సమస్యలు ఉండేవి. ఇప్పుడు ఆ రెండూ బాగా తగ్గాయి. కానీ పశువుల మేత, అడవిలో వ్యవసాయం - ఈ రెండూ పెద్ద సమస్యలుగా మారాయి.

పత్తి ఎంతలా పెరిగిందంటే, కాగజ్ నగర్ అటవీ ప్రాంతాల్లో 90 శాతం పైనే పత్తి మాత్రమే పండిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఆదాయాన్నిచ్చే పత్తి కోసం పెద్ద ఎత్తున అటవీ భూములు ఆక్రమిస్తున్నారన్నది అటవీ అధికారుల ఆరోపణ.

ఈ ఆక్రమణలో తిలా పాపం సామెత వర్తిస్తుంది. రాజకీయ నాయకులు, అటవీ అధికారులు - ఏళ్ల తరబడి సాగిన వీరి అవినీతి, నిర్లక్ష్యం... మావోయిస్టు ఉద్యమ ప్రభావం, పెరుగుతున్న జనాభా, ఆహారం పంటల స్థానంలో డబ్బు కోసం వాణిజ్య పంటలు వేయడం... ఇవన్నీ అడవి ఆక్రమణలకు కారణాలయ్యాయి.

''ఒకే పంట వేయడం, విస్తృతంగా పురుగుమందులు వాడే వాణిజ్య పంట సాగు చేయడంతో అడవి జీవావరణ వ్యవస్థ దెబ్బతింటోంది.'' అని ఒక అటవీ శాఖ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

ఆసిఫాబాద్ అడవి
ఫొటో క్యాప్షన్, ఆసిఫాబాద్ అడవి

2006లో చూపిన పరిష్కారం ఏంటి?

గిరిజనుల జీవనాధారమా? అడవి పరిరక్షణా? అనే ప్రశ్న వచ్చినప్పుడు 2006వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది.

2005 డిసెంబరు వరకూ అడవిని సాగు చేస్తోన్న వారికి ఆర్ఒఎఫ్ఆర్ విధానం కింద సాగు హక్కులు కల్పించింది. కానీ ఆ తరువాత ఇక అడవిని నరకకుండా చూడాలన్నది నిబంధన.

కానీ, 2005 తరువాత కూడా పెద్ద ఎత్తున అడవులను నరికి సాగుచేస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు.

అలా ఎవరూ కొత్తగా సాగుచేయడం లేదని స్థానిక నేతలు అంటున్నారు.

అంతేకాదు, 2005లో ఇచ్చిన పట్టాల విషయంలోనూ వివాదాలున్నాయి. దీంతో ఆ భూములను మళ్లీ సర్వే చేశారు. అది కూడా ఇంకా తేలలేదు.

2005లో ఇచ్చినట్టుగా మళ్లీ తమకు కూడా పట్టాలు ఇవ్వకపోతారా అన్న ఆశ కొందరిని కొత్తగా అడవిని నరికేలా ప్రోత్సహిస్తోంది. అడవిని ఆనుకుని చేసే సాగును అటవీ సిబ్బంది అడ్డుకోవడం, స్థానికులు తిరగబడడం... ఇలాంటివిక్కడ మామూలు అయిపోయాయి.

అటవీ శాఖకు, స్థానికులకు, రాజకీయ నాయకులకు ఇక్కడ చాలా వివాదాలున్నాయి. ఆదివాసీల జనాభాతో పోలిస్తే చాలా పెద్ద స్థాయిలో భూమి ఆక్రమణకు గురైంది.

టిఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేటి కోనప్ప
ఫొటో క్యాప్షన్, టిఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేటి కోనప్ప

దాని వెనుక బయటి పెద్దల హస్తం ఉందని మరో ఆరోపణ. రైతులు ఆక్రమించిన అటవీ భూముల్లో హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి అధికారులు ప్రయత్నించడం వివాదమైంది.

