సోనూ సూద్: కాడెద్దులుగా అక్కా చెల్లెళ్లు.. మదనపల్లె రైతుకు ట్రాక్టర్ ఇచ్చిన బాలీవుడ్ నటుడు

- రచయిత, బండి హృదయ విహారి
- హోదా, బీబీసీ కోసం
చిత్తూరు జిల్లా మహల్‌రాజుపల్లి గ్రామంలో వర్షం పడింది. వర్షానికి తడిసిన నేలను మెత్తగా చీలుస్తూ వెళ్తోంది మడక. సాధారణంగా కాడెద్దులు లాగే ఆ మడకను ఇద్దరు అక్కచెల్లెళ్లు లాగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ స్పందించారు.
'రేపు ఉదయం కాడెద్దులు వీరి ముంగిట ఉంటాయి. ఇద్దరు అమ్మాయిలు, తమ చదువు దృష్టి సారించాలి' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
తర్వాత మనసు మార్చుకున్న ఆయన ఎద్దులకు బదులు ట్రాక్టర్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్నట్లుగానే ఆదివారం రాత్రి ట్రాక్టర్‌ను అందజేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రైతు నాగేశ్వర్ రావుతో బీబీసీ ఫోన్‌లో మట్లాడింది.
కరోనా కారణంగా దేశంలో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. వారిలో మదనపల్లెలో టీ కొట్టు నడిపే నాగేశ్వర్ రావు కుటుంబం కూడా ఒకటి.
కెవి.పల్లి మండలం మహల్‌రాజుపల్లికి చెందిన నాగేశ్వర్ రావు, భార్యాపిల్లలతో కొన్నేళ్ల క్రితమే మదనపల్లెకు వలస వెళ్లారు. నాగేశ్వర్ రావుకు ఇద్దరు కూతుళ్లు. అక్కడే ఒక టీ అమ్ముతూ జీవితం గడిపేవారు.
నాగేశ్వర్ రావు పెద్ద కూతురు ఇంటర్ పూర్తి చేసింది. చిన్న కూతురు పదవ తరగతి పూర్తిచేసింది. ఇద్దరూ తమ చదువులు కొనసాగించాలని ఆశిస్తున్నారు. ఈలోగా వారి జీవితాలపై కరోనా ప్రభావం పడింది.

''మదనపల్లెలో మా టీ అంగడి వ్యాపారం బాగా జరిగేది. అయితే, మా జీవితాలు మాత్రం ఏరోజుకు ఆరోజు సంపాదన మీదే జరిగేది. మాకు వేరే సంపాదన ఏందీలేదు. ఈలోపల కరోనా వచ్చింది, వ్యాపారం మూతబడింది. నేను అంగడి మూసేస్తి. కానీ ఎన్నాళ్లని సంపాదన లేకుండా బతికేది? టీ కొట్టుకు 8వేలు, మేముండే ఇంటికి 3,500 రూపాయల బాడుగ. టీ అంగడి వల్లనే మా రోజు గడుస్తాంటే, ఇంగ ఆ షాపు లేకుండా యాడ బాడుగ కట్టేది? అందుకే మా ఇంటిగల ఆయనకు, అంగడి రూము కల ఆయనకు చెప్పేసి, మా సొంతూరు మహల్‌రాజుపల్లికి వస్తిమి'' అని నాగేశ్వర్రావు బీబీసీతో అన్నారు.
మహల్‌రాజుపల్లిలో నాగేశ్వర్ రావు కుటుంబానికి 2 ఎకరాల భూమి ఉంది. కరోనా దెబ్బకు ఇల్లు చేరుకున్న నాగేశ్వర్రావుకు సంపాదన విషయమై దిక్కుతోచలేదు. అయితే, ఈసారి తమ ప్రాంతంలో వర్షాలు బాగా పడటంతో తిరిగి వ్యవసాయం చేద్దామన్న ఆలోచన కలిగింది.
''మా అదృష్టం బావుండి, ఈసారి మా ఊర్లో వర్షాలు బాగా పడినాయి. రెండు, మూడెకరాల పొలమున్న అందరూ సేద్యం పనులు చేస్తున్నారు. నాకూ వ్యవసాయం చేద్దామని కొంచెం ఆశ పుట్టె. నా పిల్లలు కూడా వ్యవసాయం చేద్దామని పంతం పట్టినారు. కానీ నా దగ్గర, నా అమ్మానాన్న దగ్గర ఒక్క రూపాయి లేదు. నాకు తెలిసిన మనిషిని అడిగి, 15 కేజీల వేరుశెనగ విత్తనాలు అప్పుగా తీసుకుంటి. ఇంగ పొలం దున్నేకి ఎద్దులను మాట్లాడాదామని పోతే, వాడు రోజుకు 2వేలు కూలి అడిగిరి. నేను భయపడి, వద్దులే స్వామీ అని ట్రాక్టర్‌ను బాడుగకు అడిగితే వాడు కూడా గంటకు 1,500రూపాయలు అడిగిరి. ఇంగ సాధ్యం కాదనుకుని, వ్యవసాయం వద్దులే అని పిల్లలతో చెప్పినా. కానీ మరుసటి రోజు పొద్దున్నే నా పిల్లలు ఇద్దరూ వచ్చి, ఎద్దులు లేకుంటేమానె మేం ఇద్దరమూ కాడెను మోస్తాం డాడీ అని బలవంతం చేసిరి. అట్లా నా బిడ్డలతో కాడె మోపిస్తి సార్...'' అని బీబీసీతో మాట్లాడుతుండగా, నటుడు సోనూసూద్ బహూకరించిన ఒక ట్రాక్టర్ నాగేశ్వర్రావు ఇంటి ముందుకు వచ్చింది. ఆ ట్రాక్టర్ చూడగానే నాగేశ్వర్రావు మాటల్లో నవ్వు, నవ్వులో మాటలు కలిసిపోయాయి. ఇక ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు.
అలా పిల్లల చదువు కోసం పట్టణం వెళ్లి, కరోనా దెబ్బకు తిరిగి సొంత గూటికి చేరుకున్న నాగేశ్వర్రావు, తిరిగి వ్యవసాయం చేయాలనుకోవడం, కాడెద్దుల కష్టాన్ని తన పిల్లలు భుజానికి వేసుకోవడంతో కథ కొంచెం మారింది.


ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 సామాజిక వ్యాప్తిని భారతదేశం ఎందుకు ఒప్పుకోలేకపోతోంది?
- సిరాజుద్దౌలా: ఈయనను దారుణంగా చంపాకే భారతదేశంలో బ్రిటీష్వాళ్లకు ఎదురు లేకుండా పోయింది
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు కొందరిలో 'రహస్య' రోగ నిరోధక కణాలున్నాయా?
- ఉత్తర కొరియాలో మొదటి కరోనావైరస్ అనుమానిత కేసు.. అప్రమత్తమైన కిమ్ జోంగ్-ఉన్
- ప్రజాస్వామ్యం బలహీనపడుతోందా? ప్రభుత్వం ముందు భారత మీడియా మోకరిల్లుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









