శ్రామిక్ స్పెషల్ రైల్లో నాలుగు రోజులుగా కుళ్లిన శవం, శుభ్రం చేసేవారు చూసేవరకూ ఎవరికీ తెలియలేదు

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA
- రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
- హోదా, బీబీసీ కోసం
ఉత్తరప్రదేశ్‌లో బస్తీ జిల్లావాసి మోహన్‌లాల్ శర్మ మే 23న ఝాన్సీ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే శ్రామిక్ స్పెషల్ రైల్లో కూర్చున్నారు. ఆ రైలు గోరఖ్‌పూర్ వెళ్లి నాలుగు రోజుల తర్వాత తిరిగి ఝాన్సీ వచ్చింది. కానీ మోహన్‌లాల్ మాత్రం ఇల్లు చేరలేదు.
ఝాన్సీ రైల్వే యార్డులో ఆ రైలును శుభ్రం చేస్తున్న సమయంలో కడుగుతున్నవారికి బోగీలోని టాయిలెట్‌లో ఒక కుళ్లిన శవం కనిపించింది. పరిశీలించిన తర్వాత ఆ శవం మోహన్‌లాల్‌ది అని తెలిసింది. ఇలాంటి విషాదం ఒక్క మోహన్‌లాల్ విషయంలోనే జరగలేదు. శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు.
వారిలో ఎక్కువ మంది ఎందుకు చనిపోయారు. మోహన్‌లాల్ మరణం లాగే ఈ ప్రశ్న కూడా ఒక రహస్యంలాగే మిగిలిపోయింది.
ఝాన్సీలోని రైల్వే పోలీస్ డీఎస్పీ నయీమ్ ఖాన్ మన్సూరీ బీబీసీతో “పోస్టుమార్టం రిపోర్టులో బయట ఎలాంటి గాయాలూ కనిపించలేదని చెప్పారు. శరీరం లోపలి అవయవాలను పరీక్షల కోసం పంపించాం. వాటి రిపోర్టు వచ్చిన తర్వాత ఆయన ఎందుకు చనిపోయారనేది తెలుస్తుంది” అన్నారు.
మోహన్‌లాల్ ప్రయాణించిన శ్రామిక స్పెషల్ రైలు, షెడ్యూల్ ప్రకారం రైలు తర్వాత రోజు గోరఖ్‌పూర్ చేరుకోవాల్సి ఉంది. అదే రోజు అది అక్కడినుంచి తిరిగి బయల్దేరాలి. కానీ రెండు రోజుల ప్రయాణం నాలుగు రోజులు పట్టింది.
ఇది మాత్రమే కాదు చాల శ్రామిక్ రైళ్లు తమ నిర్ధారిత గమ్యం చేరుకోడానికి చాలా రోజులపాటు ప్రయాణిస్తున్నాయి. చాలాసార్లు అవి దారి కూడా తప్పుతున్నాయి. అయితే రైల్వే మాత్రం అది దారితప్పడం కాదు, ‘డైవర్షన్’ అని చెబుతోంది.