2019లో అటవీ అధికారిణి అనితపై దాడి ఘటనకు కూడా కారణం అదే. ఇదంతా పోడు చుట్టూ ఉన్న వివాదం.

''2005లో కొంత భూమికి పట్టాలు ఇచ్చారు. మిగతా వాటికి తరువాత ఇస్తామని మాట ఇచ్చారు. నా నియోజకవర్గంలో అప్పట్లో 6 వేల ఎకరాలకు పట్టాలు ఇవ్వగా, ఇంకా 20 వేల ఎకరాలకు పైగా భూమికి పట్టాలు ఇవ్వాల్సి ఉంది.

ఫిబ్రవరిలో దీనిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మాట ఇచ్చారు. అటవీ శాఖ అధికారుల గురించి జగమంతా తెలుసు. నేను గతాన్ని తవ్వితీయడం లేదు. రకరకాల సమస్యలు పుట్టించేది వాళ్లే.

గ్రామ సభలు పెట్టి సలహాలు తీసుకోకుండా నచ్చిన చోట మొక్కలు నాటుతూ వెళ్లారు. డి-గ్రేడ్ ప్రాంతాల్లో ముందు మొక్కలు నాటకుండా, సాగు చేస్తోన్న భూములు తీసుకుంటున్నారు.

2005 తరువాత అసలు పోడు వ్యవసాయం కొత్తగా ఎవరూ చేయడం లేదు. 3-4 దశాబ్దాలుగా సాగు చేస్తోన్న రైతుల పొలాల్లో కరెంటు కనెక్షన్లనూ తొలగిస్తున్నారు.'' అని సిర్పూర్ కాగజ్ నగర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేటి కోనప్ప ఆరోపించారు.

''2005 తరువాత కొత్తగా ఒక్క ఎకరం కూడా తీసుకోవడానికి వీల్లేదు. దానికి చట్ట ప్రకారం మేమేం చేయలేం. కరెంటు కనెక్షన్ కూడా పెట్టడానికి వీల్లేదు. కరెంటు పెట్టి జంతువులను చంపేస్తున్నారు. హరితహారం ఫారెస్ట్ డీగ్రేడ్ ఉన్న చోటే చేసాం. పంట భూముల్లో కాదు.'' అన్నారు ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి శాంతారాం.

పులి బోర్డ్

పులికీ దీనికీ సంబంధం ఏంటి?

అడవి ఆక్రమణకు గురైంది కాబట్టే ఆ పులులు గ్రామాల్లోకి వస్తున్నాయని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఇప్పుడు కాగజ్ నగర్ లో జరిగిన ఘటనలు కూడా అటవీ ప్రాంతంలో జరిగాయి తప్ప, గ్రామాల్లోకి పులి రాలేదనేది వారి వాదన.

ఇక పత్తి చేలలోకి తరచూ అడవి పందులు వస్తుంటాయి. అడవి పందులు... పులులకు ఆహారం. దీంతో పత్తి కోసం పంది... పంది కోసం పులి వస్తున్నాయని ఒక వాదన.

ఈ జంతువుల నుంచి పంటను రక్షించుకోవడానికి కొందరు కరెంటు తీగలు పెడుతుంటే, వాటిలో పడి అడవి జంతువులు చనిపోతున్నాయనేది అటవీ అధికారులు విమర్శ.

ఇక స్థానికులు తమ పశువులను అడవిలో మేపడంతో అక్కడ గడ్డి తగ్గిపోయి, శాకాహార జంతువులు బయటకు వస్తున్నాయని, వాటి కోసం పులి వస్తుందన్నది మరో వాదన.

అంతేకాదు, గడ్డి పూర్తిగా తగ్గిపోతే శాకాహార జంతువులూ తగ్గిపోతాయి. అప్పడు పులికి ఆహారం కష్టమై గ్రామంలోకి వస్తుందన్న వాదనా ఉంది.

అటవీశాఖ అధికారి శాంతారాం
ఫొటో క్యాప్షన్, అటవీశాఖ అధికారి శాంతారాం

''ఇది సహజంగా పులి తిరుగాడే ప్రాంతం. వెయ్యేళ్ల క్రితం, అంతకుముందు నుంచీ ఇక్కడ పులులు తిరిగిన ఆనవాళ్లున్నాయి.

