గంగూలీ: బెంగాల్ గవర్నర్‌తో బీసీసీఐ అధ్యక్షుడి భేటీ... దేనికి సంకేతం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రభాకర్ మణి తివారీ
- హోదా, బీబీసీ కోసం
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి వస్తారని 2011 నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఆయన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవిలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్ఖడ్‌తో ఆదివారం గంగూలీ రెండు గంటల పాటు భేటీ అయ్యారు. గవర్నర్ నివాసంలోనే ఈ సమావేశం జరిగింది.
ఈ భేటీ తర్వాత గంగూలీ రాజకీయాల్లోకి వస్తారని, రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ముఖ చిత్రంగా మారతారని చర్చలు ఊపందుకున్నాయి.

ఫొటో సోర్స్, Sanjay Das
సోమవారం ఉదయం దిల్లీకి వెళ్తున్న సమయంలో విమానాశ్రయంలో పాత్రికేయులతో మాట్లాడారు.
గవర్నర్‌తో భేటీ గురించి ప్రశ్నించినప్పుడు... ''నేను ఎవరితోనూ మాట్లాడకూడదా?'' అని ఎదురు ప్రశ్నించారు.
జగ్‌దీప్ దన్ఖడ్ గవర్నర్ అయినప్పుటి నుంచి పశ్చిమ బెంగాల్‌లో మమత ప్రభుత్వంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయనతో గంగూలీ భేటీ కావడంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
గవర్నర్ నివాసం నుంచి బయటకు వచ్చాక... ''ఇది స్నేహపూర్వక భేటీ మాత్రమే. ఏడాదిగా జగ్‌దీప్ దన్ఖడ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఇంతవరకూ ఆయన ఈడెన్ గార్డెన్‌ను సందర్శించలేదు. ఆయన్ను ఆహ్వానిందుకే వచ్చాను'' అని గంగూలీ అన్నారు.
ఈడెన్ సందర్శనతో పాటు వివిధ అంశాల గురించి గంగూలీతో చర్చించినట్లు గవర్నర్ దన్ఖడ్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ఆ ఇతర అంశాలేంటి అనే సమాచారం లేదు.
గంగూలీ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు దన్ఖడ్ తెలిపారు.
గవర్నర్‌ను గంగూలీ ఈడెన్ గార్డెన్స్‌కు ఆహ్వానించడం కన్నా, ఈ సమయంలో ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల జరగబోతున్నాయి. రాజకీయంగా వాతావరణం వేడెక్కి ఉంది. దీంతో గంగూలీ చర్య కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తుండటానికి సంకేతం కావొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Sanjay Das
గంగూలీ రాజకీయ ప్రవేశం గురించి చర్చలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన సీపీఎం లేదా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ల్లో చేరవచ్చని ఊహాగానాలు నడిచాయి.
గంగూలీకి వామ పక్ష నేతలతో సాన్నిహత్యం ఉందని చెబుతారు. వామ పక్ష కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో కోల్‌కతాలో పాఠశాల ఏర్పాటు చేసేందుకు గంగూలీకి స్థలం కూడా కేటాయించారు. అయితే, చట్టపరమైన కారణాలతో ఆ స్థలం కేటాయింపు పూర్తి కాలేదు.
ఇక టీఎంసీ ప్రభుత్వం సాల్ట్ లేక్‌లో గంగూలీకి రెండెకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి మమత బెనర్జీని కలిసి ఆ స్థలాన్ని వెనక్కి ఇచ్చేశారు.
అప్పుడు కూడా గంగూలీ బీజేపీలో చేరతారని వదంతులు వచ్చాయి.
''ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వస్తాను అన్నారు. అలాంటిదేమీ జరగలేదు కదా!'' అని గంగూలీ అన్నారు.
అంతకుముందు మమత బెనర్జీ చొరవ మీద గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడయ్యారు.