ఫొటో సోర్స్, Samiratmaj mishra
రైల్వే ఏం చెప్పింది?
మోహన్‌లాల్ శర్మ శవం నాలుగు రోజుల వరకూ రైలు టాయిలెట్లోనే ఉంది. అన్ని రోజులైనా ఎవరికీ ఆ విషయం తెలీలేదు.
మోహన్‌లాల్ దగ్గర 23వ తేదీ టికెట్ దొరికింది. కానీ ఆయన ఇదే రైల్లో వెళ్లారా, లేక వేరే ఏదైనా రైల్లో వెళ్లారా అనేది తెలీడం లేదని ఉత్తరమధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అజిత్ కుమార్ సింగ్ చెప్పారు.
“మా జిల్లా యంత్రాగం, పోలీసులకు దీని గురించి సమాచారం ఇచ్చాం. ఆ బాడీని హాండోవర్ చేశాం. ఆ తర్వాత పోస్టుమార్టం చేయించడం నుంచి మొత్తం వారే చూసుకున్నారు. ఆయన ఇక్కడివరకూ ఎలా వచ్చారు, ఇదే రైల్లో వెళ్లారా, లేక వేరే రైల్లో వెళ్లారా అనేది ధ్రువీకరించలేకపోయాం. రైల్లో ఆయన మృతదేహం ఉన్న టాయిలెట్ లోపల నుంచి గడియ పెట్టుంది” అని చెప్పారు.
“పోస్టుమార్టం రిపోర్టులో మోహన్‌లాల్ దాదాపు నాలుగు రోజుల క్రితం, అంటే మే 24న చనిపోయినట్లు తెలిసింది. శవం దగ్గర నుంచి ఆయన ఆధార్ కార్డ్, కొన్ని సామాన్లు, 27 వేల రూపాయల డబ్బు కూడా దొరికింది” అని డీఎస్పీ నయీం ఖాన్ మన్సూరీ చెప్పారు.
మోహన్‌లాల్ శర్మ భార్య పూజ బీబీసీతో “23న మేం రైల్లో కూర్చున్నాం అని ఆయన ఫోన్ చేశారు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ అయ్యింది. మేం మాట్లాడలేకపోయాం. 28న ఝాన్సీలో ఆయన శవం దొరికిందని ఫోన్ వచ్చింది. తర్వాత మేం అక్కడికి వెళ్లాం” అన్నారు.
మోహన్‌లాల్ శర్మ కుటుంబంలో భార్య, నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వారి పెద్ద కొడుకు వయసు పదేళ్లు. అందరికంటే చిన్నదైన కూతురి వయసు 5 ఏళ్లు. మోహన్‌లాల్ ముంబయిలో ఒక ప్రైవేట్ కారు నడిపేవారు. లాక్‌డౌన్ సమయంలో లక్షల మంది కార్మికులు సొంత ఊళ్లకు బయల్దేరడంతో ఆయన కూడా అదే పరిస్థితుల్లో ముంబయి నుంచి తన ఇంటికి వస్తున్నారు.
“ఝాన్సీలో పోలీసులే ఆయన అంత్యక్రియలు చేశారు. తర్వాత మేం ఇంటికి వచ్చేశాం. ఎవరూ కనీసం అడగడానికి కూడా రాలేదు. మాకు ఎలాంటి సాయం కూడా అందలేదు” అని ఆయన భార్య పూజ ఏడుస్తూ చెప్పారు.

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA
గమ్యం చేరుకునేలోపే మరణాలు
శ్రామిక్ స్పెషల్ రైళ్లలో కొందరు వలస కూలీల మరణానికి, వారు అంతకు ముందే అనారోగ్యానికి గురవడమే కారణం అని చెబుతున్నారు.
వారి ప్రయాణాల కోసం మెరుగైన ఏర్పాట్లు చేశామని రైల్వే మంత్రిత్వ శాఖ ఎన్నో వాదనలు వినిపిస్తోంది. కానీ శ్రామిక రైళ్లలో ప్రయాణం గురించి అక్కడక్కడా యాత్రికుల నుంచి వెల్లువెత్తుతున్న ఆగ్రహం వాటిపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
యూపీలో మే 25 నుంచి మే 27 వరకూ 9 మంది కార్మికులు శ్రామిక్ స్పెషల్ రైళ్లలో చనిపోయారు. దేశవ్యాప్తంగా మే 9 నుంచి మే 27 వరకూ ఇలా చనిపోయినవారి సంఖ్య 80 మందికి చేరింది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES VIA GETTY IMAGES
రైల్వే శాఖ ఈ గణాంకాలను ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. కానీ, రైల్వే భద్రతకు బాధ్యత వహించిన రైల్వే భద్రతా బలగాలు అంటే ఆర్పీఎఫ్ నుంచి ఈ గణాంకాలు సేకరించాం. చనిపోయినవారిలో ఈ కార్మికుల్లో ఎక్కువమంది యూపీ, బిహార్‌కు చెందినవారే ఉన్నారు.
రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న శ్రామిక్ స్పెషల్ రైల్లో ఆదివారం ఒక కార్మికుడు ముగల్‌సరాయ్ దగ్గర చనిపోయాడు. అతడితోపాటూ వెళ్తున్న వారు 8 గంటల పాటు ఆ శవంతోనే ప్రయాణించారు.
“అతడు కరోనా వల్ల చనిపోయాడేమో అని రైల్లో ఉన్న వారందరూ భయంతో వణికిపోయారని, అది పోలీసులకు చెబితే తమ ప్రయాణం కూడా ఎక్కడ ఆలస్యం అవుతుందో అని అతడు చనిపోయిన విషయం ఎవరూ పోలీసులకు చెప్పలేదు” అని వారిలోని ఒక ప్రయాణికుడు తెలిపారు.
వారితోనే ఉన్న మరో ప్రయాణికుడు సూరజ్ దాస్ “మాకు చాలా కష్టపడ్డాక రైలు టికెట్ దొరికింది. అందుకే మాతో ఉన్న వ్యక్తి చనిపోయినా ఆ శవంతోనే ప్రయాణించాం. ఉన్నాం. మాల్దా చేరుకోగానే రైల్వే పోలీసులకు చెప్పాం” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్‌డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