ఇది మధ్య భారతదేశానికి టైగర్ కారిడార్. వాటి తిరిగే హక్కును కాదనలేం. ఇప్పటి వరకూ ఇక్కడ పులి మనిషిన చంపిన ఘటన జరగలేదు. ఆ విషయం స్థానికులకూ తెలుసు. వారి తాత ముత్తాతలు వాటితో కలసి బతికారు.

వేట ఆపడం ఇతర కారణాల వల్ల పులి సంతతి పెరిగింది. వాటి పుట్టుక సంఖ్య కూడా పెరిగింది. కానీ అడవిలోపల ఆక్రమణ పెరిగింది. పత్తికోసం అడవి లోలోపలకి వెళ్తున్నారు. అక్కడే సమస్య వస్తోంది'' అని బీబీసీతో చెప్పారు శాంతారాం.

సాధారణంగా పులి రోజుకు 30-40 కిలోమీటర్లు తిరుగుతుంది. ప్రతి పులీ తనకంటూ ఒక ప్రాంతాన్ని గిరి గీసుకుంటుంది. తన మూత్రాన్ని సరిహద్దుగా జల్లుతుంది. తోడు అవసరమైన సమయంలో ఆడ లేదా మగ పులిని, పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్ల పులులకు మూడు-నాలుగేళ్ల వయసు వచ్చే వరకూ - ఈ రెండు సందర్భాల్లో తప్ప, ఒక పులి మరో పులిని తన ప్రాంతంలోనికి రానివ్వదు.

ఆ స్థలం కోసం పులులు మధ్య గొడవలు కూడా అవుతుంటాయి.

''అది సహజంగా సిగ్గరి. తెలివైనది, బలమైనది, సిగ్గు ఎక్కువ. మనుషులను చూస్తే పారిపోతుంది. పులిని మనిషి ఒకసారి చూసే లోపు పులి మనిషిని 12 సార్లు చూస్తుంది.

సాధారణంగా మనిషి కదిలే చోటుకు పులి రాదు. కానీ మనుషులు అడవి లోలోపలికి వెళ్లేసరికి పులి బయటకు రావాల్సివస్తోంది. తన సహజ ఆవాసం నష్టపోతే (మనుషులు ఆక్రమిస్తే), అది తిరిగే ప్రాంతం తగ్గిపోతుంది. అది కదలకుండా ఒకే చోట కూర్చుంటే దానిపై ఒత్తిడి పెరుగుతుంది.

మనుషులే అడవిలోపలకి వెళ్లారనడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. శాటిలైట్ ఫోటోలు ఉన్నాయి.

పులి పత్తి చేలోకి వచ్చినప్పుడు భయంతో మనిషి మీదకు ఉరుకుతుంది. నిజానికి పులికి మనిషి అవసరం లేదు. దానికి ఇక్కడ మేతకు సమస్య లేదు. ఇక్కడి అడవుల్లో జింకలు, నీల్‌గాయిలు ఎన్నో ఉన్నాయి'' అని వివరించారు శాంతారాం.

మరో సమస్య వందల సంఖ్యలో పశువులు మేతకు అడవికి వెళ్లడం. అవి మొత్తం తొక్కేసి, తినేస్తాయి. దీంతో సాధారణ శాకాహార జంతువులకు ఇబ్బంది. వాటిని తినే పులికీ ఇబ్బంది.

అయితే ఈ వాదనతో విబేధిస్తున్నారు స్థానిక నాయకులు. ''ఇక్కడ ఏళ్ళ నుంచీ పోడు సాగు ఉంది. అప్పుడు రాని పులి ఇప్పుడు ఎందుకు దాడి చేస్తోంది. అటవీ శాఖ అధికారుల వాదన తప్పు.'' అన్నారు ఎమ్మెల్యే కోనప్ప.