గత ఏడాది అక్టోబర్‌లో గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి పొందారు. అమిత్ షా సహా ముగ్గురు కేంద్ర మంత్రులు ఈ విషయంలో కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు.
అయితే, తన నియమాకం వెనక ఎలాంటి రాజకీయాలూ లేవని గంగూలీ అప్పుడు వ్యాఖ్యానించారు.
అప్పటి నుంచి గంగూలీ బీజేపీలో చేరతారని వదంతులు వస్తూనే ఉన్నాయి. అయితే, ఆయన మాత్రం వీటిని నిరాకరిస్తూనే ఉన్నారు.
ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన వన్‌డే మ్యాచ్‌ను బీసీసీఐ రద్దు చేసింది. అప్పుడు ఈ నిర్ణయాన్ని మమత బెనర్జీ విమర్శించారు.
రాజకీయాల్లోకి రావడం గురించి గంగూలీ స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ఈ విషయంపై ఆయన భార్య డోనా గంగూలీ మాట్లాడారు.
''గంగూలీ ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ, రాజకీయాల్లోకి వస్తే, ఆయన అగ్ర స్థానంలో ఉంటారు'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Sanjay Das
ఈ మధ్య అమిత్ షా మాట్లాడుతూ బెంగాల్‌కు కాబోయే ముఖ్యమంత్రి బెంగాలీ వ్యక్తే అయ్యుంటారని అన్నారు.
డోనా, అమిత్ షా వ్యాఖ్యలను ముడిపెడుతూ చాలా మంది చూస్తున్నారు.
''క్రికెట్ మైదానంలో గంగూలీ కెప్టెన్‌గా విజయవంతమయ్యారు. బెంగాల్ క్రికెట్ సంఘం, బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల్లోనూ రాణించారు. టీవీ షోలోనూ పని చేస్తున్నారు. బెంగాల్‌లో ఆయనకు మంచి ప్రజాదరణ ఉంది. రాజకీయాలు ఆయనకు సరిపడతాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం'' అని క్రీడా పాత్రికేయుడు తపన్ దత్ అన్నారు.
''ఏ రాజకీయ పార్టీకీ గంగూలీ దగ్గరగా లేరు. అయితే, అన్ని పార్టీల నాయకులతో ఆయన కలిసిమెలిసి మెదులుతారు. ఒక్క భేటీని చూసి మనం ఓ అంచనాకు రాలేం. క్రికెట్ మైదానంలోలాగే రాజకీయాల్లోనూ గంగూలీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు'' అని పాత్రికేయుడు శభ్రదీప్ సాహా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Sanjay Das
తాజా పరిణామాలపై టీఎంసీ నుంచి ఎవరూ స్పందించలేదు.
అయితే, గంగూలీ రాజకీయాల్లోకి రావడం మంచి నిర్ణయం కాదని ఇదివరకు టీఎంసీ ఎంపీ, అధికార ప్రతినిధి సౌగత్ రాయ్ అన్నారు.
''గంగూలీ రాజకీయాల్లోకి వస్తే, నేనైతే సంతోషించను. బెంగాలీలందరికీ ఆయన ఒక ఐకాన్. బెంగాల్ నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన వ్యక్తి ఆయన ఒకరే. అయితే, రాజకీయ నేపథ్యమేమీ లేని కారణంగా ఆయన ఇక్కడ మనుగడ సాగించలేరు'' అని రాయ్ అన్నారు.
మరోవైపు బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాత్రం గంగూలీ రాజకీయాల్లోకి రావాలనే అన్నారు.
''ఆయన ఏం నిర్ణయించుకుంటారో తెలియదు. కానీ, ఆయన్ను మేం గౌరవిస్తాం. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. మంచి వ్యక్తులను బీజేపీ ఆహ్వానిస్తోంది'' అని చెప్పారు.
అయితే గవర్నర్‌తో గంగూలీ భేటీ అవడాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని ఘోష్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








