కరోనావైరస్: వచ్చే చలికాలానికి అంతా నార్మల్ అవుతుందంటున్న వ్యాక్సీన్ రూపకర్తలు

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

త్వరలో రాబోయే కోవిడ్‌ వ్యాక్సీన్‌ ఎండాకాలంలో ప్రభావవంతంగా పని చేస్తుందని, వచ్చే శీతాకాలంనాటికి కోవిడ్‌ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని టీకా రూపకర్తలు చెబుతున్నారు.

ఈ వ్యాక్సీన్‌ పని చేయడానికి శీతాకాలం అనువైనందికాదని, ఈ కాలంలో కేసుల సంఖ్యను అదుపు చేయడం కష్టమని బయోఎన్‌టెక్ సహ వ్యవస్థాపకులు ప్రొఫెసర్‌ ఉగుర్‌ సహిన్‌ అన్నారు.

కోవిడ్‌ను తమ వ్యాక్సీన్‌ 90శాతానికి పైగా ప్రభావవంతంగా అడ్డుకోగలుగుతుందని బయోఎన్‌టెక్ సంస్థతో కలిసి వ్యాక్సీన్‌పై ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్న ఫైజర్‌ కంపెనీ గతవారం ప్రకటించింది. 43,000 మందిపై ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది ఆఖరుకల్లా యూకేకు ఒక కోటి డోసుల వ్యాక్సీన్ అందనుంది. మరో మూడు కోట్ల డోసులకు కూడా ఆ దేశం ఆర్డర్‌ ఇచ్చింది. ఈ వ్యాక్సీన్‌ను మూడు వారాల వ్యవధిలో రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది.

కేర్‌ హోమ్‌లలో ఉండే వయోవృద్ధులకు, వారికి సహాయం చేసే సిబ్బందికి ముందుగా ఈ వ్యాక్సీన్‌ ఇస్తారు. ఆ తర్వాత హెల్త్‌ వర్కర్స్‌, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇవ్వాలని నిర్ణయించారు. ముందు వ్యాక్సినేషన్‌ ఎవరికి అనే విషయంలో వయసును ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

వ్యాక్సిన్‌ వైరస్‌ను ఒకరి నుంచి మరొకరికి సోకకుండా నిరోధించడమే కాకుండా, వైరస్‌ లక్షణాలను కూడా అదుపు చేస్తుందని బీబీసీలో ప్రసారమయ్యే ‘ఆండ్రూ మార్‌ షో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్‌ సహిన్‌ చెప్పారు.

ప్రొఫెసర్ ఉగుర్ సహీన్
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్‌ ఉగుర్‌ సహిన్‌

వ్యాక్సీన్ ఎలా పని చేస్తుంది?

వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా నిరోధించడం ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని సహిన్‌ అన్నారు.

“వైరస్‌వ్యాప్తిని అరికట్టడంలో వ్యాక్సిన్‌ ప్రభావం 90శాతం కావచ్చు, 50శాతం కావచ్చు. కానీ దాని ప్రయోజనం మాత్రం విస్తృతంగా ఉంటుంది. మహమ్మారి నియంత్రణలో అది కీలకంగా మారుతుంది’’ అన్నారు సహిన్‌.

అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సీన్‌ రాబోతోందంటూ సోమవారంనాడు ఫైజర్‌ సంస్థ ప్రకటించింది. ఈ వ్యాక్సీన్‌తో సామాన్య జీవితం మళ్లీ యథాస్థితికి వస్తుందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సర్‌ జాన్‌బెల్‌ అన్నారు. “ఈ మాట చెబుతున్న మొదటి వ్యక్తిని నేనే కావచ్చు. కానీ అది జరిగి తీరుతుందన్న నమ్మకం నాకుంది’’ అన్నారాయన.

అయితే, వ్యాక్సీన్‌ రావడానికి ఇంకొంత సమయం పడుతుందని ప్రొఫెసర్‌ సహిన్‌ తెలిపారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది ఆఖరుకల్లా వ్యాక్సీన్‌ సరఫరాకు సిద్ధమవుతుందని, వచ్చే ఏప్రిల్‌నాటికి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల డోసులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు.

ఎండాకాలంలో వ్యాక్సీన్‌ పని తీరు బాగుంటుందని, వచ్చే ఏడాది శీతాకాలం నాటికి వ్యాక్సినేషన్‌ను చాలా వరకు పూర్తి చేయాల్సి ఉంటుందని సహిన్‌ అన్నారు.

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌

ఫొటో సోర్స్, Reuters

వ్యాధి నిరోధక బూస్టర్లు

ఈ వ్యాక్సీన్‌ ఏ వయసు వారిపై ప్రభావవంతంగా పని చేస్తుందన్నది రాబోయే కొద్దివారాల్లో తెలుస్తుందని, కానీ రెండో డోస్‌ ఇచ్చిన తర్వాత ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధకత) ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేమని ఆయన తెలిపారు.

ఒక ఏడాదిలోగా వ్యాధి నిరోధకత బలహీనపడితే, బూస్టర్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం పెద్ద సమస్య కాకపోవచ్చని ప్రొఫెసర్‌ సహిన్‌ వెల్లడించారు.

వ్యాక్సీన్‌ తీసుకున్న వారిలో ఇంజెక్షన్‌ వేసినచోట కొద్దిరోజులపాటు స్వల్పంగా నొప్పి, కొందరిలో కొద్ది జ్వరం లక్షణాలు కనిపించాయని, అంతకుమించి వ్యాక్సీన్‌ ప్రయోగాలను నిలిపేయాల్సినంత సమస్యలేవీ రాలేదని సహిన్‌ చెప్పారు

ఈ వ్యాక్సీన్‌ ప్రపంచవ్యాప్తంగా పరీక్షల దశలో ఉన్న 11 వ్యాక్సీన్‌లలో ఒకటి.

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌

ఫొటో సోర్స్, Getty Images

మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) సూచించిన రక్షణ ప్రమాణాలకు అనుగుణమని తేలే వరకు యూకేలో ఈ వ్యాక్సీన్‌ను విడుదల చేయబోవడం లేదు. అత్యవసరంగా సిద్ధం చేస్తున్నా, భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని ఎంహెచ్‌ఆర్‌ఏ అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, వ్యాక్సీన్‌కు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న ప్రచారాన్ని నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని లేబర్‌ పార్టీ ఆరోపించింది. వ్యాక్సిన్‌ గురించి తప్పుడు, అసత్య ప్రచారాలకు వేదికలవుతున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు భారీ జరిమానాలు విధించాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది.

ఇలాంటి ప్రచారంతో ప్రభుత్వంపట్ల, సంస్థలపట్ల ప్రజల్లో అపనమ్మకం కలిగేలా కొందరు ప్రయత్నిస్తున్నారని, మిగిలిన రాజకీయ పక్షాలతో కలిసి వ్యాక్సిన్‌పై సాగుతున్న ఇలాంటి ప్రచారాలను అడ్డుకుంటామని ఆరోగ్యమంత్రి జోనాథన్‌ ఆష్‌వర్త్ అన్నారు.

గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లాంటి సంస్థలకు ఈ విషయంపై స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)