అయోధ్య: రామమందిరం ఉద్యమంతో ఆర్ఎస్ఎస్‌ ఏం సాధించింది

మోదీ, మోహన్ భగవత్

ఫొటో సోర్స్, Pib

    • రచయిత, అనంత్ ప్రకాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రామ మందిర ఉద్యమం ద్వారా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏం సాధించింది? ఈ ప్రశ్నకు సమాధానం ప్రధాని భూమి పూజ ఫొటోలో దొరుకుతుంది.

ఈ ఫొటోలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆయన ఎడమ వైపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కనిపిస్తున్నారు.

భారత చరిత్రలో తొలిసారి మతం, ప్రభుత్వం, సంఘ్‌కు మధ్య సాన్నిహిత్యం ఇంత స్పష్టంగా కనిపించింది.

దశాబ్దాల ప్రయాణంలో ఆర్ఎస్ఎస్‌కు ఇవే అత్యంత గొప్ప క్షణాలు అయ్యుండొచ్చు.

‘‘చాలా సంతోషంగా ఉంది. ఒక సంకల్పం అనుకున్నాం. 20-30 ఏళ్లు కృషి చేస్తేనే, ఇది సాధ్యమవుతుందని మా సర్‌సంఘ్‌చాలక్ బాలా సాహెబ్ దేవరస్ ముందే చెప్పడం నాకు గుర్తుంది. మేము 20-30 ఏళ్లు కృషి చేశాం. 30వ ఏడాది ప్రారంభమవుతూనే సంకల్పం కార్యరూపం దాల్చింది’’ అని మోహన్ భగవత్ భూమి పూజ కార్యక్రమంలో అన్నారు.

తొమ్మిది నిమిషాల ఆయన ప్రసంగంలో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తుండటం తమ కృషి ఫలితమేనని చెప్పుకొనే ప్రయత్నం చేశారు.

ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ

భూమి పూజ కార్యక్రమంలో సంఘ్ భాగమైన తీరు, ప్రభుత్వ కార్యకలాపాల్లో దానికి ఒక రకమైన చట్టబద్ధ పాత్ర కల్పిస్తున్నట్లుగా ఉందని ‘ఆర్ఎస్ఎస్ – ద ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ రైట్’ అనే పుస్తకం రాసిన నీలాంజన్ ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.

‘‘భారత్‌లో అధికారానికి, మతానికి మధ్య సన్నని గీతలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే, అవి ఇంతగా చెరిగిపోవడం ఇదివరకెప్పుడూ జరగలేదు. సంఘ్ పరివార్ ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంది. అధికారికంగా ప్రభుత్వానికి ఇంత దగ్గరగా ఆర్ఎస్ఎస్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. భారత రాజకీయ భవిష్యతు పరంగా ఇదో పెద్ద పరిణామం’’ అని ముఖోపాధ్యాయ్ అన్నారు.

‘‘సాంస్కృతిక జాతీయవాదానికి మద్దతుగా సంకేతాలు ఇచ్చారు. మందిర ఉద్యమం తమ వల్లే జరిగిందన్న విషయం స్పష్టం చేయడానికే మోహన్ భగవత్ అక్కడ కనిపించారు’’ అని వ్యాఖ్యానించారు.

కానీ, భారత రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ ఈ స్థానాన్ని ఎలా పొందింది?

శిలాఫలకం

ఫొటో సోర్స్, Pbns

రాముడి సాయంతోనా?

మతపరమైన ఉద్యమాలు మతపరమైన సంస్థల విస్తరణకు కారణమవుతాయా లేక మతపరమైన సంస్థల వల్లే మతపరమైన ఉద్యమాలు జరుగుతాయా?

ఏదైనా సమాజపు మత, రాజకీయ, సామాజిక చరిత్రపై చేసే అధ్యయనకారులు ఎక్కువగా అడిగే ప్రశ్న ఇది.

రామమందిర ఉద్యమం, సంఘ్‌కు కూడా ఈ ప్రశ్న వర్తిస్తుంది.

రామ మందిరం నిర్మిస్తుండటం ఆర్ఎస్ఎస్ సాధించిన అతిపెద్ద విజయమని సీనియర్ పాత్రికేయురాలు సునీత ఎరాన్ అభిప్రాయపడుతున్నారు.

‘‘ఆర్ఎస్ఎస్ లేవనెత్తిన చాలా అంశాల్లో రామ మందిర ఉద్యమం కూడా ఒకటి. దళితులను కలుపుకొనిపోవడానికి కూడా ఆర్ఎస్ఎస్ ఒక ఉద్యమం చేసింది. దళితులతో కలిసి భోజనాలు చేసే కార్యక్రమాలు నిర్వహించింది. అశోక్ సింఘాల్ కూడా ఇలాంటి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ మందిర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ నెట్‌వర్క్ ఓ పాత్ర నిర్వహించింది’’ అని ఆమె అన్నారు.

‘‘ఇదివరకు ఆర్ఎస్ఎస్ గోవధ అంశాన్ని కూడా లేవనెత్తింది. రామ మందిర ఉద్యమం మతపరమైన అంశం కావడంతో చాలా మంది దీనిలో భాగమయ్యారు. రాముడి పట్ల ఆదరణ అంతగా వ్యాపించి ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

అయోధ్య
ఫొటో క్యాప్షన్, అయోధ్య

‘రామ నామ రాజకీయ మహిమ’

అయోధ్యకు వేల కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్రలో రాజకీయాలు చేసే ఠాక్రే కుటుంబం కూడా రామ మందిర ఉద్యమంలో తమ పాత్రను ఇప్పుడు గుర్తు చేస్తోంది. రామ నామానికి ఉన్న రాజకీయ మహిమకు ఇదో ఉదాహరణ.