అడవిలో పులి

ఫొటో సోర్స్, ANDHRA PRADESH FOREST DEPARTMENT

పులి ఇక్కడ పర్మినెంటుగా ఉంటుందా?

పులి వల్ల పశువులు చనిపోతే, దానికి అటవీ శాఖ పరిహారం ఇస్తుంది.

లేకపోతే పుశువులను చంపిందన్న కసితో పులికి స్థానికులు విషం పెడతారని అటవీ అధికారుల భయం. కాబట్టి సహజంగానే పులి ఇక్కడే ఉండాలని వారు కోరుకుంటారు.

''ఒక్క పులి వంద మంది అటవీ సిబ్బందితో సమానం'' అంటుంటారు వారు. పులి ఉన్న అడవి బాగుంటుందని చెబుతారు పర్యావరణవేత్తలు.

కాగజ్ నగర్ ప్రాంతంలోని అడవికి పులులు వస్తాయని తాము ముందుగానే ఊహించినట్టు బీబీసీతో చెప్పారు అటవీ శాఖలో పనిచేసే ఒక క్షేత్ర స్థాయి అధికారి.

''మేం పులులు వస్తాయని ఊహించాం. అందుకు స్థానికులను సన్నద్ధం చేశాం. అందుకే ఇక్కడ పులి - మనిషి సంఘర్షణ తక్కువ ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తో పోలిస్తే చాలా తక్కువ మరణాలు నమోదయ్యాయి'' అని ఆయన వివరించారు.

''అడవి మధ్యలో రోడ్డు ఉంది. ఆ రోడ్డు అడవిలో ఉంది కాబట్టి పులి రోడ్డు దాటుతుంది. అది కూడా వీడియో తీసి పులి తిరిగేస్తోంది అంటే ఎలా? ప్రత్యేకంగా మనిషి కోసం ఊళ్లోకి వస్తే అప్పుడు మేన్ ఈటర్ అనాలి.'' అన్నారాయన.

''సిర్పూర్ ప్రాంతం టైగర్ రిజర్వుగా ఎదిగే హంగులు ఉన్నాయని వారు అంటున్నారు. ఈ ప్రాంతం పులి నివసించడానికి అనువైనది. వాస్తవానికి కారిడార్ గానే కాకుండా, టైగర్ రిజర్వుగా ఉండదగిన ప్రాంతం ఇది. పులులకు ఈ ప్రాంతం నచ్చింది కాబట్టే ఉంటున్నాయి. కాబట్టి పులికీ, మనిషికీ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. పులి సంతానోత్పత్తికి కూడా ఇది అనువైన ప్రాంతం.

పులికి మూడు కావాలి: మేత, తోడు, తిరగడానికి చోటు. ఈ మూడు ఉంటే అవి మనుషుల జోలికి రావు.'' అని మరో అటవీ శాఖ అధికారి చెప్పారు.

సరిగ్గా ఇదే భయం స్థానికుల్లో ఉంది. పులుల సంఖ్య పెరిగితే ఆ అడవిని టైగర్ రిజర్వు చేస్తారు. అప్పుడు తమను మొత్తానికి ఇక్కడ నుంచి ఖాళీ చేయిస్తారనే భయం వారి మాటల్లో కనిపించింది.

పులి కోసం అధికారులు ఏర్పాటు చేసిన బోను
ఫొటో క్యాప్షన్, పులిని పట్టుకోడానికి అధికారులు ఏర్పాటు చేసిన బోను

ఇది మనిషి రక్తం రుచిమరిగిన పులా?

పులికి.. మనిషి సహజ ఆహారం కాదు. కేవలం కొన్ని పులులే మనిషి రుచి మరుగుతాయి. వాటితోనే సమస్య.

''అడవిని ఆక్రమించుకున్న భూములు, పత్తిచేలలో జరిగిన ఘటనల ఆధారంగా ఒక పులిని నరహంతక పులిగా చెప్పలేం. పులికి అడవిలో చోటు, ఆహారం ఉన్నా కూడా గ్రామాల్లోకి వచ్చి మనిషిపై దాడి చేస్తేనే నరహంతక పులి అనాలి.'' అని బీబీసీతో చెప్పారు అటవీ శాఖలోని వైల్డ్ లైఫ్ చూసే ఉన్నతాధికారి.

