హాథ్‌రస్ వివాదం అంతర్జాతీయ కుట్రా? ఇలాంటి కుట్ర కేసులు ఇంకేం ఉన్నాయి?

ఫొటో సోర్స్, NurPhoto
యూపీలో కుల ఘర్షణలు రెచ్చగొట్టడానికి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం పేరు చెడగొట్టడానికి జరిగిన అంతర్జాతీయ కుట్రగా రాష్ట్ర పోలీసులు హాథ్‌రస్ కేసును చెబుతున్నారు.
“అంతర్జాతీయ నిధుల ద్వారా మా ప్రత్యర్థులు కుల, మత ఘర్షణలకు పునాదులు వేసి మాపై కుట్ర చేస్తున్నార”ని స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హాథ్‌రస్ చందపా పోలీస్ స్టేషన్లో యూపీ పోలీసులు సోమవారం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అజ్ఞాత వ్యక్తులపై చాలా సెక్షన్లు నమోదు చేశారు. అందులో నేరపూరిత కుట్ర(120బి), దేశద్రోహం(124ఎ) లాంటి సెక్షన్లు ఉన్నాయి.
ఈ సెక్షన్లు ఆంగ్లేయుల కాలం నుంచి ఐపీసీలో భాగమయ్యాయి.
నేరపూరిత కుట్ర కేసులో ఆ నేరం తీవ్రతను బట్టి మరణశిక్ష, జీవితఖైదు నుంచి ఆరు నెలల జైలు శిక్ష వరకూ విధించవచ్చు.
దేశద్రోహం కేసులో జీవిత ఖైదు నుంచి మూడేళ్ల జైలు శిక్షతోపాటూ జరిమానా కూడా విధించవచ్చు. దానిని నాన్ బెయిలబుల్ నేరంగా కూడా భావిస్తారు.
గత కొన్నేళ్లుగా చర్చనీయాంశమైన కేసుల్లో కుట్ర, దేశద్రోహం అనే మాట వినిపించింది. నేరపూరిత కుట్రలుగా వర్ణించిన అలాంటి కొన్ని కేసులను ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ అల్లర్లు
ఈ ఏడాది దిల్లీలో జరిగిన అల్లర్లను పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రగా దిల్లీ పోలీసులు ఖరారు చేశారు.
సెప్టెంబర్ 16న వేల చార్జిషీటు పత్రాల్లో 15 మందిపై నమోదు చేసిన సెక్షన్లలో నేరపూరిత కుట్ర, దేశద్రోహం సెక్షన్లు కూడా ఉన్నాయి.
వాట్సాప్ మెసేజులు, గ్రూప్స్ ద్వారా ఈ అల్లర్లకు కుట్ర పన్నారని పోలీసులు తమ చార్జిషీటులో చెప్పారు.
జేఎన్‌యూ కేసు
దిల్లీ పోలీసులు 2016 ఫిబ్రవరిలో చర్చనీయాంశమైన జేఎన్‌యూ కేసులో కూడా కుట్ర జరిగిందన్నారు. అక్కడ కూడా ఇవే సెక్షన్లు ఉపయోగించారు.
2019 జనవరిలో దిల్లీలోని ఒక కోర్టులో జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, విద్యార్థి ఉమర్ ఖాలిద్, అనిర్బాన్ భట్టాచార్య, మరో ఏడుగురు కశ్మీరీ విద్యార్థులు మొత్తం 10 మందిపై ఇవే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పార్లమెంటుపై జరిగిన దాడిలో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించడానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన ఒక సభలో 2016 ఫిబ్రవరి 9న వారంతా దేశ వ్యతిరేక నినాదాలు చేశారని వారిపై ఆరోపణలు నమోదు చేశారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ) కింద దేశద్రోహానికి సంబంధించిన కేసుల్లో కోర్టులో విచారణ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తప్పనిసరి. కానీ ఈ ఆరోపణల వెనుక వాస్తవాలను తెలుసుకోడానికి తమకు మరింత సమయం కావాలని దిల్లీ ప్రభుత్వం తాత్సారం చేస్తూ వచ్చింది.
