మోదీ బీజేపీ ముందు 'సోనియా-రాహుల్ కాంగ్రెస్' ఎందుకు విఫలమవుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భూమికా రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సీడబ్ల్యుసీ సమావేశంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేంత వరకూ సోనియాగాంధీని తాత్కాలిక అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు.
సోమవారం సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు కనిపించాయి. కానీ, కొత్త అధ్యక్షుడి ఎన్నిక మాత్రం సాధ్యం కాలేదు.
మరో ఆరు నెలల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందని పార్టీ ప్రతినిధులు చెప్పారు. ఏమైనా, సోమవారం జరిగిన సమావేశం చాలా విషయాల్లో ప్రత్యేకంగా నిలిచింది.
రాహుల్ గాంధీ చేసిన ఒక ప్రకటనపై పార్టీ సీనియర్ నేతలు బహుశా మొదటిసారి బహిరంగంగా అభ్యంతరాలు తెలిపారని, ఆయన మాటను ఖండించారని తెలుస్తోంది. తర్వాత ఆ సమస్య సమసిపోయినా, ఈ ఒక్క ఘటన కాంగ్రెస్ లోలోపలి రాజకీయాలను అందరి ముందుకూ తీసుకొచ్చింది.
ఈ సమావేశం జరుగుతున్నప్పుడు లోపల బయట జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణల గురించి రాజకీయ విశ్లేషకులు స్మితా గుప్తా మాట్లాడారు.
“ఇదంతా చూస్తుంటే సమావేశం మొదలవక ముందు నుంచే పార్టీ నేతలు చాలా ఆగ్రహంతో ఉన్నట్టు అర్థమవుతోంది. కానీ, గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాంగ్రెస్‌లో అలా ఎప్పుడూ జరగలేదు” అన్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times
ఇప్పుడు జరిగిన దానిని చక్కదిద్దుకోకపోతే, అది పార్టీ విచ్ఛిన్నం అయ్యే స్థితి వరకూ వెళ్లచ్చని స్మిత భావిస్తున్నారు.
“కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని చాలా కాలం నుంచీ చెప్పుకుంటున్నారు. కానీ, ఈ సమావేశం దానిని స్పష్టంగా బయటపెట్టింది” అన్నారు.
“ఈ సమావేశంలో సోనియా గాంధీ తన రాజీనామా సమర్పిస్తారని అనుకుంటూ వచ్చారు. కానీ, అలా జరగలేదు. ఇప్పుడు జరిగింది మాత్రం కాంగ్రెస్ భవిష్యత్తు, నాయకత్వాలపై ప్రశ్నలు లేవనెత్తింది.”
“ఈరోజు జరిగిన దానిని నేను తిరుగుబాటు అని చెప్పను. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకూ హైకమాండ్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడాలంటే ఉన్న భయం ముక్కలైంది. 23 మంది బాగా ఆలోచించాక, 250 మందితో మాట్లాడి సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు. దీంతో చాలా కాలంగా పార్టీ లోపల ఉన్నదంతా బయటపడినట్లు తెలుస్తోంది” అని సీనియర్ జర్నలిస్ట్ నీరజా చౌధురి అన్నారు.
స్మిత కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. “దీనిని తిరుగుబాటు అనడం సరికాదు. కానీ, పార్టీ నేతల్లో ఆగ్రహం, బాధ కచ్చితంగా ఉంది. అతిపెద్ద విపక్షం, దేశంలో అత్యంత పురాతన పార్టీ అయినప్పటికీ మనం ముందుకు వెళ్లలేకపోతున్నామే అనే ఆలోచన నేతల్లో ఉంది. దేశంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఆయన పార్టీ ముందుకెళ్తోంది. కానీ మనం ఎక్కడా కనిపించడం లేదేమిటని వారికి అనిపిస్తోంది” అని ఆమె అన్నారు.