''గతంలో ఈ ప్రాంతంలో పులి మనిషిపై దాడిచేసిన ఆనవాలు లేదు. తాజాగా జరిగిన ఘటనలు అనుకోకుండా ప్రమాదవశాత్తూ జరిగినవే. దాని కోసమని పులిని పట్టి బంధించడం సరికాదు.'' అని ఆయన అన్నారు.

ఒకవేళ ఏదైనా పులితో మనుషులకు నిరంతరం ముప్పు ఉంటే అప్పుడు ప్రభుత్వ అనుమతితో దానిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు అధికారులు.

పులిని పట్టుకునే ప్రయత్నాలు

పులిని ఎప్పుడు పట్టుకుంటారు?

ప్రస్తుతం పులిని పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని కోసం బోనులు పెట్టారు. వాటకి ఎరగా మేక, లేగదూడ, జింకలను పెట్టారు. అయినా పులి చూసి వెళ్లిపోతోంది తప్ప, బోనులో చిక్కడం లేదు. ఇక బోను లేకుండా ఖాళీ స్థలంలో ఒక ఎరను పెట్టి, దాన్ని తినడానికి పులి వస్తే వెంటనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు.

చాలా మంది అటవీ శాఖ అధికారులకు ఈ పనులు ఇష్టం లేదు. పులిని పట్టుకోకూడదని వారి కోరిక. కానీ అయిష్టంగానే పులిని పట్టుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.

పులి నుంచి తప్పించుకునే విధానాలపై అవగాహన కల్పిస్తూ, ప్రచారం చేస్తున్నారు అటవీ అధికారులు. భయం భయంగా పనులకు వెళ్లలేక, కాపు కాసిన పత్తిని తీయలేక ఇబ్బంది పడుతున్నారు ఆదివాసీలు.

పత్తి తీస్తున్న ఆదివాసీ రైతు

దీనికి పరిష్కారం ఏంటి?

పులి స్వేచ్ఛగా తిరగాలని అటవీ అధికారులు కోరుకుంటున్నారు. చాలా మంది ఆదివాసీలు కూడా పులిని చంపాలని కోరుకోవడం లేదు. కానీ అది తమ జోలికి రాకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ పరిష్కారం వీరిద్దరి చేతుల్లో లేదు. రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంది.

స్థానికులకు అడవికి దూరంగా వేరే చోట భూములు చూపించడం దానికి ఒక మార్గం.

అటవీ భూముల ఆక్రమణపై రీ సర్వే చేయాలి. నిజమైన సాగుదారులకు హక్కు కల్పించాలని స్థానిక ఆదివాసీలు కోరుతున్నారు.

ఇక పులి తిరిగే ప్రాంతాల్లో భూములను తిరిగి స్వాధీనం చేసుకుని వారికి ప్రత్యామ్నాయం చూపాలనేది అటవీ అధికారుల సలహా. పులీ, మనిషీ పరస్పరం వ్యతిరేకం కాని పాత పద్ధతులను తేవాలనీ, ఈ టైగరు రిజర్వులను టూరిజం డెస్టినేషన్లుగా అభివృద్ధి చేయాలనేది మరో సలహా.

''పోడు భూముల సమస్య పోవాలి. దాన్ని నేనే పరిష్కరిస్తా. నేను అధికార యంత్రాంగంతో కలసి వెళ్లి డివిజన్ల వారీగా కూర్చోని సమస్యను పరిష్కరిస్తా.'' అని ఏడాది క్రితం అసెంబ్లీలో చెప్పారు కేసీఆర్.

ఆయన చెప్పినట్టు పోడు భూముల సమస్య పరిష్కారం అయితే, పరోక్షంగా పులి సమస్యా కొంత పరిష్కారం అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)