కరోనావైరస్-లాక్‌డౌన్: ఆన్‌లైన్ తరగతుల వల్ల విద్యార్థులకు లాభమా? నష్టమా?

- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశ వ్యాప్తంగా అనేక విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులను ప్రారంభించాయి.
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వలన తగ్గిన విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని, తొమ్మిదవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు సిబిఎస్ఇ విధానంలో చదువుతున్న విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి గాను 30 శాతం సిలబస్‌ని తగ్గిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు.
అయితే, ఆన్ లైన్ లో పిల్లలు విద్యనభ్యసించడం వలన పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం పై ప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
స్క్రీన్ సమయం పెరగడం వలన పిల్లల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం ఉంటుందని గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లో ఇఎన్‌టి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ హరిణి ముళ్ళపూడి చెప్పారు.
‘‘పిల్లలకు స్క్రీన్ టైం రోజుకు 30 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ సేపు మొబైల్ తో ఉండటం వలన దాని నుంచి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరం. పెద్దవాళ్ళ కపాలం కన్నా చిన్న పిల్లల కపాలం పలచగా ఉంటుంది. ఎక్కువ సేపు రేడియేషన్ కి గురవడం వలన వాళ్ళు నిద్రపోయే తీరు కూడా మారిపోతుంది’’ అని ఆమె తెలిపారు.
స్క్రీన్ టైం పెరిగితే దుష్పరిణామాలు ఉంటాయని కొన్ని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి.
స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ స్క్రీన్ ల నుంచి విడుదలయ్యే నీలి రంగు కాంతి నిద్ర పట్టడానికి సహకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుందని, కొన్ని పరిశోధనలు పేర్కొన్నాయి.
సరిగ్గా నిద్రపోకపోవడానికి, స్క్రీన్ ల నుంచి విడుదలయ్యే కాంతికి సంబంధం ఉందని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక పరిశోధన తెలిపింది.
నిద్ర పట్టే ముందు శరీరంలో జరిగే సిర్కాడియన్ రిథమ్స్‌ని నీలం రంగు కాంతి జాప్యం చేసే అవకాశం ఉందని పరిశోధనలు తెలిపాయి.
"స్క్రీన్ టైం కి ఎక్కువగా ఎక్సపోజ్ అవ్వడం వలన హైపర్ ఆక్టివిటీ బిహేవియర్, అటెన్షన్ డెఫిషిట్ డిసార్డర్ వచ్చే అవకాశం ఉంటుంది" అని హరిణి అన్నారు.
‘‘కళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. కంటి చూపు మందగించి జీవితాంతం కళ్లద్దాలు పెట్టుకోవల్సిన అవసరం ఏర్పడుతుంది.
ఆన్ లైన్ తరగతుల్లో టీచర్ చెప్పే పాఠాల మీద పిల్లలు ఎక్కువ సేపు శ్రద్ధ పెట్టలేరు.
ఎంత వరకు చెప్పిన పాఠాలు గుర్తుంటాయో, ఇవన్నీ ఎంత వరకు పరీక్షల్లో రాయగలరో కూడా తెలియదు’’ అని హరిణి అన్నారు.
అయితే, దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా చాలా మంది తల్లి తండ్రులు పిల్లలను స్కూల్ కి పంపించడానికి సుముఖత చూపించటం లేదు.
దేశంలో కోవిడ్ కేసులు నమోదవ్వడం ఆగే వరకు లేదా వ్యాక్సిన్ వచ్చేవరకు తమ పిల్లలను స్కూల్ కి పంపమని చెబుతూ 'పేరెంట్స్ అసోసియేషన్' అనే సంస్థ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి చేంజ్-ఓఆర్‌జి అనే స్వచ్చంద సంస్థ ద్వారా పిటిషన్ వేశారు.
కేంద్ర మానవ వనరుల శాఖ ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు నియమావళిని సూచించింది.
ప్రీ ప్రైమరీ - తరగతుల పిల్లల తల్లి తండ్రులకు ఆన్ లైన్‌లో 30 నిమిషాలకి మించి సూచనలు ఇవ్వకూడదు
ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థుల వరకు రోజుకు గంటన్నర వ్యవధి మించకుండా ఒకటి నుంచి రెండు తరగతులు నిర్వహించవచ్చు.
తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థులకు మూడు గంటల వ్యవధి మించకుండా నాలుగు సెషన్ల వరకు నిర్వహించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆన్ లైన్ తరగతులను నిర్వహించడం అనివార్యమైన పక్షంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ హరిణి వివరించారు.
ఒక్కో సెషన్ 30 నిమిషాలు మించి ఉండకూడదు. అలాగే, ప్రతి సెషన్ కి మధ్యలో 30 నిమిషాల వ్యవధి ఉంటే మంచిది.
మొబైల్స్, ట్యాబ్‌లలో కాకుండా, లాప్ టాప్, డెస్క్‌టాప్‌లలోనే తరగతులు హాజరవగలిగితే కొంత మేలు.
ల్యాప్ టాప్ కంటికి కొంచెం దూరంగా పెట్టడం వలన కొంత వరకు ప్రభావాన్ని తగ్గించవచ్చు.
పిల్లలు స్కూల్ పాఠాలే కాకుండా, మొబైల్ లో గేమ్స్ ఆదుకోవడం, యూట్యూబ్ లో వీడియోలు చూడటం లాంటివి తగ్గించేలా చూడాలి.
టీచర్లు ముందే పాఠాలు చెప్పిన వీడియోలను పిల్లలకు గాని, వారి తల్లి తండ్రులకు గాని పంపిస్తే, ఆ వీడియో చూపించి, తర్వాత టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని చదువుకోవచ్చు.
స్క్రీన్ సమయం పిల్లల ఆరోగ్యం పై ప్రభావం చూపకుండా ఆరోగ్యకరమైన పోషకాహారం ఇవ్వాలి. జంక్ ఫుడ్ ని తగ్గించాలి.
అవుట్ డోర్ యాక్టివిటీస్ చేయిస్తూ, వ్యాయామం చేయించడం, వేళకు నిద్రపోయేలా చేయడం లాంటివి చేయడం వలన కొంత వరకు ఈ స్క్రీన్ టైం వలన కలిగే దుష్ప్రభావాలను తగ్గించవచ్చు.
అయితే, ఆన్ లైన్ లో పాఠాలు చదువుకోవడానికి గాని, ఇతర కార్యకలాపాలకు గాని ఎక్కువ గడపడం వలన శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ ప్రభావం ఉంటుందని కింగ్ జార్జ్ హాస్పిటల్ లో సైకియాట్రీ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ నడుకూరు రాజు అన్నారు.
వీటి వలన స్వల్పకాలిక ప్రభావాలు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక ప్రభావాలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు.
"ఎక్కువ సేపు కూర్చుని ఆన్ లైన్ లో పాఠాలు వినమంటే ముఖ్యంగా చిన్న పిల్లల్లో చిరాకు లాంటివి మొదలయి, ఏకాగ్రత కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది".
"పక్క పిల్లలతో కలవకపోవడం వలన సామాజిక ప్రవర్తన, నడవడిక అలవర్చుకోలేరు".
"ఇతరులతో మెలిగే విధానం అర్ధం అవదు. పిల్లల్లో సమగ్ర మానసిక ఎదుగుదల తగ్గిపోయే అవకాశం ఉంది.
సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవడం తగ్గిపోతుంది. బాల్యంలో సాధారణంగా పాఠశాలల్లో నేర్చుకునే వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే లక్షణాలన్నీ అలవడటం కష్టమైపోయే అవకాశం కూడా ఉందని డాక్టర్ రాజు చెప్పారు.
"తల్లితండ్రుల పర్యవేక్షణ ఎక్కువగా ఉండటం వలన వారితో కూడా గొడవలు పడే అవకాశాలు ఉంటాయి".
"ఆన్ లైన్ లోనే పాఠాలు నేర్చుకోవడం దీర్ఘ కాలం కొనసాగితే జీవితపు ఆనందాన్ని కోల్పోయినట్లే అర్ధం".
ఒకే ప్రదేశంలో నివసించే 5 - 10 మంది పిల్లలకు కలిపి ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడం గాని, లేదా వ్యవధి తో కూడిన ఆన్ లైన్ షెడ్యూల్ ని తయారు చేయడం కానీ చేయవచ్చని సూచించారు.