నీరజా దీనిని పార్టీకి ఒక హెచ్చరికలా కూడా చూస్తున్నారు. “పార్టీ విచ్ఛిన్నం అవుతున్నట్లు అనిపిస్తోందా అని నన్నెవరైనా అడిగితే, అది ముక్కలవుతుందా, లేదా అనేది నాయకత్వం పార్టీని ఎలా నెట్టుకొస్తుందనేదానిపైనే ఆధారపడి ఉంటుందనే చెబుతాను. ఉదాహరణకు పార్టీ క్రమశిక్షణా చర్యలు ప్రారంభించి, ఈ రోజు ఇవి బయటకు వచ్చినట్లు, ఇక ముందు కూడా జరిగితే.. ముందుముందు ఏదైనా జరగవచ్చు” అన్నారు.

ఫొటో సోర్స్, The India Today Group
2019లోనే సిద్ధమైన నేపథ్యం
తాజాగా జరిగిన ఘటనలకు కొన్ని నెలల నేపథ్యం ఉందని స్మిత చెబుతున్నారు.
“2019లో ప్రతి నేతకూ ఇంత పెద్ద ఓటమి చవిచూసినా పార్టీలో ఏం చేయడం లేదు అనిపించింది. సోనియా గాంధీతో ఆ విషయం మాట్లాడాలని నేతలు చాలాకాలంగా అనుకుంటున్నారు. కానీ, ఎవరైనా ముందుకు వెళ్లి ఆ విషం చెబితే వారిపై తిరుగుబాటుదారుడి ముద్ర పడుతుందేమోనని భయపడ్డారు. అందుకే, నాయకత్వంతోపాటూ పార్టీలోని అన్ని అంశాలపై చర్చ జరిగితే బాగుంటుందని వారు ఈ లేఖ రాశారు” అని స్మిత చెప్పారు.
పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోందనే విషయాన్ని స్మిత కొట్టిపారేయడం లేదు. కానీ, ఆమె దానిని వర్గాలుగా భావించడం లేదు. “పార్టీలో గ్రూపులు లేవు. ఒక వర్గం ఇంకో వర్గం కంటే కాస్త ధైర్యంగా మాట్లాడుతోంది” అన్నారు.
పార్టీలోపల ఇదంతా చాలా రోజుల నుంచీ జరుగుతోందని నీరజా చౌధరి భావిస్తున్నారు.
“పార్టీ నేతల్లో లోలోపల ఎక్కడో, పార్టీ ఎన్నికల్లో ఓడిపోతోంది, ఏం జరగడం లేదు, ఏం ఆలోచించడం లేదు, మేధోమథనం జరగడం లేదు అని, పార్టీ భవిష్యత్తుపై ఆందోళన ఉంది. వారు ఈ లేఖలో ఆ ఆందోళనలను వ్యక్తం చేశారు” అని చెప్పారు.

ఫొటో సోర్స్, PTI
అత్యంత పురాతన పార్టీకి నాయకత్వం లోటు
దేశంలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్, ప్రస్తుతం సరైన నాయకత్వం కోసం సంఘర్షణలో ఉన్నట్లు కనిపిస్తోంది.
“అది ముమ్మాటికీ నిజం. కాంగ్రెస్ దేశంలో అత్యంత పురాతన పార్టీ. కానీ 2019 ఎన్నికల తర్వాత నుంచి ఎప్పుడు నాయకత్వం విషయం వచ్చినా, రాహుల్ గాంధీ, లేదంటే సోనియా గాంధీ పేరు మాత్రమే వినిపిస్తోంది” అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో అనుభవజ్ఞులైన నేతలకు, అధ్యక్షుడు అయ్యే అర్హత ఉన్నవారికి కొదవలేదని ఆమె భావిస్తున్నారు.
“పార్టీలో అనుభవజ్ఞులైన నేతలు చాలా మంది ఉన్నారు. వారు తమ రాష్ట్రాలను చూసుకున్నారు. రాష్ట్రంలో పార్టీని గెలిపించారు కూడా. కానీ ఎప్పుడు నాయకత్వం విషయం వచ్చినా వీరిలో ఎవరి వైపూ చూడరు. ఎవరి నాయకత్వ సామర్థ్యం ఎంత అనేది, వారికి అవకాశం ఇచ్చినపుడే తెలుస్తుంది. మనం అవకాశమే ఇవ్వకపోతే, అదెలా సాధ్యం అంటారు నీరజ.
“కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబం అభ్యర్థులను అంగీకరిస్తారు. వేరే ఎవరైనా అయితే మాత్రం భిన్నాభిప్రాయాలు వస్తాయి. అధ్యక్షుడుగా వేరే వారి పేరు వస్తే పార్టీ అంగీకరించదు. కానీ, గాంధీ కుటుంబం పార్టీని ఎన్నికల్లో గెలిపించలేకపోతోందనే విషయం నేతలు అర్థం చేసుకోవాలి” అని ఆమె అన్నారు.
రాహుల్ మాట్లాడుతున్నా, వినేవారు ఎక్కడ
కాంగ్రెస్‌లోని ఒక వర్గం రాహుల్ గాంధీని అధ్యక్ష పదవిలో చూడాలని కచ్చితంగా కోరుకుంటోంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ ప్రభుత్వాన్ని వరుసగా ప్రశ్నిస్తున్నారు కూడా. కానీ, ఆయన అపీల్ ఇప్పుడు ‘అలా’ ఉండడం లేదు.
ప్రతిరోజూ వివిధ అంశాలను లేవనెత్తే ఏకైక నేత బహుశా రాహుల్ గాంధీ ఒక్కరే. ఒకసారి కోవిడ్ ఐతే ఇంకోసారి ఆర్థికవ్యవస్థ, మరోసారి చైనా గురించి ఆయన ప్రశ్నిస్తారు. ఆయన తప్ప వేరే ఏ నేతా అలా ప్రశ్నించడం లేదు. కానీ, దేశంలో ఆయన ‘క్లిక్’ కావడం లేదు. ఇప్పుడు ఆయన ఎందుకు క్లిక్ కావడం లేదు, కారణం ఏంటి తర్వాత. అలా కాలేనప్పుడు కొంత కాలంపాటు వేరే ఎవరికైనా నాయకత్వం ఇచ్చి చూడాలి” అంటారు నీరజ.

ఫొటో సోర్స్, AFP
పార్టీలో నాయకులకు, సమర్థులకు, అనుభవజ్ఞులకు కొదవ లేదు, కానీ, వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందని నీరజ అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు యువతలో ఈ పార్టీని పునరుద్ధరించవచ్చా, లేదా అనే భావన ఏర్పడిందని ఆమె చెబుతున్నారు.
కొన్ని నెలల్లో పార్టీ నాయకత్వాన్ని ఎన్నుకోగలదా
కచ్చితంగా ఇది ఒక క్లిష్ట సమయం. పరిస్థితిని త్వరగా చక్కదిద్దకపోతే సమస్యలు మరింత పెరగవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటి పరిస్థితులను బట్టి, నాయకత్వం విషయానికి వస్తే కష్టంగానే అనిపిస్తోంది. కానీ, రేపు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేదానిపై అన్నీ ఆధారపడి ఉంటాయి అంటారు నీరజా
“ఆరు నెలల సమయం తీసుకున్నప్పటికీ, సోనియా గాంధీ ఆరోగ్యం గురించి ఆందోళనలు ఉన్నాయి. ముందు ముందు సోనియాగాంధీ బాధ్యతలు పంచుకోడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయవచ్చు. అలా ఆమెపై ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉంటుంది” అన్నారు.
కాంగ్రెస్ ఇప్పటికీ పాత పద్ధతిలోనే నడుస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. “పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నాయకత్వాన్ని ఎన్నుకుంటే, ఎవరు వచ్చినా ఆమోదయోగ్యంగానే ఉంటుంది. కానీ బలవంతంగా రుద్దిన నాయకత్వం ఉంటే, కొంత కాలం తర్వాత నేతలు ఆ నాయకత్వాన్ని తిరస్కరించవచ్చు” అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- "సినిమా వాళ్లు, మీడియావాళ్లు, రాజకీయ నాయకుల మనుషులు.. నాపై అత్యాచారాలు చేశారు’’
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
- నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- సోనూ పంజాబన్: ఈ మహిళకు వ్యభిచారం ‘ప్రజాసేవ’, 'కామం' ఒక భారీ మార్కెట్
- ఈ తెగలో వ్యభిచారం ఓ ఆచారం, అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








