వాకర్ టైగర్: ఆడ తోడు కోసం 3,000 కిలోమీటర్లు నడిచిన పులికి జోడు దొరికిందా? లేదా?

సీ-1 పులి

భారతదేశంలో ఇప్పటివరకు ఏ పులీ తిరగనంత దూరం ఈ పులి నడుచుకుంటూ వెళ్లింది. ఇప్పుడు ఇది ఒక అభయారణ్యానికి చేరింది. ఇక్కడ ఇది ఒంటరిగానే గడుపుతోంది.

దీన్ని అందరూ ముద్దుగా ‘‘వాకర్’’ అని పిలుస్తుంటారు. మూడున్నర ఏళ్ల వయసున్న ఈ మగ పులి గత జూన్‌లో తన పుట్టిల్లు అయిన మహారాష్ట్రలోని ఒక అభయారణ్యాన్ని విడిచిపెట్టింది. బహుశా ఇది ఆడ తోడు లేదా ఆహారం లేదా చోటు కోసం తిరుగుతూ ఉండొచ్చు.

దీనికి అధికారులు ఒక రేడియో కాలర్‌ను అమర్చారు. తొమ్మిది నెలల పాటు మహారాష్ట్ర, తెలంగాణల్లోని ఏడు జిల్లాల్లో మొత్తంగా దాదాపు 3,000 కిలోమీటర్లు (1,864 మైళ్లు) ఇది తిరిగింది. చివరగా మహారాష్ట్రలోని మరొక అభయారణ్యంలో స్థిరపడింది. గత ఏప్రిల్‌లో దీని కాలర్‌ను అధికారులు తొలగించారు.

ఈ పులి ప్రస్తుతం 205 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ధ్యాన్‌గంగా అభయారణ్యానికి చేరుకుంది. చిరుతలు, నీలి ఎద్దులు, అడవి పందులు, నెమళ్లు, జింకలకు ఈ అరణ్యం నిలయం. ఇక్కడ ఉన్న ఏకైక పులి వాకర్ మాత్రమేనని అధికారులు చెబుతున్నారు.

పులి తిరిగిన ప్రాంతం

‘‘దీనికి ఎలాంటి సరిహద్దు సమస్యలూ లేవు. సరపడా ఆహారమూ దొరుకుతోంది’’ అని మహారాష్ట్ర సీనియర్ అటవీ అధికారి నితిన్ కకోద్కర్ బీబీసీతో తెలిపారు.

ప్రస్తుతం ఈ అభయారణ్యానికి ఒక ఆడ పులిని తోడుగా తీసుకురావాలా? వద్దా అనే అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.

పులులు ఒంటరి జీవులు కావు. సహజంగా తోడు కోసం ఇవి వెతుకుతుంటాయి. అయితే, ఇక్కడకు రెండో పులిని తీసుకురావడం అంత తేలిక కాదు.

‘‘ఇదేమీ పెద్ద అభయారణ్యం కాదు. దీనికి చుట్టూ పొలాలు, అటవీ భూములు ఉన్నాయి. ఇక్కడ గానీ వాకర్ పిల్లలు పెడితే ఆహార సమస్య వస్తుంది. కొత్త పులులు నచ్చిన చోటుకు వెళ్తుంటాయి’’ అని నితిన్ వ్యాఖ్యానించారు.

ప్రపంచంలో పులులు జీవించే అరణ్యాల్లో కేవలం 25 శాతమే భారత్‌లో ఉన్నాయి. కానీ పులుల సంఖ్య విషయానికి వస్తే 70 శాతం మన దగ్గరే ఉన్నాయి. భారత్‌లో మొత్తంగా 3,000 వరకు పులులున్నాయి. పులుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వీటి ఆవాస ప్రాంతాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు వాటి ఆహారమూ తగ్గిపోతోందని అటవీ అధికారులు చెబుతున్నారు.

‘‘ప్రతి పులికీ తను నివసించే ప్రాంతంలో కనీసం 500 జంతువులు ఉండాలి. ఇవి పిల్లల్ని కంటూ ఉంటే పులికి ఒక ఆహార బ్యాంకు ఉంటుంది’’ అని నిపుణులు వివరించారు.

పులి

ఫొటో సోర్స్, AFP

గత ఫిబ్రవరిలో వాకర్‌కు రేడియో కాలర్‌ను అమర్చారు. వర్షాకాలం నడుమ నివసించడానికి ఒక మంచి చోటు వెతుక్కునేందుకు దాన్ని విడిచిపెట్టారు.

అయితే, ఇది ఒక క్రమ పద్ధతిలో నడుచుకుంటూ వెళ్లలేదని అటవీ అధికారులు చెబుతున్నారు. దీని మార్గాన్ని జీపీఎస్ సాయంతో ట్రాక్‌చేశారు. దీంతో ఇది 5,000కు పైగా ప్రాంతాలను ఇది సందర్శించినట్లు తెలిసింది.

గత చలికాలంతో పాటు ఈ వేసవిలోనూ పంట పొలాలు, నదులు, హైవేల గుండా వాకర్ తిరిగింది. మహారాష్ట్రలో శీతాకాలంలో ఎక్కువగా పత్తిని సాగుచేస్తారు. ఈ చెట్లు పొడుగ్గా ఉండటంతో ఇది హాయిగా దాక్కుంటూ వెళ్లిపోయింది. ఇది ఎక్కువగా రాత్రి పూట ప్రయాణించింది. అడవి పందులు, ఇతర జంతువుల్ని ఆహారంగా తీసుకుంది.

మనుషులపై ఒక సారి మాత్రమే ఇది దాడికి దిగింది. తన కాలి ముద్రలను వెతుక్కుంటూ వెళ్లిన ఒక వ్యక్తిని అనుకోకుండా గాయపరిచింది. అతడికి పెద్ద గాయలేమీ కాలేదు.

‘‘అభివృద్ధితోపాటు జనాభా పెరుగుతున్నప్పటికీ మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలు పులులు స్వేచ్ఛగా తిరగడానికి అనువుగా ఉన్నాయని ఈ పులి ప్రయాణం చెబుతోంది. అంటే ఇక్కడ అభివృద్ధి ఏమీ జంతువుల కదలికలకు అవరోధం కాదని తెలుస్తోంది’’ అని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ బయాలజిస్ట్ డాక్టర్ బిలాల్ హబీబ్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)