తర్వాత ఇదే ఏడాది ఫిబ్రవరి 19న దిల్లీలోని ఒక కోర్టు ఏప్రిల్ 3 లోపు ఈ కేసులో స్టేటస్ రిపోర్ట్ ప్రవేశపెట్టాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. ఆ తర్వాత 9 రోజులకు అంటే ఈ కేసు నమోదైన ఏడాది తర్వాత ఫిబ్రవరి 28న దేశద్రోహం కేసులో విచారణలకోసం చార్జిషీటు దాఖలు చేయడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం దిల్లీ పోలీసులను అనుమతించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన మంత్రి హత్యకు కుట్ర
2017-18 ఎల్గార్ పరిషత్ కేసులో కూడా పోలీసులు నేరపూరిత కుట్ర, దేశద్రోహం సెక్షన్లు నమోదు చేశారు.
పుణె పోలీసులు గత ఏడాది ఎల్గార్ పరిషత్ కేసులో చేసిన ఆరోపణల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేయడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి నిందితులు కుట్ర పన్నారని చెప్పారు.
కోరెగావ్ హింస తర్వాత ఏమైంది
ఈకేసులో వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖా, ఆనంద్ తెల్తుంబ్డే, అరుణా పెరీరా, వర్నన్ గంజాల్వెజ్ లాంటి కార్యకర్తలు నిందితులుగా ఉన్నారు.
భీమా-కోరెగావ్ యుద్ధానికి 200 ఏళ్ల పూర్తైన సందర్భంగా 2017 డిసెంబర్ 31న పుణెలో ఎల్గార్ పరిషద్ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించిన సమయంలో హింస చెలరేగింది. అందులో ఒక వ్యక్తి చనిపోయాడు. తర్వాత పుణె, మహారాష్ట్రలోని మిగతా ప్రాంతాల్లో చాలా రోజుల వరకూ హింస జరిగింది.
ఈ కార్యక్రమాన్ని కబీర్ కళా మంచ్ నిర్వహించింది. ఎన్ఐఏ దీనిని నిషేధిత మావోయిస్టులు సంబంధించిన ఒక విభాగంగా చెబుతుంది.
గత నెల కబీర్ కళా మంచ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. అప్పుడు వారిపై ఎన్ఐఏ నమోదు చేసిన సెక్షన్లలో నేరపూరిత కుట్ర, దేశద్రోహం కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
కేజ్రీవాల్-ప్రధాన కార్యదర్శి కేసు
2018లో అప్పటి దిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ ఫిబ్రవరి 19న రాత్రి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీఎం, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సమక్షంలో కొందరు ఎమ్మెల్యేలు తనను కొట్టారని ఆరోపించారు.
పోలీసులు కేసును కూడా కుట్రగా ఖరారు చేశారు. తర్వాత ఈ కేసులో 1300 పేజీల చార్జిషీటు దాఖలు చేసిన వారు అందులో అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, మరో 11 మంది ఎమ్మెల్యేలపై వివిధ సెక్షన్లు నమోదు చేశారు. వాటిలో ‘నేరపూరిత కుట్ర’ కూడా ఉంది.
ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగులో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మొత్తం 13 మంది నేతలు ఈ ఆరోపణలు నిరాధారం అంటున్నారు.
చిదంబరం కేసు
మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను కూడా సీబీఐ గత ఏడాది ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ చేసింది. ఆయనపై కూడా నేరపూరిత కుట్ర సెక్షన్లు నమోదు చేశారు.
2018 సెప్టెంబరులో దిల్లీ హైకోర్టులో కేసు విచారణ సమయంలో చిదంబరం న్యాయవాది కపిల్ సిబల్ ఆయన తరఫున ఒక ప్రశ్న అడిగారు
“వీరు నాపై నేరపూరిత కుట్ర ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు. నేను ఎవరితో కలిసి కుట్ర చేశాను” అన్నారు.
చిదంబరంను ఆగస్టు 21న అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు బెయిల్ లభించడంతో 106 రోజుల తర్వాత డిసెంబర్ 4న ఆయన విడుదలయ్యారు.
2001లో ఈ కేసు విచారించిన ప్రత్యేక న్యాయస్థానం టెక్నికల్ కారణాలతో 120బి సెక్షన్ తొలగించింది. కానీ 2017లో సుప్రీంకోర్టు మళ్లీ నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్ధరించింది.
ఇవి కూడా చదవండి:
- సరిహద్దుల్లో విధులకు వెళుతూ చైనా సైనికులు ఏడ్చేశారా?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏంటి? వీటికి పరిష్కారాలు ఏంటి?
- కరోనావైరస్ వల్ల కంటి సమస్యలు వస్తున్నాయా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- భారతదేశంలో కోవిడ్ మరణాలు 1,00,000 దాటాయి... ఈ మరణాలకు కారణాలేమిటి?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