‘ఖాళీగా గడపడం కంటే ఆన్ లైన్‌లో విద్యే మేలు’
అయితే, పిల్లలు నెలల తరబడి ఖాళీగా సమయాన్ని గడపడం కంటే రోజులో రెండు మూడు గంటల సేపు ఆన్ లైన్ లో విద్యను అందించడమే మంచిదని సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ స్టడీస్ (సీఈఎస్ఎస్) మాజీ అధిపతి, విద్యా హక్కుల నిపుణుడు నారాయణ అభిప్రాయపడ్డారు.
విద్యా సంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో ఆన్ లైన్ కానీ, డిస్టెన్స్ విధానం లో కానీ పాఠాలు నిర్వహించడమే ఉత్తమమని అన్నారు.
కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సీబీసీఏ విద్యాసంస్థలన్నీ ఆన్ లైన్ లో పాఠాలు పాఠాలు చెప్పేందుకు సంసిద్ధం అవుతున్నాయని తెలిపారు.
జులై 06 వ తేదీన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ లాక్ డౌన్ నిబంధనల్లో కూడా ఆన్ లైన్ లో పాఠాలు నిర్వహించమని పేర్కొన్నారు. ఇవి రాష్ట్రాలు కూడా అమలు చేయాలని కేంద్రం ప్రోత్సహిస్తోందని చెప్పారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యా సంస్థల్లో ఇది అమలు కావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కస్తూర్బా విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో మాత్రం ఆన్ లైన్‌లో పాఠాలు నేర్పిస్తున్నారు.
"కేరళ తరహాలో డిడి ద్వారా లేదా ప్రైవేట్ ఛానెళ్ల ద్వారా పాఠాలను చెప్పించినా బాగుంటుంది".
ఆన్ లైన్ పాఠాలు లేకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వ విద్యాలయాలకు చెందిన విద్యార్థులే నష్టపోతున్నారని చెప్పారు.

స్క్రీన్ టైం గురించి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పిడియాట్రిక్స్ ప్రచురించిన నియమావళి:
18 నెలల వయసు కన్నా తక్కువ ఉన్న పిల్లలకు వీడియోలో అప్పుడప్పుడూ మాట్లాడటానికి తప్ప స్క్రీన్ సమయం అసలు ఇవ్వకుండా ఉండటం మంచిది.
18-24 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లలతో పాటు తల్లి దండ్రులు కూడా అత్యున్నత ప్రమాణాలు కలిగిన వీడియోలను చూస్తూ, వారెందుకు స్క్రీన్ చూస్తున్నారో అవగాహన కల్పించగల్గాలి.
2-5 సంవత్సరాలు ఉన్న పిల్లలకు రోజుకు ఒక గంట సేపు మాత్రమే స్క్రీన్ టైం ఉండవచ్చు.
ఆరు సంవత్సరాల కంటే పెద్ద పిల్లలకి నిర్ణీతమైన గడువు వరకే స్క్రీన్ ని చూడటానికి అనుమతిస్తూ వారి నిద్రకి, ఇతర శారీరక వ్యాయామానికి అడ్డు రాకుండా చూడగలగాలి.
ఆన్‌లైన్ తరగతులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు తరగతులను నిర్వహించడం ఏమిటని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటని ప్రశ్నించింది.
తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదని, సీబీఎస్ఈ మాత్రం కొన్ని క్లాసుల నిర్వహణకు మార్గదర్శకాలు ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.
ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులను ఎలా నిర్వహిస్తున్నాయి? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారు? అని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్‌లైన్ క్లాసుల వల్ల విద్యార్థులపైన, తల్లిదండ్రులపైనా ఒత్తిడి పడుతుందని, దీనిపై వారం రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
కాగా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రైవేటు విద్యా సంస్థలు హైకోర్టుకు తెలిపాయి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్‌డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- కరోనావైరస్: గాలి ద్వారా వ్యాప్తి చెందడమంటే ఏంటి? దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి?
- కరోనావైరస్ భారత్‌లో చాయ్ కల్చర్‌ను చంపేస్తుందా?
- కరోనావైరస్: స్కూల్స్‌లో సామాజిక దూరం పాటించడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