ఇలాంటి సందర్భంలో రామ నామంతో ఆర్ఎస్ఎస్ సాధించిందేంటన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అసలు రామ మందిర ఉద్యమంలో ఆ సంస్థ ఎలాంటి పాత్ర పోషించింది?

రామ మందిర ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ సహకారం, మద్దతు ఇచ్చిందని... ఉద్యమానికి నేతృత్వం మాత్రం రామ జన్మభూమి న్యాస్ వహించిందని సీనియర్ పాత్రికేయుడు రామ్ బహదూర్ రాయ్ అన్నారు. ఆయన చాలా ఏళ్లపాటు రామ మందిర ఉద్యమం అంశాన్ని కవర్ చేస్తూ వచ్చారు.

‘‘ఈ ఉద్యమానికి సంఘ్ పరివార్ చేయగలిగినంత సాయం చేసింది. కానీ, సాధువులు, సమాజం మధ్య ఒక సమన్వయకర్త పాత్రను విశ్వ హిందూ పరిషద్ పోషించింది. ఒక రకంగా ఆ సంస్థ ఈ మొత్తం ఉద్యమానికి నోడల్ ఏజెన్సీలా వ్యవహరించింది. చాలా కాలం పాటు సంఘ్ పరివార్, వీహెచ్‌పీ నేతల మధ్య విభేదాలు కనిపించాయి’’ అని ఆయన చెప్పారు.

రామ మందిరానికి ‘రథ యాత్ర’ ఓ టెస్టు కేసు లాంటిదని, దానికి పెద్ద ఎత్తున జనం మద్దతు లభించిందని రామ్ బహాదుర్ అన్నారు.

‘‘ఒక సామాజిక అంశం కోసం నిజాయితీగా ఓ సంస్థ కృషి చేస్తున్నట్లు కనిపిస్తే, జనం మద్దతు వస్తుంది. 1980ల్లో మీనాక్షీపురం ఘటనలో ఆర్ఎస్ఎస్, బాలాసాహెబ్ దేవరస్ పోషించిన పాత్రలతో అప్పుడు ఆ ఆందోళన నిలబడింది. 1980లో ఆర్ఎస్ఎస్ బెంగళూరులో ఒక సభ నిర్వహించింది. అప్పుడు హిందువుల ఐక్యత అంశం ప్రధానంగా ఉంది. బాలా సాహెబ్ దేవరస్ అప్పుడు గాంధేయవాద సోషలిజం గురించి మాట్లాడుతున్న బీజేపీని దగ్గరికి తెచ్చుకోగలిగారు. ఆర్ఎస్ఎస్, దాని సంస్థల మధ్య మెల్లమెల్లగా సమన్వయం వచ్చింది. దీని ద్వారా ఆర్ఎస్‌ఎస్ లాభపడింది. బీజేపీ కూడా ప్రధాన పార్టీల్లో ఒకటిగా ఎదిగింది’’ అని ఆయన అన్నారు.

మోదీ, మోహన్ భగవత్

ఫొటో సోర్స్, Ani

ఇకపై ఎటు?

ఏదైనా వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోనంతవరకూ భావజాలం అనేది పుస్తకంలో అంశంగా మాత్రమే మిగులుతుంది.

ఆ వర్గపు అసంతృప్తి వ్యక్తీకరణకు, సమస్యలు వినిపించేందుకు, ఆందోళనలను వ్యక్తపరిచేందుకు ఆ భావజాలం వేదికగా మారినప్పుడు... వర్గానికి అది భవిష్యతు గురించి ఆశలు కల్పిస్తుంది. భావజాల మార్గంలో వెళ్తూ, అన్యాయాలను పరిష్కరించడం మొదలుపెట్టినప్పుడు... ఆ భావజాలం వెలుగులీనుతుంది.

సోషలిజం నుంచి క్యాపిటలిజం వరకూ అన్ని భావజాలాలకూ ఇది వర్తిస్తుంది. ఆర్ఎస్ఎస్ భావజాలానికి కూడా వర్తిస్తుంది.

ప్రస్తుత దశ తర్వాత ఆర్ఎస్ఎస్ మరింత ముందుకు వెళ్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ అంటున్నారు.

‘‘ఆర్ఎస్ఎస్ ఈ భూమి పూజ కార్యక్రమం ద్వారా రామ జన్మ భూమి ఉద్యమానికి నేతృత్వం వహించినట్లు బహిరంగంగా అంగీకరించింది. కానీ, భవిష్యుతులో రాముడితో ముడిపడి ఉన్న రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో ఇప్పుడే ఊహించడం కష్టం. ప్రధాని మోదీ మాటమాటకూ రామాయణాన్ని ప్రస్తావించారు. జై శ్రీరామ్‌కు బదులుగా ‘సియావర్ రామ చంద్ర్’ అని పలికారు’’ అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ఈ యుగపు రాముడికి ప్రతిరూపంగా మోదీ తనను తాను చూపించుకుంటున్నారని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)